అనుభవం ప్రత్యేకం.. ఐక్యంగా అధిగమిద్దాం..

ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్‌ కేసుల పెరుగుదలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) కి చెందిన ఇంటర్నేషనల్‌ ఏజెన్సీ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ క్యాన్సర్‌ (ఐఎఆర్‌సి) కీలక హెచ్చరికలు జారీ చేసింది. 2022 నాటికి ప్రపంచంలో రెండు కోట్ల కేసులు నమోదు కాగా.. 2050 ఏళ్లనాటికి కొత్తగా మరో 3.5 కోట్ల మందికి ఇది వచ్చే అవకాశముందని అంచనా. 2022తో పోల్చితే 77 శాతం కొత్త కేసులు నమోదవుతాయని తెలిపింది. దీనికి పొగాకు, మద్యం, ఊబకాయం, వాయుకాలుష్యమే ప్రధాన కారణాలుగా పేర్కొంది. దీని ప్రభావం జనాభా పెరుగుదల, వృద్ధాప్యంపైనా పడుతుందని చెప్పిన ఐఎఆర్‌సి అభివృద్ధి చెందిన దేశాల్లో మరింత ప్రభావం ఉంటుందని తెలిపింది. ఈ దేశాల్లో 2022 లెక్కలతో పోలిస్తే అదనంగా 48 లక్షల కేసులు నమోదయ్యే అవకాశముంది. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్‌ భారాన్ని తగ్గించడానికి అందరికీ అవగాహన కల్పించటం, నివారణకు ప్రోత్సహించటం ఈ దినోత్సవం లక్ష్యం. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం.

ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవం 2025-2027 థీమ్‌ ఖచీ×ుజుణ ద్‌ీ ఖచీ×Qఖజు. ఇది ప్రజల-కేంద్రీకృత క్యాన్సర్‌ సంరక్షణ. విభిన్న కోణాలను, వైవిధ్యాన్ని సృష్టించే కొత్త మార్గాలను అన్వేషిస్తుంది. అవగాహన పెంపొందించడం నుండి చర్య తీసుకోవడం వరకూ మూడేళ్ల పాటు నిరంతర కృషి కొనసాగుతుంది.
మానవ శరీరం లక్షల కోట్ల కణాల (సెల్స్‌) తో నిర్మితమైనది. శరీరంలో పెరుగుతున్న కణాలు నియంత్రణ కోల్పోయి, ఒక గుంపు మాదిరిగా మారతాయి. వీటిని ట్యూమర్‌గా పిలుస్తారు. ఇది కణజాలాల సమూహం అని చెప్పొచ్చు. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మెలిగట్‌ ట్యూమర్‌, మరోటి బినైన్‌ ట్యూమర్‌. మొదటి మెలిగట్‌ ట్యూమర్‌ చాలా ప్రమాదకరం. ఎందుకంటే దానిని క్యాన్సర్‌ వ్యాధి అని అంటారు. బినైన్‌ ట్యూమర్‌ అలా కాదు. ఇది అలా వ్యాపించదు. పక్క టిష్యూస్‌పై దాడి చేయదు. అప్పుడప్పుడూ పెద్దవిగా మారతాయి. వీటిని ఆపరేషన్‌ చేసి, తీసివేస్తే మళ్లీ పెరగవు.
క్యాన్సర్‌ మరణాలను తగ్గించడంలో ఆధునిక చికిత్స ఒక్కటే సరిపోదని అమెరికా శాస్త్రవేత్తల పరిశోధన తేల్చింది. నివారణ, స్క్రీనింగ్‌లో పురోగతి వల్ల బాధితుల ప్రాణాల్ని కాపాడొచ్చని వెల్లడించింది. ఐదు రకాల క్యాన్సర్లపై జరిగిన పరిశోధనలో ఇది నిర్ధారణ అయింది. ఆధునిక చికిత్సలతో పోలిస్తే, 45 ఏళ్లలో నివారణ, స్క్రీనింగ్‌ కారణంగానే ఎక్కువ ప్రాణాలను కాపాడగలిగినట్లు తేల్చారు. అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌ (ఎన్‌ఐహెచ్‌) కు చెందిన శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ఈ పరిశోధన జరిగింది. రొమ్ము, సర్వైకల్‌, పెద్దపేగు, ఊపిరితిత్తులు, ప్రొస్టేట్‌ క్యాన్సర్లు మొత్తం క్యాన్సర్‌కారక మరణాల్లో దాదాపు 50 శాతంగా ఉన్నాయి. వీటి నివారణకు, ఆరంభంలోనే గుర్తించడానికి, తగిన చికిత్సా విధానాలు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. ఈ ఐదు రకాల క్యాన్సర్ల వల్ల 1975 నుంచి 2020 మధ్య 59.4 లక్షల అకాల మరణాలను నిరోధించగలిగినట్లు ఈ పరిశోధనలో తేలింది.

