క్యాన్సర్ ఒకప్పుడు మహమ్మారి. అదేంటో కూడా తెలియని స్థితి. నేడు క్యాన్సర్ జయించే స్థితిలోకి వచ్చాం. ఇది ఒకరకంగా వైద్యరంగంలో పెద్ద విజయంగా పేర్కొనవచ్చు. అయితే ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరంగా ఉన్నదనేది అంతే వాస్తవం. అదే సందర్భంలో నేడు ఎక్కువమందిలో కనిపిస్తుండటం ఆందోళనకరం. మనదేశంలో క్యాన్సర్ ప్రమాదకర స్థాయిలో ఉందనేది గణాంకాలు చెప్తున్నాయి. ఇప్పుడు క్యాన్సర్ నియంత్రణలో అధునాతన పద్ధతులు ఎన్నో వచ్చాయి. ఇంకా చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. రోబోటిక్స్ వంటి టెక్నాలజీతో కూడా నివారించే పద్ధతుల్లో అందుబాటులోకి రావడం ఆశాజనకం. ఇంకా వైద్యరంగంలో మరింత పురోగతి సాధించటానికి కృషి కొనసాగుతూనే ఉంది. ఈ నెల 7వ తేదీన ‘జాతీయ క్యాన్సర్ అవగాహన’ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
క్యాన్సర్ నానాటికీ వృద్ధి చెందుతుండటంతో మరణమృదంగంలా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే గడిచిన రెండు దశాబ్ధాలలో క్యాన్సర్ మరణాలు పెరుగుతున్నాయి. 2026 నాటికి మనదేశంలో ఏటా 20 లక్షలమంది క్యాన్సర్‌తో మరణిస్తారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2015లో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 90.5 మిలియన్ల మందికి క్యాన్సర్ వచ్చింది. 2019లో 23.6 మిలియన్లకు ఆ సంఖ్య మరింత పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే 10 మిలియన్ల మరణాలు సంభవించాయి. ఇది గత దశాబ్ధంలో వరుసగా 26 శాతం పెరుగుదలను సూచిస్తోంది. మొత్తంమీద చాపకింద నీరులా యావత్ ప్రపంచాన్నే చుట్టేస్తున్న క్యాన్సర్‌పై మానవుడు నిత్యం పోరాడుతూనే ఉన్నాడు. మరో ఆందోళనాకరమైన విషయం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా చిన్నారులు సైతం లక్షల్లో క్యాన్సర్ భారినపడటం. ప్రపంచ వ్యాప్తంగా 2023లో సుమారు కోటి మంది వరకు క్యాన్సర్ బారిన పడి మరణించారు. 2024లో ఆ సంఖ్య ఇంకా పెరిగింది. అంటే ప్రతిరోజూ సుమారు 26 వేల మంది వరకూ ప్రాణాలు కోల్పోతున్నారనేది ఒక అంచనా. మనదేశంలో తాజాగా కొత్తగా 20 లక్షల క్యాన్సర్ కేసులు నమోదువుతున్నాయని అంచనా. నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రేషన్ ప్రకారం 2022లో 14 లక్షల మంది బారినపడ్డారు. అంటే సరాసరిన ప్రతి తొమ్మిది మందిలో ఒక్కరు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. 2025 కల్లా మనకి ఈ క్యాన్సర్ అనేది సగటున 12 శాతం పెరిగే అవకాశం కనబడుతోందని గణాంకాలను బట్టి తెలుస్తోంది.
ఎందుకొస్తుందంటే..
