ఈ పిల్లాడికేమైంది…?

Sep 29,2024 08:37 #Sneha, #Stories

మొబైల్‌ మోగుతుంటే.. ఏదో కొత్త నంబరు కనిపించడంతో ‘హలో, ఎవరు?’ అన్నాడు భాస్కర్‌.
‘అన్నయ్యగారూ, నేనండీ కృష్ణారావుగారి భార్యని’ అందామె.
భాస్కర్‌కు కృష్ణారావ్‌ ఎవరో, ఆయన భార్య ఎవరో అర్థంకాలేదు. ఆ సంగతి చెబితే ఆవిడెక్కడ నొచ్చుకుంటుందోనని సందేహిస్తుండగా..
‘ఒకసారి వదినకిస్తారా ఫోన్‌?!’ అందామె.
‘కావేరీ, ఇటు రావోరు’ అంటూ పెద్దగా పిలిచాడాయన.
కావేరితో ‘నేను వనజనండీ, గుర్తుపట్టారా?’ అందామె.
‘మీరా వదినా, చెప్పండి!’ అంది కావేరి.
‘నేను మీకు ఫోన్‌ చేస్తున్నట్టు మావారికి తెలీదు..’ నసిగింది వనజ.
‘ఫర్లేదు చెప్పండి’
‘అనూకి ఎన్ని సంబంధాలొచ్చినా పెళ్లే చేసుకోనని మొండికెత్తింది. అలాంటి తరుణంలో మీ మ్యాచ్‌ వచ్చింది. బలవంతాన పెళ్లిచూపులకు ఒప్పుకున్నా కాదంటుందేమోనని భయపడ్డాం.
”నచ్చాడు, పెళ్లి ఖాయం చేయండి” అని చెప్పకపోయినా, అనూ మాటతీరును బట్టి ఇష్టమని అర్థమవుతోంది. మీకు అభ్యంతరం లేదని ఆ వేళే అర్థమైంది. కానీ అబ్బాయేమన్నాడు? కబురు రాలేదు..’ అంది వనజ.
‘మా ముగ్గురికీ నచ్చింది. కానీ చేసుకునేది దిలీప్‌ కదా! వాడి మాట కోసమే చూస్తున్నాం’ అంది కావేరి.
‘బాబుని ఒక్క మాట అడక్కూడదా వదినా?! ఆయన్ను అడగమంటే- వాళ్లు చెప్పేదాకా ఆగాలని కోప్పడ్డారు. నేను మీకు ఫోన్‌ చేశానని తెలిస్తే తిట్టేస్తారు.’
‘చెప్పంలేండి! తప్పేముంది? ఆడపిల్ల తల్లిగా మీకామాత్రం ఆత్రుత ఉంటుంది.’
‘మీరయినా అర్థం చేసుకున్నారు వదినా! బాబుని ఒత్తిడి చేసి ఒప్పించమని నా ఉద్దేశం కాదు..’
‘ఈ రోజుల్లో పిల్లలు సరే అంటే పెళ్లి చేయాల్సిందే తప్ప.. మనం ఒప్పించడం కల్లలేనండి’
‘ఏ సంగతీ తెలుసుకోవాలని..’
‘నాకూ అనిపించింది వదినా, మీరు ఎదురుచూస్తుంటారు.. ఏ మాటా చెప్తే బాగుంటుందని.. మాకు మాత్రం ఆడపిల్ల లేదా?’
‘మీరింత మంచివాళ్లు కనుకనే పిల్ల మీ ఇంటికొస్తే సుఖంగా, స్థిమితంగా ఉంటుందని వదినా’
‘అయ్యో.. అంతగా చెప్పాల్సిన పనే లేదు, అబ్బాయితో మాట్లాడాక మీకు ఫోన్‌ చేస్తాను, సరేనా’ అంటూ ఫోన్‌ పెట్టేసింది కావేరి.
