చలికాలంలోని చలినంతా ఈ రోజే కరిగించేయాలి అన్నట్టు వీధిలోని ప్రతి ఇంటి ముందర భోగి మంటలు మండుతున్నాయి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఆ వీధిలోని వారందరూ తమతమ ఇళ్ళ ముందర భోగి మంటలు వేసి, వాటి చుట్టూ కూర్చుని సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ చలి కాచుకుంటున్నారు. పండగంటే సంతోషంగా గడపడమే కదా! పూలహారంలో అక్కడక్కడా ఉండే రంగుపూలు మాలను మరింత అందంగా, ఆకర్షణీయంగా తయారుచేస్తాయి. పండగలన్నవి మాలలోని రంగు పూలవంటివే! అవి జీవితం అనే మాలను మరింత సంబరంగా, సంతోషంగా తీర్చిదిద్దుతాయి. బంధాలను చిక్కపరుస్తాయి. జ్ఞాపకాలను పదిలపరుస్తాయి.
భోగము అంటే ఆనందం. భోగము అంటే సంతోషం. బాధలకు స్వస్తి పలికి, ఆనందాలను ఆహ్వానించడమే భోగి పండగ పరమార్థం. అందుకే మనకు భారంగా ఉండే అవసరం లేని, ఉపయోగం లేని వస్తువులను భోగి మంటల్లో పడేస్తాం. ముందురోజే సిద్ధం చేసిన కట్టెలను వీధి గుమ్మానికి ఎదురుగా పేర్చి, నిప్పు పెట్టింది కమల. ఇంట్లో పేరుకు పోయిన, అవసరం లేని వస్తువులను భోగి మంటల్లో వేస్తూ, ఒంటరిగా భోగి మంట ముందు కూర్చుంది.
ఈ సంక్రాంతి తనకు, తన ఇంటికి ఎంతో ప్రత్యేకమైనది. అత్తారింట్లో అడుగుపెట్టిన కూతురు సౌమ్యను, కొత్త అల్లుడిని తీసుకొస్తున్న సంక్రాంతి ఇది. ఇక్కడ వారిద్దరూ ఉండబోయే పండగ నాలుగురోజులకు కావలసిన ఏర్పాట్లన్నీ చేసింది కమల. నాణేనికి రెండు వైపులున్నట్టు కూతురు అల్లుడు వస్తున్నారన్న ఆనందం ఒకవైపు, అల్లుడికి అసౌకర్యం కలగకుండా చూడాలన్న కంగారు మరోవైపు కమలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ సంక్రాంతిని అల్లుడు జీవితాంతం గుర్తుపెట్టుకోవాలన్నదే ఆమె ఆరాటం.
ఒకవైపు సూర్యకిరణాల వెలుగు, మరో వైపు భోగి మంటల కాంతితో అక్కడి పరిసరాలు బంగారు వన్నెను సంతరించుకున్నాయి. ఆ వెలుగులో తను వేసిన రంగుల ముగ్గు వాకిలికి మరింత శోభనిస్తోంది. ముగ్గులో గొబ్బెమ్మలను పెట్టి వాటికి గుమ్మడి, తంగేడి పూలను గుచ్చి, పసుపు కుంకుమలతో అలంకరించింది కమల. గత ఏడాది పండగ రోజున గొబ్బియలు ఆడే ఆడపడుచులు తమ ఇంటి ముందుకు వచ్చినప్పుడు తన కూతురు సౌమ్య వారితో కలసి నృత్యం చేస్తూ పాడిన గొబ్బియల పాట కమల మనసులో స్ఫురణకు వచ్చింది. అప్రయత్నంగా ఆ పాట కమల గొంతును అల్లుకుంది.
