ఆ నిప్పుల కొలిమి యజ్ఞంలా మండుతుంది
ఎర్రని నిప్పులను ఎగదోస్తూ
కిరణాల వేడిని మించిన సెగతో
తనువునంత చెమటతో నింపేస్తుంది..
రైతన్నకు ఆసరాగా అభయమిస్తూ
పనిముట్లను విశ్వకర్మ పూర్తిచేస్తూ
డొక్క చిక్కిన ఊపిరిని వదులుతూ
సమ్మెట పోటు సవ్వడులను వినిపిస్తుంది..
కమ్యూనిస్టు సోదరులకు అభయంలా
ఎర్రజెండాలను భుజాన మోస్తూ
చింత నిప్పుల్లాంటి కళ్ళతో పహరా కాస్తూ
పిడికిలి బిగించి
గుండె ధైర్యమే ప్రదర్శించింది..
ఇనుము కరిగి ఆకారాలెన్నో పొందే
నాగలి కొడవలి చేతిలో రూపమై నిలిచే
గుండెల్లో శ్వాస ఆశలాగా మారితే
సత్తుబడిన ఇనుము
సౌందర్యాన్ని నింపుకుంది..
రాయి లాంటి ఇనుమును శిల్పంగా మార్చే
సుత్తి దెబ్బలు భరించి, సుందరాకృతి కలిగే
అగ్ని పంటలో బొబ్బలెన్నో పుడితే
కాలిన చేతుల్లో రైతన్న
ఆయుధమే జనించింది..
ఆకలి సమ్మెటలో అగ్నిగోళంలా మండితే
పక్క జీవి బతుకు
నిప్పుల కొలమిలో స్నానం చేసే
కరుడుగట్టిన గుండెల్లో శ్వాస పెరిగితే
తనువు బలం నరాల శక్తి
యుద్ధం చేస్తున్నాయి..
గాలి తిత్తులు వాయువులా ఎగిసిపడితే
బొగ్గుల నిప్పులు కణకణ మండితే
ఎర్రటి చేతులు ఎన్నో ఆకారాలను అమర్చే
చల్లటి మనసులో సౌందర్యమే వికసించే..
కొప్పుల ప్రసాద్
9885066235