గీత పరమార్థం

Dec 1,2024 10:05 #katha, #Sneha

పల్లె తల్లి ఒడిలో..
పసితనం ముచ్చట
కాలం బడిలో
నాన్న కూచి గతం …
జ్ఞాపకాల వెన్నెల్లో
ఆటలాడిన బాల్యం !
అనగనగా కథ ఇది.
కాలాన్ని వెనక్కి తీసుకెళ్లిన కన్నీటి చెమ్మ ఇది.
జ్ఞాపకాల ఒడిలో సేద తీరే అనుభూతి పర్యంతం …
అనుబంధాల జ్ఞాపకాల గళం విప్పిన గతం ఇది.

ఒక్కసారిగా ఆకాంక్ష అవెన్యూ ఏడు రంగులతో కొలువు తీరినట్టు మారిపోయింది. కొన్నాళ్లుగా కళ్లు మూసుకుని కునికిపాట్లు పడుతున్న విద్యుద్దీపాలు చిరునవ్వుల వెలుగులను పంచుతున్నాయి. అరవై మూడేళ్ళ హరిశ్చంద్రప్రసాద్‌ కళ్ళు మాటిమాటికి గేటువైపు చూస్తున్నాయి. వచ్చేవాళ్ళు రాకమానరు. ఇక్కడి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోరు. అయినా తెలియని ఉద్వేగం అతని మనసును పట్టి కుదిపేస్తోంది. కూతురు వస్తుంది.. మనవరాలితో వస్తుంది.
‘కాలమా.. నువ్వెంత నిర్దయురాలివి కాకపోతే, కూతురిని ఇచ్చినట్టే ఇచ్చి, దూరంగా సముద్రాలు దాటించి తీసుకుపోయావు. మనవరాలిని ముద్దాడే సమయంలో! కాలమా…నువ్వు మా ముందే ఉంటావు. మా తర్వాత ఉంటావ్‌.. ఎవరికీ కనిపించకుండా మమ్మల్ని నడిపిస్తూ ఉంటావు. ఎన్నో గాయాలు చేస్తావు. వాటిని నువ్వే మానేలా చేస్తావ్‌.. ఏమిటీ వైచిత్రి.?’ ఒక్కసారి దీర్ఘంగా నిశ్వసించి.. మరోసారి గేటు వైపు చూసాడు.
అతని నిరీక్షణ కళ్ళ ముందు నిలుపుతూ కారు గేట్‌లోకి వచ్చింది. ఆనంద సందోహాల హేళ మొదలైంది. వేదపండితుల ఆశీర్వచనాలు మిన్నంటాయి. సంబరాల వేళ హరిశ్చంద్రప్రసాద్‌ కన్నీటిధార అక్షతలు అయ్యాయి. కూతురు గీత, తన కూతురు కివితో లోపలికి అడుగుపెట్టింది. గీత లోపలికి అడుగు పెట్టడానికి ముందు ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. ఈ కథకు ఇది ప్రారంభవాక్యం అయ్యింది.
పనిమనిషి దిష్టి నీళ్ళు తీసి బయట పారబోసింది. హరిశ్చంద్రప్రసాద్‌ కూతురిని లోపలికి ఆహ్వానిస్తుంటే ‘నాన్నా ఒక్క నిమిషం’ అంది గీత.
కూతురి వంక ప్రశ్నార్థకంగా చూసాడు హరిశ్చంద్రప్రసాద్‌.
‘శానిటైజర్‌ లేదా నాన్నా’ అడిగింది గీత.
‘కోవిడ్‌ మహత్యం’ కాబోలు అనుకున్న హరిశ్చంద్రప్రసాద్‌ ‘ముందు లోపలికి రా తల్లీ’ అన్నాడు. అప్పటికే గీత కూతురు కివి తల్లి ఒళ్ళో నుంచి దిగి, తాత దగ్గరికి పరిగెత్తింది. ఎప్పుడూ ఫొటోలో తప్ప తాతయ్యను చూడలేదు. తనకు తెలియకుండానే తాతయ్యను గట్టిగా హత్తుకుంది. ముద్దుల వర్షం కురిపించింది. హరిశ్చంద్రప్రసాద్‌ మనసు గతంలోకి తొంగి చూసింది. చిన్నప్పుడు తన కూతురు ఇలానే ఆఫీస్‌ నుంచి రాగానే గట్టిగా హత్తుకొని, ముద్దులు పెట్టేది.