భాస్కర్‌కి ముందు అర్థం కాకపోయినా సంభాషణను బట్టి మాట్లాడిందెవరో ఇట్టే బోధపడింది. ‘ఇంత ఆలస్యం చేయడం మనదే తప్పు. దిలీప్‌ని అడిగితే.. ”నన్ను కొంచెం ఆలోచించుకోనివ్వండి నాన్నా!” అన్నాడు. అసలు వీడికేమయ్యింది?! నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలిగానీ.. ఈ తాత్సారమేంటి? ఇవాళ సంగతేంటో తేల్చేస్తాను’
‘మీరలా వార్నింగిచ్చారంటే.. ఆనక వాళ్ల మధ్య ఏ తేడా వచ్చినా- ”మీరు తొందరపెట్టారు, అందుకే సరైన నిర్ణయం తీసుకోలేదు అనగలడు.’
‘గోంగూరపచ్చడి! అవునో కాదో చెప్పడానికి నెలల తరబడి ఆలోచిస్తారేంటి? అతి రహస్యం చెవిలో పోటు అన్నట్టు ఎక్కువ ఆలోచిస్తే అనర్థమే తప్ప ఒరిగేదేమీ ఉండదు’
‘ఆవిడిలా ఫోన్‌ చేసినట్టు..’
‘నాకర్థమైందిలేవో.. రివైండ్‌ ప్లే అక్కర్లా’ అనేసి కొడుక్కు ఫోన్‌ చేశాడు.
‘చెప్పండి నాన్నా’ అన్నాడు దిలీప్‌.
‘కాలేజ్‌లోనే ఉన్నావుగా, నేనొస్తున్నా’ అన్నాడు భాస్కర్‌.
‘లేదు నాన్నా, ఇంటికి బయల్దేరా! పావుగంటలో వచ్చేస్తా!’
‘సరే, అయితే!’ అని ఫోన్‌ పెట్టేశాడు భాస్కర్‌.
*******************************************
తండ్రీకొడుకులిద్దరూ హాల్లో కూర్చున్నారు. కావేరి పకోడీల ప్లేట్లు, టీ కప్పులూ పెట్టి వెళ్లిపోయింది.
‘నీకేమైందిరా, అడిగిందానికి సరిగ్గా చెప్పకుండా మాటిమాటికీ పరధ్యానంలోకి వెళ్తావేంటి?’ విసుగ్గా అడిగాడు భాస్కర్‌.
‘నాక్కొంచెం ఫ్లాష్‌బ్యాక్‌ ఉంది నాన్నా’
‘అనుకున్నాలే చిట్టితండ్రీ.. ఏంటో ఆ గతచరిత్ర?’ వ్యంగ్యాన్ని తొక్కిపడుతూ అన్నాడు భాస్కర్‌.
‘మీకన్నీ సెటైర్లే!’
‘నువ్వింత కాంప్లికేటెడ్‌గా తయారయ్యావేంట్రా? ఎవరా అమ్మాయి? ఇలాంటి ప్రేమాయణాలు ఉన్నపుడు ముందే చెప్పాలిగానీ పెళ్లిచూపులకు వెళ్లి చూశాక.. వాళ్లని భంగపాటుకు గురిచేయొచ్చా?’ చిరాగ్గా అన్నాడాయన.
‘హయ్యో, మీకలా అర్థమైందా? ఇంటర్లో చిన్న ఇన్‌ఫాచ్యుయేషన్‌ తప్పిస్తే నాకెలాంటి ఎఫేర్లూ లేవు. ఈ ప్రేమలూ ఆకర్షణల మీద నాకేం నమ్మకం లేదు’
‘మరింకేంట్రా సమస్య? ఈ కప్పదాటు వ్యవహారాలు ఆపి, విషయమేంటో చెప్పు’
‘నాన్నా నాకు కాలేజీ బాధ్యతలు అప్పజెప్పేముందు మీరేమన్నారో గుర్తుందా?’