గొబ్బిళ్ళో గొబ్బిళ్ళో
నల్లనయ్యకు గొబ్బిళ్ళో
గొబ్బిళ్ళో గొబ్బిళ్ళో
చిన్నికృష్ణకు గొబ్బిళ్ళో
కొలనిదోపరికి గొబ్బిళ్ళో
యదు కులము స్వామికిని గొబ్బిళ్ళో
కొండ గొడుగులా గోవులు గాచిన
కొండక శిశువుకు గొబ్బిళ్ళో
గొబ్బిళ్ళో గొబ్బిళ్ళో
నల్లనయ్యకు గొబ్బిళ్ళో
గొబ్బిళ్ళో గొబ్బిళ్ళో
చిన్నికృష్ణకు గొబ్బిళ్ళో
కూని రాగంగా పాట పాడుకుంటూ ఇంటి పనులు చక్కబెడుతున్న ప్పటికీ కమల దృష్టంతా గుమ్మం వైపే ఉంది.
తన గారాలపట్టీ, కొత్త పెళ్లికూతురు అయిన సౌమ్య తన భర్తతో కలిసి తొలిసారి ఇంటికి రాబోతోంది. ఇరవై మూడేళ్ళ సౌమ్య అందంగా, నాజూగ్గా ఉంటుంది. రెండు నెలల క్రితమే ఆమెకు పెళ్లి చేసి, అల్లుడి వెంట హైదరాబాదు పంపించింది. అల్లుడు ఏదో ముఖ్యమైన ప్రాజెక్టు పూర్తిచేయాల్సి ఉండడం వల్ల అతనికి ఆఫీసులో సెలవు దొరకలేదు. ఈ రెండు నెలల్లో మూడు సార్లు హైదరాబాదు వెళ్ళి, కూతురిని, అల్లుడిని చూసొచ్చింది. కొత్తగా పెళ్ళైన బిడ్డను జంటగా కాకుండా ఒంటరిగా తన వెంట పంపమని అల్లుడిని అడగడం బాగోదని అనిపించింది. అందుకే హైదరాబాద్ వెళ్ళి కూతురిని చూసొచ్చిందే తప్ప, తన వెంట తీసుకునిరాలేదు.
వీధిలో నుండి ఏ చప్పుడు వినబడ్డా, ఇంటి బయటకు వచ్చి, వీధి మలుపు వైపు చూస్తోంది. మన అనుకునే వారి గురించి ఆలోచిస్తూ, వారి కోసం ఎదురుచూడడం ఎంతో మధురంగా ఉంటుంది. కానీ ఆలస్యం అయ్యేకొద్దీ ఆలోచనలు క్రమక్రమంగా అంతకంతకూ పెరిగి, భారంగా మారుతాయి. ఇప్పుడు కమల పరిస్థితి కూడా అలాగే ఉంది.
దేవుడి ముందు దీపం వెలిగించి దణ్ణం పెట్టుకుంటూ ఉండగా ఇంటి ముందున్న గేటు చప్పుడు వినిపించింది. బయటకొచ్చి చూస్తే, గేటు దగ్గర పాల కృష్ణమ్మ కనబడింది. నెత్తిపైనున్న పాల క్యాను కిందికి దించి, ప్రహరీగోడపై బోర్లించి పెట్టిన గిన్నెను అందుకుని, అందులోకి పాలను కొలిచి పోసింది.
‘కూతురు, అల్లుడు వచ్చేసినారా?’ అంటూ కాళ్లు పైకెత్తి లోపలికి చూస్తూ కమలను అడిగింది.
‘వాళ్ళింకా రాలేదుగానీ, అల్లుడుగారు ఉండే ఈ నాలుగు రోజులూ అరలీటరు పాలు అదనంగా పొయ్యి.’ అంది కమల.
‘అలాగేనమ్మా!’ అంటూ మరో అరలీటరు పాలను అదనంగా పోసి, క్యానుకు మూత పెట్టి, తలపై పెట్టుకుంది కృష్ణమ్మ.
‘అల్లుడిగారికి తలంటడానికి పక్కవీధిలో ఉండే చెంగన్నను పిలిచాను. మరిచిపోయాడో ఏమో! వెళ్తూ వెళ్తూ కాస్త గుర్తుచేసి వెళ్ళు!’ అంటూ చెప్పింది కమల.
‘సరేనమ్మా! చెప్తాను లే!’ అంటూ ముందుకు వెళ్లింది కృష్ణమ్మ.
