హమ్మా.. దోమా!

Sep 15,2024 10:43 #Sneha

ఓ వైపు జ్వరాలు స్వైరవిహారం చేస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా, బర్డ్‌ఫ్లూ, మంకీఫాక్స్‌.. ఇలా ఒకటేమిటి ఎన్నో జ్వరాలు జనాలను ఊపిరి ఆడనీయకుండా చేస్తున్నాయి. వీటన్నింటికి ఏకైక కారణం దోమలు కుట్టడం. కొన్ని దోమల వలన మలేరియా, ఎనాఫిలస్‌ వ్యాధులు రావడం మనకు తెలుసు. అయితే ఇటీవల దోమకాటు వలన తరచుగా తీవ్రమైన వ్యాధులు, కొన్నిసార్లు మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాంతక జీవులుగా మారాయి దోమలు. సర్‌ రోనాల్డ్‌ రాస్‌ తొలిసారి ఆడ ఎనాఫిలిస్‌ దోమ వలన మానవునికి మలేరియా వ్యాధి వ్యాపిస్తుందనే విషయాన్ని 1897 ఆగస్టు 20న కనుగొన్నారు. ఈ దోమల నివారణపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ప్రతి సంవత్సరం ఆ తేదీన కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ‘ప్రపంచ క్షేమం కోసం మలేరియా, ఇతర ప్రాణాంతక వ్యాధులను వ్యాపింప జేస్తున్న దోమలపై నిరంతరం, వేగంగా పోరాడాలి’ అనే థీమ్‌ను డబ్ల్యుహెచ్‌ఓ ప్రకటించింది.
దోమలు కూడా రోజురోజుకు వాటి సామర్థ్యం పెంచుకుని, మరిన్ని వ్యాధులను వ్యాపింప జేస్తున్నాయి. వీటిలో ఏడిస్‌ ఈజిప్టి జాతికి చెందిన దోమ డెంగ్యూ, పసుపు జ్వరం, జికా, ఇతర వ్యాధులకు కారణమయ్యే వైరస్‌లను వ్యాప్తి చేస్తోంది. ఇవి ఏడాదికి పదికోట్ల కంటే ఎక్కువ వైరస్‌నే ప్రపంచమంతా వ్యాపింపజేస్తున్నాయి. అనాఫిలిస్‌ గాంబియా అనే మరో దోమ మలేరియాకు కారణమైన పరాన్నజీవిని వ్యాపింప జేస్తుంది. ఒక్క మలేరియా వల్లనే ప్రతి సంవత్సరం నాలుగు లక్షలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక.
దోమలపై దాదాపు వంద సంవత్సరాలకు పైగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల యూనివర్శిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాకు చెందిన శాంటా బార్బరా అధ్యయన బృందం ఒక డాక్యుమెంటరీని విడుదల చేసింది. ఆ వివరాలలోకి వెళ్తే..

How Long Do Mosquitoes Live? | Trusted Since 1922

ఇన్‌ఫ్రారెడ్‌ డిటెక్షన్‌..
ప్రతి ప్రాణి శరీరం కొంత ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. మానవ శరీరం నుండి 12 మైక్రాన్ల తరంగ దైర్ఘ్యంలో రేడియేషన్‌ విడుదలవుతుంది. ఈ రేడియేషన్‌, శ్వాసక్రియ ద్వారా విడుదలయ్యే కార్బన్‌ డై ఆక్సైడ్‌ సహాయంతో దోమలు మనిషి ఉనికిని కనిపెడతాయని పరిశోధనలో తేలింది. ‘మా అధ్యయనంలో ఈడెస్‌ ఈజిప్టి జాతి దోమ మనిషి ఉనికిని గుర్తించడంలో అనూహ్యమైన నైపుణ్యాన్ని కలిగి ఉంది అని తెలిసింది. అంతేకాదు అనేక కొత్త విషయాలు కూడా తెలిశాయి’ అంటారు బృందంలోని ప్రొఫెసర్‌ క్రెయిగ్‌ మాంటెల్‌, పోస్ట్‌డాక్టోరల్‌ పరిశోధకుడు, సహ రచయిత అయిన నికోలస్‌ డిబ్యూబియన్‌. ‘సహజంగా పిట్‌ వైపర్స్‌ అనే పాములు హీట్‌ సెన్సింగ్‌ పిట్‌ ఆర్గాన్‌ ద్వారా శత్రువును గుర్తిస్తాయి. అదే హీట్‌ సెన్సింగ్‌ ఆర్గాన్‌ దోమలకు ఉండటం మమ్మల్ని ఆశ్చర్య చకితుల్ని చేసింది’ అంటుంది ఈ బృందం.

