ఆరంభంలోనే గుర్తించండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి..

Mar 9,2025 10:10 #health, #Kidney, #Sneha

ప్రపంచ మూత్రపిండాల దినోత్సవం ఏటా మార్చి రెండో గురువారం జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని అంతర్జాతీయ మూత్రపిండ వ్యాధుల సమాఖ్య (ఐఎస్‌ఎన్‌), అంతర్జాతీయ మూత్రపిండ ఫౌండేషన్‌ (ఐఎఫ్‌కెఎఫ్‌) కలిసి ప్రారంభించాయి. దీని ప్రధాన ఉద్దేశ్యం మూత్ర పిండాల ఆరోగ్యం గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించడం. ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే హార్ట్‌ ఎటాక్స్‌, హైబీపీ, డయాబెటిస్‌ తర్వాత కిడ్నీ సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. చాలా మందికి కిడ్నీ పాడవుతున్న విషయం కూడా తెలియకపోవడంతో నష్టం జరిగిపోతోంది. కిడ్నీలు దెబ్బతింటున్నట్లు ముందుగానే తెలుసుకుంటే… అప్పుడు భారీ నష్టాన్ని ఆపేయొచ్చు. కానీ కిడ్నీలు, వాటి పనితీరు గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అవగాహనా కార్యక్రమాలు చాలా తక్కువగా జరుగుతున్నాయి. 2006లో తొలిసారి ప్రపంచ కిడ్నీ దినోత్సవం జరిపారు.

మానవ శరీరంలో మూత్రపిండాలు కీలక భూమిక పోషిస్తాయి. అవి రక్తాన్ని శుభ్రం చేయడం, వ్యర్థ పదార్థాలను తొలగించడం, నీటి సమతుల్యతను నియంత్రించడం, రక్తపోటును అదుపులో ఉంచడం వంటి కీలక పనులను చేస్తాయి. ప్రపంచ కిడ్నీ దినోత్సవం (డబ్ల్యుకెడి) 2025 మార్చి 13న జరుగుతుంది. ఏడాది పొడవునా ప్రచార థీమ్‌, ‘మీ మూత్రపిండాలు ఓకేనా? ప్రారంభంలో గుర్తించండి, మూత్రపిండాల ఆరోగ్యాన్ని రక్షించండి!’ అని మూత్రపిండాల వ్యాధిని నివారించడంలో, నిర్వహించడంలో ప్రారంభ గుర్తింపు, జోక్యం యొక్క జీవితాన్ని మార్చే ప్రభావాన్ని హైలైట్‌ చేస్తుంది.

మూత్రపిండాల ఆరోగ్యం మానవ జీవనశైలికి ఎంతో ముఖ్యం. ఈ ప్రపంచ మూత్రపిండ దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకోవడం ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను నివారించుకోగలం.
కిడ్నీ జబ్బుతో బాధపడటం కన్నా రాకుండా చూసుకోవటమే మంచిది. ఆరోగ్యకరమైన జీవనశైలి కిడ్నీలకు పెద్ద రక్ష. ఆహారంలో ఉప్పు తగ్గించుకోవాలి. రోజుకు 5-6 గ్రాముల మించకుండా చూసుకోవాలి. జంక్‌ ఫుడ్‌, నిల్వ ఆహార పదార్థాలు మానెయ్యాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం తప్పనిసరి. రోజుకు కనీసం అరగంట సేపైనా నడక, కాస్త వేగంగా పరుగెత్తటం, సైకిల్‌ తొక్కటం, ఈత కొట్టటం వంటివి చేయాలి. వ్యాయామంతో శారీరక, మానసిక ఆరోగ్యం ఇనుమడిస్తాయి. రక్తంలో గ్లూకోజు, రక్తపోటూ తగ్గుతాయి. ఇవన్నీ కిడ్నీ ఆరోగ్యానికి తోడ్పడేవే.