తిరిగి ఇంట్లోకి వెళ్తున్న కమలకు వీధిలో ఆటో ఆగిన చప్పుడు వినిపించింది. పరుగు లాంటి నడకతో గేటు దగ్గరకు వెళ్లింది. ట్రాలీ బ్యాగుతో ఆటో దిగింది సౌమ్య. కూతుర్ని చూడగానే కమల ముఖం సంతోషంతో విప్పారింది. కానీ ఆ సంతోషం ఒక్క క్షణం కూడా నిలువలేదు. పక్కన అల్లుడు లేకపోవడాన్ని గమనించగానే ఆమె సంతోషం పాల పొంగులా చల్లారిపోయింది. ఆమె మనసెందుకో కీడు సంకించింది.
‘ఒక్కదానివే వచ్చావా? వెంట అల్లుడు రాలేదా??’ కంగారుగా ఆటో దగ్గరే సౌమ్యను ప్రశ్నించింది కమల. సమాధానం చెప్పకుండా లోపలికి నడిచింది సౌమ్య.
‘ఏదైనా గొడవ పడ్డారా?’ ఇంట్లో అడుగు పెట్టీపెట్టగానే మళ్లీ అడిగింది. అవునన్నట్టు తలాడించింది సౌమ్య. ఆ సైగతో కమల గుండెలో రాయి పడ్డట్టు అనిపించింది. అతి కష్టం మీద వంటగదిలోకి వెళ్ళి స్టవ్ వెలిగించి, పాలు పెట్టింది. గిన్నెలోని పాలు, కమల మెదడులో సందేహాలు సలసలా మరుగుతున్నాయి.
‘కూతురుకి, అల్లుడికి గొడవెందుకొచ్చింది? కూతురేదైనా తప్పుగా మాట్లాడిందా? అతడు చెప్పినట్లు నడుచుకోలేక పోయిందా? ఇంటిపనుల్లో అలసత్వం చూపుతోందా? తన జీతాన్ని అల్లుడికి ఇవ్వనందా? ఉద్యోగ ఒత్తిడితో భర్త అవసరాలు తీర్చలేకపోతోందా?’ తన మెదడు అడిగే ప్రశ్నలన్నింటికీ తన మనసు నుండి కాదు, లేదు అనే సమాధానమే వస్తోంది.
బిడ్డకి ఇష్టమైన ఫిల్టర్ కాఫీ కలుపుకుని వచ్చింది కమల. అమ్మ కలిపి తెచ్చిన కాఫీ తాగిన సౌమ్యకు ఆ క్షణం చాలా రిలాక్స్‌గా అనిపించింది. సోఫాపై వెనక్కు వాలి, కళ్ళు మూసుకుంది. కానీ కమల మనసులోని ఆలోచనలు ఆమెను నిలువనీయడం లేదు. ‘అసలు అల్లుడు మంచివాడేనా? అమ్మాయిని చక్కగా చూసుకుంటున్నాడా? చెడు వ్యసనాలు, వ్యాపకాలు లేనివాడేనా? సౌమ్య పెళ్లి విషయంలో తామేమీ తొందరపడలేదు కదా!’ ఇలా ఆమె మనసు ప్రశ్నలతో నిండిపోతోంది. కొన్ని సమస్యలకు కారణాలు తెలుసుకోవడానికి ఎంతో ఓర్పు, వాటి పరిష్కారానికి మరెంతో నేర్పు అవసరం. కానీ కమల ఆగలేకపోయింది.
‘సౌమ్యా! ఇద్దరి మధ్య గొడవెందుకు అయ్యింది?’ పక్కన కూర్చుంటూ అడిగింది. బదులుగా నీరు నిండిన కళ్ళతో తన గదిలోకి వెళ్ళిపోయింది సౌమ్య. ఆలుమగల మధ్య ఏర్పడ్డ చిరు మంటలు గుప్పున ఎగిరి, చప్పున చల్లారిపోతే పర్లేదు. కానీ అవి అంతకంతకూ పెరిగితే, వివాహ బంధాన్ని సైతం దహించి వేస్తాయి. ఇద్దరి జీవితాలను ఛిద్రం చేస్తాయి. ఆ భయమే కమల మనసును మెలిపెడుతోంది.