‘రెసిడెన్షియల్‌ కాలేజంటే అల్లాటప్పా కాదు. పిల్లల్ని బెదిరించో భయపెట్టో బాగుచేయాలని నసపెట్టేవాళ్లు కొందరుంటే, కాస్త కసిరినా యుద్ధానికి వచ్చేవాళ్లు ఇంకొందరుంటారు. ఎంత ఫీజయినా ఫరవాలేదు, కోరిన తిండి పెట్టి, నచ్చే ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవ్వమని కొందరంటే, వేలకు వేలు గుంజుతున్నారు.. పొద్దస్తమానం చదువు తప్ప ఇంకే ధ్యాసా వద్దని గొడవపెట్టేవాళ్లు ఇంకొందరు. సమయానికి ఫీజు చెల్లించకుండా విసిగించేవాళ్లు, కొంచెం కట్టి తక్కింది ఎగ్గొట్టే ఘనులు, భోజనం ఎంత బాగున్నా సరైన తిండి పెట్టలేదని ఘర్షణకు దిగే వీరులు, పిల్లలు నడిపే పిచ్చి ప్రేమాయణాలక్కూడా మనల్నే బాధ్యుల్ని చేసే మహానుభావులు- అంటూ మీరు చెప్తోంటే..
‘అంతచేటు భయపెడ్తారేంటి నాన్నా? అన్నీ కష్టాలే ఉంటే ఇంతింతమంది రెసిడెన్షియల్‌ కాలేజీలు ఎలా నడిపిస్తున్నారు?’ అన్నాను.
‘అప్పుడు మీరు ”అందులో ఉండే లాభాలూ సౌఖ్యాలను ఎటూ ఆనందిస్తాం. కానీ కష్టనష్టాలను భరించడం అంత సులువు కాదు. కనుక ఎలాంటి జటిలమైన వ్యక్తులు, సమస్యలు ఎదురవుతాయో తెలుసుకుంటే, వాటినెలా ఎదుర్కోగలమో ఆలోచించాలి. దిగాక అమ్మో ఇంత లోతా అని తల్లడిల్లడం వల్ల ప్రయోజనం లేదు. దిగే ముందే సమాయత్తం కావాలి” అంటూ ఒక నాలుగైదు రోజులు మార్కెటింగ్‌కి సంబంధించిన ఏదో ఒక పనిలో దిగమన్నారు. ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ చాలా ముఖ్యమని మరీ మరీ చెప్పారు’
‘అవును. అప్పుడు నువ్వు.. వాసు స్విగ్గీ డెలివరీ బారుగా చేస్తున్నాడని, నాలుగురోజులు అతనితో కలిసి
వెళ్తానన్నావు.. కాలేజ్‌ వ్యవహారానికి స్విగ్గీ డెలివరీకి సంబంధం లేదుగా అంటే.. ”కాదులే నాన్నా.. మనుషుల తీరు కొంచెం తెలుసుకుంటాను!” అంటూ వెళ్ళావు. ఇంతకీ అప్పుడు ఏమయ్యిందేంటి?’
‘ఆ నాలుగురోజుల్లోనే చాలా నేర్చుకున్నా నాన్నా! మీరన్నట్లు థియరీ కంటే ప్రాక్టికల్స్‌ ముఖ్యమని అర్థమైంది’ అని చెప్తోంటే దిలీప్‌కి ఆ రోజు సంఘటన కళ్లముందు మెదిలింది.
*************************
‘ఏరా వాసూ, లాగిన్‌ అయ్యావా?’ అడిగాడు దిలీప్‌.
‘ఆఆ.. గచ్చిబౌలీలో డెలివరీ ఉందిరా! మిల్క్‌షేక్‌, వెజ్‌ బిర్యానీ ఆర్డరిచ్చారు. ఐటమ్స్‌ కలెక్ట్‌ చేసుకుని మెహిదీపట్నంలో ఉన్నా’
‘అక్కడే ఉండు, రెండు నిమిషాల్లో వచ్చేస్తా’ అంటూ దిలీప్‌ శరవేగంగా వెళ్లాడు.