బరువు అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే ఊబకాయులకు కిడ్నీజబ్బు ముప్పు 2-7 రెట్లు ఎక్కువ. అధిక బరువుతో కిడ్నీలపైనా భారం పెరుగుతుంది. ఊబకాయంతో అధిక రక్తపోటు, మధుమేహం ముప్పులూ పొంచి ఉంటాయి. ఇవీ కిడ్నీలను దెబ్బతీసేవే. కాబట్టి శరీర ఎత్తు బరువుల నిష్పత్తి (బిఎంఐ) 25 కన్నా మించకుండా చూసుకోవాలి.

మధుమేహం, అధిక రక్తపోటు గలవారు.. ఇంట్లో ఎవరికైనా కిడ్నీ జబ్బు వచ్చి ఉన్నవారు అప్పుడప్పుడు క్రియాటినైన్‌, మూత్ర పరీక్షలు చేయించుకోవటం మంచిది. కిడ్నీ జబ్బు ఆనవాళ్లుంటే ముందే తెలుస్తాయి. ఇందుకు కొన్ని జాగ్రత్తలు ఉపయోగపడతాయి. ఇవి కిడ్నీ జబ్బు ముప్పు తగ్గటానికి, కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి, జబ్బు వచ్చినా త్వరగా ముదరకుండా చూసుకోవటానికి తోడ్పడతాయి. ఇవి ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని నియంత్రించడానికి, శరీర ద్రవాలను సమతుల్యం చేయడానికి సహాయపడతాయి. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే మూత్రం రంగు మారిపోతుంది. రాత్రిపూట మూత్రవిసర్జన అధికంగా వస్తుంది. అలసటగా అనిపించడం, కళ్ళ చుట్టూ ఉబ్బడం, దురద వంటి లక్షణాలు కనిపిస్తాయి.

గ్రామీణ ప్రాంతాల్లో..

మనదేశంలో కొన్నిచోట్ల..ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పర్యావరణంలోని విషతుల్యాలు, భార లోహాల ప్రభావం, ఒంట్లో నీటి శాతం తగ్గటం వంటివి ఇందుకు దోహదం చేస్తుండొచ్చని భావిస్తున్నారు. అలాగే గాలి కాలుష్యమూ ప్రమాదకరంగా పరిణమిస్తోంది. గాలి కాలుష్యానికీ దీర్ఘకాల కిడ్నీ జబ్బుకూ సంబంధం ఉంటున్నట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అధిక వేడి మూలంగానూ.. ముఖ్యంగా తగినంత నీరు తాగకపోతే కిడ్నీలు దెబ్బతినే అవకాశముంది.

అవగాహన ముఖ్యం..

మూత్రపిండాలు మన శరీరం నుంచి వ్యర్థాలు, అదనపు ద్రవాలను తొలగిస్తాయి. మూత్రపిండాలు మన శరీరంలోని కణాలు ఉత్పత్తి చేసే యాసిడ్‌ను కూడా తొలగిస్తాయి. రక్తంలో నీరు, లవణాలు, సోడియం, కాల్షియం, భాస్వరం, పొటాషియం వంటి వాటిని సరిపడా ఉండేలా చేస్తాయి. కిడ్నీలు పనిచేయకపోతే చనిపోయే పరిస్థితి ఉంటుంది.

విధులేమిటంటే..

