పిల్లలు రాత్రి వేళ సరిగా నిద్రపోవడం లేదంటే అది పేరెంటింగ్ ప్రాబ్లమే అంటున్నారు నిపుణులు. పిల్లలు రాత్రి ఎనిమిది అయ్యేసరికి అన్నీ ముగించు కుని, నిద్రకు సన్నద్ధం కావాలి. కానీ అలాకాకుండా పిల్లలు అర్ధరాత్రుల వరకూ ఇలా డిజిటల్ ప్రపంచంలో గడిపేస్తుంటే వారి ఆరోగ్యం పాడవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది తల్లిదండ్రులేనని నొక్కి మరీ చెప్తున్నారు. అందుకు కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు.
రాత్రి 12 గంటలైనా ఏడేళ్ల అరుణ్ నిద్రపోకుండా మొబైల్‌లో గేమ్ ఆడుతున్నాడు.
సమయం రాత్రి 11 కావొస్తున్నా 13 ఏళ్ల నమ్మీ ఎవరితోనో సీరియస్‌గా చాటింగ్ చేస్తోంది.
ఇదే దాదాపు ప్రతి ఇంట్లో నేడు నిత్యం కనిపించే జీవన చిత్రం. ఇది ఏమంత ఆరోగ్యకరమైన పరిస్థితి కాదనేది నిపుణులు చెప్తున్నారు. అయితే దీనికి పిల్లల్ని దండించడం సరైన పరిష్కారం కాదనేది నిపుణుల మాట. అందుకు గల కారణాలు తెలుసుకుని పరిష్కారం ఆవైపు నుంచే జరగాలనేది వారి సూచన. అదే వాస్తవం కూడా. అసలు సమస్యను తెలుసుకోవడమే ప్రధానంగా జరగాల్సింది. అది తల్లిదండ్రులు మాత్రమే చేయాల్సిన ముఖ్య కర్తవ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
పిల్లల్లో ఏకాగ్రత లోపించడానికీ నిద్రలేమే కారణం. అలాగే చిన్న వయస్సులోనే మరిచిపోయాననే మాట తరచూ వాడుతున్నారనంటే జ్ఞాపకశక్తి లోపించిదనేది గ్రహించాలి. అలాగే మెదడు చురుకుగా పనిచేయాలన్నా మంచి నిద్ర ఉంటేనే సాధ్యం. కమ్మని నిద్ర ఉంటే మెదడుపై సానుకూలమైన ప్రభావం చూపుతుంది. అప్పుడు ఆలోచనలు సక్రమంగా ఉంటాయి. చదివింది అర్థం చేసుకోవడానికి, అవగాహన పెంచుకోవడానికి తోడ్పడాలంటే కంటి నిండా నిద్రపోవాలి అనేది నిపుణుల సూచన.
డిజిటల్ ప్రపంచంలో..
ఈ రోజుల్లో మొబైల్స్, టాబ్, టీవీలు పిల్లల్ని డిజిటల్ ప్రపంచంలో ముంచేస్తున్నాయి. వీటి నుంచి వెలువడే కాంతి మెదడులో సహజంగా విడుదలయ్యే మెలటోనిన్ స్థాయిల్ని నిరోధిస్తుంది. ఇది నిద్రను ప్రభావితం చేసి, నిద్రలేమికి దారితీస్తుంది. ఫలితంగా పిల్లలు మానసికంగా, శారీరకంగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందనేది ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. నేడు సాంకేతికత ఆవశ్యకత అవసరం ఉన్నా, దాన్ని అవసరమైన మేరకు వాడుకునేలా చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ముందు వీటి వాడకంలో తల్లిదండ్రులు ఆ నియమాలు పాటించిన తర్వాతే పిల్లలకు చెప్పాలి. వాళ్లు ఓటిటి సినిమాలు పెట్టుకుని తెల్లవారే వరకూ చూస్తూ, పిల్లల్ని వేళకు నిద్రపోవాలని చెబితే ఎలా వింటారని – నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఆరోగ్యం ఎవరికైనా నిద్రలేమి వల్ల దెబ్బతింటుందని అంటున్నారు. అందుకనే వాస్తవ ప్రపంచంలో ఉండి, డిజిటల్‌ను వినియోగించాలని సూచిస్తున్నారు.
