హత్తుకుంటే.. బాధలన్నీ హుష్‌కాకి..!

Nov 24,2024 07:54 #children stories, #Parenting, #Sneha

పిల్లలు అంటేనే అల్లరి చేస్తూ.. ఉత్సాహంగా.. ఉల్లాసంగా ఉంటుంటారు. అందుకే పిల్లలున్న ఇల్లు సందడి సందడిగా ఉంటుంది. ఎప్పుడైనా పిల్లలు ఊరెళ్లినా.. ఎక్కడికైనా వెళ్లినా.. ఇల్లంతా బోసిపోతుంది. ఇది అందరికీ అనుభవమైన విషయమే.. అయితే అప్పుడప్పుడు పిల్లలు డల్‌గా అయిపోతుంటారు. అలాంటప్పుడు పేరెంట్స్‌ వారిని గమనించుకోవాలి. ఇలాంటప్పుడే పేరెంట్స్‌ వారిపట్ల అప్రమత్తంగా.. ప్రేమగా ఉండాలనేది నిపుణులు చెప్తున్న మాట. అందుకోసం కొన్ని సూచనలు చేస్తున్నారు..

అవేంటో తెలుసుకుందాం.

కేస్‌ : నాని స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చేసరికి ఒళ్లు వెచ్చగా ఉంది. తల్లి కాసింత కంగారుపడింది. అంతలోనే ఇదంతా జ్వరాల సీజన్‌ కదా అందుకే వచ్చి ఉంటుందని సరిపెట్టుకుంది. కానీ నాని చిన్న చప్పుడైనా, ఏమైందని అడిగినా.. భయపడుతున్నట్లు గమనించింది.
‘ఏమైంది నానీ! అలా భయపడుతున్నావు..?’ ‘మరే అమ్మా! మళ్లీ నువ్వు స్కూల్‌కి వచ్చి అడగొద్దు.. ప్రామిస్‌.. అలా అయితేనే చెప్తాను!’ అన్నాడు. ‘రానులే చెప్పు!’ అంది తల్లి. ‘అమ్మా! రిషిల్‌ నా పెన్సిల్‌ బాక్స్‌ ఇవ్వమని అడిగాడు.. నేను ఇవ్వనన్నాను. నా గొంతు గట్టిగా నొక్కేశాడు. నాకు వామ్‌టింగ్‌ అయింది..!’ అంటూ తల్లిని వాటేసుకుని పెద్దగా ఏడ్చేశాడు. ‘ఏమీ కాలేదుగా.. రేపు స్కూల్‌కి వెళ్లాక టీచర్‌కి నువ్వే చెప్పు! అలా చేయడం చాలా డేంజర్‌ కదా!’ అని తల్లి చెప్పి, నానీని దగ్గరకు తీసుకుంది. ‘నువ్వు భయపడకు.. నేనున్నాగా నీకు’ అంది.. నాని పెదాలపై చిన్నగా నవ్వు మెరిసింది.
పిల్లలు కూడా మానసికంగా కుంగిపోతుంటారు. అమ్మనాన్న ఎవరు చెప్పినా మాట వినిపించుకోరు. మూతి ముడుచుకుని గదిలో ఓ మూల కూర్చుంటారు. ఇలాంటి సందర్భాలను తల్లిదండ్రులు గమనించుకోవాలి. పిల్లల మనసులో ఏముందో పేరెంట్సే తెలుసుకోవాలి. వారికి ఏ బాధ కలిగినా తల్లితండ్రులతో పంచుకునే వాతావరణ ఏర్పరిచే బాధ్యత తల్లిదండ్రులదే అనేది నిపుణుల మాట.

భయం.. భయంగా..
పిల్లలు స్కూల్లో కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంటారు. అయితే ఆ ఇబ్బందుల్ని ఇంటికి వచ్చాక తల్లిదండ్రులతో షేర్‌ చేసుకోవడం అనేది చాలా కీలకమైనది. ఎక్కువమంది పిల్లలు తల్లిదండ్రులకు స్కూల్‌ విషయాలు పంచుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో భయపడి చెప్పరు. కానీ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పేరెంట్స్‌కు చెప్పుకోవాలనేది పిల్లలకు చెప్పాలి. ఈ ప్రపంచంలో అమ్మానాన్నలు తప్ప మరెవ్వరూ తమని కంటికిరెప్పల్లా ఉండరనేది వాళ్లకి అవగాహన కలిగించాలి.
ఏదైనా తప్పు చేసినప్పుడు పేరెంట్స్‌ కోప్పడవచ్చు. కానీ పిల్లలకు ఇబ్బందులు వస్తే తల్లిదండ్రులు తల్లడిల్లతారనేదీ వాళ్లకు తెలిసి ఉండాలి. పిల్లలు అన్యమనస్కంగా ఉన్నా, సరిగా భోజనం చేయకపోయినా, స్కూల్లో స్నేహితులతో కలవకుండా, ఇంట్లోనూ సోదరీ సోదరులకు దూరంగా.. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నా.. తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలి. పిల్లలు తమంత తాముగా చెప్పకపోయినా.. దగ్గరకు తీసుకుని, లాలనగా అడిగితే వాళ్లే తమ బాధను తప్పక షేర్‌ చేసుకుంటారని నిపుణులు చెప్తున్నారు.