కిడ్నీలు చేసే ముఖ్యమైన పని రక్తాన్ని వడపోయటం. ఇందులో నెఫ్రాన్ల పాత్ర కీలకం. ఒకో కిడ్నీలో సుమారు పది లక్షల వరకూ నెఫ్రాన్లుంటాయి. వీటిల్లోని సూక్ష్మ రక్తనాళాల గుచ్ఛాలు (గ్లోమరులస్‌) ప్రాథమిక ఫిల్టర్‌గా పనిచేస్తే.. గొట్టంలాంటి భాగాలు (ట్యూబ్యూల్‌) శరీరానికి అత్యవసరమైన పదార్థాలను తిరిగి సంగ్రహిస్తాయి. అంటే ఒకవైపు అదనపు వ్యర్థాలను ఒంట్లోంచి బయటకు పంపటంతో పాటు అవసరమైన వాటిని అట్టి పెడతాయన్నమాట. కాబట్టే కిడ్నీలు దెబ్బతింటే శరీరమంతా ప్రభావితమవుతుంది. ఒంట్లో వ్యర్థాలు పోగుపడి చెత్తకుప్పలా తయారవుతుంది. చిత్రమేంటంటే- నెఫ్రాన్లు దెబ్బతింటున్నా తొలిదశలో పైకేమీ తెలియకపోవటం. ఇవి నెమ్మదిగా దెబ్బతింటూ వస్తాయి. దీంతో కిడ్నీల సామర్థ్యం క్రమంగా మందగిస్తుంది. చివరికి పూర్తిగా చేతులెత్తేసే పరిస్థితి (కిడ్నీ వైఫల్యం) వస్తుంది. అప్పుడు డయాలిసిస్‌, కిడ్నీ మార్పిడి తప్ప మరో మార్గం లేదు. ఎందుకంటే ఒకసారి కిడ్నీలు దెబ్బతింటే తిరిగి మామూలు స్థాయికి రావటం అసాధ్యం. కానీ తొలిదశలో గుర్తిస్తే కిడ్నీలు త్వరగా దెబ్బతినకుండా, జబ్బు ముదరకుండా చూసుకోవచ్చు. కాబట్టి కిడ్నీల ఆరోగ్యం మీద ఓ కన్నేసి ఉంచటం మంచిది.

మీ మూత్రపిండాలు ఓకేనా?

కిడ్నీలు గట్టి పిండాలు అంటారు. ఉండేది పిడికెడే అయినా చేసే పనులు చాలా గొప్పవి. జీవక్రియల్లో భాగంగా పుట్టుకొచ్చే వ్యర్థాలను రక్తంలోంచి వడగట్టి, వాటిని మూత్రం రూపంలో బయటకు వెళ్లగొడతాయి. శరీరంలో ద్రవాల మోతాదులను నియంత్రిస్తాయి. సోడియం, పొటాషియం, క్యాల్షియం వంటి ఖనిజాలను సమతులంగా ఉంచుతాయి. రెనిన్‌ వంటి హార్మోన్ల ఉత్పత్తితో రక్తపోటును అదుపు చేస్తాయి. హిమోగ్లోబిన్‌ సంశ్లేషణకు తోడ్పడే ఎరిత్రోపాయిటిన్‌ హార్మోన్‌ను విడుదల చేయటం.. విటమిన్‌ డిని చురుకైన రూపంలోకి మార్చటమూ వీటి ఘనతే. ఇలా శరీరం పరిశుభ్రంగా ఉండేలా.. సక్రమంగా, సజావుగా పనిచేసేలా చూస్తాయి. మనకోసం నిరంతరం ఇంతగా శ్రమించే కిడ్నీలను కాపాడుకోవటం మన విధి.

పది శాతం మందికి సమస్యలు

మనదేశంలో సుమారు 10 శాతం మంది ఏదో ఒక స్థాయి కిడ్నీ జబ్బుతో బాధ పడుతున్నారు. కిడ్నీ జబ్బు తొలిదశలో పెద్దగా లక్షణాలేవీ కనిపించవు. ముదురుతూ వస్తున్నకొద్దీ కొన్ని సంకేతాలు కనిపిస్తుంటాయి. వీటిని ముందుగా గుర్తిస్తే జబ్బు తీవ్రం కాకుండా చూసుకోవచ్చు.