‘కివి వాటీజ్‌ దిస్‌’ ఇండియా రాగానే అంతా మర్చిపోయావా?’ అంటూ కూతురి మీద అరిచేసింది. మనవరాలు చొక్కా నలిగిపోయేలా తనను గట్టిగా పట్టుకోవడం, ఉమ్మి అంటేలా ముద్దులు పెట్టుకోవడం కూతురికి నచ్చలేదని అర్థమైంది. అతని మనసు భారమైంది.
‘ఎలా ఉన్నారు నాన్నా, వేళకు మందులు వేసుకుంటున్నారా? వంట మనిషి సరిగ్గా వస్తుందా?’ లాంటి ప్రశ్నలు వేసింది. తన గదిలోకి వెళ్ళింది. వెళ్తూ ‘తాతయ్యను డిస్ట్రర్బ్‌ చేయకు. సాయంత్రం మనం మాల్‌కి, ఐ మాక్స్‌కు వెళ్దాం’ అని చెప్పింది.
అన్నింటికీ బుద్ధిగా తలూపి తాతయ్య దగ్గరకు వచ్చింది. ‘నేను నిన్ను డిస్ట్రర్బ్‌ చేస్తున్నానా తాతయ్యా?’ అడిగింది బుద్ధిగా ముద్దుగా మనవరాలు.
‘లేదు తల్లీ నువ్వు వచ్చాకే నాకు ”ఇష్టం” మీద ఇష్టమేసింది’ అన్నాడు హరిశ్చంద్రప్రసాద్‌.
తాతయ్య అన్నది పూర్తిగా అర్థం కాకపోయినా తాతయ్యకు తనంటే చాలా ఇష్టమని అర్థం అయ్యింది. హరిశ్చంద్రప్రసాద్‌ కిటికీ తలుపులు తెరిచాడు చాలాకాలం తర్వాత. తన మనసు తలుపులు తెరుస్తూ..
కిటికీలో నుంచి తొంగిచూసింది తాతయ్యతో పాటు వచ్చిన కివి. రోడ్డు మీద పిల్లలు ఆడుకుంటున్నారు. ఎండలో కూడా ఆనందంగా ఆడుకుంటున్నారు. మరోపక్క చిన్న డేరా. రెండువైపులా కర్రలు పాతి, వాటి మీద తాడు బిగించి కట్టారు. ఒక చిన్నపాప కర్రను అడ్డంగా పట్టుకుని, తాడు మీద నడుస్తుంది. ఎర్రటి ఎండలో పిల్లలు గుమిగూడి, ఆ దృశ్యం చూస్తున్నారు.
‘ఆ పాప ఆలా ఎందుకు నడుస్తుంది తాతయ్యా.. కింద పడితే దెబ్బలు తగులుతాయిగా?’ అమాయకంగా అడిగింది కివి.
‘ఆ పాప అలా చేస్తే చూసే జనం డబ్బులు వేస్తారు. ఆ డబ్బుతో కుటుంబం బతుకుతుంది’ చెప్పాడు చిన్నగా నిట్టూర్చి హరిశ్చంద్రప్రసాద్‌.
‘పాపం తాతయ్యా.. మనం వెళ్లి డబ్బులు ఇచ్చి, అలా చేయొద్దు పాపా’ అని చెబుదామా అంది. మనవరాలిని దగ్గరికి తీసుకుని, ఎత్తుకుని కిందికి వెళ్ళాడు. కూతురు ఫ్రెషప్‌ అవడానికి తన గదిలోకి వెళ్ళింది. చాలా ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా హరిశ్చంద్రప్రసాద్‌ బయటకు వచ్చాడు. తాడు మీద నడుస్తున్న పాపకు కివితో డబ్బు ఇప్పించాడు.
ఆ పాప కివిని చూస్తుండిపోయింది. అక్కడ వున్న పిల్లలు బుట్టబొమ్మలా వున్న కివిని చూస్తున్నారు.
‘తాతయ్యా ఈ పిల్లలతో ఆడుకోనా?’ అడిగింది.
‘ఎండగా ఉంది.. మమ్మీ వచ్చిందంటే తిడుతుంది.’ అన్నాడు.
కివి కిందికి దిగి ‘నేనూ నీతో నడుస్తాను తాతయ్యా!’ అని తాతయ్యతో పాటు నడుస్తూ ఇంట్లోకి వచ్చింది. అప్పటికే ఎండ అలవాటు లేని కివి మొహం వాడిపోయింది. ఫ్రెష్‌ అయ్యి తన గదిలో నుంచి బయటకు వచ్చి, బయట నుంచి వస్తున్న తండ్రిని కివిని చూసి విషయం తెలుసుకుని, తండ్రిని ఏమీ అనలేక కివి మీద కేకలు వేసింది.
‘ఆ దుమ్ము ఏంటి? ఎండలో పిల్లలతో ఆటలు ఏంటి?’ అంటూ.

