‘చినుకు కురిసిన క్షణం పుడమి పరిమళం.. నీలిగగనాన విరిసిన హరివిల్లు వర్ణం… నిశీధిలో మిణుగురుల కాంతి తరంగం.. పచ్చని పొలాన వీచే సమీరం.. అలుపులేక ప్రవహించే సెలయేటి ప్రవాహాం.. శిశిరాన్ని మరిపించే వసంతరాగం.. ప్రకృతిలో దాగిన వర్ణాలు, జీవరాశులు అనేకం.. మనసుని పులకరించే అందాలు నీ సొంతం..’ అంటాడు ఓ ప్రకృతి ప్రేమికుడు. ఇలా ప్రకృతి గురించి చెప్పుకుంటూ పోతే మాటలు సరిపోవేమో! అంతలా మైమరిపించే అందాలు ప్రకృతిలో దాగి ఉన్నాయి. వాటిని సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబంగా కనిపిస్తుంది అంటాడు ఓ గేయ రచయిత. ఎవ్వరూ నాటకుండానే పెరుగుతున్న అడవులను, దాని సంపదను ఎవరికి వారే ‘నాదే హక్కు’ అని కొల్లగొడుతున్నారు. డబ్బు కోసం వన్యప్రాణులను చంపుతున్నారు. స్వార్థంతో ప్రాణాలు నిలిపే ప్రకృతి నాశనానికి పూనుకుంటున్నారు. ప్రకృతి పరిరక్షణ అనేది ఆరోగ్యకరమైన భవిష్యత్తు తరాలకు పునాది. అందుకే ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో పర్యావరణ ప్రకృతి అనుకూల కార్యకలాపాలను ప్రోత్సహించాలి. ఓ ఉద్యమంలా చెట్లను పెంచాలి. అంతరించిపోతున్న జీవజాతులను కాపాడుకోవాలి. అప్పుడే ప్రకృతి ముప్పును తట్టుకోగలం. ఈ నెల 28న ‘ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం’ సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.
పచ్చని దట్టమైన అడవులు, ఎత్తయిన కొండలు వాటిని ముద్దాడుతూ గల గల పారే సెలయేళ్లు, నదులు, వేవేల అడవి పూలు, రకరకాల పక్షులు- అవిచేసే మధురమైన గానాలు, పూలపై వాలే సీతాకోకచిలుకలు, చల్లటి గాలివీచే చెట్లు, తివాచీ పరిచినట్టు ఉండే పచ్చికబయళ్లు- వాటిని మధ్య తిరిగే వన్యప్రాణులు.. ఒళ్లంతా కళ్లు చేసుకుని చూస్తేగానీ ఆ అందాలను ఆస్వాదించలేం. భూమిపై ఉండే నేల, నీరు, గాలి, ఖనిజాలు, అడవి, జంతువులు అన్నీ ప్రకృతి సంపద. వీటిలో ఏది నాశనం చేసినా భూమి మీద మనిషి మనుగడ ప్రశ్నార్థకం. ‘పచ్చని చెట్లు-ప్రగతికి మెట్లు’ అనే వాక్యం ప్రాథమిక పాఠ్యపుస్తకాల్లో చదివాము. దాని అర్థం చెట్లు ఉంటే – మనిషి మనుగడ ముందుకు సాగుతుంది. ఆరోగ్యంగా ఉంటాడు అని. కానీ కార్పొరేట్ వ్యక్తులు ‘అడవులు పోయినా పర్లేదు. డబ్బు సంపాదించాలి’ అనే స్వార్థంతో ప్రకృతి నాశనానికి పూనుకుంటూ వన్యప్రాణుల అక్రమ వ్యాపారం చేస్తున్నారు. వీటితోపాటు వాయు కాలుష్యం, ప్లాస్టిక్‌లను ఉపయోగించడం, రసాయనాలు మొదలైన వాటివల్ల ప్రకృతికి అనేకరకాలుగా నష్టం జరుగుతుంది. అందుకే ప్రకృతి పరిరక్షణ చాలా ముఖ్యం. కాపాడుకోకపోతే భవిష్యత్తులో సామూహిక విపత్తులు తప్పవని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఈ రోజు ప్రత్యేకత..