రక్తహీనత : కిడ్నీ పనితీరు సన్నగిల్లితే రక్తహీనతకు దారితీస్తుంది. ఇందులో ఎర్ర రక్తకణాల సంఖ్య పడిపోతుంది. దీంతో కండరాలు, కణజాలాలకు తగినంత ఆక్సిజన్‌ అందక నిస్సత్తువ, నీరసం, అలసట వంటివి పొడసూపుతాయి. ఇవి రోజువారీ పనులకూ ఆటంకం కలిగిస్తాయి.

శరీరంపై ఉబ్బులు : ఎక్కువగా ఉన్న ద్రవాలను కిడ్నీలు తొలగించ లేకపోవటం పెద్ద సమస్య. దీంతో ద్రవాలు శరీరంలోనే.. ముఖ్యంగా కాళ్లు, మడమలు, పాదాలు, కళ్ల చుట్టూ పోగు పడతాయి. ఫలితంగా పాదాలు, కళ్ల ఉబ్బు మొదలవుతాయి.

రక్తంతో మూత్రం : మూత్ర విసర్జనలోనూ మార్పులు కనిపించొచ్చు. తరచూ.. ముఖ్యంగా రాత్రిపూట మూత్రం రావటం, మూత్రం ఉత్పత్తి తగ్గటం, మూత్రంలో రక్తం పడటం, నురగ కనిపించటం వంటివన్నీ కిడ్నీ సామర్థ్యం సన్నగిల్లుతోందటానికి సంకేతాలే.

చర్మం పొడిబారడం : కిడ్నీలు సక్రమంగా పనిచేయకపోతే క్యాల్షియం, ఫాస్ఫేట్‌ వంటి ఖనిజాల సమతుల్యత దెబ్బతింటుంది. ఫలితంగా చర్మం పొడి బారటం, దురద, చిరాకు వంటివి తలెత్తుతాయి.

ఆకలి మందగించడం : రక్తంలో విషతుల్యాలు పోగుపడుతున్న కొద్దీ ఆకలి సన్నగిల్లుతుంది. వికారం మొదలవుతుంది. దీంతో ఏదీ తినబుద్ధి కాదు. సరిగా తినకపోవటం వల్ల బరువూ తగ్గుతుంది.

  • ఏకాగ్రత లేమి : రక్తంలో వ్యర్థాలు పోగవటం మెదడు పనితీరునూ ప్రభావితం చేస్తుంది. ఏకాగ్రత కుదరకపోవటం, తలనొప్పి, తల తేలిపోవటం వంటి విషయగ్రహణ లక్షణాలు కనిపిస్తాయి. సమస్య తీవ్రమైతే మూర్ఛలకూ దారితీయొచ్చు.
  •  ఇలాంటి లక్షణాలు ఇతర జబ్బుల్లోనూ కనిపిస్తుండటం వల్ల చాలామంది పొరపడుతుంటారు. దీంతో చికిత్స తీసుకోవటమూ ఆలస్యమవుతుంది. ఏమాత్రం అనుమానం వచ్చినా నిర్లక్ష్యం పనికిరాదు. తొలిదశలోనే కిడ్నీజబ్బును గుర్తిస్తే చికిత్స తేలికవుతుందని తెలుసుకోవాలి.

ఎలా దెబ్బతింటాయంటే?

కిడ్నీలు దెబ్బతినటానికి రకరకాల కారణాలు దోహదం చేస్తుంటాయి.

మధుమేహం: ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ వైఫల్యానికిది ప్రధాన కారణం ఇదే. రక్తంలో గ్లూకోజు నియంత్రణలో లేకపోతే కిడ్నీల్లోని రక్తనాళాలు దెబ్బతింటాయి. ఫలితంగా రక్తాన్ని వడపోసే నెఫ్రాన్లూ క్షీణిస్తాయి. మధుమేహంతో ఇన్‌ఫెక్షన్ల ముప్పూ పెరుగుతుంది. ఇవీ కిడ్నీలను దెబ్బతీసే ప్రమాదముంది.