మనిషి శరీరం మొత్తం కణజాణంతో నిండి వుంటుంది. అయితే శరీరంలో ఎక్కడైనా కణజాలం అవసరం లేకుండా విపరీతంగా పెరిగిపోవటమే క్యాన్సర్. మామూలుగా శరీరంలో కణాల విభజన జరుగుతుంది. ఇలా ప్రతి కణం విభజనకు గురై పుడుతూ, చనిపోతూ ఉంటాయి. శరీరంలో ఇలాంటి ప్రక్రియకు విఘాతం ఏర్పడితే కొన్ని కణాలు చనిపోకుండా అలాగే ఉండిపోతాయి. కణాల్లో ఉండే డీఎన్‌ఏలో మార్పుల వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతుంది. డీఎన్‌ఎల వల్ల తల్లిదండ్రుల్లో ఉండే లక్షణాలే పిల్లలకు కూడా వస్తాయనే విషయం తెలిసిందే. అలాగే క్యాన్సర్ కూడా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. ఆహారపు అలవాట్లు, రేడియేషన్, పొగ తాగటం, ఊబకాయం తదితర కారణాలతో కూడా డీఎన్‌ఏలో మార్పులు వస్తాయి. దీనివల్ల కణాలు చనిపోకుండా అలాగే ఉండిపోతాయి. ఫలితంగా శరీరానికి అవసరమైన కణాలు కంటే ఎక్కువ వృద్ధి చెందుతాయి. అవన్నీ ట్యూమర్ (కణితి) గా ఏర్పడతాయి. దాన్నే క్యాన్సర్ అంటారు. పురుషుల్లో ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సరు, స్త్రీలలో ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సరు, చిన్న పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్ (లుకేమియా) అనే కారకాల వల్ల మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. క్యాన్సర్ అనేది ఇటీవల చాలా ఎక్కువగా కనిపిస్తుంది. పదేళ్ల కిందటి వరకు గుండె సంబంధిత మరణాలు ఎక్కువగా సంభవించేవి. కానీ ప్రస్తుతం క్యాన్సర్ వల్ల ఎక్కువ మరణాలు నమోదవుతున్నాయి.
క్యాన్సర్ రహిత కణితితో ప్రమాదం లేదు..
కణితులు రెండు రకాలుగా ఏర్పడతాయి. క్యాన్సర్ రహిత కణితి వల్ల ప్రమాదం ఉండదు. ఇది శరీరం ఒక చోట మాత్రమే పెరుగుతుంది. తొలగించిన తర్వాత మళ్లీ రాదు. అయితే క్యాన్సర్ కణితి మాత్రం రక్తం ద్వారా ఇతర కణాలకు సైతం వ్యాప్తి చెందుతుంది. దీంతో శరీరంలోని ఇతర భాగాల్లో కూడా క్యాన్సర్ కణితులు ఏర్పడతాయి. అలసట, శ్వాస తీసుకోవటంలో సమస్యలు, చర్మంలో గడ్డలు ఏర్పడటం, శరీరం బరువులో మార్పులు, చర్మం రంగు మారడం, దీర్ఘకాలికంగా దగ్గు వేధించటం వంటి సమస్యలను క్యాన్సర్ లక్షణాలుగా గుర్తించొచ్చు. అయితే శరీరంలో ఏర్పడే వివిధ రకాల క్యాన్సర్లకు వివిధ లక్షణాలు కన్పిస్తుంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, కొలోన్ లేదా రెక్టం క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్ వంటి క్యాన్సర్లు వస్తుంటాయి. నిపుణులైన డాక్టర్లను సంప్రదించటం ద్వారా వారిచ్చే వైద్యసేవలతో క్యాన్సర్లను నియంత్రించొచ్చు.
అధునాతన వైద్యంతో నియంత్రణ…
ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే క్యాన్సర్ నియంత్రణ పద్ధతుల్లో అధునాతనమైనవి అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం రోబోటిక్ పద్ధతిలో కూడా క్యాన్సర్ కారకాలను గుర్తించి, నియంత్రణ చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) పిలుపునిచ్చిన విధంగా 2024లో ‘క్యాన్సర్ నియంత్రణలో ఆటంకాలను అధిగమిద్దాం’ (క్లోజ్ ది కేర్ గ్యాప్) థీమ్ మేరకు ప్రపంచవ్యాప్తంగా కృషి జరుగుతోంది. మనదేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతుండటం ఒక ఎత్తయితే వీటిలో అత్యంత సాధారణంగా కనిపించే క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్, తల, మెడ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, అండాశయ క్యాన్సర్లు ఉన్నాయి.
పొగాకు ఉత్పత్తుల వాడకం, ఒబేసిటీ (స్థూలకాయం), కుటుంబ చరిత్ర, క్రమం తప్పిన జీవనశైలి అనేవి చాలా రకాల క్యాన్సర్లకు సాధారణ కారణాలుగా పరిగణించబడుతున్నాయి. రసాయన చికిత్స (కీమోథెరపీ) క్యాన్సర్ చికిత్సలో కీలక భాగంగా ఉన్నప్పటికీ, లక్ష్యిత చికిత్స, ఇమ్యూనోథెరపీ వంటి ఆధునిక చికిత్సా విధానాలు, క్యాన్సర్ సంరక్షణలో సర్వైవల్ రేటును మెరుగుపరచడం ద్వారా అత్యంత ప్రభావవంతమయ్యాయి.