విచారంగా కూర్చున్న మనవరాలి దగ్గరికి వెళ్లి ‘అమ్మ తిట్టిందని బాధపడుతున్నావా?’ మనవరాలిని దగ్గరికి తీసుకుని అడిగాడు. తల అడ్డంగా, నిలువుగా ఆడించింది.
‘మమ్మీ ఎప్పుడూ ఇంతే తాతయ్యా.. నీట్‌గా ఉండాలి అంటుంది. పిల్లలతో అడుకోనివ్వదు. ఫ్రాక్‌ నలిగిపోయినా తిడుతుంది. ఈ మమ్మీలు అంతా ఇంతే తాతయ్యా! బుంగమూతి పెట్టి అంది.
‘పిల్లలుగా ఉన్నప్పుడు అల్లరి చేస్తారు. పెద్దయ్యాక పిల్లలు అల్లరి చేయొద్దంటారు. పిల్లలు ఆడుకుంటూ అల్లరి చేస్తూ ఉంటేనే అందంగా ఉంటుంది.’ అన్నాడు.
‘నాకూ అలా అల్లరి చేస్తూ ఆడుకుంటూ ఉండాలని వుంది తాతయ్యా!’ అంది ఆశగా కివి.
మనవరాలి మొహంలో చిన్ని ఆశ ముద్దుగా అనిపించింది.
‘నీకో సీక్రెట్‌ తెలుసా తల్లీ.. చిన్నప్పుడు మీ మమ్మీ కూడా బాగా అల్లరి చేసేది. మీ అమ్మమ్మ తిట్టేది. మీ అమ్మమ్మకు తెలియకుండా నాతో కలిసి అల్లరి చేసేది’ గుసగుసగా చెప్పాడు హరిశ్చంద్రప్రసాద్‌.
‘నిజ్జంగానా తాతయ్యా?’ కళ్ళు పెద్దగా చేసి అడిగింది కివి.
‘అవును తల్లీ! నువ్వు బుద్ధిగా అన్నం తింటే ఆ కథ చెబుతా.. నిన్ను అక్కడికి తీసుకువెళ్తా’ తాతయ్య అలా అనగానే బుద్ధిగా తలూపింది.
గీత తండ్రి గదిలోకి వచ్చింది ‘నాన్నా ఇక్కడ మా బ్రాంచీ ఆఫీస్‌లో కాస్త పని వుంది. కివి నూడిల్స్‌ తింటుంది. కానీ అల్లరి చేస్తుంది. దాని చేతికి ఫోన్‌ ఇవ్వండి. కార్టూన్స్‌ చూస్తూ తింటుంది. ఎండలో బయటకు పంపించకండి. అటూ ఇటూ గెంతనివ్వకండి. నేను సాయంత్రం వస్తే, నైట్‌ మనం మాల్‌కి, ఐ మాక్స్‌కు వెళ్దాం నాన్నా’ అని చెప్పి హాల్‌లోకి వెళ్లి తల్లి ఫోటోకి దండ వేసింది.
ఇరవై ఆరేళ్ల తర్వాత ఇదే రావడం. తల్లి క్యాన్సర్‌తో చనిపోవడం. నాన్న ఒక్కరే అని, తనను చూసుకోలేరని, పిన్ని తనతో పాటు స్టేట్స్‌కు తీసుకువెళ్లింది. చదువు, పెళ్లి అన్నీ అక్కడే. తండ్రిని ఏ రెండు మూడు సార్లో కలిసింది. తర్వాత వీడియోకాల్స్‌లోనే..!
కూతురు వెళ్ళగానే హరిశ్చంద్రప్రసాద్‌ మనవరాలిని ఎత్తుకున్నాడు. పెరుగన్నం కలిపాడు. చిన్నప్పుడు తన కూతురు గీత తాను కలిపే పెరుగన్నాన్ని ఇష్టంగా తినేది. పెరుగన్నంలో కాస్త మీగడ వేసాడు. ఏసీ చల్లదనం మొహానికి తగులుతుందని, కివిని కారిడార్‌లో వున్న పిట్టగోడ మీద కూర్చోబెట్టాడు. అటువైపు కారిడార్‌ను ఆనుకుని ఉన్న వేపచెట్టు గాలి చల్లగా తగులుతోంది.
‘ఇదేమిటి తాతయ్యా..?’ పెరుగన్నం చూస్తూ అడిగింది.
‘పెరుగన్నం…కర్డ్‌ రైస్‌ అంటారు..’ చెప్పాడు హరిశ్చంద్రప్రసాద్‌.
‘మమ్మీ ఎప్పుడూ నూడిల్స్‌, పిజ్జా, చపాతీ పెడుతుంది’ చెప్పింది కివి.
‘పెరుగన్నం చాలా బాగుంటుంది. హెల్త్‌కు కూడా మంచిది’ అంటూ పెరుగన్నం తినిపించాడు.
‘యమ్మీ తాతయ్యా!’ అంది.
పెరుగన్నం మొత్తం తినేసింది.
‘తాతయ్యా గుడ్‌గర్ల్‌లా పెరుగన్నం తిన్నాను. నన్ను చిన్నప్పుడు అమ్మ ఆడుకున్న ప్లేస్‌కు తీసుకువెళ్తానని చెప్పావుగా..’ అనడిగింది.
‘వెళ్దాం’ చెప్పి రెడీ అయ్యాడు.

