సులువుగా చేసేద్దాం…

Aug 18,2024 08:55 #Cooking, #Food, #sweets and fruits

సహజంగా పండగలప్పుడో, ఫంక్షన్లప్పుడో స్వీట్స్‌ చేసుకుంటుంటాం. మధ్యలో తినాలన్పిస్తే వెంటనే షాపులో కొనుక్కుని తినడం సౌలభ్యం అనుకుంటాం. కానీ షాపులో తీసుకునే వాటికీ, మనం ఇంట్లో చేసుకునే వాటికీ ఉండే తృప్తి మనకు తెలీదాండీ! కాకపోతే సమయం, ఓపిక లేక అలా సరిపెట్టుకుంటాం. అందుకే అలా తినాలనిపించినప్పుడు తక్కువ సమయంలో తేలికగా చేసుకునే కొన్ని స్వీట్ల గురించి తెలుసుకుంటే సెలవు రోజుల్లో చేసుకోవచ్చు. అలాంటివే కొన్ని రుచులు ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.

ఆయిల్‌ లెస్‌ స్వీట్‌..

కావలసినవి : వేరుశనగ గుళ్ళు- 1/4 కేజీ, పచ్చికొబ్బరి తురుము- 1/2 కప్పు, పాలు- అర కప్పు, పంచదార- 3/4 కప్పు, డ్రైఫ్రూట్‌ పలుకులు- 2 స్పూన్లు, యాలకుల పొడి- కొద్దిగా.
తయారీ : వేరుశనగ పప్పు మాడి పోకుండా వేయించాలి. చల్లారాక పొట్టు తీసేసి, మెత్తగా మిక్సీ పట్టాలి. దానిలో పచ్చికొబ్బరి తురుము, అరకప్పుకు కొంచెం తక్కువగా పాలు పోసి మిక్సీ పట్టాలి. ఈ పేస్ట్‌, పంచదారను బాండీలో వేసి, సన్నని సెగ మీద కలుపుతూ ఉడికించాలి. పంచదార కరిగి, పేస్ట్‌ పలుచగా అవుతుంది. అది చిక్కగా అయ్యేంత వరకూ అడుగంటకుండా తిప్పుతూ ఉడికించాలి. స్వీటు దగ్గరగా వచ్చిన తర్వాత యాలకుల పొడి వేసి ఉడికించాలి. బాండీకి అంటకుండా ఆయిలీగా కనిపించేటప్పుడు నెయ్యి రాసిన ప్లేట్‌లోకి తీసుకుని, సమంగా సర్ది ఆరనివ్వాలి. ఇష్టమైతే పైన డ్రైఫ్రూట్‌ పలుకులు చల్లుకోవచ్చు. చల్లారిన తర్వాత మనకిష్టమైన ఆకారంలో ముక్కలు కట్‌ చేసుకోవటమే. చూశారా చుక్క నూనెగానీ, నెయ్యిగానీ లేకుండా స్వీట్‌ రెడీ అయిపోయింది.

బొబ్బట్లు..

కావలసినవి : గోధుమపిండి -2 కప్పులు, ఉప్పు -చిటికెడు, పసుపు -చిటికెడు, నెయ్యి- 1/2 కప్పు, బెల్లం- కప్పు, పంచదార- 1/2 కప్పు, బొంబాయి రవ్వ- కప్పు, యాలకులు- 3
తయారీ : గోధుమ పిండిలో రెండు మూడు స్పూన్ల నెయ్యి, ఉప్పు, పసుపు వేసి నీటితో చపాతీ పిండిలా మెత్తగా కలిపి మూతపెట్టి గంటసేపు పక్కనుంచాలి. పిండి ఎంత మృదువుగా కలిపితే, బొబ్బట్లు అంత బాగా వస్తాయి. ఒక గిన్నెలో మూడు కప్పుల నీళ్ళు, తురిమిన బెల్లం, పంచదార వేసి స్టౌ మీద పెట్టి తిప్పుతూ కరిగించాలి. ఇప్పుడు బాండీలో రెండు స్పూన్ల నేతిలో బొంబాయి రవ్వను వేయించాలి. రవ్వ దోరగా వేగిన తర్వాత ముందుగా కరిగించిన బెల్లం నీటిని పోస్తూ నెమ్మదిగా తిప్పుతూ పోయాలి. ఐదారు నిమిషాలకు రవ్వ ఉడికి సిల్కీగా చిక్కగా కనిపిస్తుంది. అప్పుడు మరో రెండు స్పూన్ల నెయ్యి, యాలకుల పొడి వేసి, తిప్పుతూ ఉడికించాలి. చివరికి హల్వా స్టేజ్‌కి వచ్చిన రవ్వ మిశ్రమాన్ని స్టౌ మీద నుంచి దించేయాలి. చల్లారిన తర్వాత ఉండలుగా చేసుకుని ఒక ప్లేటులో ఉంచుకోవాలి. ముందుగా కలిపి ఉంచుకున్న గోధుమ పిండిని, చిన్న చిన్న ముద్దలుగా తీసుకుంటూ చేతితోనే చపాతీలా వత్తాలి. దానిపై ఈ రవ్వుండ ఉంచాలి. ఈ ఉండల్ని ఒక్కోటి నెమ్మదిగా చేతితోనే కొద్ది నెయ్యి రాస్తూ, ఒత్తుతూ బొబ్బట్టు చేయాలి. ఇలా అన్నీ చేసి, పెనంపై నేతితో రెండు వైపులా సన్న సెగపై కాల్చాలి. అంతే పప్పు ఉడకబెట్టకుండానే అప్పటికప్పుడు చేసే బొబ్బట్లు రెడీ.