మెరుగైన జీవనశైలితో మార్పులు…
ఎంత ఉరుకులు, పరుగుల జీవితాన్ని గడుపుతున్నా ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అనారోగ్యం భారినపడకుండా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవాలి. శరీరానికి తగినంత విశ్రాంతి ఉండాలి. ఒత్తిడి లేని జీవితాన్ని గడపాలి. ఏదీ అతిగా చేయకూడదు.. తినకూడదు.. తాగకూడదు. మనలో చాలామంది ఆకలి వేసినప్పుడు కడుపు నింపుకోవటానికి ఏది అందుబాటులో ఉంటే అది తినేస్తుంటారు. అందులోనూ కనబడిన స్నాక్స్‌ను లాగించేస్తుంటాం. మరీ ముఖ్యంగా ప్రాసెసింగ్ చేసిన ఆహారాన్ని, వేపుళ్లను (ఫ్రెంచ్ ఫ్రైస్, నూడిల్స్) లాంటివి తినేస్తుంటాం. బయట దొరికే ఇలాంటి ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఉప్పు, చక్కెర వాడుతుంటారు. అందువల్ల వీటిని ఎక్కువగా తీసుకుంటే ఇబ్బందులు ఏర్పడతాయి. వీటికి బదులుగా తాజా పండ్లు, కూరగాయలు వంటివి ప్రత్యామ్నాయంగా తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. పొగాకు ఉత్పత్తులను వాడకూడదు. ప్రతిరోజూ క్రమపద్ధతిలో వ్యాయామం చేస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి.
గుర్తించేందుకు పరీక్షలు..
స్క్రీనింగ్ ద్వారా లక్షణాలు లేకపోయినా క్యాన్సర్‌ను గుర్తించొచ్చు. ఉదాహరణకు రొమ్ము క్యాన్సర్ 40 ఏళ్లు పైబడిన మహిళల్లో మ్యామోగ్రామ్ ద్వారా గుర్తించొచ్చు. గర్భాశయ ముఖద్వార కాన్సర్‌ను పాప్స్మియర్ అనే పరీక్ష ద్వారా గుర్తించొచ్చు. చాలా క్యాన్సర్లు ప్రారంభ దశలో గుర్తిస్తే నయం చేయగలిగేవి మాత్రమే ఉంటాయి. వ్యాక్సిన్ ద్వారా కొన్ని క్యాన్సర్లను నియంత్రించొచ్చు. ఉదాహరణకు గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ 9-26 సంవత్సరాల వయస్సులో ఉన్న మహిళలకు హెచ్‌పివి వ్యాక్సిన్ ద్వారా నివారించొచ్చు.
ఇమ్యునోథెరపీ మేలు…
నిర్దేశిత చికిత్స, ఇమ్యూనోథెరపీ వంటి ఆధునిక చికిత్సా పద్ధతులు, కీమోథెరపీ కన్నా తక్కువ దుష్ప్రభావాలు కలిగి ఉంటాయి. మరింత మెరుగైన సర్వైవల్ రేటు అందిస్తాయి. టార్గెటెడ్ థెరపీ ద్వారా కూడా చికిత్సలు చేయొచ్చు. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదల, వ్యాప్తిని నిరోధించడానికి ప్రత్యేక ప్రోటీన్లను లక్ష్యంగా చేసుకుని చేసే చికిత్స.
టార్గెటెడ్ చికిత్స ద్వారా ఊపిరితిత్తులు, రొమ్ము, అండాశయ, జీర్ణకోశ, ప్రేగు, ఇతర అనేక క్యాన్సర్లకు ముఖ్యంగా ప్రాథమిక, ఆ తర్వాత దశల్లో చికిత్స చేయొచ్చు. ఇమ్యునోథెరపీ ద్వారా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి, క్యాన్సర్‌తో పోరాడే చికిత్స. ఇది శస్త్రచికిత్సకు ముందు, తరువాత కూడా ఉపయోగించొచ్చు. ముదిరిన దశలో ఉన్న ఘన కణజాల క్యాన్సర్లకు కూడా ప్రభావవంతంగా ఉంటుంది. తరచుగా స్క్రీనింగ్, ముందు జాగ్రత్తలు, సమర్థవంతమైన చికిత్స క్యాన్సర్ బాధితుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి కీలకంగా ఉంటాయి.
నివారణ వైద్యం కన్నా మేలైంది..
రక్త క్యాన్సర్ : తెల్ల రక్తకణాలు, రక్త ఫలకాలు, ఎర్ర రక్త కణాలను ప్రభావితం చేసే క్యాన్సర్లు.