కారు రోడ్డు వెంట పరుగులు తీస్తుంది. వీళ్ళ ఆగమనాన్ని హర్షించి, ప్రకృతి చల్లబడింది. కారు గ్లాస్‌ డోర్స్‌ పైకి లేపి, బయటకు చూస్తోంది కివి. చల్లగాలి మొహాన్ని తగులుతుంది. కారు సిటీ ఔట్‌ స్కట్స్‌లో వున్న ఫామ్‌హౌస్‌ వైపు వెళ్తుంది. ప్రకృతి కాన్వాసు మీద, పల్లె చిత్రం. రెండువైపులా పచ్చని పంటపొలాలు. వర్షానికి ముందు మట్టివాసన.. మట్టి రోడ్డు దాటి.. సరిగ్గా యాభై నిమిషాల తర్వాత కారు ఫామ్‌హౌస్‌ ముందు ఆగింది. సెక్యూరిటీ వచ్చి గేట్‌ తీసాడు. పెద్ద రోడ్డు.. ఇరువైపులా చెట్లు. వీధి దీపాలు. సినిమా సెట్టింగ్‌ను తలపిస్తోంది. ఆకాశం చల్లబడింది. కారు కుడివైపుకు తిరిగింది. అక్కడ ఒక చెక్కగేటు. చాలాకాలం ఎవ్వరూ ఆ గేటును తీయలేదని అర్థమవుతుంది.
హరిశ్చంద్రప్రసాద్‌ కారు దిగి, ఆ చెక్క గేటు మీద చేయి వేసి తీస్తుంటే చేతులు చిన్నగా వణుకుతున్నాయి. ఉద్వేగంతో కూడిన వణుకు. కారు లోపలికి వెళ్ళింది. కోటు జేబులో నుంచి తాళం చెవి తీసి, తలుపు తెరిచాడు. ఒక జ్ఞాపకాల తెర, కాలం మాత్రమే సాక్షిగా ఉన్న నిజం కళ్ల ముందు కనిపిస్తోంది. కివి వయసులో కూతురు ఉన్నప్పుడు ఈ ఇల్లు ఒక అనుభూతి ఉద్యానవనం.
పాతికేళ్ల గతం వర్తమానం ముందు ప్రత్యక్షమైతే.. హాలులోకి వెళ్ళగానే కివి ఎదురుగా కనిపించిన ఫోటోని చూసి షాకైంది. హరిశ్చంద్రప్రసాద్‌, భార్య, కూతురు గీత వున్న ఫోటో.
‘తాతయ్యా ఆ చిన్న బేబీ నేనే కదూ!’ అంది ఎగ్జయిట్‌ అవుతూ..
‘కాదు మీ అమ్మ’ మనవరాలిని ముద్దాడి చెప్పాడు.
‘అంటే నేను మమ్మీ డబుల్‌ ఫొటోనా తాతయ్యా?’ అమాయకంగా ఆరిందాలా అడిగింది కివి.
హల్లో కుడివైపు రకరకాల రంగురంగుల చాక్‌పీసులతో పిచ్చి గీతల బొమ్మలు.. ఒక చిన్న సున్నా, రెండు పొడవాటి గీతలు. చెవులు, ముక్కు, దాని పక్కన తెలుగులో ఇది గీత అన్న పేరు. మరో పక్కన అమ్మానాన్న బొమ్మలు.. గోడకు మరోవైపు రెండు చేతులు నల్లటి సిరాలో ముంచి గోడ మీద వేసిన చిన్ని చిన్ని చేతి గుర్తులు. హరిశ్చంద్రప్రసాద్‌ చూస్తూనే వున్నాడు. కాలం కళ్ళు ముందుకు వచ్చి కన్నీరుగా చెమ్మగిల్లాయి. మనసు పొరల్లో దాగి ఉన్న గతం ఆలోచనల్లోకి వెళ్లాడు. ఆ ఫొటోలో వున్న వాళ్ళు, గోడ మీద బొమ్మల్లో వున్నవాళ్లు కదిలారు. వర్తమానం ముందు నిలిచారు.