రాష్ట్రంలో పెరుగుదల..
మన రాష్ట్రంలో క్యాన్సర్‌ బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ వైద్య సేవ (ఆరోగ్యశ్రీ) ద్వారా చికిత్సలు పొందేవారు 15 ఏళ్లలో 70 శాతం పెరిగారు. 2009-10లో 27,097 మంది, 2024-25లో (నవంబరు వరకు) 46,223 మంది ఉన్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు కింద ఏటా సగటున 45-50 వేల క్యాన్సర్‌ కేసులు కొత్తగా నమోదవుతున్నాయి. క్యాన్సర్‌ బాధితుల్లో మహిళలే ఎక్కువ. వీరిలో బ్రెస్ట్‌, సర్వేకల్‌, ఊపిరితిత్తులు, పెద్దపేగు క్యాన్సర్లు ఎక్కువగా చూస్తుంటాం. 2009-10లో 67,218 కేసులు నమోదు కాగా, 2024-25లో (నవంబరు వరకు) 2,22,605 వచ్చాయి. పురుషులకు ఎక్కువగా తల, మెడ (నోరు, గొంతు, ఇతర), ప్రొస్టేట్‌, ఊపిరితిత్తులు, పొట్ట (చిన్నపేగు, ఇతర), పురుషాంగం, పెద్దపేగు క్యాన్సర్లు వస్తున్నాయి. వీరు సర్జికల్‌, కీమో, రేడియోథెరపీ లాంటి చికిత్సలు పొందుతున్నారు. కొందరికి రెండుసార్లు శస్త్రచికిత్సలు అవసరమవుతున్నాయి.
రాష్ట్రంలో క్యాన్సర్‌ సంపూర్ణ నివారణే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. పది నెలలపాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఇప్పటివరకూ 19,447 మంది నోటి క్యాన్సర్‌, 15,401 మంది రొమ్ము క్యాన్సర్‌, 17,373 మంది గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్‌ అనుమానితులను ఆరోగ్యశాఖ గుర్తించింది. ఈ పరీక్షల్లో ప్రతి వంద మందిలో ఒకరు క్యాన్సర్‌ అనుమానితులుగా తేలారని గుర్తించింది. ఇప్పటివరకూ 53,07,448 మందికి వైద్యపరీక్షలు నిర్వహించగా, వారిలో 52,221 మంది క్యాన్సర్‌ అనుమానితులను గుర్తించింది. ఈ వ్యాధిని కట్టడి చేసేందుకు వీలుగా ప్రజలందరికీ క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 18 ఏళ్లు పైబడిన వారికి నోటి, రొమ్ము క్యాన్సర్‌, 30 సంవత్సరాలు పైబడిన మహిళలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ జరుగుతోంది.