వాసు తన బండిని అక్కడే పార్క్‌ చేశాడు. ఇద్దరూ కలిసి దిలీప్‌ బండి మీద బయల్దేరారు. జీపీఎస్‌ సాయంతో స్ట్రెయిటు, లెఫ్టు, రైటు తీసుకుంటూ వెళ్తున్నారు. ‘గూగుల్‌ దారులు కనిపెట్టినోడికి వెయ్యి దండాలెట్టాలి’ అన్నాడు వాసు.
‘నిజమే కానీ ఒక్కోసారి మాత్రం కొంప ముంచుతుందిరా! ఎదురుగా కొండుంటే-”గో స్ట్రెయిట్‌!” అంటుంది. కుడిపక్కన పెద్ద చెరువుంటే ”టేక్‌ రైట్‌!” అంటుంది.. అలాంటప్పుడు చావుకొస్తుంది’
‘ఆ.. సిగల్స్‌ అందకపోతే గూగులమ్మ మాత్రం ఏం చేస్తుందిలే? కోటి మేళ్లు చేసింది మర్చిపోయి ఒక్క తప్పునే హైలైట్‌ చేస్తే ఎలా? మనుషుల్లా మిషన్లు విశ్వాస ఘాతుకంగా మాత్రం ఉండవు’
ఇంతలో వాసు ఫోన్‌ మోగింది. ఎత్తగానే ‘ఏమయ్యా, ఇంకెంతసేపు పడ్తుంది?’ అంటూ గద్దించిందో స్వరం.
‘వచ్చేస్తున్నా మేడమ్‌! ఆన్‌ ది వే’ అన్నాడు వాసు చాలా వినయంగా.
‘ఇంత లేటా? బుద్ధీజ్ఞానం ఉండాలి, ఈపాటికి తినేసి పడుకుందామనుకున్నా’ అని గాండ్రిస్తూ ఫోన్‌ పెట్టేసిందామె.
‘ఆమె విసురుకు ఫోనుకు బీటలు పడ్డట్టున్నాయి, మాటలన్నీ బయటకు లీకైపోయాయి’ నవ్వేడు దిలీప్‌.
‘వాల్యూమ్‌ తక్కువే ఉంది.. ఏం చేద్దాం దద్దరిల్లే తబలా గొంతు.. పేరు అనూ.. గొంతు యమా ఘనం’ చిరాగ్గా అని ‘ఇలాంటి పులులూ సింహాలూ రోజూ తగుల్తూనే ఉంటాయిలే. అద్సరే గానీ ఇందాకో పెద్దావిడెంత ఘోరంగా అవమానించిందో తెల్సా?’
‘పిల్లలు ఇంటి తిండి తినకుండా పొద్దస్తమానం బయటి ఫుడ్డుకు ఆర్డర్లిస్తోంటే పెద్దాళ్లక్కాలుద్దిలే, అర్థంచేసుకోవాలి!’
‘అయితే మట్టుకు.. డెలివరీ చేసిన పాపానికి దుడ్డుకర్ర తీసుకు వెంటపడ్తుందా? ఆ కుర్రాడు ముందే గూగుల్‌ పే చేసి.. పరిగెట్టుకొచ్చి ఆర్డర్‌ తీసుకున్నాడు కాబట్టి సరిపోయింది’
‘ఆవిడ కర్ర ఎత్తితే.. ఆర్డర్‌ క్యాన్సిల్‌ చేయకపోయావా?’