కోపం ప్రదర్శించడం..
పిల్లలు పెద్దవాళ్లలానే నొసలు చిట్లిస్తూ చిరాకు ప్రదర్శిస్తుంటారు. అలా చేసినప్పుడు పెద్దవాళ్లు ముద్దొస్తున్నాడని మురిసిపోతుంటారు. ఎప్పుడో ఒకసారి అలా పిల్లలు ప్రవర్తిస్తుంటే  నో ప్రాబ్లమ్‌.. కానీ తరచూ అలాగే చేస్తుంటే సంథింగ్‌ రాంగ్‌ .. అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే తల్లిదండ్రులు పిల్లలు చిరాకుగా.. పరాకుగా ఉంటుంటే అప్రమత్తం కావాలి. పిల్లలు ఏదో విషయంపై మధనపడితేనే ఆవిధంగా ప్రవర్తిస్తారని చెప్తున్నారు. ఆ స్థితిలో ఉన్న పిల్లలను పేరెంట్స్‌ గుండెలకు హత్తుకుని, దగ్గరగా ఉంటూ, మెల్లగా కొన్ని రోజులకైనా అసలు కారణమేమిటో తెలుసుకోవాలి. పిల్లలతో పేరెంట్స్‌ అలా క్లోజ్‌గా మూవ్‌ అవుతుంటేనే ఓ భరోసా కలిగి ఓపెన్‌ అవుతారు. కారణం తెలిశాక సమస్య పరిష్కరించడం తేలిక.

తక్కువ చేసుకోవడం..
పిల్లలు తమని తాము తక్కువ చేసుకుంటూ మాట్లాడతారు. ఏదైనా చదవమని చెప్తే.. ‘బాబోరు నా వల్ల కాదు!’ అని చెప్పేస్తారు. ప్రయత్నం చెయ్యమని చెప్పినా.. రాదంటే రాదని మొండిగా చెప్తుంటారు. ‘నువ్వు సూపర్‌ నాన్నా!’ అని పేరెంట్స్‌ అన్నా.. ‘అంతలేదు!’ అంటూ డైలాగ్స్‌ వేస్తుంటారు.
ఇలాంటి సందర్భాల్లో పేరెంట్స్‌ మురిసిపోకుండా.. పిల్లల్ని దగ్గరకు తీసుకుని.. వాళ్లల్లో ఉన్న ప్రతిభను ఉదాహరణలతో వారికి చెప్పాలి అంటున్నారు. అప్పుడు పిల్లలు తమ వల్ల సాధ్యమవుతుందని నమ్ముతారు. ఎక్కడా తగ్గేదేలేదు అనేలా పిల్లల్ని స్ట్రాంగ్‌గా తయారుచేయాల్సింది పేరెంట్సే!

అనారోగ్యం వల్ల..
పిల్లలు ఆరోగ్యం సరిగా లేకపోతే కూడా డల్‌ అయిపోతుంటారు. అలాంటప్పుడు పేరెంట్స్‌ అటెన్షన్‌ మరింత పెరగాలనేది నిపుణుల మాట. సహజంగా పిల్లలు ఆరోగ్యం బాగోకపోతే తమతోనే తల్లిదండ్రులు ఉండాలని కోరుకుంటారు. పేరెంట్స్‌ పక్కనే ఉంటే వాళ్లకి నిజంగా భరోసాగా అనిపిస్తుంది. తిరిగి ఆరోగ్యం పుంజుకోవడానికి తల్లిదండ్రులు వాళ్లతో ఉండడం చాలా బాగా పనిచేస్తుంది. అలాగే పిల్లలు స్కూల్‌కి వెళ్లడానికి ఇష్టపడకపోవడం, ఏదో ఒక కారణం చెప్తుండడం పేరెంట్స్‌ గమనంలో పెట్టుకోవాలి. స్కూల్లో ఏమైనా ఇబ్బందిని ఎదుర్కొనడమో, తోటి పిల్లలతో ఏదైనా సమస్య వల్ల మానసికంగా ఆందోళన చెందుతున్నారో.. చదువు విషయంలో ఒత్తిడికి గురవుతున్నారో… ఇలా కారణాలేంటో తెలుసుకోవాలి. అవసరమైతే పిల్లలకు ఆ సమస్యలను ఎలా పరిష్కరించుకోవచ్చో తల్లిదండ్రులు వివరించాలి. అప్పుడు వాళ్లు వండర్‌ అవ్వడమే కాదు.. ఏ సమస్యకైనా తమ తల్లిదండ్రులు ఇట్టే పరిష్కరించగలరన్న భరోసా వస్తుంది.
ఇలా పిల్లలకు అన్ని వేళలా తల్లిదండ్రులే గొప్ప ధైర్యం ఇవ్వగలరు. అలాంటి పేరెంటింగ్‌తో పిల్లలు ఆరోగ్యకరంగా ఎదుగుతారు. చదువులో రాణిస్తారనేది నిపుణులు చెప్తున్న మంచి మాట.

➡️