కారణాలు..
పొగాకు ఉత్పత్తుల వాడకం, ఒబేసిటీ (స్థూలకాయం), కుటుంబ చరిత్ర, క్రమం తప్పిన జీవనశైలి, గాలి, నీరు, ఆహార కాలుష్యం అనేవి చాలా రకాల క్యాన్సర్లకు సాధారణ కారకాలుగా పరిగణించబడుతున్నాయి. మారుతున్న జీవనశైలి కీలకపాత్ర పోషిస్తున్నప్పటికీ, గాలిలో కాలుష్యం గణనీయంగా దోహదం చేస్తుంది. సూక్ష్మ నుసి (పీఎం2.5) ప్రభావానికీ ఊపిరితిత్తుల క్యాన్సర్లు, రొమ్ము క్యాన్సర్ల ముప్పు పెరగటానికీ సంబంధం ఉంటున్నట్టు పరిశోధనలు చెప్తున్నాయి. వాయు కాలుష్యంతో కొందరిలో మూత్రాశయ, ప్రొస్టేట్‌, రక్త క్యాన్సర్ల ముప్పు పెరుగుతోంది. మనదేశంలో వాహనాలు, పరిశ్రమల వల్ల, కలప వంటివి మండించటంతో గాలి కాలుష్యానికి దారితీస్తున్నాయి. వీటి నుంచి వెలువడే పొగలో బెంజీన్‌, పార్మల్‌డీహైడ్‌, పాలీసైక్లిక్‌ ఆరోమాటిక్‌ హైడ్రోకార్బన్స్‌ (పీఏహెచ్‌సీ) వంటి క్యాన్సర్‌ కారకాలుంటాయి. దీర్ఘకాలం వీటి ప్రభావానికి గురైతే కణాల్లో మార్పులు సంభవిస్తాయి. ఇవి చివరికి క్యాన్సర్‌గా పరిణమిస్తాయి. పిల్లలు, వృద్ధులు, జబ్బులతో బాధపడేవారి మీద ఈ కాలుష్యం మరింత ప్రభావం చూపుతుంది. కాబట్టి గాలి కాలుష్యాన్ని తగ్గించటం, దీని ప్రభావానికి గురికాకుండా చూసుకోవటం అందరి తక్షణ కర్తవ్యం.
సాధారణంగా రోడ్లపై అమ్మే చిరుతిళ్లు తింటుంటారు. పునుగులు, బజ్జీలను ఆరగిస్తుంటారు. నూనెలను ఎక్కువసార్లు మరిగించటం, వాడిందే వాడటం వల్ల అందులో కెమికల్స్‌ కొన్ని అనారోగ్యానికి, మరికొన్ని హానికరమైన క్యాన్సర్‌ కారకాలు తయారవుతాయి. వీటితో తయారైన ఆహారపదార్థాలను తినటం ద్వారా క్యాన్సర్‌ కణాలు వృద్ధి చెందుతాయి.
వ్యవసాయంలో భాగంగా రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు పరిమితికి మించి పురుగుమందులను పిచికారీ చేస్తుంటారు. తద్వారా భూమి, నీటిలోకి ఆయా క్రిమిసంహారకాలు చేరతాయి. వర్షపునీటి ద్వారా కూడా చేరతాయి. రైతులు వ్యవసాయ మోటార్లను వాడే క్రమంలో భూమిలో నీరే కదా అని తాగేస్తుండటం వల్ల క్రిమిసంహారకాలు నీటిలో ఉండటంతో అవి తాగి అనారోగ్యం పాలవుతారు. అలాగే పరిశ్రమల నుంచి వెదజల్లే కాలుష్య కారకాలు, వ్యర్థాలు కూడా భూగర్భ జలాల్లో కలవటం వల్ల క్యాన్సర్‌ కారకాలుగా మారుతున్నాయి. ఇలాంటి క్రిమిసంహారకాలు కలిగిన నీటిని తాగినా క్యాన్సర్‌ కణాలు వ్యాపిస్తాయి. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఎక్కువ పరిశ్రమలు ఉన్న ప్రాంతాల్లో ఈ తరహా కేసులు నమోదవుతున్నాయి.
క్యాన్సర్‌ నియంత్రణ పద్ధతుల్లో అధునాతనమైనవి అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం కేవలం 10 మి.లీ. రక్త నమూనాలతో మనం క్యాన్సర్‌ను నిర్ధారించొచ్చు. జెనెటిక్‌ నిర్ధారణ కూడా చేయొచ్చు. నెక్స్ట్‌ జనరేషన్‌ స్క్రీనింగ్‌ (ఎన్‌జిఎస్‌) ద్వారా డిఎన్‌ఎ, ఆర్‌ఎన్‌ఎలో ఉన్న తేడాలను తేలికగా కనిపెట్టొచ్చు. తద్వార ఏ మందులకు క్యాన్సర్‌ తగ్గుతుందో ముందుగా తెలుసుకోవచ్చు. పిఇటి సిటీ స్కాన్‌ ద్వారా రోగికి క్యాన్సర్‌ ఏ దశలో ఉందో కూడా తెలుసుకోవచ్చు. ఆధునిక వైద్యంలో ఎన్‌జిఎస్‌ సర్జికల్‌లో లాప్రోస్కోపిక్‌, రోబోటిక్‌ క్యాన్సర్‌ సర్జరీలు చేయటం వల్ల కూడా త్వరగా రికవరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఈ పద్ధతిలో కూడా క్యాన్సర్‌ కారకాలను గుర్తించి, నియంత్రణ చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌వో) పిలుపునిచ్చిన విధంగా 2025లో ‘క్యాన్సర్‌ నియంత్రణలో ఆటంకాలను అధిగమిద్దాం’ (క్లోజ్‌ ది కేర్‌ గ్యాప్‌) థీమ్‌ మేరకు ప్రపంచవ్యాప్తంగా కృషి జరుగుతోంది. మనదేశంలో క్యాన్సర్‌ రోగుల సంఖ్య పెరుగుతుండటం ఒక ఎత్తయితే, వీటిలో అత్యంత సాధారణంగా కనిపించే క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్‌, తల, మెడ క్యాన్సర్‌, గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్‌, ఊపిరితిత్తుల క్యాన్సర్‌, అండాశయ క్యాన్సర్లు ఉన్నాయి. రసాయన చికిత్స (కీమోథెరపీ) క్యాన్సర్‌ చికిత్సలో కీలక భాగంగా ఉన్నప్పటికీ, లక్ష్యిత చికిత్స, ఇమ్యూనోథెరపీ వంటి ఆధునిక చికిత్సా విధానాలు, క్యాన్సర్‌ సంరక్షణలో సర్వైవల్‌ రేటును మెరుగుపరచడం ద్వారా అత్యంత ప్రభావవంతమయ్యాయి.

