కాలేయాన్ని కాపాడుకుందాం..

Apr 13,2025 09:14 #ruchi

కాలేయం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే అవయవాల్లో ప్రధానమైనది. తిన్న ఆహారం జీర్ణం అవ్వాలన్నా, శరీరానికి శక్తి సరిగ్గా అందాలన్నా, విష పదార్థాలు బయటికి వెళ్లాలన్నా లివర్‌ సరిగ్గా పనిచేయాలి. కానీ నేటి పరిస్థితుల్లో మనం తీసుకుంటున్న అనేక ఆహార పదార్థాలు పురుగుమందులతో కూడుకున్నవి. వీటి ప్రభావంతో కాలేయం ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే మంచి ఆహార పదార్థాలతోనే కాలేయ ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. అలాగే జంక్‌ ఫుడ్స్‌ వంటివి కాకుండా మనం తీసుకునే ఆహారంలో చేపలు, ఆకుకూరలు, మెంతులు వంటివి తప్పనిసరి చేసుకోవాలి. వీటితో కొన్ని వెరైటీగా ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.

మెంతుల మొలకల కూర
కావాల్సినవి : మెంతి మొలకలు – ఒక బౌల్‌, ఉల్లిపాయ ముక్కలు- కప్పు పచ్చిమిర్చి -4, నూనె, ఉప్పు, కారం, పసుపు – తగినంత, వెల్లుల్లి రెబ్బలు – 6, కరివేపాకు – రెండు రెబ్బలు, కొత్తిమీర తరుగు – కొద్దిగా, తాలింపు గింజలు – అర స్పూన్‌.
తయారీ: స్టౌ పై పాన్‌ పెట్టి వేడయ్యాక, నూనె పోయాలి. అందులో ముందుగా తాలింపు గింజలు వేసుకుని, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, నిలువుగా చీల్చుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి వేగాక, అందులో కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకోవాలి. మొలకెత్తిన మెంతులు వేసి, వేగనివ్వాలి. మెంతులు కాస్త మగ్గాక కరివేపాకు, కారం, వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అవి వేగాక చివరిలో కొత్తిమీర తరుగు వేసి దింపేసుకోవాలి. అంతే మెంతుల మొలకల కూర రెడీ! మెంతులు జీర్ణక్రియ ఎంతగానో తోడ్పడతాయి.

సాల్మన్‌ చేపల పులుసు..
కావాల్సినవి : చేపలు – కిలో, ఉప్పు -స్పూన్‌, పసుపు – స్పూన్‌, నూనె – స్పూన్‌, చింతపండు – నిమ్మకాయ సైజు, కొత్తిమీర తరుగు – కొద్దిగా, జీలకర్ర – 1/2 స్పూన్‌, మెంతులు – అర స్పూన్‌, దాల్చిన చెక్క – అంగుళం, లవంగాలు – 5, యాలకులు – 2, ధనియాలు – స్పూన్‌, నూనె – రెండు స్పూన్లు, ఆవాలు – స్పూన్‌, పచ్చిమిర్చి- 8, ఉల్లిపాయలు – రెండు, కరివేపాకు – 2 రెమ్మలు, అల్లంవెల్లుల్లి పేస్ట్‌ – స్పూన్‌, కారం – 3 స్పూన్లు.
తయారీ : చేప ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకుని ఉప్పు, పసుపు, నూనె వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా అరగంటసేపు ఉంచాలి. స్టౌ మీద పాన్‌ పెట్టుకుని ధనియాలు, జీలకర్ర, మెంతులు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి, సన్నని మంటపై వేయించుకోవాలి. చల్లారాక మెత్తగా మిక్సీపట్టాలి. స్టవ్‌ మీద వెడల్పాటి గిన్నె పెట్టుకుని నూనె పోసి, వేడిచేయాలి. తర్వాత ఆవాలు, చీల్చిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగు, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. రెండు నిమిషాలు వేగాక కారం, పసుపు వేయాలి. ఇందులో చింతపండు రసం పోసుకుని రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఐదు నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత చేప ముక్కలను వేసుకుని, పది నిమిషాలు ఉడికించాలి. మధ్యలో గరిటె పెట్టకుండా ముక్కలు కదిలేలా తిప్పాలి. వెంటనే మసాలా పొడి వేసి, రెండు నిమిషాలు ఉడికిస్తే ముక్కలకు పట్టి, రుచిగా ఉంటుంది. చివరగా కొత్తిమీర తరుగు వేసుకుంటే సరి.

బచ్చలికూర పచ్చడి..
కావాల్సినవి : బచ్చలికూర కట్టలు – 3, ఎండుమిర్చి – 15, పచ్చిమిర్చి – 5, చింతపండు – ఉసిరికాయంత, ఆవాలు – స్పూన్‌, జీలకర్ర – స్పూను, శనగపప్పు – స్పూను, ధనియాలు – స్పూను, మెంతులు – స్పూను, ఉప్పు – రుచికి తగినంత, నూనె – మూడు స్పూన్లు.
తయారీ: స్టౌపై గిన్నె పెట్టుకొని, స్పూను ఆయిల్‌ వేసి, వేడయ్యాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ధనియాలు, మెంతులు ఒకదాని తర్వాత ఒకటి వేసి దోరగా వేయించి, ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే గిన్నెలో మిగిలిన నూనె వేసి, వేడి చేసుకోవాలి. బచ్చలికూర తరుగు, చింతపండు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. బచ్చలికూర బాగా వేగిందనుకున్నాక దింపేసి, చల్లారనివ్వాలి. మిక్సీ జార్‌లో వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, బచ్చలికూర, తగినంత ఉప్పు వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్‌ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన బచ్చలికూర పచ్చడి రెడీ!. విటమిన్లు ఎ, సి, ఇ, కె, క్యాల్షియం, ఫొలేట్‌, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, మాంగనీస్‌ బచ్చలికూరలో పుష్కలంగా లభిస్తాయి.

 

➡️