****************************
సౌమ్య పుట్టిన కొన్నాళ్లకే కమల భర్త ప్రమాదవశాత్తూ మరణించాడు. తనకున్న డిగ్రీ చదువుతో ఆ కాలంలోనే ఒక ప్రైవేట్ ఉద్యోగాన్ని సంపాదించుకుంది కమల. తన ఒక్కగానొక్క బిడ్డ సౌమ్యను చదివించు కోగలిగింది. సౌమ్య కూడా చక్కగా చదువుకుంది. ఒక కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. హైదరాబాద్‌లో కంపెనీ. ఏడాది పాటు ఇంట్లోనే ఉండి వర్క్ ఫ్రమ్ హోం చేసింది. ఇంతలోనే తెలిసినవాళ్ల ద్వారా సంబంధం కుదిరింది. అబ్బాయి పేరు అజరు. తమ దూరపు చుట్టాలకు బాగా తెలిసినవాడు. అతడికి ముందు, వెనుక ఎవరూ లేరు. బాబాయి సంరక్షణలో పెరిగాడు. అతను కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీరే. సౌమ్య కన్నా నాలుగేళ్లు పెద్దవాడు.. అందగాడు, మంచి జీతగాడు కూడా. అనుకున్నదే తడవుగా అన్నీ చకచకా అమరిపోయాయి. సౌమ్యకు అతగాడితో పెళ్లి చేసి, అతని వెంట హైదరాబాద్ పంపించింది కమల. సిటీలో కాపురం. బిడ్డ కాపురానికి వెళ్లి, రెండు నెలలు కావస్తోంది. ప్రతిరోజూ కూతురికి ఫోన్ చేసి మాట్లాడేది. రెండు మూడు సార్లు హైదరాబాద్ వెళ్ళి, కూతుర్ని చూసొచ్చింది. అల్లుడు మొహమాటస్తుడని, ఆ కారణంగా తనతో కలివిడిగా మాట్లాడడం లేదని అనుకుంది. సౌమ్యలో కూడా పెళ్ళికి ముందున్నంత చలాకీతనం పెళ్లయ్యాక కనబడలేదు. కొత్త కాపురం కదా! చిన్నగా అన్నీ సర్దుకుంటాయిలే అనుకుంది. కానీ కూతురు ఇలా ఒంటరిగా తిరిగి వస్తుందని ఆమె ఎప్పుడూ అనుకోలేదు.
****************************
టిఫిన్ వండుతూ ఉండగా గేటు దగ్గర చెంగన్న వచ్చిన అలికిడి వినబడింది.
‘అమ్మా! అల్లుడిగోరికి తలంటేదానికి వచ్చినాను!’ చెప్పాడు చెంగన్న. కమలకు ఏం చెప్పాలో అర్థంకాలేదు. ఒక్క క్షణం ఆలోచించి, వెంటనే తేరుకుని, ‘అల్లుడుగారు ముఖ్యమైన ఆన్‌లైన్ మీటింగులో ఉన్నారు. ఇప్పుడు తలంటుకోవడానికి సమయం లేదని చెప్పారు..!’ అంటూ అప్పటికప్పుడు తోచిందేదో చెప్పి, చెంగన్నను పంపించేసింది కమల. టిఫిన్ వండడం పూర్తవ్వగానే కూతురు గదికి వెళ్ళింది. చెమ్మగిల్లిన కళ్ళతోనే కనబడింది సౌమ్య.
‘నువ్విలా మౌనంగా ఉంటే ఎలా? నీ సమస్య ఏంటో చెబితేనే కదా నాకు తెలుస్తుంది?’ ఈసారి గట్టిగానే అడిగింది కమల.
‘అమ్మా! ఎవరూ అన్ని విషయాలూ అందరితో చెప్పుకోలేరు. తల్లికి చెప్పుకోలేని సమస్యలు కూడా ఉంటాయి!’ అంతే గట్టిగా బదులిచ్చింది సౌమ్య.