ఆటలు.. వ్యాయామం..
పిల్లలు ఉదయం లేవగానే రెడీ అయ్యి స్కూల్‌కి సమయానికి పంపితే చాలు అనుకుంటారు చాలామంది తల్లిదండ్రులు. అది చాలా తప్పు. పిల్లల్ని వేకువజామునే లేపి, తమతో పాటు నడక, వ్యాయామం చేసేలా ప్రతి ఒక్కరి జీవనశైలి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆవిధంగా చేయడం వల్ల పిల్లలు శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. అది వారి ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతుందని నిపుణులు చెప్తున్నారు. అలాగే సాయంత్రం స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చేయించడం మీదున్నంత శ్రద్ధ పిల్లలు కాసేపు ఆటలు ఆడుకుంటే వచ్చే ఆరోగ్యం గురించి పేరెంట్స్‌కి పట్టడం లేదు. ఎంతసేపూ అనారోగ్యకర పోటీలు పెంచే ర్యాంకుల గొడవ తప్ప, పిల్లలు ఆరోగ్యంగా ఉంటే చదువులోనూ ముందే ఉంటారని అర్థంచేసుకోరు. అందుకనే పిల్లల్ని సాయంత్రం వేళ కాసేపు ఆటలు ఆడుకోనివ్వాలి. శారీరకంగా అలసి, రాత్రికి తొందరగా నిద్రపోతారు. అంతేకాకుండా చదువుల ఒత్తిడిని నుంచి సేద తీర్చడానికీ ఆటలు ఎంతగానో తోడ్పడతాయనేది తల్లిదండ్రులు గమనంలో ఉంచుకోవాలంటున్నారు నిపుణులు.
కథలు.. పాటలు..
పిల్లలు పడుకున్నప్పుడు మంచి సంగీతం వినడమో, అమ్మానాన్న ఎవరైనా పాడితే గొంతు కలపడమో చేయడం మంచి ఆరోగ్యకరమైన వాతావరణమని నిపుణులు చెప్తున్నారు. అయితే అందరూ ఈ పని చేయడం సాధ్యం కాకపోవచ్చు. అలాంటపుడు పిల్లలతో కలిసి, మంచి సంగీతం వినే పని చేయాలంటున్నారు. పిల్లలకు పడుకున్నప్పుడు కథలు వింటుండే అలవాటు కూడా మంచిదని నిపుణులు చెప్తున్నారు. అలాగే పిల్లలకు కథలు చెప్పేందుకు తల్లిదండ్రులు సంబంధిత పుస్తకాలు చదవాలని. ఒకవేళ చెప్పడం వీలుకాకపోతే పిల్లలతో కలిసి కథలు చదవడం.. వాటి గురించి వివరించడం చేస్తుండాలని సూచిస్తున్నారు. ఈ విధంగా చేస్తే పిల్లలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఆ తల్లిదండ్రులు కల్పించినట్లేనని చెప్తున్నారు. అందుకనే పిల్లలకు కథలు, పాటలు అనేవి మనసుకు హాయినిగొల్పుతాయి. అదే సందర్భంలో ఒత్తిడి నుంచి కాస్త రిలీఫ్ పొందుతారు. డిజిటల్ ప్రపంచానికీ ఎడిట్ కాకుండానూ ఉంటారనేది నిపుణుల మాట.
ఈ సూచనలు పాటించడంలో పిల్లలకు నిద్రలేమి సమస్య ఉండనే ఉండదు. అలాంటి పరిస్థితుల నుంచి పిల్లల్ని ఎంత త్వరగా వీలయితే అంత తొందరగా బయటపడేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా తల్లిదండ్రులు సమాయత్తం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.