సంకురాతిరికీ.. చందమామా..!

Jan 12,2025 08:50 #Poetry

సరికొత్త సంకురాతిరినై
సందడి చేయాలని.. చందమామా..
వేకువనే పయనమైతి..
సక్కంగ దోవబడితి.. చందమామా..
పొద్దు పొడుపున
తరచి చూస్తి చందమామా..
ఒక్కింటి ముంగిటా ముగ్గులేదు..
ముగ్గులోన పసుపు కుంకుమ..
గొబ్బెమ్మలసలు లేనెలేవు..
గొబ్బిలోన బంతిపూల సొగసు లేదు..
గంగిరెద్దు జాడలేదు..!
అంబరాన్ని తాకే సంబరాల
గాలి పటమ్ములు లేవు..!
సరిసరి సాంకేతికత పెరిగినాదియని
సరిపుచ్చుకుంటి చందమామా..!
సడిచేయకనే.. చల్లగాలి
సన్నగా నిట్టూర్చింది చందమామా..
ఆపై నా పయనంలో..
గడప గడపకి బంతిపూల దండకాడ
ఎన్నెన్నో రంగుపూల చమక్కులు
బంగారు మెరుపుల ప్లాస్టిక్కులు
రారమ్మంటున్న నీరాజనాలన్ని
నా గుండెల్లో గుబులు నింపాయి
చందమామా..!
గడపకే కాదు.. తడవ తడవకూ
కానవచ్చె ప్లాస్టిక్కులు
విశ్వానికే చేటుకాదా చందమామా..!
పల్లె పట్టున వంటలేవీ..!
పంట రాశుల కొట్టమేదీ.!.
రంగు కొమ్ముల పశువులేవీ..!
రంగవల్లుల తీరులోన..
రాతి బండలపై లక్కముగ్గులెట్టి..
రంగుల లోకంలో విహరిస్తూ చందమామా!
రంగుల రాట్నంలా తిరిగి తిరిగి
అలసి సొలసిన మేనుకేది పుష్టి చందమామా..!
అన్నింటా మనకుంటేనే అంతర్‌ దృష్టి
సరియౌను కదా సాగరమేఖల
సరిగమల సృష్టి చందమామా..!

– టి. టాన్య
7095858888

➡️