‘డాడీ.. ఐ గాట్ ఫస్ట్ ర్యాంక్’.. అంటూ అప్పుడే ఇంటికి వచ్చిన తన తండ్రి మాట వినపడి పరిగెత్తుకుంటూ గుమ్మంలోకి వచ్చి తన తండ్రిని అమాంతంగా చుట్టేశాడు ఏడేళ్ల బాబి. చేతిలో ప్రోగ్రెస్ కార్డు పట్టుకుని మరీ. తండ్రికి ఆ కార్డ్ చూపిస్తూ ‘ఇదిగో చూడు’ అంటూ.. కాస్త గర్వంగా మొహం పెట్టి మరీ చూపించాడు. ‘వావ్ సూపర్. కంగ్రాట్స్ మై డియర్ సన్. ఎప్పుడూ ఇలానే ప్రతీసారీ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి సరేనా…’ అంటూ బాబీ చేతిలోని ప్రోగ్రెస్ కార్డు తీసుకుని, బాబిని ఎత్తుకొని ముద్దాడుతూ ప్రశంసగా చూశాడు తండ్రి శశిధర్.
‘నువ్వు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావ్. మరి నేను నీకు ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకుంటాను సరేనా’ అన్నాడు బాబితో. వాళ్ళిద్దరి సంభాషణను వింటూ అక్కడే ఉన్న బాబీ తల్లి మాధవి ‘ వీడు మీ కోసం ఇందాకట్నుంచి ఆ కార్డు చేతిలో పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఎదురు చూస్తున్నాడు. మీరు ఎప్పుడు వస్తారా అని’ అంది.
‘ఫస్ట్ ర్యాంక్ వస్తే వాడికి ఏదో గిఫ్ట్ కొంటానన్నారంట కదా’ అంటున్న తన భార్య వంక చూస్తూ అవును అన్నట్టు తలూపాడు. ‘సరే ఒక అరగంటలో రెడీ అయ్యి ముగ్గురం కలిసి మార్కెట్‌కి వెళ్దాం సరేనా.. బాబిక్కావల్సినవి అన్నీ కొందాం.’ అన్నాడు శశిధర్.
ఆ మాటకి బాబి ఎంతో ఉత్సాహంగా ‘ ఓ…కే ‘ అంటూ తన రూమ్‌లోకి వెళ్ళాడు రెడీ కావడానికి. ఓ అరగంట తర్వాత శశిధర్ టీ తాగి కప్పు మాధవికి అందిస్తూ.. ‘ఇక వెళ్దామా!’ అంటూ.. వాళ్ళిద్దర్నీ తీసుకుని బయలుదేరాడు.
‘డాడీ ఓ చెప్పుల షాపుకి తీసుకెళ్లండి నన్ను’ అన్నాడు బాబి. అక్కడికి వెళ్లాక బాబి సేల్స్ మాన్ తో ‘ఓ ముసలి మామ్మకి చెప్పులు కావాలి’ అన్నాడు.
సేల్స్‌మాన్ ముసలివాళ్ళు వేసుకునే చెప్పులుజత తీసుకొచ్చి బాబికి ఇచ్చాడు. ఇదంతా చూస్తున్నా శశిధర్‌కి ఏమీ అర్థం కాలేదు. ‘బాబి అవి తీసుకున్నావ్ ఏంటి ఎవరికి..?’ అని అడగ్గా.
‘మా స్కూల్ బయట గేటు దగ్గర పల్లీలు అమ్మే ఒక ముసలి మామ్మ కోసం తీసుకున్నాను. మామ్మకి చెప్పుల్లేవు. పాపం డాడీ.. రోజు ఎండలోనే చాలా దూరం నుండి నడిచొస్తుంది డాడీ. ఒక గొడుగు కూడా కొంటావా.?. ఆ మామ్మ కిద్దాం.’ అంటూ దీనంగా అడిగాడు బాబి.
శశిధర్ తల మీద చేయి వేసి నిమురుతూ… ‘అలాగే రా.. తప్పకుండా కొంటాను సరేనా..’ అన్నాడు చిరునవ్వుతో. ఇదంతా చూస్తున్న మాధవికి కళ్ళళ్ళో నీళ్లు తిరిగాయి. తన కొడుక్కి వచ్చిన మంచి ఆలోచనకి. అక్కడినుంచి మిగతా షాపింగ్ కూడా పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వచ్చారు ముగ్గురూ.
