‘అందమైన నందనంలో మిడతల దండు వచ్చింది.. పూలు, రెమ్మలు, పండ్లూ కాయలు ధ్వంసం చేయగ చూస్తోంది.. భారతావని నందనం.. మతోన్మాదమే మిడతల దండు ‘ అన్న కవి మాటలకు నేటి భారతం ప్రత్యక్ష నిదర్శనం.
‘ఒక పెద్ద దేశం చిన్న దేశాన్ని అణచివేయాలని చూస్తే నేను ఆ చిన్న దేశం వైపు నిలబడతాను. ఆ చిన్న దేశంలోనే మెజారిటీ మతం చిన్న మతాన్ని అణగదొక్కాలని చూస్తే నేను చిన్న మతం వైపు నిలబడతాను. ఆ మైనారిటీ మతంలో కులాలు ఉండి అది ఒక కులం మరొక కులాన్ని అణగదొక్కాలని చూస్తే ఆ అణచివేతకు గురయ్యే కులం వైపు నిలబడతాను. ఆణిచివేతకు గురైన కులంలో ఒక యజమాని తన నౌకరుని అణిచివేస్తుంటే నేను ఆ నౌకరు వైపు నిలబడతాను. ఆ నౌకరు తన ఇంట్లో తన భార్య హక్కుల్ని కాలరాస్తుంటే నేను ఆ నౌకరు భార్య వైపు నిలబడి గొంతెత్తుతాను. చివరికి నేను చెప్పేది అణిచివేత అనేది ఏ స్థాయిలో ఏ స్థితిలో ఉన్నా అది నా శత్రువు!’ అంటాడు పెరియార్ ఇ.వి. రామస్వామి.
భారతదేశ నాగరికత అతి ప్రాచీనమైనది. కాల ప్రవాహంలో కొన్ని నాగరికతలు, సంస్కృతులు కాలగర్భంలో కలిసిపోతుంటాయి. కొత్త నాగరికతలు, సంస్కృతులు పుట్టుకొస్తుంటాయి. ఎన్నో మతాలు, సంస్కృతుల సంగమం మనదేశం. అనేక సాంప్రదాయాలు, చారిత్రక నేపథ్యాలున్న హిందూ, ముస్లిం, క్రైస్తవ, బౌద్ధ, జైనుల సహజీవనం మన సంస్కృతి. రాచరిక ప్రభువుల నిరంకుశత్వాన్ని దాటి, భూస్వాముల అరాచకాలను, ఆగడాలను ఎదుర్కొని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మన జీవన విధానంగా చేసుకున్నాం. భిన్న సంస్కృతులను విశాల దృక్పథంతో అర్థం చేసుకొనేవారితోనే సమానత్వం సిద్ధిస్తుంది. ఈ వైవిధ్యాన్ని సమాజ రక్షణ కోసం ఏర్పడిన రాజ్యం దాన్ని విస్మరిస్తూ విద్వేషం వెదజల్లుతున్న వేళ.. న్యాయమూర్తులే విద్వేష వ్యాఖ్యలు చేస్తున్న సమయం. ఈ నేపథ్యంలో మైనార్టీల హక్కుల దినోత్సవ ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ నెల 18న ‘జాతీయ మైనార్టీల హక్కుల దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక కథనం.
థీమ్..
ఈ ఏడాది మైనారిటీ హక్కుల దినోత్సవ థీమ్ ”వైవిధ్యాన్ని ప్రోత్సహించడం, హక్కులను పరిరక్షించడం!” అని ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. ఇంతకుముందు కూడా థీమ్‌లను ప్రకటించారు. మాటలు కోటలు దాటాయే తప్ప ఆచరణ గడప దాటలేదు. కేంద్రంలో మోడీ పదేళ్ల పాలనలో మైనార్టీల హక్కులపై ఎడాపెడా దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ థీమ్ కార్యరూపం దాల్చాలంటే పోరాటం మినహా మరో మార్గం లేదు.
మనిషితనాన్ని కోల్పోయి.. మనిషి రక్తాన్ని మరిగినప్పుడు- ఈ దుష్ట సంస్కృతిని, నిరంకుశత్వాన్ని ప్రశ్నిస్తూ.. ‘మేమూ మనుషులమే.. ఈ గడ్డలో మేమూ భాగమే.. మమ్మల్నీ బతకనీయండి’ అంటూ నినదించే పౌర సమాజ బృందాలు, కార్యకర్తల గొంతులను, బిగించిన పిడికిళ్లను బుల్డోజ్ చేస్తూ.. అణచివేస్తుంటే.. ఆ అణచివేతను, ఆ నిరంకుశత్వాన్ని ఎదిరించే పోరాటాలే మానవ హక్కులయ్యాయి. ఏ దేశంలోనైనా హక్కుల ఉల్లంఘన, అణచివేత.. ఆందోళన కలిగించే విషయమే. ‘ప్రజల మానవ హక్కులను తిరస్కరించడం అంటే.. వారి మానవత్వాన్ని సవాలు చేయడమే’ అంటాడు నెల్సన్ మండేలా. జాతీయత, మతం, వర్గం, జాతి నేపథ్యంతో సంబంధం లేకుండా సమాజమంతటికీ లభించే సమానత్వం, గౌరవం, స్వేచ్ఛ కనీస అవసరం. నాగరికత ఎంత అభివృద్ధి చెందినా, అనేక దేశాల్లో మానవ హక్కులకు, ముఖ్యంగా మైనారిటీల హక్కులకు పూర్తి భరోసా లేని పరిస్థితి ఏర్పడింది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకుంటున్న భారత్‌లో సైతం మైనారిటీల హక్కుల హననం కొనసాగుతోంది.