అధిక రక్తపోటు: దీర్ఘకాలంగా రక్తపోటు ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీల మీద విపరీత భారం పడుతుంది. క్రమంగా దెబ్బతింటూ వస్తాయి. నిజానికి అధిక రక్తపోటు కిడ్నీ జబ్బుకూ సంకేతమే.

సూక్ష్మ రక్తనాళాల వాపు : ఇన్‌ఫెక్షన్లు, స్వీయ రోగనిరోధక జబ్బులు, కొన్నిరకాల మందులతో కిడ్నీల్లోని సూక్ష్మ రక్తనాళాల్లో వాపు (గ్లోమరులో నెఫ్రయిటిస్‌) తలెత్తొచ్చు. ఇది కిడ్నీ వైఫల్యానికి దారితీస్తుంది.

కిడ్నీల్లో తిత్తులు: జన్యుపరంగా కొందరికి కిడ్నీల్లో నీటితిత్తులు ఉంటాయి. కొందరిలో కిడ్నీ మొత్తం ద్రాక్ష పండ్ల గుత్తిగా మారుతుంది కూడా. క్రమంగా కిడ్నీ పనితీరు దెబ్బతింటూ వస్తుంది.
మూత్ర ఇన్‌ఫెక్షన్లు: కొందరికి తరచూ మూత్ర ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. వీటికి చికిత్స తీసుకోకపోతే కిడ్నీలూ దెబ్బతినే ప్రమాదముంది.

మందులు: నొప్పిని తగ్గించే మందులు, ఒమిప్రజోల్‌ వంటి పీపీఈ రకం మందులు, యాంటీబయాటిక్స్‌ వంటివీ కిడ్నీలను దెబ్బతీయొచ్చు. వీటిని డాక్టర్‌ సలహా లేకుండా అనవసరంగా, అధిక మోతాదులో, తరచూ వేసుకోవటం ప్రమాదకరం.

నిర్ధారణ పరీక్షలు

దీర్ఘకాల కిడ్నీ జబ్బులో నిర్ధారణ చాలా కీలకం. దీని లక్షణాలు ఇతర జబ్బులనూ పోలి ఉండటం వల్ల కచ్చితంగా నిర్ధారించటం ముఖ్యం. పరీక్షలతో జబ్బు ఉన్నదీ లేనిదీ తేలుతుంది, తీవ్రతా బయటపడుతుంది. చికిత్సను నిర్ణయించుకోవటానికిది తోడ్పడుతుంది.

రక్త పరీక్షలు: దీర్ఘకాల కిడ్నీ జబ్బు నిర్థారణలో రక్తంలో క్రియాటినైన్‌ మోతాదులు కీలకం. ఇది కండరాల నుంచి ఉత్పత్తయ్యే వ్యర్థ పదార్థం. క్రియాటినైన్‌ మోతాదులు పెరిగితే కిడ్నీ పనితీరు దెబ్బతిందనే అర్థం. దీని ఆధారంగానే కిడ్నీ వడపోత వేగాన్ని అంచనా (ఈజీఎఫ్‌ఆర్‌) వేస్తారు. కిడ్నీలు 50శాతం దెబ్బతినేవరకూ క్రియాటినైన్‌ మోతాదులు పెరగకపోవచ్చు. అందువల్ల ఈజీఎఫ్‌ఆర్‌ అనేది చాలా ముఖ్యం. రక్తంలో క్రియాటినైన్‌ మోతాదులతో పాటు వయసు, బరువు, ఎత్తు వంటి వాటిని పరిగణనలోకి తీసుకొని దీన్ని లెక్కిస్తారు.