చికిత్సా పద్ధతులు..
క్యాన్సర్‌ చికిత్సలు
మూడు పద్ధతుల్లో జరుగుతాయి..
1. సర్జరీ 2. కీమోథెరపీ, 3. రేడియేషన్‌
అన్ని క్యాన్సర్లకు ఒకే రకమైన ట్రీట్మెంట్‌ ఉండదు. క్యాన్సర్‌ను బట్టి పేషెంట్‌ శారీరక స్థితిగతులు బట్టి, అవయవాల తీరును బట్టి, క్యాన్సర్‌ దశను బట్టి చికిత్స విధానం మారుతూ ఉంటుంది. కొన్ని క్యాన్సర్లకి సర్జరీ, మరికొన్ని కేసులకు కీమోథెరపీ, ఇంకొన్నింటికి రేడియేషన్‌ అనేది ముఖ్యమైన చికిత్స అవుతుంది. చాలామంది రోగుల్లో ఈ మూడు పద్ధతులు కలిపి చేయాల్సి ఉంటుంది. మూడింట రెండొంతుల రోగుల్లో ఏదో ఒక రెండు పద్ధతుల చేయాల్సి ఉంటుంది. మూడింట ఒక వంతులో ఏదో ఒక పద్ధతి ద్వారా మాత్రమే చికిత్స చేస్తే సరిపోతుంది. కొన్నిసార్లు సర్జరీ తర్వాత కీమోథెరపీ ఇవ్వాల్సి ఉంటుంది. రేడియేషన్‌ అవసరమవ్వొచ్చు. రెండూ కలిపి చేయాల్సి రావొచ్చు. కొంతమంది రోగులకు అసలు సర్జరీయే లేకుండా రేడియేషన్‌ చికిత్స, ఇంకా కీమోథెరపీ కలిపి చేయాల్సి వస్తుంది. మరికొంత మందికి మూడు పద్ధతులూ కలిపి చేయాల్సి ఉంటుంది. క్యాన్సర్‌ను ప్రాథమిక దశలో గుర్తించటం అన్నింటికన్నా ముఖ్యం. తద్వార పూర్తిగా నయం చేయటానికి వీలుంటుంది.
సర్జరీ : గతంలో కేవలం సర్జరీల ద్వారానే చికిత్సలు అందించేవారు. ఇక్కడ ట్రీట్‌మెంట్‌ ద్వారా చికిత్సలు అందించి, పెరిగిపోయిన గడ్డలను పూర్తిగా తొలగిస్తుంటారు. వ్యాధి ప్రాథమిక దశలో ఉన్న వారికి సర్జరీ ద్వారా పూర్తిగా తొలగించటానికి వీలుంటుంది.

