గోస

May 11,2025 11:48 #Poetry, #Sneha

అయిదేండ్లు సాలు
అయిదు తరాలకు
సరిపోయేటంత
సర్దుకోవచ్చు
కొండల్ని పిండిజేసి
మట్టిని తవ్వుక పోవాలె
గుట్టల గుండెల్ల
గడ్డపారలు దించి
గ్రానైట్లు చెయ్యాలె
బీడి కాడోన్ని సూసి
బట్టెబాజ్‌ మాటల్జెప్పాలె
ఖాళిభూమి కనిపిస్తె
కబ్జజెయ్యాలె
అయిదేండ్ల పొద్దు
అయిపోకముందే
ఫామ్‌ హౌజ్‌ కట్టుకొని
కంచేసుకోవాలె
కుర్చిమీద నేను కూసుంటే
నువ్వు నోర్మూసుకో
నువ్వు కూసుంటె
నేను నోర్మూసుకుంట
అనుకొని ఇద్లరుగల్సి
ఊళ్ళు పంచుకోవాలె
అయిదేండ్లప్పటికి
అన్ని మర్సిపోయి
అయిదేలకోసం
అంగలార్చెటోళ్ళు
ఓట్ల సంతలనాడు
ఎదురు సూస్తనే ఉంటరు
కొత్తనూకలు సల్లి
వలలు పర్సుడే ఇగ
మల్లకుర్సి దొర్కితె సరిపాయె
లేకపోతె గోడమీదెక్కి
రెండుదిక్కుల సూడాలె
అందినకాడ్కి అప్పుజెయ్యాలె
మంది మొకాలకు
పంగనామాలు పెట్టాలె

ఖద్దరు తెల్లంగోల్లు
ఎన్కటిలాక లేరు మామ
అంత మారిపోయింది
అసలు అర్థమే మారిపోయింది..

– అంకం మనోహర్‌
9492503339

➡️