  • ఈజీఎఫ్‌ఆర్‌ 90 మి.లీ. కన్నా ఎక్కువుంటే నార్మల్‌.
  • ఒకవేళ 90 మి.లీ. కన్నా తగ్గి, కిడ్నీలు కొంతవరకు దెబ్బతింటే కిడ్నీజబ్బు తొలిదశలో ఉందని అర్థం.
  • ఇక 89-60 మి.లీ. ఉంటే ఒక మాదిరి.
  • 30-59 మి.లీ. ఉంటే మధ్యస్థం
  • 15-29 మి.లీ. ఉంటే తీవ్ర దశ జబ్బుగా పరిగణించొచ్చు
  • అదే ఈజీఎఫ్‌ఆర్‌ 15 కన్నా తగ్గితే కిడ్నీ వైఫల్యం మొదలైనట్టే.

మూత్ర పరీక్షలు: మూత్ర విశ్లేషణలో కిడ్నీ ఆరోగ్యం తీరుతెన్నులు తెలుస్తాయి. మూత్రంలో ప్రొటీన్‌ (ఆల్బుమిన్‌/సుద్ద), రక్తం పడటం కిడ్నీ జబ్బుకు సంకేతాలు. సుద్ద, క్రియాటినైన్‌ నిష్పత్తి ఆధారంగా మూత్రంలో ఎంత ప్రొటీన్‌ పోతుందో తెలుస్తుంది.

ఇమేజింగ్‌ పరీక్షలు: అల్ట్రాసౌండ్‌ లేదా సీటీ స్కాన్‌ పరీక్షలతో కిడ్నీ సైజు, ఆకారం, అడ్డంకుల వంటివన్నీ బయటపడతాయి. ఇవి కిడ్నీలను క్షుణ్నంగా విశ్లేషించటానికి తోడ్పడతాయి.

బయాప్సీ: కిడ్నీ పనితీరు సన్నగిల్లినా కారణమేంటో తెలియనప్పుడు చిన్న ముక్కను తీసి పరీక్షించాల్సి ఉంటుంది (బయాప్సీ). దీంతో కిడ్నీ తీరుతెన్నులతో పాటు ఎంతవరకు దెబ్బతిన్నదో కూడా బయటపడుతుంది.

రక్తపోటు: అధిక రక్తపోటు కిడ్నీ దెబ్బతినటానికే కాదు.. కిడ్నీ దెబ్బతినటం మూలంగానూ రక్తపోటు పెరుగుతుంది. కాబట్టి తరచూ బీపీ పరీక్ష చేయించుకోవాలి. కిడ్నీ జబ్బు నిర్ధరణకే కాకుండా, జబ్బు నియంత్రణలో ఉంటుందో లేదో తెలుసుకోవటానికీ ఉపయోగపడుతుంది. కాపాడుకోవచ్చు.
అందుబాటులో

అధునాతన చికిత్సలు.. : కిడ్నీ జబ్బు చికిత్స అందరికీ ఒకేలా ఉండదు. జబ్బు దశ, జబ్బుకు దారితీసిన అంశాలు, ఆయా వ్యక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయించాల్సి ఉంటుంది. జబ్బు త్వరగా ముదరకుండా, లక్షణాలను తగ్గించేలా, రోజువారీ జీవితాన్ని హాయిగా గడిపేలా చూడటమే చికిత్స ఉద్దేశం.
కిడ్నీ జబ్బు మూలంగా రక్తహీనత, ఎముక జబ్బులు, పొటాషియం పెరగటం వంటి రకరకాల సమస్యలు తలెత్తుతాయి. వీటికీ చికిత్స అవసరం. రక్తహీనత తగ్గటానికి, ఎముక ఆరోగ్యానికి మందులు ఉపయోగపడతాయి. ఆహారంలో మార్పులు లేదా మందులతో పొటాషియం మోతాదులు తగ్గేలా చూడాల్సి ఉంటుంది.

