రేగిపండ్లు

Apr 14,2024 13:38 #Sneha

చిలకలపాలెం అనే ఊరిలో రాణి, రమ్య అనే ఇద్దరు స్నేహితులున్నారు. ఊరిలో ఉన్న ప్రభుత్వ పాఠశాల్లో నాలుగో తరగతి చదువుతున్నారు. చదువులోనూ, ఆటల్లోనూ చురుకుగా ఉంటారు. వీరి తల్లిదండ్రులు వ్యవసాయ కూలి పనులకు వెళతారు.
భోజనం సమయంలో రాణి, రమ్య ఇళ్లకు వచ్చేవారు. రాణి వాళ్ల ఇంటికి మూడు ఇళ్ల తర్వాత రమ్య వాళ్ల ఇల్లు ఉంటుంది. దగ్గరే కావడంతో ఒకరింటికి మరొకరు అన్నం ప్లేటు తీసుకెళ్లి, ఇద్దరూ కలిసి తినేవారు. ఇంట్లో అమ్మకు పనుల్లో సహాయం చేసేవారు. మళ్లీ మధ్యాహ్నం బ్యాగు తగిలించుకుని స్కూలుకు వెళ్లేవారు.
ఒక రోజు మధ్యాహ్నం భోజనం చేస్తూ రాణి ‘మొన్న నాన్నతో పొలం వెళ్లాను అబ్బా.. దారి పొడవునా రేగిచెట్లే. రేగిపళ్లు ఎంత తియ్యగున్నాయో! చెట్ల నిండా కాయలే..’ అంటూ నోరూరిస్తూ, కళ్లు తిప్పుతూ చెప్పింది.
దాంతో రమ్యకీ తినాలనిపించింది. అందులోనూ పచ్చని పొలాలంటే రమ్యకి చాలా ఇష్టం. తనెప్పుడూ వెళ్లలేదు. ‘రాణీ మనం ఒక రోజు వెళదామా? ఆ దారి నీకు తెలుసు కదా!’ అని కుతూహలంగా అడిగింది.
రాణి ‘ఓ.. నాకు తెలుసు.. కావాలంటే ఈ రోజే వెళదాం. నీకు ఆ చెట్లు చూపిస్తా. ఇద్దరం ఎంచక్కా కోసుకొని తిందాం’ అంది.
రమ్య కళ్లు పెద్దవి చేసి, తల పక్కకు తిప్పి చూసింది. అక్కడక్కడ రేగిచెట్లు, ఆ చెట్లకి బాగా విరగకాసిన రేగిపండ్లు ఊహించుకుంది. స్కూలు గురించి ఆలోచించలేదు. ‘త్వరగా వెళదాం పద’ అంటూ ఇంటికి వెళ్లి, తాళం వేసింది. రాణి దగ్గరకు పరుగు తీసింది. ‘ఏంటే లేటు…త్వరగా రా..మళ్లీ స్కూలుకి వెళ్లాలి కదా!’ అంది.
రాణి బయటకు వస్తూ..’అబ్బా.. నీకు ఏది వచ్చినా ఆపలేము. వస్తున్నాగా.. ఆ చెట్లు ఏమన్నా పారిపోతాయా ఏంటీ?’ అంటూ రమ్యని ప్రేమగా కోప్పడింది.
‘ఇప్పుడు ఒకటయ్యింది. రెండింటికల్లా తిరిగి వచ్చేయాలి. లేకపోతే మాస్టారు కొడతారు’ అంది రమ్య.
‘నీకెందుకు? నేనున్నాగా. రేగిపండ్లు తినిపించే పూచి నాది’ అంది నవ్వుతూ రాణి.
ఇద్దరూ కలిసి పొలాల వైపు నడక సాగించారు. కొంతదూరం పరుగుతీస్తూ, మధ్యలో ఆగి మళ్లీ నాలుగు అడుగులు వేస్తూ.. గెంతుతూ, హుషారుగా ముందుకి అడుగులు వేశారు. కొంతదూరం వెళ్లగానే పిల్లకాలువ కనిపించింది. అందులో దిగారు. పాదాల లోతే ఉంది. దిగువ పొలాలకు రైతులు నీళ్లు పెట్టుకునేలా ఆ కాలువ వదిలారు.
‘రాణీ.. ఎంతచల్లగా ఉన్నాయే నీళ్లు. ఈ కాలువ మన స్కూలు దగ్గర ఉంటే ఎంత బాగుందో. రోజూ నీళ్లల్లో దిగి ఆడుకోవచ్చు. కాగితపు పడవలు చేసి వదలచ్చు’ అంది రమ్య.
