ఫెయిల్యూర్‌ ఇస్‌ స్టేపింగ్‌ స్టోన్‌ అఫ్‌ సక్సెస్‌

Sep 29,2024 09:32 #Poetry

ఓడిపోయాను..
అనుకున్న ప్రతిసారీ
ఏదో కొత్త వెలుగు
గెలుపు దారిలో
నన్ను నడిపించేది!
నాలో నన్ను
వెతికే ప్రయత్నంలో
అంచనాలు తప్పినా
ఆటుపోట్లు తగిలినా
నిరాశ ఒడిలో..
ఒదుగుతున్న నన్ను
ఏదో శక్తి మళ్ళీ వెన్నుతట్టి
మూసుకుపోయిన
నయనాల తలుపులు తెరిచి
విశాల ప్రపంచాన్ని చూపించేది!
అవయవలోపం ఉన్నా
లెక్కచేయక నవ్వుతూ
నింగిలో తారల్లా మెరిసిపోయే
అపర మేథావులెందరినో
చూసి రమ్మని చెప్పేది!
చిరిగిపోయిన ఆత్మవిశ్వాసానికి
ప్యాచ్‌ వర్క్‌ చేసి
శ్రద్దా, నిబద్ధత నింపి
ఎయిర్‌ బెలూన్‌చేసి సాగనంపేది !
గెలుపు ఒక్కసారి మాత్రమే
విజేతను చేస్తుంది
ఓటమి గెలిచేవరకు
ప్రయత్నమై పరిగెట్టిస్తుందనే సత్యాన్ని
బలపం పెట్టి పలకపై రుద్దించేది !
భయాన్ని వీడి ముందుకు సాగిపో
పడిన ప్రతిసారీ లేచి నిలబడే
ఆత్మస్థైర్యం అదే ఇస్తుందని
భుజం తట్టి పంపించేది!
కొండంత ధైర్యాన్ని చద్దన్నం మూటలా
వెంట తీసుకువెళ్లిన వాడికి
కాలం.. విజయాన్ని ..
కిరీటంగా తొడుగుతుంది !
ఫెయిల్యూర్‌ ఇస్‌ స్టేపింగ్‌ స్టోన్‌ అఫ్‌ సక్సెస్‌ !!

– జ్యోతి మువ్వల
9008083344

➡️