‘మాటికీ క్యాన్సిల్‌ చేస్తే..రిమార్కే కాదు, నా జేబుకు చిల్లుపడుద్ది’
‘నీ ఓపిక్కి జోహార్లు రా వాసూ! ఈ నాల్రోజులకే చిత్రవిచిత్రమైన క్యారెక్టర్లని చూశా! వేడి చల్లారిపోయిందని గొంతు చించుకునే ఘటం, ల్యాండ్‌మార్క్‌ చెప్పడానిక్కూడా విసుక్కునే పైల్స్‌ పేషెంటు, ఇంత వెలితిగా ఉందేంటి మధ్యలో మింగేశావా అనే అనుమానప్పక్షి, డెలివరీ బారు అంటే బిచ్చగాడన్నట్టు ఛీత్కరించేవాడు.. వామ్మో!’ అన్నాడు దిలీప్‌.
‘నువ్వు చూసింది చాలా తక్కువరా కన్నా! నాకింకా విడ్డూరమైన కేసులు చాలానే తగిలాయి!’ అన్నాడు వాసు.
‘స్లో స్లో.. రైట్‌ చూపిస్తోంది’ అనడంతో వాసు కుడివైపుకు తీసుకుని ‘వామ్మో, ఇదేంట్రో కీకారణ్యంలా ఉంది?’ అన్నాడు.
ఇళ్లను విసిరేసినట్టుగా ఉన్నాయి. అక్కడక్కడా మిణుకు మిణుకుమనే వెల్తురే తప్ప స్ట్రీట్‌లైట్లే లేవు. బండి పక్కకు తీసుకుని, ఫోన్‌ చేశాడు వాసు.
‘మళ్లీ ఫోనేంటి? యూజ్‌లెస్‌ ఫెలో’ అందామె.
ఆ మాటకి వాసు అవాక్కయ్యాడు. ఇదంతా మామూలే అన్నట్టు క్షణంలో తేరుకుని ”వచ్చేశాను, దగ్గర్లో ఉన్నాను. కొంచెం గుర్తులు చెప్పండి” అన్నాడు.
‘ఇంత తెలివితక్కువతనమేంటి? అసలు నీకీ ఉద్యోగమిచ్చిందెవరు?’ ఘీంకరించిందామె.
‘ప్లీజ్‌ మేడమ్‌, అలా మాట్లాడొద్దు.. ఇక్కడంతా చీకటిగా ఉంది.. ఏమీ కనిపించడం లేదు’
‘టార్చ్‌లైట్‌ పట్టుకు రమ్మంటావా?’
వాసు బిక్కచచ్చిపోయి ‘కాస్త గుర్తులు చెప్పండి. లక్కీ టీ స్టాల్‌ దగ్గరున్నా.. ఇక్కణ్ణించి ఎటు రావాలి?’
‘షటప్‌ స్టుపిడ్‌! లొకేషన్‌ సెర్చ్‌ చేయడం కూడా రాదా నీకు?! గంట నుంచి వెయిట్‌ చేస్తున్నా.. బుర్ర తింటున్నావు కదరా డర్టీఫెలో! ఫో వెనక్కి! వెళ్లి గండిపేట చెరువులో దూకి చావు’ అంటూ ఇష్టారాజ్యంగా తిట్టేసింది.
‘ముందు మీ నోరు అదుపులో పెట్టుకోండి’ ఉక్రోషంగా వాసు కూడా గొంతు హెచ్చించాడు.
‘షటప్‌! నేను గానీ వచ్చానంటే తన్నేస్తా జాగ్రత్త’
‘అవునవును.. నీతో తన్నించుకోడానికే వచ్చాం!’
‘ఫోరా ఫూల్‌, వెనక్కి చూడకుండా ఫో’ అనేసి ఫోన్‌ పెట్టేసింది.
అంతదాకా వంద మీటర్లంటూ డెస్టినేషన్‌ చూపిన గూగుల్‌ మ్యాప్‌ బొత్తిగా మొరాయించింది. సిగల్‌ పోయింది. తన బ్రాంచ్‌ ఆఫీసుకు ఫోన్‌ చేసి చెబుదామన్నా నంబర్‌ కలవలేదు.
