గాంధీ పుట్టిన దేశంలో…

Sep 29,2024 07:32 #Articles, #Gandhi, #Gandhiji, #Sneha

భారత స్వాతంత్య్రోద్యమం గురించి మాట్లాడితే గాంధీజీ గురించి మాట్లాడే తీరాలి. గాంధీజీ గురించి మాట్లాడితే భారత స్వాతంత్రోద్యమం గురించి మాట్లాడాలి. ఈ నేలతో అంతగా పెనవేసుకుపోయిన బంధం ఆయనది. పట్టువదలని పోరాటాన్ని శాంతి కపోతంగా ఎగరేసిన బక్కపల్చని గట్టి మనిషి గాంధీజీ. రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని బోసినవ్వుతో నేలకు రాల్చిన సత్యోద్రిక్తుడు గాంధీజీ. అంటరానితనపు చెత్తను తుడిచి పెట్టేందుకు, సమానత్వపు చీపురు పట్టుకుని తిరిగాడు. మహిళల స్వేచ్ఛే దేశం స్వేచ్చ అనీ, మహిళల స్వతంత్రమే దేశ స్వతంత్రమనీ ఆనాడే రేషనల్‌ గీతాన్ని ఎత్తుకున్నాడు. గాంధీ ఈ లోకాన్ని విడిచి ఎంత కాలమవుతుందో… గాంధీ కలలు కన్న దేశానికీ, ఇప్పటి పరిస్థితికీ మధ్యన అంత దూరం పెరిగింది. మహాత్ముడు కోరుకున్న దేశం ఆచరణలో ఉందా అని ఏ పుటను తల పరికించి చూసినా మనకి మిగిలేది నిరాశే. అక్టోబర్‌ రెండవ తేదీ గాంధీ పుట్టినరోజు. ఆయన్ని స్మరించుకుందాం.

‘భలే తాత మన బాపూజీ.. బాలల తాత బాపూజీ..’ అన్న పాట ప్రతి ఒక్కరి బాల్యంలో విన్నదే. అలాంటి బాలల తాత బాపూజీ పట్ల ద్వేషం వెదజల్లే శక్తులు ఇప్పుడు ఏలుతున్నాయి. దేశ స్వాతంత్య్రం కోసం పాటుపడిన గాంధీజీని బలిగొన్న వారి వారసులు వీరు. వీళ్లు స్వాతంత్య్రోద్యమంలో పాలుపంచుకోకపోగా, బ్రిటీష్‌ వారికి లొంగిపోయిన బాపతు. ఈ నేపథ్యంలో గాంధీజీని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనదే. ఆయన కలలు గన్న స్వరాజ్యాన్ని పునర్నిర్మించుకోవాలి.

గ్రామ స్వరాజ్యం గల్లంతు..
గాంధీ గ్రామ స్వరాజ్యం కోరుకున్నారు. పల్లెలూ, వ్యవసాయమూ ఈ దేశానికి వెన్నెముకలని నమ్మారు. మనది వ్యవసాయాధారిత దేశం. ఇన్నేళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా రైతులకు తమ వృత్తి పట్లా, బతుకు పట్లా భరోసా లేదు. ప్రపంచీకరణ, సామ్రాజ్యవాదం ఈ దేశాన్ని అంతకంతకూ పీక్కుతింటోన్న కాలంలో ఉన్నాం. గాంధీజీ కలలు కన్న దేశం కాస్తా క్యాపిటలిస్టులకు అనుకూలంగా అయిపోయింది. మన డబ్బులన్నీ అంబానీల డబ్బులైపోయాయి. మన జీవితాలన్నీ ఆదానీల జీవితాలైపోయాయి. మనల్ని మనమే కొనుక్కునే రోజులకి తీసుకొచ్చాయి. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం గంగలో కలిసిపోయింది.