కీమోథెరపీ : మందులను సెలైన్‌ ద్వారా ఇచ్చే ట్రీట్‌మెంట్‌. దీనివలన రక్తంలో పూర్తిగా కలిసి, శరీరమంతా వ్యాపించి క్యాన్సర్‌ కణాలను చంపుతాయి. ఇలాంటి కీమోథెరఫీ వ్యాధి ముదిరిన రోగులకు ఇస్తూ ఉంటారు. తద్వారా వ్యాధిని పూర్తిగా నియత్రించటానికి ఈ ట్రీట్‌మెంట్‌ ఎంతో మేలైనది. కీమోథెరపీ ఇవ్వటం వల్ల శరీరంపై కొన్ని దుష్ప్రవాలు ఉంటాయి. జుట్టు ఊడిపోవటం, శరీరం రంగు మారటం, నోటిపూత, విరోచనాలు అవ్వటం, వాంతులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ అవి పూర్తిగా తాత్కాలికమే. అవి రాకుండా కూడా కొన్ని రకాల మందులను ఇవ్వటం వల్ల వ్యాధిని నివారించొచ్చు. ఇంజెక్షన్‌ ఇచ్చి ట్రీట్‌మెంట్‌ చేస్తారు. స్టేజి దాటిన తర్వాత కీమోథెరపీ ఉపయోగించి, రేడియోథెరపీ ద్వారా సంబంధిత గడ్డలను తొలగించొచ్చు. ఈ ట్రీట్‌మెంట్‌ ఎంతో మేలైనది.
30 సంవత్సరాలు దాటిన మహిళలు ప్యాస్మియర్‌ పరీక్ష చేయటం ద్వారా ఏమైనా ఇన్ఫెక్షన్‌ ఉందా? లేదా? అని తెలుసుకోవచ్చు. క్యాన్సర్‌ ఉంటే నిర్ధారించొచ్చు.

రేడియోథెరపీ : హైఎనర్జీ, ఎక్సరేను గామారేస్‌ ద్వారా క్యాన్సర్‌ సెల్స్‌ను చంపటానికి ఉపయోగిస్తారు. గర్భసంచి, గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్‌, నోటి క్యాన్సర్లు, గొంతు క్యాన్సర్లు ఈ కోవకు చెందుతాయి.
వీటితోపాటుగా ఇమ్యూనో థెరపీ, టార్గెటెడ్‌ థెరపీ కూడా ఉన్నాయి. క్యాన్సర్‌ కణాలను గురిచూసి కొట్టడం ద్వారా వాటిని పూర్తిగా తొలగించొచ్చు.