‘ఇదెక్కడి రాక్షసిరా దిలీప్‌! ఇలాంటి చెత్తమొహాల్ని గొయ్యి తీసి పాతిపెట్టినా పాపం లేదు. ఇప్పుడీ ఆర్డర్‌నేం చేయాలి?’ అన్నాడు వాసు.
‘ఆఫీసులో చెప్పు, నీదేం తప్పుందని?’
‘వాళ్లకా లాజిక్‌ ఉండదు. కస్టమర్లు ఎంత వికారంగా మాట్లాడినా సరే మీరు సౌమ్యంగా ఉండాలంటారు. కాల్సన్నీ రికార్డవుతాయి. జీపీఎస్‌ పని చేయలేదంటే నమ్మరు. నాదే తెలివితక్కువతనం అన్నట్టు అవమనిస్తారు’ అన్నాడు వాసు.
‘అవతలెంత దారుణంగా మాట్లాడినా ఆఫీసు వాళ్లు పట్టించుకోకపోవడమేంటి? అసలీ చెత్తమొహాలు నీకేమన్నా బిచ్చమేస్తున్నారా? ఇంట్లో వండుకునే తెలివి లేక.. కనీసం హోటలుకెళ్లి తినే ఓపికా లేక ఆర్డరిస్తే.. పాపం మీరు తీసికెళ్లి అందిస్తున్నారు. ఇద్దరికీ ఒకరి అవసరం ఒకరికుంది. ఇంకా మాట్లాడితే అందుకునేవాళ్లే ఎక్కువ కృతజ్ఞతగా ఉండాలి’ అన్నాడు దిలీప్‌.
‘లేదురా నాయనా! నాకీ ఉద్యోగం ఇచ్చేటప్పుడే వార్నింగిచ్చారు, వాళ్లేమన్నా దులిపేసుకోవాలి, కస్టమర్లే లేకుంటే మనకీ కొలువుండదని మర్చిపోవద్దన్నారు’
‘ఏడ్చినట్టుంది.. సరే ఇప్పుడేం చేస్తావు?’
‘ఈ రెండూ నీక్కావాలంటే చెప్పు.. ఇవాళ్టికి బతికిపోతాను’
‘నాకొద్దుగానీ నువ్వే ఇంటికి తీసికెళ్లు.. వాటి ఖరీదు నేనిచ్చేస్తా’ అన్నాడు దిలీప్‌.
దారిలో వాసు మాట్లాడినా.. దిలీప్‌ జవాబివ్వలేదు. మనసంతా పాడయ్యింది. ‘వాసు ఆర్థిక పరిస్థితి బాగాలేని మాట నిజమే. తండ్రి పెద్దవాడైపోవడంతో ఉద్యోగం లేదు. చేసింది ప్రైవేటుది కనుక కూడబెట్టిందీ లేదు, పెన్షనూ రాదు. చెల్లిని, తమ్ముడ్ని చదివిస్తూ కుటుంబభారం మోస్తున్నాడు. జీతం సరిపోక సాయంత్రాలూ సెలవురోజుల్లో ఈ పార్ట్‌టైం పని పెట్టుకున్నాడు. కానీ ఉద్యోగం అవసరమైనంతలో ఆత్మగౌరవాన్ని వదిలేయాలా? ఇది దిగజారడం కాదా? కాలేజీ బాధ్యతలు తీసుకుంటే తనూ ఇంతేనా? ఫీజు కడుతున్నాం కదాని నోటికొచ్చిందల్లా మాట్లాడితే భరించాలా? లేదు, తమకు జవాబుదారీతనం ఉండాలి. అలాగే.. అవతలివాళ్లు హద్దుమీరి ప్రవర్తిస్తే మట్టుకు సహించాల్సిన పని లేదు’ అనుకున్నాడు.
మెహిదీపట్నంలో వాసును దింపేసి, తన దారిన వెళ్లిపోయాడు.