‘ఏరు గీతా! పరుగెత్తకు. కింద పడిపోతావు’ హెచ్చరించింది తల్లి. అప్పటికి ఇంట్లో పరుగెడుతూ కింద పడిపోయింది గీత. తల్లి అరుపుతో భయపడి, గీత తండ్రి చాటుకు వెళ్లి నిలబడింది.
‘ఆడుకోనివ్వు వైదేహి.. పిల్లలన్నాక ఆడుకోవాలి. అల్లరి చేయాలి. కింద పడాలి,.’ అన్నాడు భార్యకు నచ్చచెబుతూ హరిశ్చంద్రప్రసాద్‌.
‘మీరు అలాగే గారాం చేయండి. అది పెంకిలా తయారవుతుంది.’ వైదేహి అంది. అప్పటికే గీత, హరిశ్చంద్రప్రసాద్‌ బయటకు వెళ్లారు. వర్షం మొదలైంది. నేలంతా బురద బురద. గీత వర్షాన్ని చూస్తూ ఎగురుతుంది.. తడుస్తుంది. వాన నీళ్ళు తండ్రి మీద చిలకరిస్తోంది. కాళ్లన్నీ బురద బురద. చీకటి పడే వరకూ ఇద్దరూ వర్షంలో తడిచారు.. ఆడుకున్నారు. వైదేహి తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూనే ఉంది.
ఆ పల్లెలో పెద్ద తోటకొని, ఒకవైపు ఇల్లు కట్టుకున్నారు. గృహప్రవేశం చేసి వారం రోజులు కాకముందే, కూతురు ‘కొత్తగా పెయింట్‌ వేసిన గోడల మీద చాక్‌పీసులతో, క్రేయాన్స్‌తో బొమ్మలు వేయడం, ఎబిసిడి రాస్తూ గోడలనే పలకగా మార్చుకుంది. తల్లి తిడుతూనే ఉంటుంది. తండ్రి కూతురిని వెనకేసుకొస్తూనే ఉంటాడు.
‘చూడండి మీ కూతురి నిర్వాకం. కొత్తగా పెయింట్‌ వేసిన గోడలు. మొత్తం పిచ్చి బొమ్మలతో పాడు చేసింది’ కంప్లైంట్‌ చేసింది వైదేహి.
‘నా చిట్టితల్లి కన్నా, నా చిట్టితల్లి అల్లరి కన్నా ఈ జీవంలేని గోడలు, పెయింట్‌ వేస్తేనే మెరిసే ఇల్లు గొప్పనా? నా కూతురి కళ్ళలోని మెరుపు ఎన్ని పెయింట్లు వేస్తే వస్తుంది.?! గది గోడలే పలక అనుకుంది. అనుకోనివ్వు..’ అన్నాడు.
తండ్రి గదిలో నుంచి ఇంకు బాటిల్‌ తెచ్చి, ఇంకును చేతుల్లో పోసుకుని, చేతి గుర్తులు గోడ మీద వేసింది. అలా వాళ్ళ అల్లరితో ఆ ఇల్లు బృందావనమే అయ్యింది. అప్పుడే క్యాన్సర్‌తో వైదేహి చనిపోవడం, గీతను వాళ్ళ పిన్ని విదేశాలకు తీసుకు వెళ్లడం జరిగింది. ఆ తర్వాత ఫామ్‌హౌస్‌కు రావడం తగ్గించాడు, వచ్చినా ఈ ఇంటి వైపు రాలేదు. ఇప్పుడు గీత స్థానంలో ఈ ఇంట్లోకి మనవరాలు వచ్చింది.

