గోంగూర ఊరగాయలు..

May 11,2025 09:08 #Food, #ruchi, #Sneha

గోంగూర తెలుగువారికి ప్రీతిపాత్రమైనది. అందుకే దీనికి ఆంధ్ర మాత అని పేరు. గోంగూరలో విటమిన్స్‌ సి, ఎ, బి1, బి2, బి9, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్‌, పొటాషియం, ఐరన్‌, రైబోఫ్లేవిన్‌, కెరోటిన్‌ వంటి పోషకాలు మెండు. ఎంతో ప్రయోజనకారి అయిన గోంగూరతో రకరకాల నిల్వ పచ్చళ్ళు పెట్టుకుని సంవత్సరమంతా తినొచ్చు. మరి వాటిని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.


ఉప్పు గోంగూర..
కావలసినవి : గోంగూర-కేజీ, ఉప్పు-250 గ్రా, మెంతులు-2స్పూన్లు
తయారీ : శుభ్రం చేసిన గోంగూరను రంగు మారే వరకూ వేయించుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత కళ్ళుప్పు, మెంతులు చల్లి అరచేతితో అద్దినట్లు నొక్కిపెట్టి మూతపెట్టాలి. ఒకరోజంతా కదపకుండా అలాగే ఉంచేసి మరునాడు రోటిలో దంచుకోవాలి. ఆకులు పూర్తిగా నలగకపోయినా ముద్దలా వస్తుంది. అంతే ఉప్పు గోంగూర రెడీ. దీనిని సీసా లేదా జాడీలో పెట్టుకోవాలి. ఇది సంవత్సరం పైగా నిల్వ ఉంటుంది.


పండుమిర్చితో..
కావలసినవి : గోంగూర (శుభ్రంచేసి ఆరిన తర్వాత) -150గ్రా, ఉప్పు-100గ్రా, చింతపండు-30గ్రా, పండుమిర్చి-250గ్రా, కారం-25గ్రా, వెల్లుల్లి-(30+30)60గ్రా, మెంతిపిండి-15గ్రా, ఆవపిండి-30గ్రా, నూనె-500గ్రా
తాలింపు దినుసులు : ఆవాలు-స్పూను, మినప్పప్పు-2స్పూన్లు, శనగపప్పు-2 స్పూన్లు, జీలకర్ర-స్పూను, పసుపు-1/4 స్పూను
తయారీ : పండుమిర్చి శుభ్రం చేసుకొని, తొడిమలు తీసుకోవాలి. చింతపండు మునిగేంత వరకు మరిగే నీటినిపోసి నానిన తర్వాత గుజ్జుతీసి ఉంచుకోవాలి. తర్వాత బాండీలో శుభ్రం చేసిన గోంగూరను తీసుకుని రంగుమారే వరకూ వేయించాలి. బాండీలో నూనె మొత్తం వేడిచేసి తాలింపు దినుసులన్నీ దోరగా వేయించాలి. తర్వాత స్టౌ ఆఫ్‌ చేసి 30 గ్రా. కచాపచాగా దంచిన వెల్లుల్లి, కరివేపాకు, ఇంగువ వేసి చల్లారేంతవరకూ బాండీని పక్కనుంచాలి. రెండు గరిటెలు నూనె వేడిచేసి దానిలో చింతపండు గుజ్జును నూనె పైకి తేలేంతవరకూ ఉడికించాలి. ఇప్పుడు గ్రైండర్‌లో ముందుగా పండుమిర్చి, ఉప్పు కొంచెం కొంచెం వేస్తూ రుబ్బుకోవాలి. మిర్చి సగం పైగా నలిగిన తర్వాత గోంగూర, వెల్లుల్లి (30గ్రా పొట్టు వలిచినవి), కారం, పసుపు, మెంతిపిండి, ఆవపిండి, చింతపండు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ గ్రైండ్‌ చేసుకోవాలి. పచ్చడిలో అన్నీ కలిసిన తర్వాత తీసి తాలింపులో కలుపుకోవాలి. అంతే నోరూరించే పండుమిర్చి గోంగూర పచ్చడి రెడీ. ఒకరోజు అలాగే కదపకుండా ఉంచేసి రెండో రోజు ఉప్పు చూసుకుని సీసాలో పెట్టుకుంటే సంవత్సరమంతా తాజాగా ఉంటుంది.


పులిహోర..
కావలసినవి : గోంగూర-750గ్రా, ఉప్పు-తగినంత, వేయించిన ధనియాల పొడి-50గ్రా, ఎండుమిర్చి-15, జీలకర్ర-స్పూను, ఒక వెల్లుల్లి ముద్ద, మెంతిపొడి-స్పూను, పసుపు- 1/2స్పూను, కారం- 50గ్రా, చింతపండు గుజ్జు-100 గ్రా, నూనె- తగినంత
తయారీ : బాండీలో 50 గ్రా. నూనె వేడిచేసి గోంగూర, కొంచెం ఉప్పు వేసి వేయించుకోవాలి. రెండు స్పూన్ల నూనెలో ఎండుమిర్చి, జీలకర్ర వేయించి మిక్సీ పట్టుకోవాలి. వెల్లుల్లి రెబ్బల్ని కూడా విడిగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు జార్‌లో చింతపండు గుజ్జు, మిర్చి-జీలకర్ర పొడి, ధనియాల పొడి, వెల్లుల్లి పేస్ట్‌, మెంతిపొడి, పసుపు, కారం, గోంగూర వేసి మధ్యలో ఆపుతూ (అవసరమైతే మరిగించి చల్లార్చిన నీటిని కొంచెం పోసుకోవచ్చు) రుబ్బుకుని గిన్నెలోకి తీసుకోవాలి. అంతే ఘుమఘుమలాడే పులిహోర గోంగూర పచ్చడి రెడీ. దీనిని సీసాలో పెట్టుకుని కావలసినప్పుడు తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది.


నిల్వ పచ్చడి..
కావలసినవి : గోంగూర-కేజీ, చింతపండు-1/4కేజీ, కారం-1/4కేజీ, ఉప్పు-1/4కేజీ, వెల్లుల్లిరెబ్బలు- 150గ్రా. ఆవాలు-2 స్పూన్లు, మెంతులు-స్పూను, నూనె-1/2 కేజీ
తయారీ : ముందుగా మెంతులు దోరగా వేయించాలి. దింపబోయే ముందు వాటిలో ఆవాలు వేసి ఒక్క నిమిషం వేయించి, చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక గిన్నెలో చింతపండు మునిగేంతవరకూ మరిగించిన నీరు పోసి నానబెట్టాలి. బాండీలో రెండు స్పూన్ల నూనె వేసి గోంగూరను వేయించుకోవాలి. అదే బాండీలో మరో రెండు స్పూన్ల నూనె వేడిచేసి నానిన చింతపండును నూనె పైకి తేలేంతవరకూ ఉడికించాలి. దింపబోయే ముందు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు, ఉప్పు, కారం, మెంతి ఆవపిండి ఒక తిప్పు తిప్పి గోంగూర, వెల్లుల్లి ముద్ద వేసుకుని కచాపచాగా రుబ్బుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే గోంగూర నిల్వ పచ్చడి రెడీ. దీనిని సీసాలో పెట్టుకుని కావలసినప్పుడే కాస్త తీసుకుని తాలింపు పెట్టుకుంటే ఆంధ్రమాత రుచే వేరు మరి.

➡️