మర్నాడు వాసుతో చెప్పకుండా ఆమెని కలిసి ‘మడిసన్నాక కాసింత వినయం, విధేయతా ఉండాలి’ అంటూ చిన్నపాటి క్లాసు తీసుకుందామని వీరోచితంగా వెళ్లాడు. కానీ గేటెడ్‌ కమ్యూనిటీ కనుక వాచ్‌మ్యాన్‌ ఆపేశాడు. ఎంత బతిమాలినా విన్లేదు. పైగా ఆడపిల్లల్ని వెంటాడే రోమియోలా పరిగణించేసరికి అవమానంగా అనిపించి తిరిగొచ్చేశాడు.
*******************
‘ఏరా దిలీప్‌, వినిపిస్తోందా?’ అంటూ తల్లి బిగ్గరగా మాట్లాడేసరికి ఈ లోకంలోకి వచ్చి ‘సారీ అమ్మా’ అన్నాడు దిలీప్‌.
ప్రశ్నార్థకంగా చూస్తున్న తండ్రివైపు తిరిగి.. గతంలో జరిగింది క్లుప్తంగా చెప్పాడు.
అంతా విని ‘ఇప్పుడు నీ ఉద్దేశమేంటి? ఈ అనూ ఆ పిల్లేనంటావా?’ అన్నాడు తండ్రి.
‘అదే అడ్రస్‌ నాన్నా, నాకు బాగా గుర్తుంది.’
‘అయితే చూట్టానికి రాకుండా ఉండాల్సింది.’
‘మీరు తీసికెళ్లేవరకూ అక్కడికని నాకు తెలీదు. పేరు కూడా అదే అవ్వడంతో ఆశ్చర్యమేసింది.’
‘కానీ, ఆ అమ్మాయితో నేను మాట్లాడాను కన్నా! నవ్వుముఖం, నెమ్మదస్తురాలు’ అంది తల్లి.
‘నాకూ అలాగే అనిపించిందమ్మా! కానీ భయంకరమైన అవకాశవాది అయ్యుంటుంది. ఊసరవెల్లిలా రంగులు మార్చేయగలదేమో!’
‘ఒకవేళ బాగా ఆకలేసి.. ఎంతకూ ఫుడ్‌ రాలేదని చిరాకేసిందేమో!’
‘అయితే మాత్రం.. అంత దురుసుతనం చూపొచ్చా? రేపు మనవల్ల ఏదైనా జాగు జరిగితే అలాగే విదిలిస్తే?’
‘సరే, ఆ పిల్లను వద్దనుకోవడంలో నీకు స్వేచ్ఛ ఉంది, కాదన్ను.. కానీ ఆ మాట అప్పుడే చెప్పాలి. ఇలా తాత్సారం చేసి.. ఆనక ఇష్టంలేదనడం సబబు కాదు’ అన్నాడు తండ్రి.
‘అంత పెళుసయిన పిల్ల కనుక అవమానించాలనుకున్నావా? లేదంటే బుద్ధొచ్చేలా చేయాలనుకున్నావా?’ అంది తల్లి.
‘ఉహూ.. ఆమెని అవమానించాలనీ లేదు, పాఠాలు చెప్పాలనీ లేదు. నేనే పెద్ద డైలమాలో పడ్డాను. చూట్టానికి బాగుంది. డ్రెస్సింగ్‌ స్టయిలూ మాట తీరూ నచ్చాయి. కానీ వీటి మాటున కర్కశత్వం ఉందే.. ఆ కోణాన్నెలా భరించగలమని భయంగా, బెంగగా ఉంది’ అన్నాడు దిలీప్‌.
‘ఎంత పెద్ద సమస్యకైనా ఏదో పరిష్కారముంటుంది’ అన్నాడు భాస్కర్‌.
‘నిజమే కదా! ఈ నాన్చుడు ఎందుకు? ఏదో ఒకటి తేల్చుకోవాలిగానీ’ అంది కావేరి.
