చైల్డ్ ఆర్టిస్ట్‌గా మలయాళంలో పలు చిత్రాల్లో నటించిన హీరోయిన్ నివేదా థామస్ తెలుగు అమ్మాయిగా టాలీవుడ్‌లో గుర్తింపు పొందారు. జెంటిల్‌మేన్ నుంచి వకీల్ సాబ్ వరకు దాదాపు తను నటించిన ప్రతీ మూవీ హిట్ టాక్ దక్కించుకున్నారు అంటే నివేదా – ఇచ్చిన పాత్రలో ఎంతగా ఒదిగిపోతారో అర్థమవుతోంది. నందకిశోర్ దర్శకత్వంలో ’35 చిన్న కథ కాదు’లో అమ్మ పాత్రలో నటించారు అనే కంటే జీవించారు అంటే బాగుంటుంది. ఎందుకంటే కొన్నిచోట్ల తన నటన కన్నీళ్లు తెప్పిస్తుంది. సెప్టెంబర్ 6న విడుదలైన ఈ సినిమా విజయవంతంగా అభిమానుల హృదయాలను హత్తుకుంది. ఈ సందర్భంగా ఆమె గురించి తెలుసుకుందాం.
నివేదా థామస్ తండ్రి థామస్ బిజినెస్ మేన్. తల్లి లిల్లీ. నివేదాకు నిఖిల్ అనే తమ్ముడున్నాడు. నివేదాను ఇంట్లో అందరూ బేబీ అని ముద్దుగా పిలుస్తారట. పుట్టింది కేరళలోనే అయినా విద్యాభ్యాసం మొత్తం తమిళనాడులోని చెన్నైలోనే. బాలనటిగా తన కెరీర్‌ని స్టార్ట్ చేసిన ఈమె హీరోయిన్ కావాలనే చిన్నప్పటి నుంచి అనుకునేదట. అలా మోడల్‌గా అడుగులేస్తూ మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో సినిమా అవకాశాలను దక్కించుకున్నారు.
బాలనటిగా ఎంట్రీ
నివేదా 2002లో మలయాళ చిత్రం ”ఉత్తర”తో బాలనటిగా తెరంగేట్రం చేశారు. సన్ టీవీలో ప్రసారమయ్యే బాలల సీరియల్ ”మై డియర్ బూతం” లో కూడా నటించారు. మలయాళం సినిమా ”వెరుథె ఒరు భార్య” సినిమాలో జయరాం కుమార్తెగా నటించారు. తర్వాత తమిళ, మలయాళ చిత్రాల్లో సహాయ నటిగా అవకాశాలు వచ్చాయి. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ తనదైన నటనతో ప్రశంసలు అందుకున్నారు. చాప్పా కురిష్, తట్టతిన్ మరయతు వంటి విజయవంతమైన సినిమాల్లో గుర్తింపు సంపాదించారు. మలయాళ చిత్రం ”వెరుథె ఒరు భార్య” గాను విమర్శకుల ప్రశంసల మాత్రమే కాదు, పురస్కారం కూడా అందుకున్నారు.
అన్నీ హిట్టే..
ఇక టాలీవుడ్‌లో డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందించిన ”జెంటిల్మెన్” సినిమా ద్వారా నివేదా థామస్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తరువాత ”నిన్నుకోరి, బ్రోచేవారెవరురా, జై లవకుశ” చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నివేదా చదువు కోసం కొంచెం గ్యాప్ తీసుకున్నారు. మళ్లీ కళ్యాణ్‌రామ్‌తో జోడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ”118, జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్’ యాక్షన్, వీ” తదితర సినిమాలతో తెలుగు అమ్మాయిగా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. పవన్‌కల్యాణ్‌తో వకీల్ సాబ్‌లో అద్భుతంగా నటించి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశారు. దాదాపు తను నటించిన ప్రతీ మూవీ హిట్ అయ్యింది. అదే నివేదాకు ప్లస్ పాయింట్ అని చెప్పాలి.
”దర్బార్”లో రజనీకాంత్ కూతురిగా నటించిన అనుభవం ఆమెలో మరింత ఆత్మవిశ్వాసం పెంచింది. కథల ఎంపికలో తానెప్పుడూ జాగ్రత్తగా ఉంటారు. అందుకే సినిమాల సంఖ్య తక్కువగా ఉంటుంది. ‘ఏమాత్రం గుర్తింపు ఇవ్వని పది పాత్రల్లో నటించడం కంటే, ప్రేక్షకుల మనసుదోచే ఒక్క పాత్ర చేయడం మేలని నా అభిప్రాయం. కాబట్టే, ఆచితూచి కథలను ఎంచుకుంటా. హీరోయిన్‌గానే చేయాలనే నియమం పక్కన పెట్టి, ప్రాధాన్యం ఉన్న ఏ పాత్రకైనా సిద్ధంగా ఉంటాను. నిజంగా మంచి కథలు దొరకని పరిస్థితి వస్తే నేనే సొంతంగా ఓ కథ రాసి, నటించేందుకు ప్రయత్నిస్తానే కానీ నచ్చని కథలను ఒప్పుకోను.’ అని ఓ సందర్భంలో చెప్పారు.
చాన్నాళ్ల తర్వాత తెలుగు తెరపై మెరిసిన నివేదా థామస్ తన కెరీర్లో గుర్తుండిపోయే పాత్రను చేశారు. ’35 చిన్న కథ కాదు’లో సరస్వతిగా తన అభినయం గురించి ఎంత చెప్పినా తక్కువే. మధ్య తరగతి ఇల్లాలి పాత్రలో సులువుగా ఒదిగిపోయారు. చిత్తూరు యాస నేర్చుకుని, సొంతంగా డైలాగులు చెప్పి, తెలుగు అభిమానులను మెప్పించారు నివేదా.
సాహసాలు ఇష్టం
హీరోయిన్‌గా మెప్పించే నివేదా థామస్‌కి సాహసాలు ఇష్టమట. ఎత్తయిన శిఖరాలను అధిరోహించడం మరింత ఇష్టమట. దీనికోసం 2021లో ఆరు నెలలపాటు ట్రెక్కింగ్‌లో శిక్షణ తీసుకుని, తన లక్ష్యాన్ని చేరుకున్నారు. ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. రిస్క్ అయినా అనుకున్నది సాధించి, అందరిచేత ప్రశంసలు అందుకున్నారు. అటు చదువును, ఇటు కెరీర్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ హీరోయిన్‌గా ఎదిగిన సెలబ్రిటీల్లో నివేదా ఉండటం అభినందనీయం. ఈ నేపథ్యంలో ‘కొన్నిసార్లు షూటింగ్‌కు వెళ్లి ఆ మేకప్‌తోనే క్లాస్‌కు హాజరైన సందర్భాలు చాలా ఉన్నాయి’ అని ఒక ఇంటర్వ్యూలో నివేదా తెలిపారు.
పేరు : నివేదా థామస్
పుట్టిన తేది : 1995, నవంబర్ 2న
అవార్డులు : కేరళ రాష్ట్ర ఉత్తమ యువ నటి పురస్కారం