పక్షులు చాలా కాలంగా శాస్త్రవేత్తలను, ప్రకృతి ప్రేమికులను అవి ఉత్పత్తి చేసే గొప్ప శబ్దాలతో ఆకర్షిస్తున్నాయి. శ్రావ్యమైన పాటల నుండి పదునైన అలారం శబ్దాల వరకు పక్షుల గాత్రాలు సహచరులను ఆకర్షించడం, భూభాగాన్ని రక్షించడం.. ఇతరులతో కమ్యూనికేట్ చేయడం.. వివిధ ప్రయోజనాలకు ఉపయోగపడేవి. అయితే పక్షి శబ్దాల యొక్క అద్భుతమైన వైవిధ్యాన్ని నడిపించే అంతర్లీన అంశాలు ఇప్పటివరకూ సరిగా అర్థం కాలేదనే చెప్పాలి. విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు నిర్వహించిన కొత్త అధ్యయనం పక్షులు కొన్ని శబ్దాలను ఎందుకు చేస్తాయి? ఏ పౌనఃపున్యంలో చేస్తాయి? అనే దానిపై కొత్త అధ్యయనాలను అందించింది. ఆ వివరాలలోకి వెళితే..
‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది రాయల్ సొసైటీ’ లో ఈ పరిశోధన ప్రచురించారు. ఇందులో పక్షి స్వరాలను ప్రభావితం చేసే పర్యావరణ, జీవ సంబంధమైన అంశాలను విశ్లేషించారు. పిహెచ్‌డి విద్యార్థి అయిన హెచ్‌ఎస్ సత్యచంద్ర సాగర్ నేతృత్వంలోని ఈ అధ్యయన బృందం ప్రపంచ వ్యాప్తంగా లక్ష కంటే ఎక్కువ పక్షి ధ్వని రికార్డింగ్‌లను విశ్లేషించింది. ఈ రికార్డింగ్‌లు పక్షి జాతులలో 77% ప్రాతినిధ్యం వహించాయని చెప్తోంది. పక్షి సంభాషణలో ప్రపంచ నమూనాల సమగ్ర అవగాహనను అందిస్తున్నాయని బృందం పేర్కొంది.
స్వరాలను ప్రభావితం చేయడం..
పక్షుల స్వరాలను ప్రభావితం చేసే అనేక ముఖ్యమైన అంశాలను ఈ పరిశోధన హైలైట్ చేసింది. వాటిలో ఆవాసాలు, అక్షాంశం, శరీర పరిమాణం, ముక్కు ఆకారం తదితరాలు ఉన్నాయి. ఈ అంశాలు పక్షులు ఎలా సంభాషిస్తాయో తెలియచేయడమే కాకుండా విస్తృత పరిణామ, పర్యావరణ నమూనాలనూ ప్రతిబింబిస్తాయని పేర్కొంది.
అత్యంత ఆశ్చర్యకరమైన ఆవిష్కరణలలో ఒకటి పక్షి నివాస స్థలం, దాని శబ్దాల ఫ్రీక్వెన్సీ మధ్య సంబంధం పేర్కొనడం. అధిక నేపథ్య శబ్దం ఉన్న పర్యావరణ వ్యవస్థలలో – ఉదాహరణకు వేగంగా ప్రవహించే నీరు లేదా దట్టమైన వృక్షసంపద ఉన్న ప్రదేశాలలో పక్షులు అధిక-ఫ్రీక్వెన్సీ శబ్దాలను ఉత్పత్తి చేస్తాయని బృందం తెలుసుకోగలిగింది. ఈ అనుసరణ పరిసరాల్లోని తక్కువ-ఫ్రీక్వెన్సీ పర్యావరణ శబ్దాల్లో కలిసిపోకుండా ఉండటానికి సహాయపడుతుంది.. దీని వలన ఆ పక్షులు చేసే శబ్దాలు విభిన్నంగానూ ఉండటాన్ని వీరు గుర్తించారు. ఈ అధ్యయనంలో పక్షుల స్వరాలలో భౌగోళిక నమూనాను కూడా కనుగొన్నారు. ఒకే అక్షాంశాల వద్ద నివసించే పక్షి జాతులు ప్రపంచవ్యాప్తంగా ఒకే రకమైన శబ్దాలను ఉత్పత్తి చేస్తాయనే గమ్మత్తయిన అంశాన్ని గమనించింది. అక్షాంశంతో ముడిపడి ఉన్న పర్యావరణ పరిస్థితులు – వాతావరణం వంటివి – పక్షుల సంభాషణను రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని బృందం పరిశోధనలో తేలింది.