పరమత సహనం.. గాంధీ అభిమతం..
పరమత సహనమే గాంధీ పాటించిన అసలైన మతం. మనిషిని మనిషి ప్రేమించాలనుకున్నాడు. మతాన్ని కాదు. గీతా పారాయణం చేసుకున్నా, రామ నామం జపించుకున్నా, హిందూ మతాన్ని ఆచరించినా అదంతా ఆయన వ్యక్తిగత వ్యవహారం. దేశం మీదో ప్రజల మీదో రుద్దాలనుకునే తత్వం కాదు. సనాతన ధర్మాన్ని చంకకెత్తుకుని తిరగమని ఏనాడూ చెప్పలేదు. కానీ, ఈ రోజు ‘మతం’ దేశం నెత్తిమీదకెక్కి కూర్చున్న పరిస్థితిలో ఉన్నాం. మతాన్ని రాజకీయానికి వాడుకునే స్థితిలో ఉన్నాం. అధికారాన్ని కాపాడుకునేందుకు మత విద్వేషాలు సృష్టించి, తమ పబ్బం గడుపుకునే పాలకుల పంచలోనే కాలం వెళ్లదీస్తున్నాం.

అదే అసలు స్వాతంత్య్రం..
ఈ పురుషాధిక్య సమాజంలో వివక్షకు లోనవుతున్న మహిళల వరకూ చేరినప్పుడే అది నిజమైన స్వాతంత్య్రం అవుతుందని గాంధీ నమ్మారు. అర్ధరాత్రి ఒక మహిళ ఒంటరిగా తిరిగినప్పుడే ఈ దేశానికి నిజమైన స్వాతంత్య్రమన్నారు. స్వాతంత్య్రం సంగతి సరే, కనీస భద్రత కూడా కరువైంది. మొన్నటి దిశ ఇష్యూ.. నిన్నటి కోల్‌కతా డాక్టర్‌ అభయ దుర్ఘటన తాజా ఉదాహరణలు. ఇవి పక్కన ఉంచితే.. అధికారంలో ఉన్న నాయకులు మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తోన్న సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. రింగులో దేశం తరపున పోరాడి, ఒళ్లు హూనం చేసుకుని, పతకాలు సాధించడానికి చెమటోడుస్తున్న రెజ్లర్ల దుస్థితిని మీడియా సాక్షిగా చూస్తూనే ఉన్నాం. అసలు మనం ఏం తినాలో, ఎలాంటి దుస్తులు ధరించాలో, ఎవరిని పెళ్లి చేసుకోవాలో నిర్ణయిస్తూ.. నియంతృత్వంగా వ్యవహరిస్తున్న దుస్థితిలో నేడు దేశం ఉంది.

అత్యంత అవమానవీయం..
మనుషులు అత్యంత అమానవీయంగా చేసే నేరాల్లో అంటరానితనం మొదటిస్థానంలో ఉంటుంది. దాని నిర్మూలన కోసం గాంధీ తన జీవితమంతా గొంతెత్తి కదుల్తూనే ఉన్నాడు. కానీ ఇంకా అనేక రూపాల్లో మన దేశంలో అంటరానితనం, కుల వివక్ష కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ దేశంలోని ఎన్నో గ్రామాల్లో రెండు గ్లాసుల పద్ధతి బాహాటంగానే కొనసాగుతోంది. టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందిన కాలంలోనూ టాయిలెట్ల క్లీనింగ్‌ మనుషుల ద్వారానే జరుగుతుంది.

మద్య రహిత దేశం…
గాంధీ మన దేశం నుంచి మద్యాన్ని సమూలంగా నిర్మూలించాలనుకున్నారు. బతుకు ఆటలో మద్యానికి చెక్‌ పెడితేనే ప్రజలు ముందుకెళ్తారనీ, దేశం ముందడుగేస్తుందనీ విశ్వసించాడు. తన జీవితంలో మద్యానికి ఎదురు నిలబడటాకి పెద్ద పీటవేశాడు. అయితే స్వతంత్ర దేశంలో ఆ ఛాయలేవైనా ఉన్నాయా అని పరికించి చూస్తే, మిగిలేది నిరాశే. మద్యంలేని గ్రామాలను వెతికితే, మంచినీళ్లు లేని గ్రామాలు దొరుకుతాయి. బెల్టు షాపుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి కానీ, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వాటి సంఖ్య తగ్గించిన జాడ కనిపించదు.
ఇలా ఏ అంశాన్ని పట్టుకున్నా, మన సమాజానికి అద్దం పట్టే ఏ ప్రతిబింబాన్ని తీసుకున్నా మనకి కనిపించే దేశం ఇదే. వీటికి దూరంగా నడుస్తూ, గాంధీ కలలు కన్న సమాజానికి దగ్గరగా నడవడమే మనం ఆయనకి ఇచ్చే నిజమైన నివాళి.

– అర్హ

➡️