నేల మీద ఆకుల కల్లాపి

Dec 1,2024 08:05 #kavithalu, #Sneha

ఒక ఆకాశం మీదుగా
మరొక ఆకాశానికి కరుగుతున్నప్పుడు
భయం ఉడుకుతుంది.

కాలపు వాగులో
పిచుక రెక్కలను నాన్పుకొని
అచంచలమైన స్వరాన్ని సవరించుకుంటుంది.

అరణ్యం తగలబడిన తర్వాత
చెట్ల శవాల మీద
మనిషి విహారయాత్రకు పూనుకుంటాడు.

ఒక కొత్త పలుకు పలకడానికి
నిన్నటి పదాన్ని మర్చిపోవాలి.
నాలుకను తెగ్గొట్టుకొని
కుటుంబ జాతరలో
కుయుక్తుల కత్తుల కిందు
మెడను అందివ్వాలి.

రాసిన వాక్యాల మీద మన్ను పోసి
విష గుళికలు చప్పరించాలి.
సంఘటనలు, సందర్భాలు
చేజారిన తర్వాత
ఘనీభవించిన గాయాల నుండి
కన్నీళ్లు తప్పిపోతాయి.

నమ్మకం గుడ్డితనంతో సంసారం చేసి
మూఢనమ్మకాలను కంటుంది
అంధత్వంగా ఎదిగి
పచ్చని సమాజం మీద పురుగై
మనిషి నోటి నుండి నురుగై
మెదులుతుంది.

చెట్లు
నేల మీద ఆకుల కల్లాపి చల్లుతాయి.
అవి భూమిలోకి ఇంకిపోయి,
సంపూర్ణ బలాన్ని ప్రకటిస్తాయి.

చెట్ల లాంటి మనుషులు
ఎక్కడ ఉన్నారు?
నదుల లాంటి గొంతులు ఎక్కడ పారుతున్నాయి?
ఊపిరి ఊదుతున్న చేతులెక్కడీ
మైలబడిన చూపుల్లో,
చూపును పుట్టించిన కన్నుల్లో
స్పటికను ఎవరు నింపుతారు?

ఎవరో ఎందుకు
ఈ కవిత ప్రవహిస్తే చాలదా!?

జాని తక్కెడశిల
7259511956

➡️