కిడ్నీ ఆరోగ్యం కోసం..

Mar 9,2025 09:34 #health, #Kidney, #ruchi, #Sneha

శరీరంలో మూత్రపిండాలు చాలా ముఖ్యమైన అవయవాలు. రక్తం శుద్ధి చేసి, వ్యర్థాలను యూరిన్‌ ద్వారా బయటకు పంపిస్తాయి. లేకపోతే అవయవాలు పనిచేయడం తగ్గుతుంది. అలాంటి కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో కొన్ని పదార్థాలు తప్పనిసరిగా చేర్చుకోవాలని నిపుణుల సలహా. క్యాలీఫ్లవర్‌లో సోడియం, పొటాషియం తక్కువగా ఉంటుంది. ప్రొటీన్లు, ఫైబర్‌ ఎక్కువగా ఉంటాయి. తద్వార శరీరంలో టాక్సిన్స్‌ క్లీన్‌ చేసి, కిడ్నీలపై భారం పడకుండా చేస్తుంది. అలాగే ఓట్స్‌లో పీచు పదార్థం ఎక్కువ. రెడ్‌ క్యాప్సికమ్‌లో విటమిన్‌ సి, ఎ, బీ 6, ఫోలిక్‌యాసిడ్‌ అధికం. వీటిని కిడ్నీ పేషెంట్స్‌ తరుచూ తీసుకోవాలని పోషకాహార నిపుణుల సూచన. మరి వీటితో వెరైటీగా ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.

గోబీ రైస్‌..

కావాల్సినవి : (క్యాలీఫ్లవర్‌ ఫ్రై కోసం) క్యాలీఫ్లవర్‌ -250 గ్రాములు, మిర్చి- రెండు, గరం మసాలా- 1/2 స్పూన్‌, జీలకర్ర పొడి-1/2 స్పూన్‌, రెడ్‌ఫుడ్‌ కలర్‌ – చిటికెడు, కరివేపాకు, కొత్తిమీర- కొద్దిగా, నూనె- వేయించడానికి, ఉప్పుు- తగినంత, నీరు- కొంచెం.
ఫ్రైడ్‌ రైస్‌ కోసం : వండిన అన్నం-కప్పు, ఎర్రకారం- స్పూన్‌, నూనె- 3 స్పూన్లు, ఎర్ర మిరపకాయలు- 2, ఉల్లిపాయలు – రెండు, పచ్చిమిర్చి- 3, వెల్లుల్లి తరుగు- 2 స్పూన్లు, మిరియాల పొడి- స్పూను, కరివేపాకు- రెండు రెమ్మలు, నిమ్మరసం- స్పూను, వెనిగర్‌- స్పూను, ఉల్లికాడలు- కొద్దిగా, కొత్తిమీర- కొద్దిగా, ఉప్పు- తగినంత.
తయారీ : క్యాలీఫ్లవర్‌ ఫ్రై కోసం పైన చెప్పిన పదార్థాలన్నిటినీ మందపాటి గిన్నెలో వేసి, కొద్దికొద్దిగా నీరు పోసి కలుపుకోవాలి. దానిలో క్యాలీఫ్లవర్‌ ముక్కలు వేసి కలపాలి. వీటిని బాగా కాగిన నూనెలో వేసి, బంగారు రంగులో వచ్చే వరకూ వేయించి, పక్కన పెట్టుకోవాలి.
మరో పాన్‌లో నూనె పోసి, వేడి చేయాలి. ఎర్ర మిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి వేసి వేయించాలి. తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తర్వాత రైస్‌ వేసి మంట హైలో పెట్టి వేయించాలి. వెంటనే ఉప్పు, గోబీ ముక్కలు, మిరియాల పొడి, నిమ్మరసం, వెనిగర్‌ వేసి కలపాలి. చివరిగా కొత్తిమీర వేసి దించేయాలి. అంతే గోబీ రైస్‌ రెడీ!

ఓట్స్‌ దోశ..

కావాల్సినవి : ఓట్స్‌ – కప్పుు, పెరుగు : కప్పు, గోధుమపిండి – రెండు స్పూన్లు, బొంబాయిరవ్వ – స్పూను, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు – అర కప్పు, అల్లం తురుము – స్పూను, కరివేపాకు- నాలుగు రెమ్మలు, ఉప్పు- రుచికి తగినంత, మిరియాల పొడి- చిటికెడు, జీలకర్ర- కొంచెం, మెంతులు-చిటికెడు.
తయారీ : ముందుగా ఓట్స్‌, మెంతులు వేసి మిక్సీలో పొడి చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని గోధుమ పిండి, బొంబాయి రవ్వ, పెరుగు తగినంత ఉప్పు వేసి, బాగా కలపాలి. తర్వాత మిరియాల పొడి, అల్లం తురుము వేసి, కొంచెం నీరు పోసి బాగా కలుపుకోవాలి. దీన్ని పావుగంట సేపు నానబెట్టాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ముక్కలు వేసుకుని కలుపుకుని, పక్కన పెట్టుకోవాలి. స్టౌ వెలిగించి, దోశల పెనం పెట్టాలి. వేడి ఎక్కిన తర్వాత దోశలు పోసుకోవాలి. వేడి వేడిగా ఓట్స్‌ దోశలు సూపర్‌గా ఉంటాయి.

రెడ్‌ క్యాప్సికమ్‌ పచ్చడి..

కావాల్సినవి : రెడ్‌ క్యాప్సికమ్‌-ఒకటి, ఎండు మిరపకాయలు- ఐదు, శనగపప్పు – స్పూను, నూనె – స్పూను, ఎర్ర కందిపప్పు – స్పూను, వెల్లుల్లి రెబ్బలు- రెండు, జీలకర్ర- స్పూను, ఉల్లిపాయముక్కలు – అర కప్పు, చింతపండు – మూడు రెమ్మలు, ఉప్పు – తగినంత.
తయారీ : ఒక పాన్‌లో నూనె పోసి, వేడి చేయాలి. ఎండు మిరపకాయలు, శనగ పప్పు, ఎర్ర కందిపప్పు వేసి సన్న సెగ మీద వేయించాలి. అందులోనే వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి పచ్చివాసన పోయే వరకూ వేయించి, పక్కన పెట్టుకోవాలి. తర్వాత క్యాప్సికమ్‌ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి పచ్చివాసన పోయే వరకూ వేయించాలి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చింతపండు వేడినీళ్లల్లో నానబెట్టాలి. వీటన్నింటినీ కలిపి, తగినంత ఉప్పు, నానబెట్టిన చింతపండు వేసి మిక్సీ పట్టాలి. అంతే రెడ్‌ క్యాప్సికమ్‌ చట్నీ రెడీ! ఇది దోశ, ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది.

➡️