పర్యావరణంలో చాలా మార్పులు తలెత్తుతున్నాయి. దీనికి కారణం అడవుల నరికివేత, పెరుగుతున్న కాలుష్యం, భూమి మీద నుండి అదృశ్యమవుతున్న జీవజాలం. మానవాళి మనుగడకు మూలమైన సమస్త ప్రకృతిని కాపాడుకోవడానికి నడుం బిగించాలన్న లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి 2018లో జరిగిన సర్వసభ్య సమావేశం నిర్వహించింది. జులై 28ని ‘అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ దినం’గా పాటించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. అయితే కొన్నేళ్లుగా అనేక దేశాల్లోని వివిధ సంస్థలు ఈ దిశలో కార్యక్రమాలు నిర్వహించాయి. ఐక్యరాజ్యసమితి నిర్ణయం తర్వాత ఈ రోజుకు అధికారిక గుర్తింపు లభించింది. యావత్ ప్రపంచం.. వ్యక్తులు, సంస్థలు, అనేక దేశదేశాల ప్రభుత్వాలు ప్రకృతి పరిరక్షణపై దృష్టి సారించాయి. భూగోళ పరిరక్షణకు, మానవాళి భద్రత, భవిష్యత్తుకు నడుం బిగించాయి. అప్పటివరకు చేసిన కార్యక్రమాలను సమీక్షించుకున్నాయి. కొంగొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి 2018 నుండి జులై 28ని ఒక వేదికగా చేసుకున్నాయి. దీంతో ప్రకృతి పరిరక్షణ కోసం విడివిడిగా కార్యక్రమాలు చేస్తున్న వారంతా ఈ ఒక్కరోజైనా కలిసికట్టుగా చేయాలనేదే దీని ఆకాంక్ష. మన దేశం కూడా చర్యలు చేపట్టింది. స్వచ్ఛ భారత్ అభియాన్, ప్రాజెక్ట్ టైగర్, భవిష్యత్తు కోసం మడ అడవుల సంరక్షణ దిశగా కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. కానీ ఆచరణలో మాత్రం వెనకబడింది.
అడవుల విధ్వంసం..
జీవ వైవిధ్యానికి అత్యంత కీలకంగా భావించేది అమెజాన్ అడవులు. వీటి వైశాల్యం గత శతాబ్ద కాలంలో 20 శాతం తగ్గింది. కార్పొరేట్ సంస్థలు ఖనిజాలు, శిలాజ ఇంధనాల వెలికితీత కోసం ఈ అడవులను విచ్చలవిడిగా విధ్వంసం చేశాయి. యంత్రాలతో తవ్వడం, బాంబులతో పేల్చడం వంటి విచ్చలవిడి చర్యలు చేపట్టారు. ఫలితంగా ఇక్కడి జీవజాలం నామరూపాలు లేకుండా పోయింది. భూ గోళానికి ఊపిరితిత్తులుగా ప్రసిద్ధి కెక్కిన అమెజాన్ అడవుల్లో 30 లక్షల రకాల జంతుజాతులు, 2,500 రకాల వృక్ష జాతులు ఉన్నాయి.
భూమి మీద ఉన్న కీలకమైన వృక్ష జాతుల్లో మూడో వంతు ఈ అడవుల్లోనే ఉన్నాయి. విచ్చలవిడిగా సాగుతున్న విధ్వంసం ఫలితంగా ఇక్కడి జీవ, వృక్ష జాతుల మనుగడ నేడు ప్రశ్నార్థకంగా మారింది. ‘ఇంటర్ గవర్నమెంటల్ సైన్స్ – పాలసీ ప్లాట్‌ఫామ్ ఆన్ బయో డైవర్సిటీ అండ్ ఎకో సిస్టమ్ సర్వీసెస్ -ఐపిబిఇఎస్’ నివేదిక ప్రకారం పది లక్షల జంతుజాతుల ఉనికి ప్రమాదంలో పడింది. వీటిలో కొన్ని ఇప్పటికే అంతరించిపోయాయి. ఏడాదికి సగటున 3,800 చదరపు మైళ్ల అమెజాన్ అడవి విధ్వంసానికి గురవుతోంది. అమెజాన్ పరిరక్షణకు ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నా ఈ విధ్వంసకాండ మాత్రం ఆగడం లేదు. ఫలితంగా స్థానిక తెగల ప్రజల ఉనికి సైతం ప్రశ్నార్థకంగా మారింది.
