మూడురోజుల పాటు చేసుకునే సరదాల సంక్రాంతికి పిండి వంటలూ ప్రత్యేకమే. పండగ, పబ్బము అన్నారు. అంటే సంక్రాంతికి చేసుకునే పిండివంటలన్నీ కాలానికనుగుణంగా, ఆరోగ్యదాయకంగా ఉండాలనేది వాటి సారాంశం. ఇటీవల కాలాలు కాస్త గజిబిజిగా ఉంటున్నాయనుకోండి. అయినా జివ్వుమనే చలికాలం.. పంట ఇంటికి వచ్చే సమయం.. ఇవన్నీ పురస్కరించుకుని సంక్రాంతి పండక్కి బియ్యప్పిండితో చేసే వంటకాలు ఎక్కువగా చేయటం ఆనవాయితీ. ఇటీవల ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్‌స్టంట్‌గా షాపుల్లో దొరికేస్తున్నాయి. అయితే ఇంట్లో చేసుకుని తింటే రుచే వేరు. అమ్మమ్మల కాలం నాటి ఆరోగ్యాన్నిచ్చే పిండివంటలు ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
అరిసెలు..
కావలసినవి : బియ్యం-కేజీ, బెల్లం-3/4 కిలో, యాలకుల పొడి-స్పూను, నెయ్యి-1/4 కప్పు, నువ్వులు-4 స్పూన్లు, నూనె-డీప్ ఫ్రైకి సరిపోను
తయారీ : బియ్యం శుభ్రంగా కడిగి (రేషన్ బియ్యమైతే అరిసెలు మెత్తగా ఉంటాయి) రాత్రంతా నానబెట్టాలి. ఉదయం మరోసారి కడిగి, వడకట్టి తడి బియ్యప్పిండి పట్టించుకుని, తప్పనిసరిగా జల్లించుకోవాలి. చెమ్మ ఆరకుండా పిండిని చేతితో గట్టిగా అదుముతూ జల్లించుకోవాలి. అడుగు మందంగా ఉన్న గిన్నెలో బెల్లం తురుము, చిన్న గ్లాసు నీళ్ళు పోసి తిప్పుతూ మెత్తని ఉండ పాకం పట్టాలి. పాకం దగ్గర పడే సమయానికి అంచు ప్లేటులో నీళ్లు పోసి దానిలో కొంచెం పాకం వేసి చేతితో చుట్టినప్పుడు ఉండ రావాలి. పాకంలో నెయ్యి, యాలకుల పొడి, నువ్వులు వేయాలి. ఆ వెంటనే పిండిని బెల్లం పాకంలో కొద్ది కొద్దిగా వేస్తూ తిప్పుతూ చలిమిడి తయారుచేయాలి. ఈ పిండిని కొద్దిగా పెద్ద ప్లేటులోకి తీసుకుని అరటి / బాదం ఆకులు / ప్లాస్టిక్ పేపర్‌పై చిన్న చిన్న ముద్దలు చలిమిడి పెట్టి అరిసెలుగా చేతితో వత్తుకోవాలి. బాండీలో నూనె కాగిన తర్వాత అరిసెలు వేసి రెండువైపులా ఎర్రగా కాల్చుకోవాలి. వేగిన అరిసెలను అపకల మధ్య ఉంచి నూనె విడిచేలా ఒత్తాలి. అంతే ఘుమఘుమలాడే అరిసెలు రెడీ. వీటిని వరి గడ్డిపైగానీ, పేపర్‌పైగానీ తెల్లని వస్త్రం వేసి, ఆరనివ్వాలి. వీటిని కొత్త కుండలో పెట్టుకుంటే చాలా రోజులు తాజాగా ఉంటాయి.
(నూనెకు బదులుగా నెయ్యి వాడి,
నేతి అరిసెలూ చేసుకోవచ్చు)
చక్రాలు..
కావలసినవి : అటుకులు-1/4 కేజీ, పుట్నాలు-1/4 కేజీ, బియ్యప్పిండి-కేజీ, జీలకర్ర పొడి- 1/2 స్పూను, వాము-స్పూను, ఉప్పు- తగినంత, కారం-2 స్పూన్లు, వెన్న- స్పూను, నూనె-డీప్ ఫ్రైకి సరిపోను
తయారీ : అటుకులు, పుట్నాలు ఐదు నిమిషాలు చిన్న సెగ మీద వేయించాలి. చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బేసిన్‌లో బియ్యప్పిండి, అటుకులు-పుట్నాల పిండి, జీలకర్ర పొడి, వాము, ఉప్పు, కారం, వెన్న వేసి బాగా కలుపుకోవాలి. దానిలో వేడినీళ్ళు పోస్తూ గరిటెతో కలుపుకోవాలి. వేడి తగ్గిన తర్వాత చేతితో చపాతీ పిండిలా కలుపుకుని నూనెలో వేయించుకోవాలి. అంతే కరకరలాడే కమ్మని అటుకుల చక్రాలు రెడీ. వీటిని గాలిపోకుండా డబ్బాలో నిలువ ఉంచుకుంటే నెలరోజుల పైనే తాజాగా ఉంటాయి.
గవ్వలు..
కావలసినవి : గోధుమపిండి-2 కప్పులు, నెయ్యి-3 స్పూన్లు, ఉప్పు-1/2 స్పూను, వంటసోడా-1/4 స్పూను, బెల్లం-కప్పు, నూనె-డీప్ ఫ్రైకి సరిపోను
తయారీ : ఒక వెడల్పు గిన్నెలోకి గోధుమపిండి, నెయ్యి, ఉప్పు, వంటసోడా వేసి బాగా కలుపుకోవాలి. నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకుని పదిహేను నిమిషాలు మూతపెట్టి, పక్కనుంచాలి. తర్వాత పిండిని చిన్నచిన్న ముద్దలుగా చేసుకుని గవ్వలు చేసుకోవాలి. బాండీలో నూనె కాగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించాలి. మరో గిన్నెలో బెల్లం, కొంచెం నీళ్ళు పోసి తిప్పుతూ పాకం పట్టుకోవాలి. పాకం తీగ పాకానికి, ఉండ పాకానికి మధ్య ఉండాలి. పాకం వచ్చిన వెంటనే స్టౌ ఆఫ్ చేసి గవ్వలు వేసి, పాకం అన్నింటికీ పట్టించాలి. అంతే బెల్లం గవ్వలు రెడీ. ఇవి గాలి చొరబడని డబ్బాలో పెట్టుకుంటే నెలరోజుల పైనే ఉంటాయి.