రక్త క్యాన్సర్ రకాలు
మొత్తం మూడు రకాల రక్త క్యాన్సర్లు ఉంటాయి:
1. లుకేమియా (తెల్ల రక్త కణాలు)
2. లింఫోమా (లింఫ్ నోడ్లు)
3. మల్టిపుల్ మైలోమా (ప్లాస్మా కణాలు)
లుకేమియా నిర్ధారణ
– లుకేమియాను ఎముక మజ్జ పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు.
– లింఫోమాలను లింఫ్ నోడ్ బయోప్సీ, పెట్ సిటి ద్వారా నిర్ధారిస్తారు.
– మల్టిపుల్ మైలోమాను రక్తపరీక్షలు, ఎముక మజ్జ పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు.
లక్షణాలు
తరచుగా జ్వరాలు, చిగుర్ల నుండి రక్తస్రావం, తరచుగా రక్తస్రావం, బరువు తగ్గడం, లింఫ్ నోడ్లు వాపు.
చికిత్సా విధానాలు
కీమోథెరపీ, ఎముక మజ్జ మార్పిడి (బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్).
ఎముక మజ్జ మార్పిడి ఏమిటంటే?
స్టెమ్ కణాలను రోగి రక్తనాళాల్లో ప్రవేశపెట్టి, ఎముక మజ్జను ఉద్దీపన చేసి కొత్త కణాలను ఉత్పత్తి చేయడం.
ఎముక మజ్జ మార్పిడి రకాలు
ఆటోలోగస్ మార్పిడి – రోగి స్వంత స్టెమ్ కణాలను ఉపయోగించడం.
అలోజెనిక్ మార్పిడి – కుటుంబ సభ్యులు లేదా ఇతర దాతల నుండి స్టెమ్ కణాలను రోగి శరీరంలో ప్రవేశపెట్టి చేయడం.
స్టెమ్ సెల్ థెరపీ ప్రయోజనాలు ఏమిటంటే
ఇది మల్టిపుల్ మైలోమా, పునరావృత లుకేమియా, లింఫోమాలకు పూర్తి ఆరోగ్యవంతమైన చికిత్సను అందిస్తుంది.
రోబోటిక్స్ పద్ధతిలో చికిత్సలు..
క్యాన్సర్‌ను జయించగలమనే నిజమైన ఆశను కల్గిస్తూ రోగుల్లో మనుగడ, జీవ నాణ్యతను మెరుగుపడుతున్నాయి. ఇందుకోసం రోబోటిక్ సర్జికల్ టెక్నికల్ క్యాన్సర్ చికిత్సలు ప్రపంచవ్యాప్తంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి. నేడు క్యాన్సర్ చికిత్సా పద్ధతుల్లో రోబోటిక్స్ విధానం దేశంలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతోంది. క్యాన్సర్ చికిత్సలు సాధారణంగా సాంప్రదాయకంగా ఓపెన్ టెక్నిక్‌ల ద్వారానే జరుగుతాయి. ఓపెన్ సర్జరీతో పెద్ద గాయం కల్గించటంతోపాటు ఆలస్యంగా కోలుకోవటం, సాధారణ కార్యకలాపాలకు తిరిగి రావడంలో జాప్యం వంటి సమస్యలు ఉంటాయి. లాప్రోస్కోపిక్ శస్త్ర చికిత్స పెద్దప్రేగు, ఎండోమెట్రియల్, అన్నవాహిక క్యాన్సర్‌తో సహా కొన్ని క్యాన్సర్‌లకు సాధ్యమయ్యే చక్కటి, సురక్షితమైన ఎంపికగా చెప్పొచ్చు. అయితే 2-డైమెన్షనల్ చిత్రాన్ని మాత్రమే చూడగలగడం, పరిమిత కదలికలతో కూడిన సాధనాలు, కెమెరా పట్టుకోవడానికి శిక్షణ పొందిన సహాయకుడిపై ఆధారపడాల్సి రావటం ద్వారా ఆ విధానానికీ పరిమితులు ఉన్నాయి. రోబోటిక్ సర్జరీలో సర్జనే స్వయంగా నియంత్రించగలిగే హై డెఫినిషన్ కెమెరా మాగ్నిఫైడ్ 3-డైమెన్షనల్ వీక్షణను అందిస్తుంది. విపరీతమైన స్వేచ్ఛతో కదిలే సాధనాలు (ఎండో-రిస్ట్), ఇరుకైన ప్రదేశాల్లో, క్యాన్సర్లను చేరుకోవడం కష్టంగా ఉండే ప్రదేశాల్లో, ఓపెన్ లేదా లాపరోస్కోపిక్ పరికరాలతో అసాధ్యమైన కోణాల్లో పరికరాలను ఉపయోగించటానికి సర్జన్‌ను అనుమతిస్తుంది. సర్జన్ వేళ్ల కదలికల నిష్ఫత్తిలో పరికరం కదిలేలా దాని కదలిక స్థాయిని తగ్గించటానికి మోషన్ స్కేలింగ్ సర్జన్‌ను అనుమతిస్తుంది. ఇది ఎక్కువ ఖచ్చితత్వాన్ని అనుమతిస్తుంది. మెరుగైన విజువలైజేషన్‌ను అందించటం ద్వారా నరాలు, ఇతర సంక్లిష్ట నిర్మాణాలను సంరక్షించటంతోపాటు రోబోటిక్ టెక్నిక్‌లు, రాడికల్ ఆపరేషన్‌కు వెసులుబాటు కల్గిస్తాయి. పురుషనాళ, గైనకాలజీ, ప్రొస్టేట్ క్యాన్సర్ శస్త్ర చికిత్సల్లో ఇది చాలా ముఖ్యమైంది.