భూమి క్షేమం కోసం..
అందరికీ ఆహారం కావాలన్నా, నివాసం ఉండాలన్నా భూమి కావాలి. అటువంటి భూమిని ప్రయివేటు వ్యక్తులు రకరకాలుగా నాశనం చేస్తున్నారు. ఇది ఏ స్థాయిలో జరుగుతుందో తెలుసుకుంటే తల తిరిగిపోతుంది. అడ్డొచ్చిన అడవులను నరికేస్తూ పోతున్నారు. ప్రభుత్వాల అండతో ఖనిజాలను, గనులను ఇష్టారీతిన తవ్వుతున్నారు. కార్పొరేట్ సంస్థల మితిమీరిన లాభార్జనే దీనికి ప్రధానకారణం. దీంతోపాటు పారిశ్రామిక వ్యర్థాలు, రసాయనిక ఎరువులు, పురుగుమందుల అధిక వినియోగం, పెద్ద ఎత్తున పోగుబడుతున్న చెత్త వల్ల భూమి విపరీతంగా కాలుష్యం అవుతుంది. దీన్ని నియంత్రించకపోతే భవిష్యత్తులో భారీ నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది. గృహ వ్యర్థాలు, చెత్తాచెదారం వల్ల కూడా భూసారం దెబ్బతింటోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక ప్రకారం మన దేశంలో ప్రతిరోజూ 15 వేల టన్నులు, ఏటా యాభై ఆరు లక్షల టన్నుల చెత్త పోగుపడుతోంది. ఈ టన్నుల చెత్తని శుభ్రపరచడానికి వందల సంవత్సరాలు పట్టవచ్చు. అందుకే భూమి నాశనం చేసే వ్యర్థాల వాడకం తగ్గించాలి. అందుకే పరిరక్షణ చర్యలు చేపట్టాలి. చెట్లను పెంచడం, సేంద్రియ ఎరువులు వాడాలి. ఖనిజ వనరులను ప్రణాళికాబద్ధంగా, స్థిరమైన పద్ధతిలో ఉపయోగించాలి. తక్కువ ఖర్చుతో తక్కువ -గ్రేడ్ ఖనిజాలను ఉపయోగించడానికి సాంకేతికతను మెరుగుపరచాలి. లోహాలను రీసైకిల్ చేయాలి.
అక్రమ వన్యప్రాణుల వ్యాపారం..
ప్రకృతి పరిరక్షణ అంటే జాతులు అంతరించిపోకుండా రక్షించడంతోపాటు వాటికి ఆవాసాలను నిర్వహించడం, వనరుల దుర్వినియోగాన్ని నిరోధించడం. అడవులకు అందం వన్యప్రాణులే.. అవి లేకుండా అడవులను చూడలేము. అవి లేకపోతే అడవులను ఊహించుకోలేము. అడవిలో ఠీవిగా పులి నడిచి వస్తుంటే.. ఆ అడవికే అందం. ఏనుగులన్నీ గుంపుగా వెళుతున్నా, జింకలు, లేళ్లు చెంగు చెంగున పరిగెడుతుంటే, ఎతైన చెట్లపై రకరకాల పక్షులు, పిట్టలు అరుపులతో అడవి అంతా ఆహ్లాదంగా ఉంటుంది. అలాంటి అడవి జంతువులను వన్యప్రాణుల వేటగాళ్లు అక్రమంగా తరలిస్తున్నారు. ‘గత 20 సంవత్సరాలలో.. వేటాడటం, అక్రమ వన్యప్రాణుల వ్యాపారం బహుళ-బిలియన్ డాలర్ల పరిశ్రమగా మారింది’ అని ప్రకృతి శాస్త్రవేత్త సర్ డేవిడ్ అటెన్‌బరో చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద జీవవైవిధ్య హాట్‌స్పాట్‌లలో ఒకటైన భారతదేశం వన్యప్రాణుల వేట, అక్రమ రవాణాకు కేంద్రంగా మారిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్నేళ్లుగా, ఖడ్గమృగం కొమ్ములు, పాంగోలిన్ పొలుసులు, మాంసం, పులి, చిరుతపులి పంజాలు, ఎముకలు, చర్మాలు, ఏనుగు దంతాలు…ఇలా అక్రమంగా రవాణా చేయబడుతున్నాయి.