‘అవును గానీ..ఆ లంగా తడవకుండా పైకి పట్టుకో. తడిచిందంటే మీ అమ్మ తిడుతుంది’ అంది రాణి. అలాగే నడుస్తూ కొంత దూరం వెళ్లారు. ఆ కాలువకు ఇరువైపులా గట్లు ఉన్నాయి. వాటిపై అక్కడక్కడ పిచ్చిచెట్లు గుట్టగా పెరిగాయి. దూరం నుంచి చూసి వాటిని రేగిచెట్లు అనుకుని భ్రయపడ్డారు ఇద్దరూ. తీరా దగ్గరకు వెళ్లి చూస్తే పిచ్చిచెట్టు. రెండు, మూడుసార్లు ఇలాగే జరగడంతో నిరాశపడ్డారు.
రమ్య బిక్క ముఖం పెట్టి ‘ఏవే రేగిచెట్లు.. చాలా ఉన్నాయి అన్నావు? ఒక్కటీ లేదు.’ అంది.
‘అబ్బా వీటికే అలా డీలా అయితే ఎలాగే బాబు. ముందుంటాయిలే. నేను మా నాన్నతో బండి మీద వచ్చాను కదా. దాంతో చెట్లు దగ్గరగా ఉన్నట్లు అనిపించింది. మనం నడుస్తున్నాం కదా! దూరంగా అనిపిస్తోంది. నీకు రేగిపండ్లు కోసిపెడతాను. ఆ ముఖం మార్చవే బాబు. చూడలేకపోతున్నా.’ బుజ్జగింపుగా అంది రాణి.
అయినా రమ్యలో రేగిచెట్లు కనబడలేదన్న బాధ ఉంది. కానీ పచ్చని వరి పొలాల మధ్య నుంచి వస్తున్న పైరుగాలిని పీలుస్తూ, పారుతున్న ఆ నీళ్ల శబ్దం వింటూ ఆ బాధను పైకి కనిపించకుండా చేసింది.
కొంతదూరం వెళ్లగానే వారికి ఓ రేగిచెట్టు కనిపించింది. దగ్గరకు పరుగు తీశారు. చెట్టునిండా కాయలే. అక్కడక్కడ పండినకాయలూన్నాయి. బాగా పండిన కాయలు రాలి అటు పొలంలోనూ, ఇటు కాలవలోనూ పడిపోయాయి. వాటిని చూసి ఇద్దరి ముఖాలు వెయ్యి దీపపు కాంతులు వెలిగినట్లు అయ్యాయి.
ఒకరిముఖం ఒకరు చూసుకుంటూ ఆతృతగా కాయలు కోయడం మొదలుపెట్టారు. అక్కడక్కడ ముళ్లు గుచ్చుకుంటున్నా.. తాము వెతుక్కుంటూ వచ్చినందుకు కాయలు దొరికాయన్న ఆనందంలో లెక్కచేయలేదు. ఇద్దరి జేబులు నిండాయి.
కాయ నోట్లు వేసుకుని.. ముఖం అంతా దగ్గరకు చేర్చి, కళ్లు మూసుకొని ‘అబ్బా..ఎంత పుల్లగున్నాయో’ అంది రమ్య. ఇంతలో బడి గంట వినిపించింది. ఊరి చివర బడి. ఎటువంటి భవంతులూ, ఇళ్లూ లేకపోవడంతో బడిగంట శబ్ద తరంగాలు వారి చెవికి చేరాయి. ఇక అంతే…రమ్య ఏడుపు ముఖం పెట్టింది. ‘ఇప్పుడెలా. బడికి వెళ్లలేముగా’ అంది.
‘నువ్వు కంగారుపడకు. ఈ రోజు స్కూలుకు వెళ్లలేము. ఆప్సెంటు వేస్తారు. అమ్మవాళ్లకి చెబుదాం. అర్థం చేసుకుంటారు’ అంది ధైర్యంగా రాణి. ‘సరే! ఇకెప్పుడు ఇలా స్కూలు ఎగ్గొట్టి రావొద్దు. సెలవు రోజుల్లో వద్దాం. మనకు చదువే కదా ముఖ్యం’ అంటూ గుప్పిట్లో ఉన్న రేగుపండు ఒకటి తీసి నోట్లో వేసుకుంది.

పద్మావతి
94905 59477

➡️