ఉపయోగాలు…
క్యాన్సర్ రోగికి నొప్పి గణనీయంగా తగ్గుతుంది.
క్యాన్సర్ కణజాలాన్ని ఖచ్చితంగా తొలగించొచ్చు.
తక్కువ రక్త నష్టం జరుగుతుంది.
మచ్చలు కూడా తక్కువగానే ఏర్పడతాయి.
రోగి ఆసుపత్రిలో ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం లేదు.
రోగి రోజువారీ సాధారణ కార్యకలాపాలను తిరిగి వేగంగా ప్రారంభించొచ్చు.
ఓపెన్ సర్జరీకి సమానమైన వేగంతో క్యాన్సర్ నివారణ.
కణితులను మినహాయిస్తే మిగతా ఆచరణాత్మకంగా అన్ని క్యాన్సర్లు ఈ విధానానికి అనుకూలంగా ఉంటాయి.
ట్రాన్స్ ఓరల్ రోబోటిక్ సర్జరీ..
ఇది ప్రత్యేకంగా తల, మెడ క్యాన్సర్ ఉన్న రోగుల కోసం రూపొందించబడింది. ఇది మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ. నోటి ద్వారా రోబోటిక్ పరికరాలను చొప్పించి, నియంత్రిస్తారు. శరీరంపై కోతలు అవసరం లేదు. దీనికి విరుద్ధంగా, సంప్రదాయ ఓపెన్ సర్జరీకి గొంతు, దవడ దగ్గర పొడవుగా కోయాల్సి రావడంతో, రోగులపై తరచుగా మచ్చలు కనిపించటానికి, శ్వాస తీసుకోవడంలో లేదా మింగడంలో ఇబ్బంది కలగడానికి, కోలుకోవడానికి సుదీర్ఘకాలం పడుతుంది. రోబోటిక్స్ సర్జరీ ద్వారా రోగి వేగంగా కోలుకుని, మామాలుగా మారిపోతారు. ఓరల్ రోబోటిక్ సర్జరీని గొంతు క్యాన్సర్, నాలుక క్యాన్సర్, గవదల క్యాన్సర్ నియంత్రించటానికి ఉపయోగిస్తుంటారు.
బాధితులకు చిత్రసీమ అండ…
సాధారణంగా వివిధ రకాల క్యాన్సర్ బాధితుల్లో మరణాలు ఎక్కువగా చోటుచేసుకుంటాయి. చనిపోతామని తెలిసిన సినీ అభిమానులు తమ అభిమాన హీరోలను ఒక్కసారైనా చూసి కనుమూయాలని భావిస్తుంటారు. అలాంటి కోరికలను అభిమానులు కోరితే సినీ హీరోలు మానవతా దృక్పథంతో స్పందించి, స్వయంగా పరామర్శించి ఓదార్చుతుంటారు. తమవంతుగా వారు కోలుకోవటానికి ఆర్థిక సహాయం చేస్తుంటారు. అందుకు నిదర్శనాలు చాలానే ఉన్నాయి.
