ఆహార వ్యవస్థల్లో మార్పులెలా?

Feb 11,2024 07:13 #Food, #Sneha
How do food systems change?

ఆహార లోపం, పర్యావరణం, జీవ వైవిధ్యం, గ్లోబల్‌ వార్మింగ్‌, వ్యవసాయం, కాలుష్యం లాంటి తీవ్ర పరిణామాలను కొన్ని దశాబ్దాలుగా మానవాళి ఎదుర్కొంటున్నది. దీనిపై శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు కలసి పరిశోధనలు చేశారు. బ్రూకింగ్స్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్రికా గ్రోత్‌ ఇనిషియేటివ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆర్థికవేత్త వెరా సాంగ్‌వే దీనిపై నివేదికను రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆహారవ్యవస్థలను మార్చడం, వాతావరణ పరిస్థితులపై లక్ష్యాలు, ఆర్థిక ప్రయోజనాల సూచికలతో ఈ నివేదిక విడుదలైందన్నారు సాంగ్‌ వే.

కొత్త గ్లోబల్‌ పాలసీ నివేదిక ప్రకారం ఫుడ్‌ సిస్టమ్‌ ఎకనామిక్స్‌ కమిషన్‌ ప్రపంచవ్యాప్తంగా ఆహారం ఎలా ఉత్పత్తి చేయబడుతోంది.. ఎలా వినియోగించబడుతుంది.. తద్వారా పర్యావరణ నష్టం ఏర్పడటం.. ఆరోగ్య ప్రభావాలకు దారితీయటంపై ఒక నివేదిక విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఆహార వ్యవస్థల్లో మార్పులు తేవడం ద్వారా వాతావరణంలో సమతుల్యత సాధించవచ్చునని నివేదిక చెబుతోంది. అంతేకాదు 17.4 కోట్ల ముందస్తు మరణాలను నిరోధించవచ్చని వివరిస్తుంది. దీని ఫలితంగా ఐదు లక్షల కోట్ల నుండి 10 లక్షల కోట్ల రూపాయల వరకు ఆర్థిక ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చని పరిశోధకుల అంచనా.’ఆహార వ్యవస్థల ఇటీవలి పరిణామం తీవ్రమైన సవాళ్లకు ఆజ్యం పోసింది.

ఆహార వ్యవస్థ అంటే.. ఆహార ఉత్పత్తి, మార్కెటింగ్‌, వినియోగం ఇవన్నీ. ప్రస్తుతం మన కమ్యూనిటీలో మార్పు అనేది రాజకీయ, సామాజిక, ఆర్థిక, పర్యావరణ, సాంస్కృతిక విభాగాలలో రావాలి’ అని నివేదిక పేర్కొంది. ప్రధానంగా మానవాళి ఎదుర్కొంటున్న నిరంతర ఆకలి, పోషకాహార లోపం, ఊబకాయం, జీవవైవిధ్య నష్టం, పర్యావరణ నష్టం, వాతావరణంలో అసమంజస పరిణామం వల్లనే.

ప్రస్తుత మన ఆహార వ్యవస్థలు అభివృద్ధి కంటే నష్టాన్నే చూస్తున్నాయి. ఈ ఆహార వ్యవస్థల్లో మార్పు ద్వారా సమతుల్యత సాధ్యమవుతుంది అంటున్నారు శాస్త్రవేత్తలు. ఆర్థిక శాస్త్రం, పోషణ, ఆరోగ్యం, సహజ వనరులు, వ్యవసాయంపై నిపుణుల అధ్యయనాన్ని కమిషన్‌ నివేదించింది. 1970ల నుండి ప్రపంచ జనాభా రెండింతలు పెరిగింది. దాంతోపాటు ఆహారోత్పత్తి పెరుగుదలలో కొన్ని మార్పులు జరిగాయి. ఈ పెరుగుదల ఒకరకంగా ప్రపంచానికి అన్ని రకాలుగానూ భారమైంది. వీటిపరంగా అనేక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడ్డాయి. అధిక రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్‌ వంటి ఆహారం వలన కలిగే అనారోగ్యాలకే దాదాపు పదకొండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చవుతోంది. ఇవేకాక ఇతర వ్యాధులను కలుపుకుని మొత్తంగా దాదాపు పదిహేను లక్షల కోట్ల రూపాయల వరకు అవుతుందని నివేదిక అంచనా.

ఆహారోత్పత్తి, వ్యవసాయ భూమి వినియోగ పద్ధతులు పర్యావరణం కిందికే వస్తాయి. దీనికి మూడు లక్షల కోట్ల రూపాయలు వినియోగించినా దీని ప్రభావం గ్రీన్‌హౌస్‌ ఉద్ఘారాలపై పడకుండా ఆపలేకపోయాము. గ్లోబల్‌ వార్మింగ్‌ క్రమంగా పెరుగుతూ 1.5 డిగ్రీల సెల్సియస్‌ను దాటిపోయిందని ప్రాథమికంగా ఉన్న అంచనా.. వీటన్నింటికీ కారణం ఆహార వ్యవస్థలలో వచ్చిన మార్పేనని అధ్యయన రచయితలు వివరించారు. ఈ నివేదిక అమలు చేయటం.. పర్యావరణానికి, ప్రజారోగ్యానికి, భవిష్యత్తులో మన ఆర్థికవ్యవస్థ భద్రతకు ఉపకరిస్తుందని నొక్కి వక్కాణిస్తున్నారు నిపుణులు.

మనం అవలంబించే మెరుగైన విధానాల వల్ల దీర్ఘకాలిక వ్యాధులు, మరణాలు తగ్గుతాయని, అలాగే కార్బన్‌ సీక్వెస్ట్రేషన్‌ (వాతావరణంలోని కార్బన్‌ డై ఆక్సైడ్‌ను సంగ్రహించి నిల్వ చేయటం) గా పనిచేస్తుందని తెలిపారు. ఆహారవ్యవస్థలో పురోగతిని కొనసాగించగలిగితే 2040 నాటికి గ్లోబల్‌ వార్మింగ్‌ను 1.5 డిగ్రీల కంటే తగ్గించవచ్చు అంటున్నారు. 2050 నాటికి ఈ మెరుగైన విధానాలు పోషకాహార లోపాన్ని కూడా నిర్మూలిస్తాయని అంటున్నారు. తద్వారా 140 కోట్ల హెక్టార్ల భూమిని రక్షించవచ్చు. జీవవైవిధ్యాన్ని కాపాడవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 40 కోట్ల వ్యవసాయ కార్మికులు సరైన ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది అని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.

➡️