డయాలిసిస్‌: కిడ్నీలు విఫలమైనప్పుడు డయాలిసిస్‌ అవసరమవుతుంది. ఇది రక్తంలోని వ్యర్థాలు, ఎక్కువమొత్తంలో ఉండే ద్రవాలను తొలగించటానికి ఉపయోగపడుతుంది. ఇందులో రెండు రకాల పద్ధతులున్నాయి.
కిడ్నీ మార్పిడి: కిడ్నీలు పూర్తిగా విఫలమైనప్పుడు ఇతరుల కిడ్నీని మార్పిడి చేయాల్సి ఉంటుంది. ఇది డయాలిసిస్‌ నుంచి విముక్తి కలిగిస్తుంది. మరింత చురుకుగా జీవించటానికి తోడ్పడుతుంది. అయితే కిడ్నీని శరీరం తిరస్కరించకుండా జీవితాంతం రోగ నిరోధకశక్తిని అణచి పెట్టే మందులు వాడు కోవాల్సి ఉంటుంది. ట్రాన్స్‌ఫ్లాంటేషన్‌ ద్వారా ఆధునిక చికిత్సలతో కిడ్నీల పనితీరు మెరుగుపర్చొచ్చు.

1. జీవన్‌ ధాన్‌ : జీవన్‌ ధాన్‌ ఆర్గనైజేషన్‌ విజయవాడలోని డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ పరిధిలో పనిచేస్తుంది. ఎవరైనా అవయవదానం చేసేవారు, కావాలని కోరుకునే వారు ఇక్కడ తమ పేర్లు నమోదు చేసుకోవాల్సివుంటుంది. ఎవరైనా బ్రెయిన్‌ డెడ్‌ అయిన రోగులు ఉంటే వారి అవవయాలను తీసుకుని భద్రపరుస్తుంటారు. రిజిస్టరు చేసుకున్న వారికి ప్రాధాన్యతా క్రమంలో అందిస్తూ ఉంటారు. కిడ్నీ రోగుల్లో తమ బంధువుల్లో ఎవరైనా ఒకరి బ్లడ్‌ సరిపోని పరిస్థితుల్లో జీవన్‌ధార్‌ కెడావర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను ప్రోత్సహిస్తారు. బ్రెయిన్‌ డెడ్‌ అయిన వారి అవయవాలను తీసుకుని భద్రపర్చటం ద్వారా 8 మంది ప్రాణాలను కాపాడొచ్చు. 1 గుండె, 2 రెండు లంగ్స్‌, 2 కిడ్నీలు, 1 లివర్‌, రెండు కళ్లు, ప్రాంకియాస్‌ అనే అవయవాలతో ట్రాన్‌ప్లాంటేషన్‌ చేస్తే కొంతమందికి ప్రాణదానం చేయటమే కాకుండా వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించిన వారు అవుతారు.

2. ఎబిఓ ఇన్‌కంపాటబుల్‌ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ : ఒకే రక్తం గ్రూపు దాతలు దొరకనప్పుడు ఎబిఓ ఇన్‌కంపాటబుల్‌ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ పద్ధతిలో వేరే రక్తం గ్రూపు వారి కిడ్నీని మార్పిడి చేయటమే మంచిది. లేకపోతే బ్రతికి ఉన్న వారి కిడ్నీ కోసం వేచివుండాల్సివస్తుంది. డయాలసిస్‌ మీదుండే వారికి రక్తం గ్రూపు సరిపోయిన వారి కిడ్నీ దొరకనప్పుడు ఏబీఓ ఇన్‌కంపాటబిలిటీ మార్పిడి ప్రక్రియను నిజంగా ప్రాణదాయినిగా చెప్పొచ్చు.