ఏపీకి చెందిన టీటీడీలో కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసులు, సరస్వతి దంపతుల పెద్ద కుమారుడు కౌశిక్ (19). కౌశిక్‌కు బ్లడ్ క్యాన్సర్ 2022 నుంచీ చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఆ యువకుడు బెంగళూరులోని కిడ్‌వై ఆస్పత్రిలో ఇన్ పేషెంట్‌గా ఉన్నాడు. తాను ఎప్పుడు చనిపోతానో తెలియదని, తారక్ ‘దేవర’ సినిమా విడుదలయ్యే వరకూ.. అంటే సెప్టెంబర్ 27వ తేదీ వరకు తనను బతికించాలని డాక్టర్లను వేడుకున్నాడు. ఈ విషయం తెలిసిన జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాలు ఈ వార్తను ”ఎక్స్”లో పోస్టు చేశారు. ఎన్టీఆర్ వెంటనే స్పందించారు. కౌషిక్‌కి వీడియో కాల్ చేసి మాట్లాడారు. ‘నువ్వు త్వరగా కోలుకోవాలి.. మనం మళ్లీ కలవాలి.. నువ్వు ధైర్యంగా బయటికి రావాలి.. అమ్మనాన్నలను బాగా చూసుకోవాలి’ అంటూ అభిమానికి ధైర్యం చెప్పారు. తన అభిమాన హీరో వీడియో కాల్ చేసి మాట్లాడటంతో.. కౌశిక్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎన్టీఆర్ చేసిన ఈ పనికి అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. వైద్య ఖర్చుల కోసం దాదాపు రూ.60 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలపడంతో.. ఎన్టీఆర్ అభిమానులు తమ వంతుగా సాయం చేశారు.
గతంలో కూడా క్యాన్సర్‌తో బాధపడుతున్న వీరాభిమాని నాగార్జునను కూడా పరామర్శించారు. నాగార్జున మృత్యువుతో పోరాడుతూ తన చివరికోరికగా జూనియర్ ఎన్టీఆర్‌ను కలవాలనుకున్నాడు. విషయాన్ని తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ కేరళ షుటింగ్‌ను కూడా వాయిదా వేసుకుని, అభిమానిని పరామర్శించేందుకు వెళ్లారు. ఆ సందర్భంగా నాగార్జున కుటుంబానికి వ్యక్తిగతంగా సహాయం చేస్తానని ఎన్టీఆర్ హామీ ఇచ్చారు.
హీరో బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎందరో పేద ప్రజలకు ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్నారు. అంతేకాదు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఒక అమ్మాయికి ఆయన సొంత ఖర్చులతో వైద్యాన్ని చేయించారు. అనంతపురం జిల్లాకు చెందిన ఇంటర్ విద్యార్థిని బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న నేపథ్యంలో ఆపరేషన్‌కిగాను 10 లక్షల కంటే ఎక్కువ ఖర్చవుతుంది అని డాక్టర్లు చెప్పారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బాలయ్య ఆ అమ్మాయి తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆ అమ్మాయిని హాస్పిటల్లో చేర్పించి, వైద్యాన్ని అందించారు.
అభిమానులను, సినీ కార్మికులను రక్షించేందుకు మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందే ఉంటారు. స్టార్ క్యాన్సర్ సెంటర్‌తో కలిసి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా వెయ్యిమందికి పైగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయించారు. హైదరాబాద్, వైజాగ్ నగరాల్లో ఉచితంగా వైద్య పరీక్షలు చేయడమే కాకుండా, చికిత్సకయ్యే ఖర్చులోనూ తాను కొంత భరిస్తున్నారు.
నటి హంసానందిని తల్లి కూడా గతంలో క్యాన్సర్‌తో బాధపడింది. తానూ క్యాన్సర్‌ను జయించింది. రొమ్ము క్యాన్సర్ బారిన పడి మరణించిన తన తల్లి పేరు మీద ‘యామినీ క్యాన్సర్ ఫౌండేషన్’ను నెలకొల్పారు. దీనిద్వారా ఎంతోమందికి వైద్యం చేయిస్తూ, అండగా నిలబడ్డారు. అభిమానులే కాదు అభిమానులను మేమూ అభిమానిస్తాం, ప్రేమిస్తామని మన సినీనటులు తెలియజేస్తున్నారు.
డాక్టర్ సాయికృష్ణ కొల్లూరు
అమెరికన్ అంకాలజీ ఇనిస్టిట్యూట్, కానూరు, విజయవాడ.
MD, DM, ECMO (UK),
MRCP (UK-Med.Onco)
Consultant-Medical, Paediatric Haemato-Oncology & BMT
Cell : 9121816902
[email protected]
సేకరణ : యడవల్లి శ్రీనివాసరావు