శరీరం.. ఆకారం.. పరిమాణం..
పక్షి శరీరం, ముక్కు యొక్క పరిమాణం, ఆకారం కూడా అది ఉత్పత్తి చేసే శబ్దాలను ప్రభావితం చేస్తుందని వీరి పరిశోధనలో వెల్లడైంది. చిన్న పక్షులు అధిక-ఫ్రీక్వెన్సీ శబ్దాలను ఉత్పత్తి చేస్తే, పెద్ద పక్షులు తక్కువ-ఫ్రీక్వెన్సీ ధ్వనులను ఉత్పత్తి చేస్తాయని తేలింది. ఇది భౌతిక సూత్రాలకు అనుగుణంగా ఉంటుంది – చిన్న స్వర తంతువులు, చిన్న ముక్కులు అధిక ధ్వని శబ్దాలను సృష్టించడానికి బాగా సరిపోతాయనీ, అయితే పెద్ద శరీర ద్రవ్యరాశి, పొడవైన ముక్కులు లోతైన స్వరాలకు అనుకూలంగా ఉంటాయని అధ్యయనంలో తెలిసింది.
చిన్న పక్షులు విస్తృతశ్రేణి ధ్వని పౌనఃపున్యాలను కలిగి ఉన్నాయని మరింత విశ్లేషణతో తెలుసుకున్నామని బృందం తెలిపింది. మనుగడను మెరుగుపరచడానికి ఇది ఒక పరిణామాత్మక అనుసరణ కావచ్చని పేర్కొంది. అధిక పిచ్ కాల్స్ వాటి జాతులలో సంభాషించడానికి సహాయపడతాయని తెలిపింది. అయితే తక్కువ-ఫ్రీక్వెన్సీ శబ్దాలు మభ్యపెట్టే రూపంగా ఉపయోగపడతాయని మరింత విశ్లేషణతో తెలుసుకున్నామని పేర్కొంది. పెద్ద పక్షుల లోతైన స్వరాలను అనుకరించడం ద్వారా, చిన్న జాతులు వేటాడే జంతువులను గందరగోళానికి గురిచేస్తాయని, వాటిని లక్ష్యంగా చేసుకునే అవకాశాలను తగ్గిస్తాయని తెలిపింది. పక్షుల సంభాషణను అర్థం చేసుకోవడంతో పాటు, ఈ అధ్యయనం వాటి పరిరక్షణకు కూడా గణనీయమైన ప్రభావం చూపుతుంది. పక్షుల స్వరాలు ”సౌండ్‌స్కేప్‌ల”లో కీలకమైన భాగం – ఒక నిర్దిష్ట వాతావరణంలో శబ్దాల ఆధారంగా సౌండ్‌స్కేప్‌ల నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికీ శాస్త్రవేత్తలకు పర్యావరణ వ్యవస్థల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికీ సహాయపడుతుంది. ఉదాహరణకు, వేట కారణంగా పెద్ద పక్షుల సంఖ్య తగ్గడమనేది ఒక నిర్దిష్ట ఆవాసంలో తక్కువ-ఫ్రీక్వెన్సీ శబ్ధం లేకపోవడం ప్రతిబింబిస్తుంది. ఉష్ణమండల అడవులు, ఇతర జీవవైవిధ్య ప్రాంతాలలోని సౌండ్‌స్కేప్‌లు తక్కువ-ఫ్రీక్వెన్సీ శబ్దాల తగ్గుదలను చూపిస్తుంది. అంతేకాదు ఆ పక్షులను అతిగా వేటాడటాన్నీ, పర్యావరణ క్షీణత ప్రభావాన్నీ సూచిస్తుందని ఆ బృందం వివరించింది.
విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయం నుండి వచ్చిన ఈ అధ్యయనం పక్షి శబ్దాలను రూపొందించే సంక్లిష్ట కారకాలపై కొత్త వెలుగును ప్రసరింపజేస్తుంది. ఆవాసాలు, భౌగోళిక శాస్త్రం, భౌతిక లక్షణాలు.. పక్షి స్వరాలను ఎలా ప్రభావితం చేస్తాయో వెల్లడిస్తుంది. ఈ పరిశోధన ద్వారా పక్షి సంభాషణపై లోతైన అవగాహనను అందిస్తుంది. అలాగే పర్యావరణ పరిరక్షణకు కొత్త ద్వారాలు తెరిచినట్లుయ్యిందని ఆ బృందం పేర్కొంది.