ఆధునిక వైద్య పద్ధతులు..
ప్రస్తుతం కొన్ని ఆధునిక వైద్య పద్ధతుల ద్వారా క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయొచ్చు. అతి తక్కువ దుష్ప్రభావాలతో చికిత్స చేయడం అనేది ఇప్పుడు చాలా సులభంగా మారింది.
సర్జరీలో అడ్వాన్స్‌డ్‌ లాప్రోస్కోపిక్‌ సర్జరీ, రోబోటిక్‌ సర్జరీల ద్వారా చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా రోగికి కుట్లు లేకుండానే చికిత్స చేస్తారు. నొప్పి తక్కువగా ఉంటుంది. త్వరగా కోలుకుని, తన దైనందిన జీవితాన్ని సంతోషంగా గడపటానికి వీలుంటుంది.
టార్గెట్‌ థెరపీ, ఇమ్యూన్‌ థెరపీ పద్ధతుల ద్వారా మందులతో చికిత్స చేస్తారు.
టార్గెటెడ్‌ థెరపీ : ఇది కీమోథెరపీలో ఒకభాగం. ఈ చికిత్స ద్వారా కొన్నిరకాల మందులు సెలైన్‌ ద్వారా ఇవ్వటం వల్ల అవి పూర్తిగా క్యాన్సర్‌ కణాల లక్ష్యంగా వెళ్లి వాటిని చంపుతాయి. దీనిద్వారా దుష్ప్రవాలు చాలా తక్కువగా ఉంటాయి. క్యాన్సర్‌ కణాలపై మందు ప్రభావం ఉంటుంది. దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి.
ఇమ్యునోథెరపీ : కొన్ని రకాల మందులను ఉపయోగించి, వాటిని వ్యాధి నిరోధకశక్తి ప్రేరణ పొంది- క్యాన్సర్‌ కణాలను పూర్తిగా నివారించటంలో ఉపయోగ పడతాయి. దీనివలన దుష్ప్రభావాలు చాలా తక్కువగా ఉంటాయి. క్యాన్సర్‌ పూర్తిగా నివారించటానికి వీలుకలుగుతుంది. ఈ రెండు చికిత్సా పద్ధతులకు ఖర్చు ఎక్కువ.
రేడియేషన్‌కి వచ్చేటప్పటికీ అత్యంత అధునాతన పద్ధతులైన రేడియో సర్జరీ, వాల్యూమెట్రిక్‌ మాడ్యులేటెడ్‌ ఆర్క్‌ థెరపీ (విఎమ్‌ఎటి)), ఇమేజ్‌ గైడింగ్‌ రేడియో థెరపీ (ఐజిఆర్‌టి) పద్ధతుల ద్వారా చాలా తక్కువ దుష్ప్రభావాలతో చికిత్సను పూర్తిచేయొచ్చు. క్యాన్సర్‌ ఆనవాళ్లనేవే లేకుండా రోగులకు చికిత్స పూర్తిచేయడం మనకి ప్రస్తుతం ఉన్న పద్ధతుల్లో సులభ సాధ్యమవుతుంది. టార్గెటెడ్‌ థెరపీ, ఇమ్యునోథెరపీ ఖర్చు ఎక్కువ. రోగికి త్వరగా నయమవుతుంది. కీమోథెరపీ ద్వారా చికిత్సల్లో కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి. టార్గెటెడ్‌ థెరపీ, ఇమ్యునోథెరపీలో దుష్ప్రభావాలు చాలా తక్కువ. ఖర్చు ఎక్కువైనా వ్యాధి త్వరగా నయమవుతుంది. రేడియోథెరపీకి కొన్ని రకాల దుష్ప్రభావాలు సంభవిస్తాయి. కానీ ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీతో అలాంటి వాటిని నియంత్రిం చొచ్చు, రాకుండా కూడా చేయొచ్చు.
ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే క్యాన్సర్‌ నియంత్రణ పద్ధతుల్లో అధునాతనమైనవి అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం కేవలం 10 మి.లీ. రక్త నమూనాలతో మనం క్యాన్సర్‌ను నిర్ధారించొచ్చు. జెనెటిక్‌ నిర్ధారణ కూడా చేయొచ్చు. తర్వాతి జనరేషన్‌ స్క్రీనింగ్‌ (ఎన్‌జిఎస్‌) ద్వారా డిఎన్‌ఎ, ఆర్‌ఎన్‌ఎలో ఉన్న తేడాలను తేలికగా కనిపెట్టొచ్చు. తద్వారా ఏ మందులకు క్యాన్సర్‌ తగ్గుతుందో ముందుగా తెలుసుకోవచ్చు. పిఇటి సిటీ స్కాన్‌ ద్వారా రోగికి క్యాన్సర్‌ ఏ దశలో ఉందో కూడా తెలుసుకోవచ్చు. ఆధునిక వైద్యంలో ఎన్‌జిఎస్‌ సర్జికల్‌లో లాప్రోస్కోపిక్‌, రోబోటిక్‌ క్యాన్సర్‌ సర్జరీలు చేయటం వల్ల కూడా త్వరగా రికవరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మెరుగైన జీవనశైలితో..
ఎంత ఉరుకులు, పరుగుల జీవితాన్ని గడుపుతున్నా ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అనారోగ్యం బారినపడకుండా ఉండాలంటే తాజా పండ్లు, కూరగాయలతో కూడిన రక్షితమైన పౌష్టికాహారం తీసుకోవాలి. శరీరానికి తగినంత విశ్రాంతి ఉండాలి. ఒత్తిడి లేని జీవితాన్ని గడపాలి. ఏదీ అతిగా తినకూడదు. తాగకూడదు. మనలో చాలామంది ఆకలి వేసినప్పుడు కడుపు నింపుకోవటానికి ఏది అందుబాటులో ఉంటే అది తినేస్తుంటాం. అందులోనూ కనబడిన స్నాక్స్‌ను లాగించేస్తుంటాం. మరీ ముఖ్యంగా ప్రాసెసింగ్‌ చేసిన ఆహారాన్ని, వేపుళ్లను (ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, న్యూడీల్స్‌) లాంటివి తినేస్తుంటాం. బయట దొరికే ఇలాంటి ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఉప్పు, చక్కెర ఎక్కువగా వాడుతుంటారు. అందువల్ల వీటిని ఎక్కువగా తీసుకుంటే ఇబ్బందులు ఏర్పడతాయి. వీటికి బదులుగా తాజా పండ్లు, కూరగాయలు వంటివి తీసుకుంటే ఆరోగ్యం మెరుగుదల అవుతుంది. పొగాకు ఉత్పత్తులను వాడకూడదు. ప్రతిరోజూ క్రమపద్ధతిలో వ్యాయామం చేయాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి.

