ఏదీ సం’క్రాంతి’ ?!

Jan 12,2025 08:51 #Poetry

నున్నటి సిమెంటు రోడ్లు తప్ప
పచ్చటి పంటల తివాచీ కనిపించడం లేదు
ఇంటిముందు గచ్చు నేలపై రెడీమేడ్‌ డిజైన్‌ ఆర్ట్‌..
మట్టినేలలు.. పేడ కళ్లాపులు.. పిండి ముగ్గులు..
గొబ్బెమ్మలు.. బంతిపూలు.. పసుపుకుంకులు..
అంతరించిపోతున్న అలంకరణలు..

ఏది కావాలన్న డబ్బెట్టి కొనుక్కోవడమే
ఆప్యాయతలు.. పంచుకోవడాలు లేవు
నా ఇంట్లో నేను నావాళ్లూ తప్ప
అందరూ సమిష్టిగా ఉండలేని పరిస్థితులు
కాస్త సమయం చిక్కితే టీవీలో ఓటిటి సినిమాలు
పలకరింపులు.. ఊరంతా కలయ తిరగడాలు..
ఫోనుల్లో, వాట్సాప్‌లు.. షార్ట్స్‌లోనే..

ముంగిట్లో.. నట్టింట్లో.. ప్లాస్టిక్‌ పూలమొక్కలు..
బంతిపూలు.. చేమంతులు.. కనుమరుగైన వేళ
ఊరంతా బోసిపోయిన జాడలు..
హారు.. హలో.. అంటూ..
షేక్‌ హాండ్లతో విష్‌ చేయడమే అంతా..

హరిదాసుల, గంగిరెద్దుల సందళ్లు లేవు..
యూట్యూబ్‌లో వీడియోలే అన్నీ..
కలిసి వండుకునే పిండివంటలు లేవు..
అరిసెలు.. చక్రాలు.. చెక్కలు..
పట్టుచీరలు.. పరికిణీలు మాయమై..
లెహంగాలు.. టూ మినిట్స్‌ శారీస్‌..
ఏవైనా ఆన్‌లైన్‌లోనే ఆర్డర్లు..

మరో ప్రపంచంలో మనిషి..
మర ప్రపంచంలో యంత్రంతోనే గడపడం..
పండగవేళ.. వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ పనిలో బిజీ..
ఇలాగే వదిలేస్తే.. మోడులే మిగిలేది..

నలుగురితో కలవడం..
నాలుగు మాటలు మాట్లాడటం..
మట్టి వాసన పీల్చడం..
సంఘజీవిగా మొలకెత్తడమే ఇప్పుడు కావాలి..!

– శాంతిశ్రీ
8333818985

➡️