నవాబీ స్వీట్‌..

కావలసినవి : సన్నని రోస్టెడ్‌ సేమ్యా- 200గ్రా., బాదం పప్పు- 10, జీడిపప్పు- 10, యాలకులు- 4, నెయ్యి-1/4 కప్పు, పాలు- 1/2లీ., కస్టర్డ్‌ పౌడర్‌ (కార్న్‌ఫ్లోర్‌)- 11/2 స్పూను, పంచదార- 1/4 కప్పు, డ్రైఫ్రూట్‌ పలుకులు- స్పూను
తయారీ : ఒక బౌల్‌లో బాగా సన్నగా ఉండే రోస్టెడ్‌ సేమ్యా (అయితేనే ఈ స్వీటు బాగుంటుంది) ను చేతితో నలిపి, చిన్నగా చేయాలి. బాదం, జీడిపప్పు, యాలకులు వేసి, మెత్తగా మిక్సీ పట్టాలి. దీన్ని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. అదే మిక్సీజార్‌లో మూడు స్పూన్ల పంచదార వేసి, పౌడర్‌ చేసుకోవాలి. బాండీలో రెండు స్పూన్ల నెయ్యి వేడి చేసి, సేమ్యాను (సిమ్‌లో) దోరగా వేయించాలి. దానిలో పంచదార పొడి వేసి కలుపుతూ వేయించాలి. మూడు నాలుగు నిమిషాల తర్వాత పొడి కరిగి సేమ్యాకు స్వీట్‌నెస్‌ వస్తుంది. ఈ సేమ్యాను రెండు భాగాలు చేసి, ఒక భాగాన్ని అంచుతో ఉన్న వెడల్పు ప్లేటులో అంగుళం మందంతో సమంగా సర్దాలి. కస్టర్డ్‌ పౌడర్‌ను, మిక్సీ పట్టుకున్న జీడిపప్పు, బాదం మిశ్రమాన్ని చిన్న గిన్నెలో పావు కప్పు పాలతో జారుగా కలిపి ఉంచుకోవాలి. బాండీలో పాలు వేడి చేసి, రెండుమూడు పొంగులు వచ్చిన తర్వాత పై మిశ్రమాన్ని వేసి, తిప్పుతూ ఉడికించాలి. పాలు చిక్కబడి క్రీమీగా వచ్చినప్పుడు పంచదార వేసి, కలుపుతూ మరో ఐదు నిమిషాలు ఉడికించి దించేయాలి. దీనిని ప్లేటులో సర్దిన సేమ్యాపై ఒక అంగుళం మందంలో పోయాలి. ఆ పైన సేమ్యా రెండో భాగాన్ని సర్ది డ్రైఫ్రూట్‌ పలుకులతో గార్నిష్‌ చేయాలి. అంతే నవాబీ సేమియా స్వీట్‌ రెడీ. ఇది ఒక గంట ఫ్రిజ్‌లో పెట్టుకుని సర్వ్‌ చేస్తే ఆహా! అనాల్సిందే మరి.

➡️