అత్యాశ

Apr 13,2025 09:19 #children stories, #Sneha

రామవరం ఊరిలో శేషాద్రి కిరాణాకొట్టుకి మంచిపేరు ఉంది. ఒకరోజు ఒక కొత్త వ్యక్తి ఆ కొట్టుకు వచ్చి, శేషాద్రితో ‘కిలో కందిపప్పు ధర ఎంత?’ అని అడిగాడు.
ధర చెప్పాడు శేషాద్రి.
ఆ కొత్త వ్యక్తి ఆశ్చర్యపోతూ ‘అమ్మో ఎందుకంత? కిలో వంద రూపాయలకైతే తీసుకుంటా, లేకుంటే లేదు!’ అన్నాడు.
అతడు అడిగిన ధర, తను కొన్న ధర కన్నా చాలా తక్కువ. ‘నువ్వు అడిగే ధరకు ఇక్కడ దొరకదు. దొరికే చోటును వెతుక్కో పో!’ అని శేషాద్రి కోపంగా అన్నాడు.
దాంతో ఆ వ్యక్తి అదిరిపడ్డాడు. కాసేపటికి తేరుకొని ‘నువ్వు నాలుగు దిక్కుల తిరిగినోడివిగా కనిపించడం లేదు. ఒక ప్రాంతంలో ఒక్క రూపాయికి కూడా విలువ లేని వస్తువు, మరో ప్రాంతంలో అపురూపమైనదిగా అధిక ధరకు అమ్ముడవుతుంది. కందులు పండించే రైతు దగ్గరకు వెళ్లి, కొనుగోలు చేయోచ్చుగా! చాలా తక్కువ ధరకు దొరుకుతుంది. నేను నీకు కిలో 100 రూపాయలకు కందిపప్పు తీసుకొస్తాను. తీసుకుంటావా?’ అని అడిగాడు.
అప్పటికే ఆ వ్యక్తి మాటలకు విసిగిపోయి ఉన్నాడు శేషాద్రి. ‘నువ్వు తెచ్చి ఇచ్చినప్పుడు చూసుకుందాం పో!’ అన్నాడు నిర్లక్ష్యంగా.
ఆ వ్యక్తి వెళ్లిపోయాడు.
నాలుగు రోజుల తర్వాత ఆ కొత్త వ్యక్తి ఎద్దుల బండిలో ఐదు మూటల కందిపప్పు వేసుకుని వచ్చాడు.
శేషాద్రి ఆ వ్యక్తి ఇచ్చిన సరుకు ఏమాత్రం నాణ్యత లేనిదై ఉండవచ్చు అనుకున్నాడు. కానీ ఆ సరుకులు పరిశీలించి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆ సరుకు నాణ్యత బాగుంది. పైగా 100 రూపాయలకే దొరుకుతుంది. శేషాద్రి మరి ఏమాత్రం ఆలస్యం లేకుండా ఆ సరుకు విలువ లెక్కగట్టి సంతోషంగా డబ్బులు ఇచ్చి పంపాడు. ఆ వ్యక్తిని మెచ్చుకుంటూ ‘అప్పుడప్పుడు వస్తూ ఉండు’ అని ఉత్సాహంగా చెప్పాడు.
ఆ వ్యక్తి పేరు తిరుపతయ్య. అప్పటి నుంచి ఆ ఇద్దరి మధ్య లావాదేవీలు మొదలయ్యాయి. తిరుపతయ్య కిరాణా సరుకులు తక్కువ ధరకు తెచ్చి ఇచ్చేవాడు. శేషాద్రి మంచి లాభాలు సంపాదించేవాడు.
ఒకరోజు శేషాద్రి వద్దకు తిరుపతయ్య చాలా ఉత్సాహంగా వచ్చాడు. ‘తంతే బూరెల బుట్టలో పడ్డట్టు ఇప్పుడు మనకు మంచి అవకాశం లభించింది. నాకు తెలిసిన ఒక కిరాణా వ్యాపారి వృద్ధాప్యంలో ఉన్నందువల్ల తన కొట్టు మూసేసి, నగరంలో ఉద్యోగం చేసుకుంటున్న తన కొడుకు దగ్గరకు వెళ్ళిపోయేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. అతనికి త్వరగా డబ్బు కావాలి. నా శక్తియుక్తులు ఉపయోగించి, నాలుగు లక్షల విలువచేసే అంగడి సరుకులు బేరమాడి రెండు లక్షలకే తీసుకురాగలను. ఈ రహస్యం మన మధ్యనే ఉండాలి. బయటకు పొక్కితే చాలామంది పోటీకి రాగలరు. త్వరగా డబ్బులు ఇస్తే, వెళ్లి అలా సరుకులు తీసుకురాగలను. నాపై నమ్మకం ఉంచు!’ అన్నాడు తిరుపతయ్య.
శేషాద్రికి, తిరుపతయ్య పైన ఏమాత్రం సందేహం కలగలేదు. ఎందుకంటే అతని కారణంగా ఎంతో లాభం గడించి ఉన్నాడు కాబట్టి. తన దగ్గర అంత డబ్బు లేకపోవడంతో నగలు అమ్మి, రెండు లక్షలు తీసుకొచ్చి, తిరుపతయ్యకు ఇచ్చాడు.
తిరుపతయ్య మరో ఇద్దరితో కలిసి దొంగిలించిన సరుకులు శేషాద్రికి తక్కువ ధరకు అమ్మేవాడు. శేషాద్రికి ఈ విషయం తెలియదు. తిరుపతయ్యపై నమ్మకం పెంచుకున్నాడు. ఆ నమ్మకాన్ని అడ్డుపెట్టుకొని తిరుపతయ్య మాయమాటలు చెప్పి, డబ్బులు దోచుకున్నాడు. ఒకరోజు సరుకు దొంగలిస్తుంటే పోలీసులు తిరుపతయ్య, అతనికి తోడున్న ఇద్దరినీ పట్టుకుని, అరెస్టు చేశారు. ఈ విషయం తెలిసిన శేషాద్రి అత్యాశకు పోకూడదని, ఇది తనకో గుణపాఠం అనుకున్నాడు. ఇంకెప్పుడూ ఇలాంటి వాటిపై ఆశపడకూడదని, గుడ్డిగా ఎవరినీ నమ్మకూడదని తెలుసుకున్నాడు.

– గుండ్రాతి సుబ్రహ్మణ్యం గౌడు
6302099718

➡️