‘కుటుంబ కథా చిత్రాలే నప్పుతాయి’

Jan 12,2025 08:23 #film celebrities

ఐశ్వర్య రాజేశ్‌.. చిన్నప్పటి నుంచీ ఎన్నో కష్టాలు.. కుటుంబంలో సమస్యలు వెంటాడాయి. ఇండిస్టీలో ‘నీకు సినిమాలేంటి?’ అనే విమర్శల్ని భరించారు. అయినా పట్టు వదలలేదు. ప్రయత్నిస్తూ నటిగా చిన్నస్థాయి నుంచి ఉన్నతస్థాయికి ఎదిగారు. స్వశక్తితో ఇండిస్టీలో ముందుకు వెళుతున్న ఐశ్వర్య రాజేశ్‌ ఇప్పుడు లేడీ ఓరియంటెండ్‌ పాత్రలనే కాకుండా దక్షిణాది ప్రముఖ నటిగా రాణిస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’లో హీరో వెంకటేష్‌తో పోటీగా నటించి ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలోనే పుట్టారు ఐశ్వర్య. తండ్రి రాజేష్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడే. ‘మల్లెమొగ్గలు’, ‘రెండు జళ్ల సీత’, ‘ఆనందభైరవి’ లాంటి సినిమాల్లో నటించారు. హాస్యనటి శ్రీలక్ష్మి ఐశ్వర్యకు మేనత్త అవుతారు. అందుకే తనక్కూడా చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం ఏర్పడింది.

కుటుంబం కోసం..
ఐశ్వర్య ఎనిమిదో ఏటే తండ్రిని కోల్పోయారు. తండ్రి చేసిన అప్పులు, అందుకు వడ్డీలూ అన్నీ కలిపి ఇంటిపై పడ్డాయి. ఆ భారం తల్లి మోసింది. ఆమె ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తూనే తన నలుగురు పిల్లల్నీ చదివించారు. ఒకానొక దశలో అప్పుల్ని తీర్చలేక ఉన్న ఇంటినీ అమ్మేయాల్సి వచ్చింది. అద్దె ఇళ్లల్లోనే ఉంటూ ఐశ్వర్య చదువుకుంది. పెద్దన్నయ్య ఎంబీఏ పూర్తిచేశారు. ఉద్యోగం కూడా వచ్చింది. రెండో అన్నయ్య కూడా స్థిరపడుతున్నాడని అనుకుంటున్న దశలో.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నలూ చనిపోయారు. ఆ బెంగతో తల్లి అనారోగ్యానికి గురైంది. ఇలాంటి పరిస్థితుల్లో చదువు మానేసి, ఉద్యోగ ప్రయత్నాలు మొదలెట్టింది ఐశ్వర్య.

డ్యాన్స్‌ జీవనాధారంగా
ఐశ్వర్యకు చిన్నప్పటి నుంచీ డ్యాన్స్‌ అంటే ఇష్టం. తల్లి డ్యాన్సర్‌ కావడంతో.. ఆమెను చూసి ఐశ్వర్య డ్యాన్స్‌ నేర్చుకున్నారు. ఓ టీవీ ఛానల్‌ నిర్వహిస్తున్న డ్యాన్స్‌ రియాలిటీ షోలో పాల్గొని, బుల్లితెరపై తొలి ఎంట్రీ ఇచ్చారు. ఆ షోలో తానే విన్నర్‌. ఆ విజయం తనపై తనకు నమ్మకాన్ని పెంచింది. క్రమంగా టీవీ సీరియల్స్‌లో అవకాశాలు రావడం మొదలయ్యాయి. రోజుకి రూ.1000 పారితోషికం అందుకుంటూ, నటిగా తన జీవిత ప్రయాణం కొనసాగించారు. కానీ ఇంటి అవసరాలు, ఖర్చు పెరిగిపోతూనే ఉండేవి. దాంతో సినిమాల్లో ప్రయత్నాలు చేశారు. కానీ.. అక్కడ ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ‘నల్లగా ఉన్నావ్‌. నీకెందుకు సినిమాలూ’ అని తన రంగుని హేళన చేశారంతా. కొంతమంది చిన్న చిన్న పాత్రలు ఇచ్చారు. అలా చెల్లెలు, స్నేహితురాలుగా నటిస్తూ వచ్చిన ప్రతీ అవకాశాన్నీ అందుకుంటూ ముందుకెళ్లారు.