వ్యక్తిగత ప్రయోజనాల కోసం జంతువులను చంపడం అనేది చట్టవిరుద్ధం. ఈ అక్రమ వన్యప్రాణుల వ్యాపారంలో ఎక్కువ భాగం జంతువులు- వాటి శరీర భాగాల కోసం జరుగుతున్నాయి. బెంగళూరులోని అలయన్స్ యూనివర్సిటీకి చెందిన వర్మ అనే జర్నలిస్టు చేసిన సర్వే ప్రకారం.. అక్రమ అంతర్జాతీయ వన్యప్రాణుల వ్యాపారంలో, 2013లో దక్షిణాఫ్రికాలో వేటాడటం కారణంగా 1300 ఖడ్గమృగాలు చంపబడ్డాయి. గత 100 సంవత్సరాలలో 95 శాతం ఏనుగులు హత్యకు గురయ్యాయని అంచనా. 2010-12 మధ్య ప్రతి సంవత్సరం 33,000 ఏనుగులు చనిపోయాయి. ప్రతి సంవత్సరం, అంతరించిపోతున్న జాతుల జాబితాలో మరిన్ని జాతులు చేర్చబడుతున్నాయి. గత రెండేళ్లలో ఇలాంటి జంతువుల ధరలు పెరగడంతో వేటగాళ్లు ఎక్కువయ్యారు.
వన్యప్రాణుల అక్రమ వ్యాపార గణాంకాలు
అక్రమ వ్యాపారులు తమ అకృత్యాలను అరికట్టడానికి తగినంత కఠినమైన చట్టాలు, నియమాలు లేనందున వారి నేరాల నుండి తప్పించుకుంటున్నారు. భయంకరమైన వాటితో పోల్చితే ఇలాంటి నేరాలకు సంబంధించి తీసుకున్న చర్యలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వాటికి ఇప్పటివరకూ ప్రాధాన్యతను ఇవ్వకపోవడమే. చట్టవిరుద్ధమైన వ్యాపారంపై గణాంకాల జాబితా అంతులేనిది. ఇలాంటి చట్టవిరుద్ధమైన వన్యప్రాణుల వ్యాపారాన్ని దక్షిణాఫ్రికాలో జాతీయ ప్రాధాన్యతగా చట్టబద్ధత కల్పించడం ఆందోళన కలిగిస్తుంది. భారతదేశంలో జరిమానాలు పది వేల రూపాయల నుండి ఇరవై ఐదు వేల రూపాయల వరకూ ఉంటాయి. ఏడు నుండి పదేళ్ల జైలు శిక్ష ఉంటుంది. అయితే, సరైన విచారణ లేకపోవడంతో ఎక్కువ మంది వేటగాళ్లు నిర్దోషులుగా విడుదలయ్యారు. ఒక వేటగాడికి మూడేళ్లపాటు శిక్ష విధించడం భారతదేశంలో అరుదైన శిక్షగా పరిగణించబడింది. దీన్ని బట్టి చూస్తే చట్టం ఎంత ఉదారంగా ఉందో తెలుస్తోంది.
ప్లాస్టిక్‌తో నాశనం..
ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే పదార్థ అణువులతో కాకుండా కృత్రిమంగా తయారుచేసే అణు పుంజాలతో నిర్మితమయ్యే పదార్థమే ‘ప్లాస్టిక్’. ఓ ప్రమాదకరమైన వివిధ రకాల ప్లాస్టిక్ వ్యర్థాలు కొన్ని వందల సంవత్సరాల వరకూ భూమిలో నాశనం కాకుండా నిల్వ ఉండి, భూమి ఉత్పాదకశక్తిని తగ్గిస్తున్నాయి. మనదేశంలో సముద్రాల్లో టన్నుల కొద్దీ ప్లాస్టిక్ చేరుతుంది. అవి తింటున్న జీవరాశులు నాశనం అవుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో ఉండే ప్లాస్టిక్ పదార్థాలను పశుపక్ష్యాదులు వీటిని తినడం వల్ల చనిపోతున్నాయి. పెరుగుతున్న ప్లాస్టిక్ ఉపయోగాన్ని తగ్గించడానికి చైనా ఈ సంవత్సరం జనవరి నుండి ప్లాస్టిక్ ఉత్పత్తులపై నియంత్రణ చేపట్టింది. కెనడాలో ఏకంగా ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫ్రాన్స్‌లో 2016లో ప్లాస్టిక్ నియంత్రణ చట్టాన్ని చేశారు. ఈ చట్టం ప్రకారం సాధారణ అవసరాలకు వినియోగించే ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు మొదలైన వాటిపై 2020 వరకూ పూర్తిగా నిషేధం విధించారు. ప్లాస్టిక్‌పై నిషేధం విధించకుండానే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించగలిగిన దేశం ఐర్లాండ్. భారీగా జరిమానాల మూలంగా ఆ దేశంలో ప్లాస్టిక్ వినియోగం 94 శాతం తగ్గిపోయింది. మలేషియా కూడా ప్లాస్టిక్‌ను నియంత్రించింది. కానీ మనదేశంలో తీసుకునే చర్యలు నామమాత్రమే. దాని వల్ల ఎన్నో మూగజీవులు ప్రాణాలు కోల్పోతున్నాయి.
అపరిశుభ్రంగా నదులు..
భూగోళంపై 80 శాతం జలం విస్తరించి ఉంది. స్వచ్ఛమైన నీరు జలాలను చూస్తుంటే.. అలాగే చూడాలనిపిస్తుంది. దాహం తీర్చుకోవాలనిపిస్తుంది. అలాంటి నీటినీ కలుషితం చేస్తున్నారు. తాగడానికి ఉపయోగపడే శుద్ధమైన నీరు దొరకడం లేదు. స్వచ్ఛమైన నీటి లభ్యత మూడు శాతం కంటే తక్కువగా ఉంది. ఎక్కువ శాతం నీరు కలుషితమై లేదా ఉప్పు నీటి రూపంలో ఉంది. లభించే కొద్దిపాటి శుద్ధజలం మానవ చర్యల వల్ల పనికిరాకుండా పోతోంది. దీనివల్ల కేవలం మనుషులేకాక సమస్త ప్రాణికోటి, ముఖ్యంగా జలచరాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. భూగర్భజల కాలుష్యాన్ని ఆపడానికి మనం తీవ్రంగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వ్యవసాయానికి, తాగడానికి స్వచ్ఛమైన నీరు అత్యంత ఆవశ్యం. జలాన్ని సంరక్షించడం, పరిశుభ్రంగా ఉంచడం మనందరి నైతిక బాధ్యత. మన సంస్కృతిలో నదులను మాతగా పూజిస్తారు. అటువంటి గంగ, యమున, గోదావరి వంటి నదుల పరిస్థితి ఎలా ఉందో మనకు తెలియంది కాదు. పరిశ్రమల నుండి వచ్చే విషతుల్య రసాయనాలు, నివాస ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్థాలు, చెత్త చెదారం నదులలో కలుస్తున్నాయి. దీని పర్యవసానంగా దేశంలో ఉన్న ప్రముఖ నదులన్నీ పెద్ద మురికి కాలువలుగా మారిపోయాయి. కాబట్టి నదులను కాపాడుకోవడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. పట్టణాలలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి. నదుల కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ వాటిని సంరక్షించుకోవాలి.
చెట్ల తొలగింపుతో..