పెగ్‌ ఇన్‌ పిట్‌..
దోమ యాంటెన్నా చివర పెగ్‌-ఇన్‌-పిట్‌ (స్పర్శ, వాసన, రుచి, వేడి, చలిని గుర్తించే చిన్న వెంట్రుకలు) నిర్మాణాలను కలిగి ఉంటుంది. వీటిలో ట్రాన్సియెంట్‌ రిసెప్టర్‌ పొటెన్షియల్‌ చానెల్స్‌ (జంతుకణ నిర్మిత ప్లాస్మాపొర) అనే జన్యువులు ఉంటాయి. ఇవే ఇన్‌ఫ్రారెడ్‌ డిటెక్టర్‌లు. ఇవి ఇన్ఫ్రారెడ్‌ రేడియేషన్‌ను వెంటనే గ్రహిస్తాయి. వీటి ద్వారా దోమలు తక్కువ వెలుతురులోనే మనిషి ఉనికిని తెలుసుకుంటాయని పరిశోధనల్లో తెలిసింది. మన శరీరం నుండి వెలువడే వేడి, దోమలో ఉండే న్యూరాన్‌లను తాకుతుంది. వేడి నుండి వచ్చే శక్తి విద్యుదయస్కాంత తరంగాలుగా మార్చబడినప్పుడు ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. దాని ద్వారా దోమలు రేడియేషన్‌ను పరోక్షంగా గుర్తిస్తాయి. దీని ప్రభావం 70 సెం.మీ (2.5 అడుగులు) ల వరకు ఉంటుంది. దాదాపు పది సెం.మీ. దూరం నుంచే మన శరీరంపై పెరుగుతున్న ఉష్ణోగ్రతను నేరుగా పసిగట్టగలుగుతాయి. ఎందుకంటే దోమల కళ్ళలో ఉండే రోడాప్సిన్‌ (రెటీనాలోని రాడ్‌ కణాలను ప్రేరేపించే) ప్రోటీన్‌కు కాంతి (ఇన్‌ఫ్రారెడ్‌ రేస్‌) ని గుర్తించే శక్తి చాలా తక్కువుగా ఉంటుంది. ఎలాగంటే దోమల యాంటెన్నాలలో హీట్‌ సెన్సింగ్‌ న్యూరాన్లు ఉన్నాయి. వాటిని తొలగించి, చేసిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడైనట్లు బృందం తెలిపింది.
ప్రాణాంతకమైన మలేరియాను నివారించడానికి కొన్ని సూచనలు అందరూ పాటించటం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ఎనాఫిలస్‌ దోమ ద్వారా ప్రోటోజోవన్‌ పరాన్నజీవి మనిషి శరీరంలో ప్రవేశిస్తుంది. మలేరియాకు కూడా ఫ్లూ లక్షణాలే ఉంటాయి. జ్వరం వచ్చి, వణికించే చలి ఉంటుంది. సరైన చికిత్స అందకపోతే మూత్రపిండాలు, కాలేయాన్ని దెబ్బతీస్తుంది. ప్లీహము చీలిపోయి దెబ్బ తింటుంది. ఈ పరిస్థితుల్లో ప్రాణాపాయం కావొచ్చు. అందువలన సత్వర చికిత్స అవసరం.

Is the blood seen after splattering a mosquito, blood from humans? The  blood at times would be quite alot which scares me that it may be mine. :  r/biology

నివారణ కోసం..
ఇంటి పరిసరాలు, చుట్టుపక్కల వాతావరణం శుభ్రంగా ఉండేలా చూడాలి.
పడుకునేటప్పుడు శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా ఉండి, వదులుగా ఉన్న దుస్తులను ధరించాలి.
దోమతెరలు ఉపయోగించాలి.
అవసరాన్ని బట్టి పెర్మెత్రిన్‌ అనే కీటక సంహారిణిని దోమతెరలపై పిచికారీ చేయాలి.
ప్రతి సంవత్సరం సుమారు ఒక వంద కోట్ల మంది ప్రజలు వ్యాధి బారిన పడుతున్నారని బృందంలోని డా. చందేల్‌ చెప్పారు. వాతావరణ మార్పు కూడా ప్రపంచ వ్యాప్తంగా దోమల వ్యాప్తికి కారణం. దోమలను అణిచివేసేందుకు అందరూ కంకణం కట్టాలి. దోమల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి.

➡️