క్యాన్సర్‌ వ్యాక్సిన్లు
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ రాకుండా హెచ్‌పివి సర్వైకల్‌ వ్యాక్సిన్‌ దోహదపడు తుంది. 99 శాతం క్యాన్సర్లు రాకుండా ఆపొచ్చు. ఫీమేల్‌ మామోగ్రఫీ ద్వారా బ్రెస్ట్‌ ఎక్సరేతో రొమ్ముల్లో ఉండే గడ్డలను గుర్తించొచ్చు. హెచ్‌బిసి వ్యాక్సిన్‌ ద్వారా కూడా క్యాన్సర్‌ను నియంత్రించొచ్చు.
”క్యాన్సర్‌ వచ్చిన తర్వాత చికిత్స చేయించుకోవటం కాకుండా రాకముందే నివారణా చర్యలు తీసుకోవటం మంచిది”

ముందుగా గుర్తించే పరీక్షలు (స్క్రీనింగ్‌)

రొమ్ము క్యాన్సర్‌ : మహిళలకు ఎక్కువగా ఈ క్యానర్‌ వస్తుంది. 35 సంవత్సరాలు దాటిన మహిళలు ఏడాదికి ఒకసారైనా మ్యామోగ్రఫీ పరీక్ష చేయించుకోవాలి. ఈ స్క్రీనింగ్‌ ద్వారా లక్షణాలు లేకపోయినా క్యాన్సర్‌ను గుర్తించొచ్చు.

బ్రెస్ట్‌ సెల్ఫ్‌ ఎగ్జామినేషన్‌ : 25 సంవత్సరాలు దాటిన మహిళలు ప్రతినెలా తమకు వచ్చే రుతుక్రమం పూర్తయిన ఐదు రోజుల తర్వాత ఎవరికి వారు రొమ్ములను పరీక్షించుకోవాలి. లోపలి ఏమైనా గట్టిగా ఉందా?, చర్మం కందిందా?, ఎర్రగా ఏమైనా చర్మం మారిందా?, చంకలో ఏమైనా గడ్డలు వచ్చాయా?, నొప్పి, పుండు వంటివి ఏమైనా ఉన్నాయా? అనేది ఎవరికి వారు స్వయంగా వారి చేతుల ద్వారా పరీక్షించుకోవాలి. గతం కంటే ఏమైనా కొత్త మార్పులు వచ్చినప్పుడు డాక్టరు గారిని సంప్రదించాలి.

