లీడ్‌ రోల్‌ చేశానంతే..

Jun 9,2024 07:57 #Actors, #interviews, #movies

‘జబర్దస్త్‌’ కామెడీ షో ద్వారా పాపులర్‌ అయిన ఆర్టిస్టులలో గెటప్‌ శ్రీను ఒకరు. తన గెటప్‌ను ఆకర్షణీయంగా చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. ఏ గెటప్‌ వేసినా అందులో ఇమిడిపోవడం ఆయన ప్రత్యేకత. వేషధారణ, ముఖ కవళికలతోనే నవ్వు పుట్టించే హాస్యనటుడు. అలాంటి గెటప్‌ శ్రీను ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సైడ్‌ ఆర్టిస్టుగా చేస్తూనే హీరోగా అవకాశాలను అందిపుచ్చుకుని కెరియర్‌లో ముందుకు వెళుతున్నారు. ఈ మధ్య ‘రాజు యాదవ్‌’ సినిమాలో హీరోగా చేసి, తనదైన శైలిలో వినోదాన్ని పంచారు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.

శ్రీను పదేళ్ల క్రితం ఓ ఛానల్‌లో ప్రసారమయ్యే షో ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చారు. అతి తక్కువ కాలంలోనే సుడిగాలి సుధీర్‌తో జత కట్టి తన నటన, ఆహార్యంతో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో ఆ షో పట్ల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దాన్నే తన వేదికగా చేసుకుని ఎన్నో స్కిట్లు చేసి, అభిమానులను కడుపుబ్బా నవ్వించారు. శ్రీకాకుళం నుంచి వలస కూలీలుగా పశ్చిమగోదావరి జిల్లాలోని కాళింగగూడెం వచ్చిన బొడ్డుపల్లి రామస్వామి, దాలమ్మ దంపతుల కుమారుడు శ్రీను. గ్రామంలోని పంట కాలువ, పచ్చని పైర్ల మధ్యన అతడి బాల్యం గడిచింది. సిద్ధాపురం హైస్కూల్‌లో పదో తరగతి, దుంపగడప ప్రభుత్వ కళాశాలలో ఇంటర్‌ చదివారు. సెలవు దినాల్లో తల్లిదండ్రులతో కలిసి పొలంలో పనులకు వెళ్లేవారు.

బాల్యం నుంచే..
చిన్నతనం నుంచి హాస్యధోరణితో ఉండే శ్రీను తోటి కూలీల మాటలను, నడకను అనుకరిస్తూ హాస్యం పండించేవారు. తన హావభావాలతో నవ్విస్తూ అందరినీ ఆకట్టుకునేవారు. సరదాగా చేసినా ఆ ప్రతిభ అతన్ని హాస్యనటుడిని చేసింది. చిన్నతనం నుంచి డ్యాన్స్‌ పట్ల ఆసక్తి కనబర్చేవారు. చిరంజీవిపై అభిమానంతో సినిమాల్లో రాణించాలని కలలుగన్నారు. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌ వచ్చి, సినిమాలపై ఇష్టంతో సినీరంగంవైపు అడుగుపెట్టారు. ‘మొదట్లో ఇంట్లో వారికి ఇష్టం లేదు. పెద్ద రికమండేషన్‌లు, బ్యాక్‌బోన్‌లు ఉంటేనే ఇండిస్టీలో రాణిస్తారని మావాళ్లు అనేవారు. నేను కొన్నాళ్ళు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కూడా పనిచేశాను. అయినా నాలో నటుడిని కావాలనే తపన తగ్గలేదు. ఎలాగైనా సరే చెన్నై వెళ్ళి అక్కడ తమిళ్‌ నేర్చుకుని, ఇరగదీసేద్దాం అనుకున్నా. కానీ అక్కడ ఎందుకనో ఇమడలేకపోయాను. తిరిగి వచ్చేశా.. ఆ తర్వాత వచ్చిన అవకాశమే ”జబర్‌ దస్త్‌”. కెరియర్‌ పరంగా స్థిరత్వం రావడానికీ .. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఈ షోనే కారణమైంది. అయితే ప్రతి మనిషి జీవితంలో ఎదగాలనే అనుకుంటాడు. నేనూ అలాగే ఆలోచించాను. అందువల్లనే టీవీ నుంచి సినిమాల వైపు ప్రయత్నించా. ప్రస్తుతం సినిమాలతో బిజీగానే ఉన్నాను’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

బోరు కొట్టించకుండా..
గెటప్‌ శ్రీను 2014లో విడుదలైన ‘దిక్కులు చూడకు రామయ్య’ సినిమాతో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా రంగంలోకి అడుగుపెట్టారు. వరసగా 70 చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా తనదైన శైలిలో హాస్యాన్ని పండించారు. ‘రాంప్రసాద్‌, సుధీర్‌తో కలిసి ”3 మంకీస్‌” చిత్రం చేశాను. అది ఆశించినంత విజయాన్ని అందించలేదు. దాంతో మరొక మంచి సినిమా చేయాలని ముగ్గురిలో కసి పెరిగింది. రాంప్రసాద్‌ మంచి కథను సిద్ధం చేస్తున్నారు. భవిష్యత్తులో ముగ్గురం కలిసి నటిస్తాం’ అన్నారు.
ఇప్పుడు కృష్ణమాచారి దర్శకత్వంలో ‘రాజు యాదవ్‌’లో నటించారు. ఈ సినిమాలో తనే హీరో కావడంతో సినిమాని తన భుజాలపై వేసుకొని కారవాన్‌ కూడా వద్దని, షూటింగ్‌ లొకేషన్స్‌లో కూడా నిర్మాతకు సపోర్ట్‌గా నిలిచారు గెటప్‌ శ్రీను. ‘నన్ను హీరో అనకండి. అలా అనిపించుకోవడం ఇష్టం లేదు. నేను కథలో లీడ్‌రోల్‌ చేశానంతే. అందరూ నటిస్తారు. అందుకు భిన్నంగా, మనసును హత్తుకునేలా నటించాలన్నదే నా లక్ష్యం. బుల్లితెరపై బోరు కొట్టించకుండానే వెండి తెరపై ప్రేక్షకుల్ని రంజింపజేస్తున్నా. సినిమాల్లో మరింత ఉన్నత స్థాయికి ఎదగడమే నా ఆశయం.’ అంటున్న శ్రీను తన మొదటి సంపాదన 40 రూపాయలు అని, పొలం పనులకు వెళ్లి సంపాదించానని ఎలాంటి భేషజాలు లేకుండా చెప్పారు. తరచూ గెటప్‌ శ్రీను స్వగ్రామమైన కాళింగగూడెం వెళ్లి, వస్తుంటారు. స్థానికంగా జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ గ్రామస్తులకు అందుబాటులో ఉంటారు. దాంతో ‘ఎంత సంపాదించినా ఇసుమంత కూడా గర్వం లేదురా నీకు’ అంటూ శ్రీనుని అందరూ పొగడ్తుంటారు.

పేరు : గెటప్‌ శ్రీను
పుట్టిన తేది : 1984 డిసెంబర్‌ 12న
నివాసం : హైదరాబాద్‌
భార్య : సుజాత
పిల్లలు : కొడుకు

➡️