చెట్లను నరకడం వల్ల మన శ్వాసను మనమే, ఆపుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లే. చాలామంది భవన నిర్మాణాలకు అడ్డుగా ఉన్నాయని చెట్లను విపరీతంగా తొలగిస్తున్నారు. పెరుగుతున్న పట్టణీకరణ, వాహనాలు, ఫ్యాక్టరీల నుండి వచ్చే పొగతో వాయు కాలుష్యం పెరిగిపోతోంది. మానవ ప్రేరిత చర్యల వల్ల వాతావరణంలో కొన్ని విషపూరితమైన వాయువులు చేరి, ఆక్సిజన్ శాతం తగ్గిపోతోంది. 2016లో వెలువడ్డ ఒక సర్వే రిపోర్ట్ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 90 శాతం ప్రజలు కలుషితమైన వాయువులు పీలుస్తున్నారు. దీనికి కారణంగా అనేక వ్యాధులు సంభవిస్తున్నాయి. వేగంగా విస్తరిస్తున్న ఈ కాలుష్యం వల్ల సహజంగానే సమస్త ప్రాణికోటి, వృక్షజాతులు ప్రమాదంలో పడ్డాయి. దేశంలో ఉన్న శాస్త్రవేత్తలు, మేధావులు, స్వచ్ఛంద సేవకులు ఈ సమస్యను అధిగమించడానికి అనేక రకాల ప్రాజెక్టులు, కార్యక్రమాలు నిర్వహించాలని పర్యావరణ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వాయు కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలను తగ్గించడం, పర్యావరణ అనుకూల ఉత్పత్తిని ప్రోత్సహించడం, ప్లాస్టిక్ రీసైక్లింగ్‌ను స్వీకరించడం, వ్యర్థాలను తగ్గించడం ద్వారా పర్యావరణ పనితీరును మెరుగుపరచవచ్చు.
క్షీణిస్తున్న మడ అడవులు..
మన రాష్ట్రంలో తూర్పు కనుమలు అపూర్వమైన జీవరాశికి నిలయం. విశాలమైన సముద్ర తీరం, మత్స్య సంపద మన ప్రత్యేకత. రాష్ట్రంలో 1,60,205 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పర్యావరణ వ్యవస్థ విస్తరించి ఉంది. వివిధ రకాల అటవీ భూములతో పాటు, వేలాది హెక్టార్లలో విస్తరించి ఉన్న మడ అడవులు ఉన్నాయి. పారిశ్రామిక కాలుష్యం కారణంగా తీర ప్రాంత పరిరక్షణకు అత్యంత కీలకమైన మడ అడవులు వేగంగా క్షీణిస్తున్నాయన్నది వాస్తవం. కాలుష్య నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా దీనిని నివారించవచ్చు. అయితే ఆ దిశలో కార్యాచరణ లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. కార్పొరేట్ శక్తులు, స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో సాగుతున్న విధ్వంసాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. బయోడైవర్సిటీ (జీవ వైవిధ్య) బోర్డు గణాంకాల ప్రకారమే రాష్ట్రంలో 65 రకాల జీవజాతులు అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉంది. వీటిలో 22 మొక్క జాతులు, 19 పక్షి, 10 క్షీరదాలు, 12 రకాల చేపలు, రెండు రకాల సరీసృపాల జాతులు ఉన్నాయి. ఈ అధికారిక లెక్కల కన్నా, క్షేత్రస్థాయి వాస్తవాలు భిన్నంగా మరింత ఆందోళన కలిగించేలా ఉన్నాయి.
ప్రకృతిని నాశనం చేసే ఈ విషయాలన్నిటినీ వీడియోల రూపంలో ప్రజలకు తెలియజేయాలి. అడవులు, జంతువుల పరిరక్షణ కోసం ప్రజలను భాగస్వామ్యం చేయాలని ఈ సంవత్సరం ఐక్యరాజ్యసమితి థీమ్‌గా తీసుకుంది. ఆ దిశగా ఆయా దేశాలు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. మూసుకుపోయిన అజ్ఞానం, లాభార్జనతో, అంధకారంలో ప్రకృతిని నాశనం చేస్తున్నారు. ఈ చర్యలను ఇంతటితో ఆపకపోతే సకల ప్రాణికోటి జీవరాశుల మనుగడకే కష్టతరం అవుతుంది. వీటివల్ల ప్రకృతి తల్లడిల్లిందో ఏ ఒక్కరం మిగలం. అది తెలుసుకుని ప్రకృతి పరిరక్షణ దిశగా అడుగులు వేద్దాం.
– పద్మావతి
9490559477