మనకు తెలియని మనుషులు, తెలియని రహస్యాలు ఉండొచ్చు. కానీ, తను కని పెంచిన తన కన్నకూతురి జీవితంలో సైతం తనకు తెలియని, తనతో చెప్పుకోలేని రహస్యాలు ఉంటాయని కమల ఊహించలేదు. ఏమీ మాట్లాడకుండా వంటగదికి వెళ్ళిపోయింది కమల. సౌమ్య మంచంపై వాలి, కళ్ళు మూసుకుని గతంలోకి జారిపోయింది.
****************************
తను కోరుకున్నట్టే అందమైన భర్త, సిటీలో కాపురం. కోటి ఆశలతో అతగాడి వెంట వెళ్ళింది సౌమ్య. ఆ రోజు మొదటి రాత్రి. పాలగ్లాసు అందించి భర్త పక్కన కూర్చుంది.
‘నీకు బారుఫ్రెండ్ ఉన్నాడా?’ గ్లాసు అందుకుంటూ అడిగాడతను. ఆ ప్రశ్నతో సౌమ్య బిత్తరపోయింది. వెంటనే ధైర్యాన్ని తెచ్చుకుని, ‘సరదాగా అడుగుతున్నారా?’ ప్రశ్నించింది.
‘కాదు, సందేహంతో అడుగుతున్నాను!’ బదులిచ్చాడు.
‘సందేహమా?’ అడిగింది.
‘కాదు! అనుమానం’. రెట్టించాడతను.
‘ఎందుకు?’
‘ఇంత అందమైన అమ్మాయిని ఎవడో ఒకడు ప్రయత్నించే ఉంటాడు కదా!’.. అతని మాటతీరులో సరదాతనం, సరళత్వం కనబడలేదామెకు. నీరు నిండిన కళ్ళతో మౌనంగా ఉండిపోయింది. ఆ క్షణమే ఆ గదిలోనూ, సౌమ్య మనసులోనూ చీకట్లు అలుముకున్నాయి. చీకటి ఈ సమస్త ప్రపంచాన్ని దాచిపెట్టగలదు. భరించలేని ఘోరాలను, ప్రశ్నించలేని నేరాలను తనలో నింపుకోగలదు. కన్నీటిని కనబడకుండా చేయగలదు. ఆ రాత్రే కాదు! సౌమ్యకు ప్రతిరోజూ అలాంటి కన్నీటి రాత్రులే!
అతడు ఉదయం ఆఫీసుకు వెళ్ళగానే ప్రశాంతంగా ఫీలయ్యేది. ఆమెది హైదరాబాదులో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్. అతడు సాయంత్రం ఇంటికి వచ్చినప్పటి నుండీ ఏదో ఒకటి అనేవాడు. తన ఫోన్లో కాంటాక్ట్స్ చెక్ చేసేవాడు. లాప్టాప్‌లో తన వాట్సాప్ గమనించేవాడు. తన రాకపోకల గురించి వాచ్మెన్ దగ్గర వాకబు చేసేవాడు. పక్క ఫ్లాట్ వాళ్ళతో, ఎదురు ఫ్లాట్ వాళ్ళతో మాట్లాడవద్దని ఆంక్షలు పెట్టేవాడు. రాత్రుల్లో పడకగదిలో అతని మాటలను, ప్రశ్నలను, చేష్టలను ఆమె భరించలేకపోయేది.
తన కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ రద్దు చేసింది. ఆఫీసుకు వచ్చి పనిచేయాలని చెప్పింది. అదే విషయాన్ని ఆమె అజరుకు చెప్పింది. అతను వద్దన్నాడు. ఆఫీసుల్లో ఆడవాళ్ళ నిర్వాకాలు తనకు తెలుసన్నాడు. ఉద్యోగం మానేసి ఇంట్లో ఉండమన్నాడు. భర్త మంచివాడైతే తాను అలాగే చేసేది. కానీ అజరు లాంటి వాడి కోసం తన కెరియర్‌ను వదులుకోవడం సరైన నిర్ణయం కాదని ఆమెకు అనిపించింది.