పిల్లల తల్లిగా
‘కాకా ముట్టై’ ఐశ్వర్య జీవితాన్ని మలుపు తిప్పింది.ఈ సినిమాలో హీరోయిన్‌ తనే అయినా ఇద్దరు పిల్లల తల్లిగా కనిపించాలి. అప్పటికీ తనకు ఇరవైఏళ్లు. తను నటించేందుకు ఆలోచిస్తున్న సమయంలో అప్పట్లో విజరు సేతుపతి ఇచ్చిన సలహాతో ఆమె ధైర్యంగా ఆ పాత్రలో నటించారు. సినిమా బాగా హిట్టయ్యింది. ఇందులో ఐశ్వర్య నటనకు మంచి పేరొచ్చింది. దర్శకుడు మణిరత్నం ‘నవాబ్‌’లో ఐశ్వర్యకు ఓ కీలకపాత్ర ఇచ్చారు. గౌతమ్‌మీనన్‌ తీసిన ‘ధృవనక్షత్రం’లోనూ ఐశ్వర్యకు అవకాశం వచ్చిందంటే కారణం..’కాకా ముట్టై’నే. ఈ సినిమానే.. అర్జున్‌ రాంపాల్‌ హిందీ చిత్రం ‘డాడీ’లో ఐశ్వర్యని హీరోయిన్‌గా అవకాశం కల్పించింది.

గెలుపు, ఓటమీ ఒకటే…
తమిళంలో ‘కనా’ అనే సినిమాలో ఐశ్వర్య క్రికెటర్‌గా నటించారు. ఈ సినిమానే తెలుగులో ‘కౌశల్య కృష్ణమూర్తి’ పేరుతో రీమేక్‌ చేశారు. ‘జీవితం నాకు చాలా నేర్పింది. ఇంకా కొత్త కొత్త పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. తొలి దశలోనే చాలా దెబ్బలు తిన్నాను. అందుకే ఇప్పుడు ఓటమి నన్ను అంతగా బాధ పెట్టదు. గెలుపు – ఓటమి రెండూ నన్ను ఏమాత్రం మార్చలేవు’ అని ఆత్మవిశ్వాసంతో చెబుతన్న ఐశ్వర్య వరసగా 50 సినిమాలకు పైగా నటించారు.

నటనకు ప్రాధాన్యత
తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటిస్తూ ఐశ్వర్యరాజేశ్‌కు ఒక ప్రత్యేక ఇమేజ్‌ ఏర్పడింది. ఉమెన్స్‌ సెంట్రిక్‌ కథా పాత్రల్లో నటిస్తూ వరుసగా చిత్రాలు చేసిన ఈమె ఎక్కువగా కుటుంబ కథా చిత్రాల్లో నటంచారు. కాగా ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ గ్లామర్‌ పాత్రలు నాకు తగవు. అందుకే అవకాశాలు వచ్చినా ఒప్పుకోవడం లేదు. కుటుంబ కథా చిత్రాలే చేస్తాను. అందులోనూ నటనకు అవకాశం ఉంటేనే ఒప్పుకుంటున్నా’ అంటున్న ఐశ్వర్య దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’లో కీలక పాత్రలో నటించారు. హీరో వెంకటేష్‌ పక్కన భార్య పాత్రలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. మరీ ఈ సినిమా కూడా ఐశ్వర్యకు విజయాన్ని అందించాలని కోరుకుందాము.

➡️