హరిశ్చంద్రప్రసాద్‌ ఆ గోడ దగ్గరికి వెళ్ళాడు. చిన్నప్పుడు ఇంకులో ముంచి, చేయి ముద్ర వేసిన ఆ చేతి మీద తన చేతిని పెట్టాడు. చిట్టి చేయి. తన చేతిని పట్టుకుని నడిచిన చేయి.
‘తాతయ్యా..’ నేల మీద కూర్చుని ఆ బొమ్మలను చేత్తో తడుముతూ, చిన్నప్పటి కూతురి చేతి ముద్ర మీద చెయ్యి వేస్తూ కదిలిపోతున్న తాతయ్యను పిలిచింది కివి.
తాతయ్య చేతిని తన చేతిలోకి తీసుకొని, తన కుడిచేతిని చిన్నప్పుడు తల్లి చేతి ముద్ర వున్న చేయి మీద పెట్టింది. సరిగ్గా చేయి సరిపోయింది. మనవరాలిని గుండెలకు హత్తుకున్నాడు. అప్పుడే అతని వెనుక చప్పుడైంది. తలతిప్పి చూస్తే నీళ్ళు నిండిన కళ్ళతో గీత నిలబడి వుంది.
‘చిన్నప్పటి జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. తండ్రి తనతో చేసిన అల్లరి గుర్తొచ్చింది. పరుగెత్తుకొచ్చింది. గోడల మీద తాను గీసిన పిచ్చి గీతలు, బొమ్మలు తడిమింది. తన చేతిని తండ్రి చేతిలో పెట్టింది. గుండెల మీద వాలిపోయింది.
‘మీరు ఇక్కడికే వస్తారని ఊహించాను నాన్నా, కానీ ఇంకా మీ జ్ఞాపకాలు ఇక్కడే ఉన్నాయని అర్థం చేసుకోలేదు. కివి అల్లరిని హద్దులో పెట్టాలనుకున్నాను. నేను చేసిన అల్లరి మర్చిపోయాను. నువ్వు నాకు ఒక వరం నాన్నా. సారీ నాన్న..ఔ’ ఏడుస్తోంది గీత..
‘ఏమైంది మమ్మీ.. ఎందుకు ఏడుస్తున్నావు? నేను అల్లరి చేయను బుద్ధిగా ఉంటాను!’ ముద్దుముద్దుగా అంది కివి.
‘ఊహూ నువ్వు అల్లరి చేయాలి.. ఆడుకోవాలి.. గెంతాలి. అచ్చం చిన్నప్పుడు మా నాన్నతో నేను అల్లరి చేసినట్లు..’ గీత తండ్రిని కూతురిని తీసుకుని బయటకు పరుగెత్తింది. పైపును చేతిలోకి తీసుకుంది. నేలను తడిపింది. తడిసిన నేల మీద తండ్రి కూతురితో కలిసి గెంతులు వేస్తుంది. వాళ్ళ ఆనందాన్ని చూసి, మేఘం హర్షించి వర్షించింది. నేలంతా బురద బురద.. అయినా ఆ వర్షంలో కేరింతలు. సెక్యూరిటీ పనివాళ్ళు, వాళ్ళ పిల్లలు విస్తుపోయి చూస్తున్నారు.

గీత తన స్టేటస్‌ను, అహాన్ని ఇగోని పక్కన పెట్టింది. పనివాళ్లను, వాళ్ళ పిల్లల్ని పిలిచింది. పిల్లలంతా వర్షంలో తడుస్తూ ఆడుకుంటున్నారు. వాళ్లతో పాటు హరిశ్చంద్రప్రసాద్‌, గీత పనివాళ్ళు కలిసి అల్లరి చేశారు. ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొంది. కివి తాతయ్య భుజం మీద ఎక్కింది.
ఎవరెస్టు శిఖరం లాంటి తాతయ్య. ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన ఆనందం. పిల్లలకు ఇంతకన్నా గొప్ప జ్ఞాపకాలు ఏముంటాయి.? వాళ్ళ జ్ఞాపకాలు ఆదిలోనే తుంచేయకండి. ఇదే గీతా పరమార్థం.

 

విజయార్కె
9700289681

➡️