గుమ్మడి ఇప్పుడు సీజనల్‌గా బాగా దొరుకుతుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాగని గుమ్మడికాయ వంటలను ఇష్టపడేవాళ్లు ఎంతమంది? దాని పేరు చెబితేనే మాకొద్దు అంటూ పారిపోతారు. అందుకే అలాంటివారూ ఇష్టంగా తినేలా గుమ్మడితో కొన్ని వెరైటీ వంటలు ఇస్తున్నాం. ఇంకెందుకాలస్యం వెంటనే వండేసుకుని ఆ రుచిని ఆస్వాదించండి.
పూర్ణాలు..
కావాల్సినవి: తీపి గుమ్మడికాయ తురుము – కప్పు, బెల్లం తురుము – కప్పు, నెయ్యి – పావు కప్పు, మినపప్పు – కప్పు, బియ్యం – రెండు కప్పులు, యాలకుల పొడి – స్పూను, జీడిపప్పు పలుకులు – టీస్పూను, ఉప్పు – చిటికెడు, నూనె – సరిపడినంత.
తయారీ : బియ్యం, మినపపప్పు కలిపి నాలుగ్గంటల పాటూ నానబెట్టాలి. తర్వాత మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గుమ్మడి పండు తురుమును ఒక వస్త్రంలో మూటలా కట్టి, దానిపై కాస్త బరువుపెట్టాలి. అప్పుడు అందులోని నీరు బయటికిపోతుంది. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి, కొద్దిగా నెయ్యి వేయాలి. అందులో జీడిపప్పు పలుకులు వేగించి, పక్కన పెట్టుకోవాలి. అందులోనే మరికొంచెం నెయ్యి వేసి, గుమ్మడి తురుము వేసి వేయించాలి. తురుము పచ్చి వాసన పోయే వరకు ఉంచాలి. తర్వాత అందులో బెల్లంతురుము వేసి బాగా కలపాలి. బెల్లం కరిగాక తురుముతో కలిసి మళ్లీ గట్టిపడుతుంటుంది. అప్పుడు యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు వేయాలి. ఆ మిశ్రమం చల్లారిన తర్వాత పూర్ణాల్లా గుండ్రంగా చుట్టుకోవాలి. తర్వాత స్టవ్‌మీద పాన్‌పెట్టి, వేయించడానికి సరిపడా ఎక్కువ నూనె పోసి, వేడి చేయాలి.ఆ పూర్ణాలని ముందుగా రుబ్బి పెట్టుకున్న బియ్యం- మినపప్పు మిశ్రమంలో ముంచి తీసి, నూనెలో వేసి, వేగించాలి. బంగారు వర్ణంలోకి రాగానే వాటిని తీసెయ్యాలి. అంతే గుమ్మడి పూర్ణాలు రెడీ.
పచ్చడి
కావాల్సినవి: తీపి గుమ్మడికాయ – 300 గ్రా., పసుపు- అర టీస్పూను, బెల్లం తరుగు- రెండు టీస్పూన్లు, ఉప్పు – తగినంత, మసాలా: తాజా కొబ్బరి తురుము – అరకప్పు, పచ్చిమిర్చి – ఒకటి, అల్లం తురుము – టీస్పూను, తాలింపుకు : కరివేపాకు- రెండు రెమ్మలు. నూనె – టీ స్పూను, ఆవాలు – అర టీస్పూను, మినప్పప్పు- అర టీ స్పూను, కరివేపాకు- రెండు రెమ్మలు.
తయారీ : గుమ్మడికాయను శుభ్రంగా కడిగి, పెద్ద పెద్ద ముక్కలుగా తరగాలి. స్టౌ మీద కుక్కర్‌లో గుమ్మడికాయ ముక్కలు, తగినంత ఉప్పు, పసుపు, కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టాలి. ఒక విజిల్ రాగానే దింపేసి, కుక్కర్ మీద చల్లటి నీళ్లు పోసి, మూత తీసేయాలి. గుమ్మడికాయ ముక్కలను ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. మసాలా కోసం తీసుకున్న పదార్థాలను మిక్సీలో వేసి, కొద్దిగా మెత్తగా చేసి, బయటకు తీయాలి. అందులోనే గుమ్మడికాయ ముక్కలకు జత చేయాలి. స్టౌ మీద పాన్‌లో నూనె వేసి కాగాక, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేసి వేయించి, పచ్చడి మీద వేసి కలియబెట్టాలి. ఈ పచ్చడి అన్నంలోకి రుచిగా ఉంటుంది.
కేక్
కావాల్సినవి: మైదా పిండి- రెండున్నర కప్పులు, బేకింగ్ పౌడర్- టీస్పూను, దాల్చిన చెక్కపొడి- అర టీస్పూను, అల్లం పేస్టు- పావు టీస్పూను, జాజికాయ పొడి- అర టీస్పూను, గుమ్మడికాయ గుజ్జు- కప్పు, అరటిపండు గుజ్జు- కప్పు, పంచదార- అరకప్పు, తేనె- అరకప్పు, ఆవనూనె- పావుకప్పు, గుడ్లు- రెండు, వాల్ నట్- ముప్పావుకప్పు, ఉప్పు- తగినంత.
తయారీ : ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో మైదా పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు, దాల్చినచెక్క, జాజికాయ పొడి ఒకదాని తరువాత ఒకటి వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత అల్లం పేస్టు, అరటిపండు గుజ్జు, గుమ్మడి కాయ గుజ్జు, పంచదార, తేనె, ఆవనూనె, గుడ్లు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కేక్ మేకర్ బౌల్‌లో ఆ మిశ్రమం మొత్తాన్ని వేసుకుని దానిపై వాల్‌నట్ తురుముని వేసుకుని నలభైౖ నిముషాల పాటు ఉడకనివ్వాలి. చల్లారిన తరువాత నచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గుమ్మడికాయ కేక్ రెడీ.
హల్వా
కావాల్సినవి: గుమ్మడికాయ – కేజీ, దాల్చినచెక్క – కొద్దిగా, పంచదార / బెల్లం – 150 గ్రా., నెయ్యి – నాలుగు స్పూన్లు, ఎండుద్రాక్ష – 50 గ్రా., కొబ్బరి తురుము – రెండు స్పూన్లు, బాదం – రెండు స్పూన్లు.
తయారీ : ముందుగా గుమ్మడికాయ పొట్టు తీయాలి. కొబ్బరి తురుము, బాదం వేగించి పొడి చేసుకోవాలి. ఒక పాత్రలో గుమ్మడికాయ, దాల్చిన చెక్క తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి, మూత పెట్టి ఉడికించాలి. తర్వాత నీళ్లన్నీ తీసేసి గుమ్మడికాయను గుజ్జుగా చేయాలి. పాన్‌లో నెయ్యి వేసి కాస్త వేడయ్యాక, గుమ్మడికాయ గుజ్జు వేసి, పదినిమిషాల పాటు వేగించాలి. ఇప్పుడు సరిపడా పంచదార / బెల్లం వేయాలి. మిశ్రమం చిక్కగా అయ్యే వరకు ఉంచాలి. అందులోనే కొబ్బరి తురుము, బాదం వేయాలి. ఎండుద్రాక్ష వేసి సర్వ్ చేసుకోవాలి.