గర్భాశయ ముఖద్వార కాన్సర్‌ : పాప్స్మియర్‌ అనే పరీక్ష ద్వారా తొందరగా గుర్తించొచ్చు. ఇది గొంతు క్యాన్సర్లను రాకుండా ప్రభావితం చేస్తుంది.
ప్రస్తుతం రెండు రకాల క్యాన్సర్ల నియంత్రణకు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. గర్భాశయ ముఖ ద్వారా కాన్సర్‌ను నిరోధించటానికి వ్యాక్సిన్‌ ఉపయోగపడుతుంది. ఈ క్యాన్సర్‌ ముఖ్యంగా హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ (హెచ్‌పివి) వల్ల వస్తుంది. ముఖ్యంగా ఈ వ్యాక్సిన్‌ 9 నుంచి 25 సంవత్సరాల మధ్యనున్న మహిళలకు ఇవ్వటం వల్ల గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్‌ను 90 శాతం రాకుండా నియంత్రిస్తుంది. రెండోరకం వ్యాక్సిన్‌ హైపటైటిస్‌ బి వైరస్‌ ఇన్ఫెక్షన్‌ రాకుండా ఇవ్వటం వల్ల లివర్‌ క్యాన్సర్‌ను ఎక్కువశాతం ఆపొచ్చు. ఇది ముఖ్యంగా ఆసుపత్రి సిబ్బందికి మేలుకలుగుతుంది.

ఊపిరితిత్తుల క్యాన్సర్‌ : ప్రారంభ దశలో గుర్తిస్తే నయం చేయగలిగేవి మాత్రమే ఉంటాయి. పొగాకు ఉత్పత్తులను తాగేవారు, ఇప్పటికే బాగా తాగిన వారు, ఇంకా కొనసాగిస్తున్న వారు ఏడాదికి ఒకసారైనా ఛాతీ పరీక్ష సిటి స్కాన్‌ చేసుకోవటం మంచిది. తద్వారా క్యాన్సర్‌ ఉందో లేదో తెలుసుకోవచ్చు.

ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ : 50 సంవత్సరాలు పైబడిన పురుషులకు ఏడాదికి ఒకసారి రక్తనమూనా పరీక్ష (పిఎస్‌ఎ) ద్వారా క్యాన్సర్‌ ఉందో, లేదో తెలుసుకోవచ్చు. ప్రమాదకర సంకేతాలు..

  • శరీరంలో ఎక్కడైనా పుండు ఏర్పడి, అది తగ్గకపోవడం
  • పుట్టుమచ్చలు రంగు మారడం, పరిమాణంలో మార్పులు.
  • మల, మూత్ర సమయాల్లో మార్పులు. రక్తం పడటం, విరేచనం నల్లగా కావడం.
  • మింగడం కష్టంగా అనిపించడం. అరుగుదల సరిగ్గా లేకపోవడం.
  • మహిళల్లో అసాధారణ రక్తస్రావం, తెలుపు అధికంగా కావడం.
  • శరీరంలో ఏభాగంలోనైనా వాపుగానీ, గడ్డలు గానీ.. ముఖ్యంగా మహిళలకు రొమ్ముల్లో గడ్డలు.
  • అలసటగా అనిపించడం, బరువు తగ్గటం.
  • గొంతు బొంగురు పోవడం, రక్తహీనత, ఎడ తెగని దగ్గు.

పైన చెప్పిన ఈ లక్షణాలన్నీ క్యాన్సర్‌ కావచ్చు. వాటిని అశ్రద్ధ చేయకుండా డాక్టర్‌ దగ్గరికి వెళ్లాలి. అక్కడ పరీక్ష చేయించుకుంటే నిర్ధారణలు చేసి, తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.

డాక్టర్‌ చాతరాజుపల్లి మురళీకృష్ణ ఎంఎస్‌, ఎంసిహెచ్‌ (బిహెచ్‌యు), ఎఫ్‌ఎంఎఎస్‌
చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌,
శ్రీ గాయత్రి సూపర్‌ స్పెషాలిటీ కాన్సర్‌ ఆసుపత్రి
విజయవాడ.
9398520368

➡️