నీలి సముద్రంలో…

Feb 11,2024 09:10 #Children, #Sneha
in blue sea children story

సిరి అమ్మ నాన్నలతో సముద్ర తీరానికి వెళ్ళింది. ఎక్కడ మొదలు? ఎక్కడ చివరో తెలియని నీలివర్ణపు నీళ్లను చూసి సంబరపడిపోయింది. వేగంగా తీరాన్ని తాకుతున్న అలలు అంతే వేగంగా వెనక్కు వెళ్ళడం కళ్ళప్పగించి చూస్తోంది.

‘ సిరీ! ఇదుగో బైనాక్యూలర్స్‌. దీంట్లో నుండి చూస్తే నీకు దూరంగా ఉన్నవి కూడా దగ్గరగా, స్పష్టంగా కనిపిస్తాయి.’ అన్నాడు సిరి వాళ్ల నాన్న మహేష్‌.

‘థ్యాంక్స్‌ డాడీ! నాకు ఈ నీళ్లు ఎక్కడ నుండి వస్తున్నాయో తెలుసుకోవాలనుంది. దీంట్లో నుండి చూస్తే తెలుస్తుందా?’ కుతూహలంగా అంది సిరి.

‘హా హా… ఆ నీళ్ళు ఎక్కడ నుండి వస్తున్నాయో నీకు తెలియదు కానీ వాటిని చాలా దూరం వరకు నువ్వు చూడవచ్చు’ అన్నాడు మహేష్‌.

సిరి బైనాక్యూలర్లో నుండి నీళ్లళ్లో ఎగసిపడుతున్న జలచరాలను, బీచ్లో కూర్చున్న మనుషులను, నీళ్ళల్లో కాళ్ళను తడుపుతూ ఆడేవాళ్ళను, కెరటాలు చూసి సంబరపడుతున్న పిల్లలను చూస్తోంది. అంతలో దూరంగా ఒక నీలి వర్ణపు పెద్ద చేపలాంటి ఆకారం తీరం వైపుకు రావడం సిరి గమనించింది.

‘డాడీ! డాడీ! ఇటు చూడండి. చాలా పెద్ద చేప కనిపిస్తుంది” అంది సిరి.మహేష్‌ బైనాక్యూలర్స్‌ లో నుండి చూశాడు. ఒక తిమింగలం తీరం వైపుకు వస్తుంది. ‘సిరీ! అది చేప కాదు తిమింగలం. నీళ్లలోనే ఉండే జీవి… మరి ఒడ్డుకి ఎందుకు వస్తుందో!” అంటూ అటు వైపుకు నడిచాడు. అప్పటికే ఒడ్డుకి చేరిన తిమింగలాన్ని అక్కడున్న చాలా మంది చూశారు. అందరూ ఆశ్చర్యంగా దూరంగా నిలబడి చూస్తున్నారు. గుంపులు గుంపులుగా చేరిన జనాన్ని చూసినా కూడా తిమింగలం కదలడం లేదు.

‘డాడీ! అది నీళ్ళల్లో నుండి ఎందుకు బయటకు వచ్చింది?’ అంది సిరి.’ఏమో! అది జలచరం. ఎందుకు వచ్చిందో తెలియడం లేదు’ అన్నాడు మహేష్‌.

‘డాడీ! తిమింగలం రెక్కల మీద ఎర్రగా గాయం ఉంది చూడండి’ కాసేపటి తరువాత అంది సిరి.

‘అవును సిరి! దాని రెక్కలకు ఏదో గాయం అయింది. అందువల్ల నీళ్ళల్లో ఈదలేకపోవడంతో ఒడ్డుకి కొట్టుకు వచ్చింది’ అర్ధమైనట్లుగా అన్నాడు మహేష్‌.

‘డాడీ! అటు చూడండి… దాని కళ్ళల్లో బాధ కనిపిస్తోంది. మనం ఇప్పుడు దానికి వైద్యం చేయించాలి’ అని కంగారు పడింది సిరి.మహేష్‌ వెంటనే జంతువుల అంబులెన్స్‌కి ఫోన్‌ చేశాడు. తిమింగలం పరిస్థితి వివరించి దానికి అత్యవసరమైన వైద్యం అవసరమని చెప్పాడు. కాసేపటి తరువాత అక్కడకు ఒక అంబులెన్స్‌ , జంతువులను మోసే క్రేన్‌ లాంటి వాహనం వచ్చాయి. అందులో నుండి వైద్యులు, వారి సేవకుల బృందం దిగింది. మహేష్‌ వారికి తిమింగలాన్ని చూపించాడు.

క్రేయిన్‌  ద్వారా తిమింగలాన్ని పైకి ఎత్తి వైద్యులు దాని రెక్కలకు ప్రాథమిక చికిత్స చేశారు. అక్కడున్న జనమందరూ చూస్తూ నిలబడిపోయారు. సిరి మాత్రం తిమింగలం దగ్గరకు వెళ్ళి ఓదార్పు మాటలు చెప్తోంది.

‘ఓ పెద్ద చేపా! నీకు ఏమీ కాదు. డాక్టర్‌ వచ్చారు, మందు రాస్తున్నారు కదా తగ్గిపోతుందిలే, అప్పుడు మళ్ళీ మీ ఇంటికి వెళ్ళిపోతావు” అంది సిరి. దాదాపు రెండు గంటల తరువాత తిమింగలం కాస్త సేద తీరినట్లుగా కొంచెం కదిలింది.

‘మహేష్‌ గారు! ఇక దీన్ని నీటిలో వదలవచ్చు! దీనికి సరైన సమయంలో మీ వల్లే వైద్యం అందింది’ అన్నారు వైద్య బృందం.

‘నిజానికి ఈ తిమింగలాన్ని ముందు చూసింది మా పాప సిరి. తను చెప్పడం వల్లే దాని రెక్కల మీద గాయం చూశాను. తను బాధ పడుతుందనే మీకు ఫోన్‌ చేశాను లేకపోతే అందరి లాగానే నేనూ చూస్తూ నిలబడేవాడిని’ అన్నాడు మహేష్‌.

‘సిరీ! నీ సమయస్ఫూర్తి వల్ల ఒక ప్రాణికి స్వస్థత చేకూరింది. చిన్నపిల్లవైనా పెద్ద సహాయం చేశావు’ అని మెచ్చుకున్నారు వైద్య బృందం.

తరువాత తిమింగలాన్ని క్రేయిన్‌ ద్వారా సముద్రంలోకి వదలడానికి సిద్ధం చేస్తుండగా అది సిరి వైపు చూసి తోక ఊపుతూ ఈల వేసినట్లుగా శబ్ధం చేసింది.

‘సిరీ! నువ్వు ఓదార్పు మాటలు చెప్పినందుకు నీలి తిమింగలం నీకు కృతజ్ఞతలు చెప్తోంది’ అన్నారు అక్కడ ఉన్న జనం.

సిరి తిమింగలం వైపు ప్రేమగా చూస్తూ చేతులు ఊపింది. వైద్యులు నీలి తిమింగలాన్ని నీళ్ళల్లోకి వదిలేశారు. అది ఆనందంగా మునకలు వేస్తూ సముద్రంలోకి వెళ్ళిపోయింది. అక్కడున్న అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.

– కె.వి.సుమలత, 94926 56255

➡️