గుంటగలగరతో ఘుమఘుమలు

Feb 11,2024 08:41 #cooking and begging, #Food, #Sneha
guntagalagara special dishes

పల్లెటూర్లలో ఎక్కడ పడితే అక్కడ పెరిగే గుంటగలగర ఆకులో ఎన్నో ఔషధాలున్నాయి. నీటి కాలువలు, గుంటల పక్కన, తేమ గల ప్రదేశాలలో నేలబారుగా పెరిగే ఈ మొక్కకి గుత్తులుగా తెల్లని తెలుపులో చిన్నపూలు పూస్తాయి. దీన్ని సంస్కృతంలో భృంగరాజ అంటారు. ఈ మొక్కలో ఎక్లిప్టిన్‌ అనే ఔషధం ఉంది. ఇది లివర్‌ సమస్యలను తగ్గించే గుణం ఉందని ఆయుర్వేద వైద్య విధానంలో కనుగొన్నారు. ఈ ఆకుల రసాన్ని గాయాలు తగిలిన చోట రాస్తే త్వరగా తగ్గిపోతాయి. నోటి పూత సమస్య తగ్గుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ ఆకులతో వంటలూ చేసుకోవచ్చు. అవెలా తయారుచేయాలో తెలుసుకుందాం.

 

ఆయిల్‌ తయారీ

గుంటగలగరాకు మొక్కను వేరుతో సహా మెత్తగా దంచి, ముద్ద చేయాలి. దానికి నాలుగు రెట్లు నువ్వులనూనె / కొబ్బరినూనె కలిపి, సన్నటి సెగపై మరిగించాలి. ఆ మిశ్రమంలోని తేమ ఇగిరిపోయాక నూనెను వడపోయాలి. ఈ నూనె రాసుకుంటే తెల్లజుట్టు నల్లబడుతుంది. వెంట్రుకలు రాలిపోవడం ఆగి, కుదుళ్లకు బలం కలుగుతుంది. పేను కొరుకుడు సమస్య తగ్గిస్తుంది.

  • పచ్చడి..

కావల్సినవి : మినప్పప్పు- స్పూను, జీలకర్ర- స్పూను, ఎండుమిర్చి- పది, గుంటగలగర ఆకు- కప్పు, ధనియాలు- స్పూను, చింతపండు- ఉసిరికాయంత, తాలింపు గింజలు- స్పూను, కరివేపాకు- రెండు రెమ్మలు, వెల్లుల్లి గబ్బాలు- ఆరు, ఉప్పు- తగినంత, నూనె- రెండు స్పూన్లు.

తయారీ : పొయ్యి మీద బాండీ పెట్టి కొంచెం నూనె పోసి వేడి చేయాలి. మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర వేసి చిన్న మంట మీద వేయించాలి. అందులోనే ఎండుమిర్చి, చింతపండు వేసి వేయించి, వెంటనే దించాలి. తర్వాత గుంటగలగరాకు వేసి వేయించుకోవాలి. ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి మిశ్రమాలన్నీ మెత్తగా మిక్సీ పట్టాలి. తర్వాత గుంటగలగరాకు వేసి కచ్చాపచ్చాగ మిక్సీ పట్టుకోవాలి. తాలింపు కోసం బాండీలో నూనె పోసి వేడిచేయాలి. తాలింపు గింజలు వేసి, చిటపటలాడాక వెల్లుల్లి, కరివేపాకు వేయాలి. వెంటనే పచ్చడి మిశ్రమం కలపాలి. అంతే పచ్చడి రెడీ.

పప్పు..

కావల్సినవి : కందిపప్పు- కప్పు, గుంటగలగర ఆకు- కప్పు, ఉల్లిపాయ- ఒకటి, మిర్చి- నాలుగు, టమోట- ఒకటి, ఉప్పు- అరస్పూను, పసుపు- చిటికెడు, కారం- అరస్పూను, చింతపండు- కొంచెం, వెల్లుల్లి గబ్బాలు- నాలుగు, తాలింపు గింజలు- స్పూను, కరివేపాకు- రెండు రెమ్మలు, నూనె- స్పూను.

తయారీ : కుక్కర్‌లో కందిపప్పు వేసి, చిన్న మంట మీద ఐదు నిమిషాలు వేయించాలి. వేగిన తర్వాత నీళ్లతో శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు పోసి, పసుపు, కారం, చింతపండు వేసి ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోపు బాండీలో నూనె వేసి, తాలింపు పెట్టి, అందులో కొద్దిగా పసుపు, ఉల్లిపాయ, మిర్చి ముక్కలు, వెల్లుల్లి, కరివేపాకు, గుంటగలగరాకు వేయాలి. ఆకు కొంచెం మగ్గాక, టమోటా ముక్కలు వేయాలి. కుక్కర్‌లో ఉడికించుకున్న పప్పులో ఉప్పు వేసి, మెత్తగా మెదపాలి. ఈ పప్పును ముందుగా తాలింపు పెట్టుకున్న బాండీలో వేసి కలపాలి. కొద్దిసేపు కుతకుతలాడే వరకూ ఉడికించి, దించేయాలి. అంతే కమ్మని పప్పు రెడీ.

కారప్పొడి..

కావల్సినవి : నువ్వులు – స్పూను, శనగపప్పు- రెండు స్పూన్లు, మినప్పప్పు- స్పూను, జీలకర్ర- స్పూను, ఎండుమిర్చి- పదిహేను, గుంటగలగరాకు- కప్పు, కరివేపాకు – గుప్పెడు, ధనియాలు- స్పూను, చింతపండు- నిమ్మకాయంత, మెంతులు- చిటికెడు, వెల్లుల్లిగబ్బాలు- ఆరు, ఉప్పు- తగినంత, నూనె- రెండు స్పూన్లు.

తయారీ : గుంటగలగరాకు నీళ్లతో శుభ్రం చేశాక, కాటన్‌క్లాత్‌లో వేసి తడి లేకుండా ఆరనివ్వాలి. పొయ్యి మీద బాండీ పెట్టి కొంచెం నూనె పోసి వేడి చేయాలి. మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసి చిన్న మంట మీద వేయించి, ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. నువ్వులు వేయించి అదే ప్లేట్లో పోయాలి. తర్వాత బాండీలో కొంచెం నూనె పోసి, ఎండుమిర్చి, చింతపండు వేసి వేయించి, ప్లేట్‌లోకి తీసుకోవాలి. చివరిగా బాండీలో నూనె పోసి, గుంటగలగరాకు వేసి తడిపోయేలా పదినిమిషాల పాటు వేయించాలి. తర్వాత కరివేపాకు కూడా వేసి, వేపాలి. అంతే ముందుగా వేపి పెట్టుకున్న పదార్థాలు, ఎండుమిర్చి మిశ్రమం, ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. తర్వాత ఆకు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. అంతే కారప్పొడి రెడీ.

 

 

 

 

➡️