3. జెనోట్రాన్సాప్లాంటేషన్‌ : జెనోట్రాన్సాప్లాంటేషన్‌ అనేది నేడు ఆధునికంగా అందుబాటులోకి వచ్చిన కిడ్నీ చికిత్సల్లో అతి ముఖ్యమైంది. మానవ వైద్య పరిస్థితులకు చికిత్స చేయడానికి పంది మూత్రపిండాలు వంటి మానవేతర కణాలు, కణజాలాలు లేదా అవయవాలను ఉపయోగించడం. అందుబాటులో ఉన్న దానికంటే ఎక్కువ మందికి అవయవాలు అవసరం. సగటున, యునైటెడ్‌ స్టేట్స్‌లో ప్రతిరోజూ అవయవ మార్పిడి కోసం వేచి ఉండి 17 మంది మరణిస్తున్నారని అంచనా. ప్రాణాలను కాపాడటానికి అవయవాల కోసం ఇతర వనరులను కనుగొనడం చాలా కీలకం. జెనోట్రాన్స్‌ప్లాంటేషన్‌ అనేది ఒక ప్రయోగాత్మక చికిత్స. ఇది చాలా అరుదైన, తీవ్రమైన కేసుల్లో మాత్రమే అనుమతించ బడుతుంది. అమెరికాలో మౌంటాంగ్‌ మరి అనే శాస్త్రవేత్త బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తికి పంది కిడ్నీని అమర్చారు. అది 24 గంటల పాటు విజయవంతంగానే పనిచేసింది. ఇలాంటి ప్రయోగాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
ఉద్దానం ప్రాంతంలోనూ ఎస్‌ఇఇకె (స్క్రీనింగ్‌ ఎర్లీ ఎవాల్యుయేషన్‌ కిడ్నీ డిసీజెస్‌ ఇండియా) ద్వారా కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో కొన్ని ఎన్‌జిఒ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కిడ్నీ వ్యాధుల నిరోధానికి కృషిచేస్తున్నారు. ఇక్కడి కిడ్నీ సమస్యలపై హార్వార్డ్‌ యూనివర్శిటీ నుంచి నేను కూడా పరిశోధనల్లో పాల్గొన్నా.

కారణాలు..

  • శరీర ద్రవ్యలోపం (డీహైడ్రేషన్‌)
  • అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్‌)
  •  మధుమేహం (డయాబెటిస్‌)
  • అధిక ఉప్పు, చక్కెర తీసుకోవడం
  • ధూమపానం, మద్యం సేవించడం
  • ఆరోగ్యకరమైన జీవనశైలి లేకపోవడం నివారణ..
  •  శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోండి (రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగండి).
  •  అధిక ఉప్పు, చక్కెర వాడకాన్ని తగ్గించండి.
  • మధుమేహం, రక్తపోటును నియంత్రించండి.
  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
  • మద్యం, ధూమపానం మానేయండి.
  • ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి (పండ్లు, కూరగాయలు, తక్కువ సోడియం ఆహారం).
  • మూత్రపిండాలకు సంబంధించి ఏమైనా లక్షణాలు ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

ఇవీ పాటించాలి..

  • రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలి.
  • మంచి ఆహారం తీసుకోవాలి.
  •  రోజూ వ్యాయామం చేయాలి.
  •  రక్తపోటు 130/80 కన్నా మించకుండా చూసుకోవాలి.
  •  140/90, అంతకన్నా ఎక్కువుంటే మందులు వేసుకోవాలి.
  •  మధుమేహం ఉన్నవారు గ్లూకోజును ఖచ్చితంగా నియంత్రించుకోవాలి.
  •  ఎలాంటి మందులనైనా డాక్టర్‌ సలహా లేకుండా వాడొద్దు.
  •  తగినంత నీరు తాగాలి.
  •  సిగరెట్లు, చుట్టలు, బీడీలు తాగితే రక్తనాళాలు దెబ్బతింటాయి.
  •  మద్యం మితిమీరితే రక్తపోటులో హెచ్చుతగ్గులు తలెత్తుతాయి.
  •  రక్తంలో కొలెస్ట్రాల్‌ అదుపులో ఉంచుకోవాలి.
  •  మాంసాహారం, వేపుళ్లు తగ్గించుకోవాలి.

 

➡️