విన్నారా?చెన్నైలో
విజుప్పురం గ్రామముంది!
అందులోన ఎనిమిదేళ్ల
అనసూయను బాలికుంది!!
సైకిలొకటి కొనాలనీ
సరదాపడుతూ వున్నది!
కొంచెం కొంచెం పైకం
కూడబెట్టుకొనుచున్నది!!
నెమ్మది నెమ్మదిగా అవి
తొమ్మిదొంద లగుచుండగ
సైకిలు కొనవచ్చుననీ
సంబర పడుతూ వుండగ
కేరళ వరదలు ఎంతో
దారుణంగ వున్నాయని
తెలుసుకున్న అనసూయకు
కలవర పాటాయె మదిని!!
కొండచరియలు విరిగిపడి
కూలిపోయె నెన్నొ ఇళ్లు!
ఘోర వరదల ఉరవడికి
కొట్టుకుపోయాయి ఊళ్లు!!
సైకిలుకై దాచుకున్న
పైకమంత వెలికిదీసె!
వరద బాధితుల కోసం
విరాళంగ ఇచ్చివేసె!!
పత్రికలందీ వార్తను
ప్రముఖంగా ప్రచురించిరి!
ఆ వార్త చదివిన వారు
అనసూయను శ్లాఘించిరి!!
హీరో సైకిల్ సంస్థయు
హృదయం స్పందించంగా
అనసూయకు ఒకసైకిలు
అందించెను బహుమతిగా!!
వరద బాధితుల కోసం
విరాళమూ తానిచ్చెను!
కోరకనే తన చెంతకు
హీరోసైకిల్ వచ్చెను!!
మంచి చేస్తె మనం సదా
మంచి మనకు జరుగు గదా!
మనమందర మీ సత్యం
మరవరాదు అనునిత్యం!!
– ‘బాలబంధు’ అలపర్తి వెంకటసుబ్బారావు
కేంద్ర అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత)
9440805001