మరుసటి రోజు ఉదయం బాబి స్కూలుకి బయలుదేరుతుండగా… బాబీతో ‘ఈ రోజు నేనే నిన్ను స్కూలు దగ్గర డ్రాప్ చేస్తాను. సరేనా’ అన్నాడు శశిధర్. ‘ఓ.. యస్. థాంక్యూ డాడ్’ అంటూ సంతోషంగా రెండు చేతులు పైకెట్టి అరిచాడు బాబి.
మాధవి.. తానూ వస్తాను అనడంతో, ముగ్గురు కలిసి స్కూల్‌కి వెళ్లారు. బాబిబైకు దిగగానే ‘డాడీ ఇక్కడే ఉండండి ఇప్పుడే వస్తాను’ అంటూ స్కూల్ బ్యాగ్ క్లాసులో పెట్టి, పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ అమ్మ చేతిలో ఉన్న కవర్ తీసుకొని పల్లీల మామ్మ వైపు పరిగెత్తాడు.
‘బాబీ మెల్లిగా నడూ.. జాగ్రత్తా..’ అంటూ అరుస్తున్న ఆమె మాట వినిపించుకోకుండా మామ్మ దగ్గరికెళ్ళాడు. బాబీని చూడగానే మామ్మ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. బాబి వెనకనే వస్తున్న అతను తల్లిదండ్రులు చూశారు. బాబి మామ్మ చేతికి కవర్ అందిస్తూ ‘నీకోసం ఏం తెచ్చానో చూడు’ అన్నాడు.
మామ్మ ఆ కవర్ని తీసుకుని ఆసక్తిగా చూసింది కవర్లోకి. చెప్పుల్ని, గొడుగుని బయట తీసి చూసింది. అవి చూసి ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యింది. బాబీని దగ్గరికి పిలిచి తలపై చేయి వేసి నిమురుతూ… ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు అన్నట్టు చూసింది. ఆ పసివాడి ప్రేమకి హృదయంలో ఉప్పొంగుతూ వస్తున్న ఆనందం కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలుగా ముడతలు పడిన చెంపలు పైన జలజలా రాలుతున్నాయి. వారిద్దరి మధ్య గొప్ప నిశ్శబ్దం అలుముకుంది. స్వచ్ఛమైన ప్రేమ. స్వార్థం లేని ప్రేమ. ఎల్లలు లేని ప్రేమ వారిద్దరి హృదయాల్లో నిండిపోయింది. బాబీ చేతిని తన చేతిలోకి తీసుకుని తన కంటి దగ్గర పెట్టుకొని ఒకసారి కళ్ళకు హత్తుకుంది. ఆ దృశ్యం చూసిన బాబి తల్లిదండ్రులకి కూడా కళ్ళళ్ళో నీళ్లు తిరిగాయి.
బాబీ.. మామ్మ కి ‘ మా మమ్మీ, డాడీ’ అంటూ వాళ్ళిద్దర్ని పరిచయం చేశాడు. మామ్మ చేతులు రెండు జోడించి నమస్కరిస్తుంటే శశిధర్ వారిస్తూ… ‘మీరు నా తల్లి లాంటి వారు. మీ బోటి పెద్దవాళ్ళ ఆశీస్సులు నా బిడ్డ మీద ఉంచితే నాకు అదే చాలు’ అన్నాడు. తిరిగి నమస్కరిస్తూ. మామ్మ పల్లీల తట్టలోంచి మూడు పల్లీల పొట్లాలు తీసి ఆ ముగ్గురి చేతికి అందించి తినమని సైగ చేసింది. జోబులోంచి డబ్బులు తీసి ఇస్తున్న శశిధర్ని వారిస్తూ.. వద్దని ప్రాధేయ పడింది. పల్లీలు తీసుకుని బాబి వాళ్ల ముగ్గురికి బారు చెప్తూ స్కూల్ లోకి పరిగెత్తాడు. మామ్మ పరిగెడుతున్న బాబి వైపు చూసి ముసి ముసిగా నవ్వుకుంది. నిండు మనసుతో ఆశీర్వదిస్తూ…
పేలూరి వెంకట మీనాక్షి
9912601765