‘ఉద్యోగం కావాలా? భర్త కావాలా??’ ప్రశ్నించాడు.
ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక తను పుట్టి, పెరిగిన ఇంటికి చేరుకుంది.
****************************
ఎంతగానో ఆలోచించింది సౌమ్య. బంధాలు బాధలను తేలికపరచాలి. బరువును పంచుకోవాలి. భరోసా కలిగించాలి. కానీ దురదృష్టవశాత్తూ కొన్ని బంధాలు మనకు బాధలను మోసుకొస్తాయి. భరించలేనంత బరువుగా తయారవుతాయి. మన ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తాయి. మన ఆనందాల్ని అడ్డుకుంటాయి. అలాంటి బంధాలను భరించే కొద్దీ, అవి మరింత బరువెక్కుతాయి. మన భవిష్యత్తును బంధిస్తాయి. ఆసరా ఇవ్వని బంధాలకోసం ఆత్మాభిమానాన్ని చంపుకోవడం అవివేకమని అనిపించింది సౌమ్యకు. తన జీవితాన్ని వేరొకరి చేతిలో పెట్టకూడదని, తన సంతోషాలు ఇంకొకరి దయాదాక్షణ్యాలపై ఆధారపడకూడదని మనసులో గట్టిగా నిర్ణయించుకుంది సౌమ్య. ఒక బలమైన నిర్ణయాన్ని తీసుకుంది. తనను బెంగళూరు బ్రాంచ్‌కు మార్చవలసిందిగా హెడ్ ఆఫీసుకు మెయిల్ పెట్టింది. కన్నీళ్లు తుడుచుకుని, చక్కగా స్నానం చేసి, తయారయ్యి హాల్లోకి వచ్చింది. ఆత్మవిశ్వాసంతో వచ్చిన కూతుర్ని చూడగానే కమల ఎంతగానో సంతోషపడింది. తన కూతురు తీసుకునే నిర్ణయం ఏదైనా తనకు మద్దతుగా నిలవాలని అనుకుంది.
‘సౌమ్య! నీ స్నేహితురాలు సిరికి ఫోన్ చేశాను. అన్ని విషయాలు తెలుసుకున్నాను. నువ్వు కళకళలాడుతూ హాయిగా ఉంటే చూడాలన్నదే నా ఆశ! నువ్వు తీసుకునే నిర్ణయానికి నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది.’ చెప్పింది కమల. తల్లి మద్దతు దొరకడంతో సౌమ్య మనసు మరింత తేలికపడింది.
ఇంతలో, ప్రతి సంక్రాంతిలాగే, తమ ఇంటి ముందుకు గొబ్బియలు ఆడే ఆడపడుచులు వచ్చారు. వారిని చూడగానే సౌమ్య పరిగెత్తుకుంటూ వెళ్ళి, వారి బృందంతో కలుసుకుని, పాట అందుకుంది.
‘గొబ్బియాలో
కంచికి పోయే
గాజులశెట్టి గొబ్బియాలో
కంచిలో మాచమ్మ
ఎవరాడబిడ్డ గొబ్బియాలో
సింతాకు రాసేటి
శివుని బారియ గొబ్బియాలో
మరు భూములేలేటి
మంగ మరదాలు గొబ్బియాలో
గాకాకు రాసేటి రాజు కోడలు!’
అంటూ సౌమ్య పాట పాడుతూ ఆ బృందంతో కలిసి గొబ్బెమ్మల చుట్టూ నాట్యం చేస్తుంటే.. కమల మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది.
జీవితంలో ఏర్పడ్డ కష్టాలను, కన్నీళ్లను భోగిమంటల్లో వేసి, సరికొత్త ఆనందాలను, సంతోషాలను ఆహ్వానించడానికి సిద్ధమైన తన బిడ్డ సౌమ్యను చూసి గర్వపడింది కమల. బాధలకు స్వస్తి పలికి, ఆనందాలను ఆహ్వానించడమే భోగి పండగ పరమార్థం కదా!
– పేట యుగంధర్
9492571731