చివరి పేజీ

Apr 27,2025 09:52 #Poetry

బాగా గుర్తు –
ఆ పుస్తకం
ఒక పోటీలో గెలిచినందుకు
క్లాస్‌ టీచర్‌ ఇచ్చిన గిఫ్ట్‌
మనిషి గెలుపులన్నీ రాయబడ్డ పుస్తకం
బాల్యం నుండీ చదువుతున్నాను
పేజీల పేజీల ప్రయాణం
చక్రం కనిపెట్టడానికి
ప్రపంచం పడ్డ పురిటినొప్పులు
నిరీక్షణ అంచున ఆనందాన్ని తడుముకున్న కథలు
ఇంకా, రాత్రుల లోంచి
వేకువలు మొలిచిన జ్ఞాపకాలు
కాళ్ళులేని మనిషిని భుజం మీద ఎక్కించుకుని
శిఖరం వైపు నడుస్తున్న పర్వతం
నా ఆల్‌ టైమ్‌ ఫేవరేట్‌
99 సార్లు నన్ను ఓడించిన గెలుపు
చెవిలో గుసగుసలాడింది
‘నా వ్యతిరేకపదాన్ని కనుక్కున్నావా’ అని
అడ్డంగా తలూపుతూ
ముందుకు సాగాను
ఎక్కువ నేర్చుకున్నదైతే
రెండు వరుస విజయాల విరామంలోనే
ఇప్పుడు నాకు
గెలుపుకి స్పెల్లింగ్‌ పూర్తిగా తెలిసింది
ఉచ్చారణ నోటికొచ్చేసింది
పట్టుబడాల్సిందల్లా దాని అర్థమే
చివరిపేజీకంటా వచ్చేశాను
ఇంకొక్క పేరాగ్రాఫు, అంతే
విజయం యొక్క చివరి మాటలు
ఏమై ఉండొచ్చు?
ఆగకుండా చదువుతున్నాను
చుట్టూ సాయంకాలపు
బ్లాక్‌ అండ్‌ వైట్‌ నీడలు
గమనించలేదు కానీ
కొద్ది కొద్దిగా శరీరం అదృశ్యమైపోతోంది
కాళ్ళూ చేతులూ
ఛాతీ ముఖమూ..
కళ్ళు మాత్రం మిగిలాయి
ఆఖర్న ఒకే వాక్యం,
అదొక్కటి చదివితే చాలు
అదురుతున్న రెప్పలు
కనుపాపల మాట వినడం లేదు
ఐనా సరే –
”గెలుపు మత్తు
మనిషిని ఆయుధం వైపు నడిపించింది
ఆ మలుపు మొదట్లోనే అతడు మరణించాడు”
నా కళ్ళు చీకట్లో కలిసిపోయాయి
తెలుసుకున్నది చెప్పటానికి
ఇప్పుడు నేను లేను!

– సాంబమూర్తి లండ
9642732008

➡️