అందాకా నిశ్శబ్దంగా వింటూ కూర్చున్న దివ్య కల్పించుకుని ‘నాన్నా, ఆ వేళ అనూ నంబరు తీసుకున్నాను. తనతో ఒకసారి మాట్లాడొచ్చా?’ అంది.
‘ఇదంతా చెప్తావా ఏంటి?’ కంగారుగా అన్నాడు దిలీప్‌.
‘అంత తెలివితక్కువదాన్నేం కాదులే’ అనేసి గదిలోకి వెళ్లింది.
ముగ్గురిలో కలవరం, ఉత్కంఠ. ఎవరికి వారు ఏదో పని కల్పించుకుని చేస్తున్నా.. మనసులు కుదురుగా లేవు. దివ్య ఏం మాట్లాడ్తుందో, చివరికి ఏం వినాల్సొస్తుందోనన్న ఆరాటం, అలజడి.
సుమారు అరగంటయ్యాక దివ్య వచ్చింది. ఆరు కళ్లూ ప్రశ్నార్థకంగా చూశాయి.
‘స్విగ్గీ ఇన్సిడెంట్‌ గురించి మాట్లాడ్డానికి ఎంత ప్రయాసపడ్డానో తెలుసా? ఎక్కడో హయత్‌నగర్లో మొదలెట్టి.. హిమాలయాలకు చేరినట్టు..’
‘ఇవతల టెన్షన్‌తో ఛస్తోంటే నీ ఉపోద్ఘాతాలేంటే తల్లీ!’ అంది తల్లి.
‘మరి ఇదేమన్నా మామూలు సంగతేంటి? పెళ్లి..!! రెండు జీవితాలకు సంబంధించింది!! విషయం రాబట్టాలి, విషపరిణామాలు చోటుచేసుకోకూడదు.’
‘దివ్యంగా సెలవిచ్చావుగానీ.. త్వరగా చెప్పు’
‘అరే, నేనెంత కష్టపడి ఆ ఊసులోకి వెళ్లానో చెప్పనివ్వరా?’
‘అబ్బో.. కాశీ నుంచి కన్యాకుమారి వరకూ పరిగెట్టావులేవే.. నీకు ఐ ఫోన్‌ లేటెస్ట్‌ వర్షన్‌ కొనిస్తాగానీ ముందు చెప్పు.’
‘అనూకి బయటి ఫుడ్‌ పెద్దగా నచ్చదట. వాళ్ల పిన్ని కూతురు మాత్రం స్వీగ్గీలూ జొమేటోల మీద పడి బతికేస్తుందని, వాళ్లింటికొచ్చినప్పుడు కూడా ఆర్డర్లు ఇస్తుంటుందని చెప్పింది. తన పేరు అనూహ్య..’
‘హమ్మయ్య.. అనూష కాదా?’ అంది కావేరి.
‘అవునూ, నువ్విలా అడుగుతుంటే తనకస్సలు డౌటు రాలేదా?’ అడిగాడు దిలీప్‌.
‘అదేగా చెప్పేది.. ఎంతమాత్రం అనుమానం రాకుండా స్విగ్గీ డెలివరీ బారుస్‌ మీద జోకులేస్తూ ఏదేదో చెప్తూ.. కొందరు వాళ్లతో ఆడుకుంటారట.. అంటూ మాట్లాడ్తే.. అప్పుడు తను- అనూహ్య చేసే నిర్వాకాలు చెప్పింది.’
భాస్కర్‌ టీపారు మీదున్న మొబైల్‌ చేతిలోకి తీసుకుని.. ‘కాసేపు మాట్లాడకండి! అమ్మాయి నచ్చిందని చెప్తాను, ఇప్పటికే ఆలస్యమైంది’ అన్నాడు.
ముగ్గురూ నవ్వుతూ చూశారు.

 

  • ఎన్నార్
➡️