ఇలా ఏర్పడింది..
ఐక్యరాజ్యసమితి మొట్టమొదట మైనార్టీ హక్కుల దినోత్సవంగా 1992, డిసెంబర్ 18వ తేదీని పరిగణించింది. మతము, జాతి, భాషా, లింగం, సంస్కృతిపరంగా మైనారిటీ హక్కుల పరిరక్షణకు ఈ రోజును గుర్తించాల్సిందిగా ప్రకటించింది. మనదేశంలో కూడా డిసెంబర్ 18ను మైనార్టీ హక్కుల దినోత్సవంగా ప్రకటించి, చట్టం చేసి జాతీయ మైనారిటీల కమిషన్ (ఎన్‌ఎంసి -1992) నియమించింది. ఈ సంవత్సరం 2024 మైనారిటీ హక్కుల దినోత్సవం యొక్క థీమ్ (ప్రమోటింగ్ డైవర్సిటీ అండ్ ప్రొటెక్టింగ్ రైట్స్) వైవిధ్యాన్ని ప్రోత్సహించడం, హక్కులను రక్షించడం.
రాజ్యాంగ హక్కు..
భారత జాతీయ మైనారిటీల కమిషన్ మనదేశంలోని ముస్లింలను (14.2), క్రైస్తవులను (2.3), సిక్కులను (1.7), బౌద్ధులను (0.7), పారశీలను (0.06), జైనులను (0.4) మైనార్టీలుగా గుర్తించింది. మైనార్టీలకు భద్రతా, సమానత్వం, సమన్యాయం అందించడం రాజ్యాంగబద్ధమైన ఆదేశమే కాక సామాజిక అవసరం కూడా. గాంధీజీ అన్నట్లు ”ఒక దేశం యొక్క గొప్పతనం అన్నది ఆ దేశంలో అణగారిన వారు ఎలా చూడబడుతున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది”. ఈ రోజు మతం పేరుతో మనదేశంలో జరుగుతున్న దాడులు కొద్దిమంది మతోన్మాదులకు తృప్తిని కలిగించవచ్చు. కానీ ప్రపంచ దృష్టిలో మాత్రం దేశ గౌరవ ప్రతిష్టలకు భంగం కలుగుతుందన్న స్పృహ అవసరం. గోరక్షణ పేరుతో మానవహత్యలు గావించడం, మైనారిటీ మహిళలను నగంగా ఊరేగించి హత్యాచారాలు చేయించడం యథేచ్చగా కొనసాగుతోంది. హిజాబ్, హలాల్, అజాన్, నమాజ్‌ల పేర్లతో మతాచారాలపై, మైనారిటీల ఆస్తులపై బుల్డోజర్లను ప్రయోగించి నిరాశ్రయులను చేస్తోంది. ఇవన్నీ రాజ్యాంగ అతిక్రమణ చర్యలే కాదు అమానవీయమైనవి.
మైనారిటీల స్థితిగతులు..
మనదేశంలోని మైనార్టీ స్థితిగతులపై నివేదిక కోసం 2005, మార్చి 9న ప్రధానమంత్రి జస్టిస్ రాజేందర్ సచ్చార్ నాయకత్వాన ఒక కమిటీ వేయడం జరిగింది. ఈ దేశంలో ముస్లిం మైనార్టీలు, విద్యా, ఉపాధి, ఆర్థికపరంగా ఎంత వెనుకబాటుతనంలో ఉన్నారో సమూల వివరణలతో ఆ కమిటీ రిపోర్టు సమర్పించింది. వీటిని అధిగమించటానికి సూచనలు కూడా చేసింది. కానీ కమిటీలు వేయడంలో ఉన్నంత చిత్తశుద్ధి, దాని సూచనలు అమలులో లేకపోవడం విచారకరం. ప్రధానంగా విద్యను మాతృభాషలో అందించటానికి ప్రాధాన్యతనిస్తూ పాఠశాలలు ఏర్పాటు చేసినా, ఆంగ్ల భాష మీద చూపే ప్రేమ మైనార్టీ భాషనే కాదు మెజార్టీ స్థానిక భాషలపైనా ప్రభావం చూపుతుందన్నది సత్యం. ఈ పరిస్థితి మైనార్టీలను మధ్యలోనే విద్యకు దూరం చేసి, మరింత వెనుకబాటులోకి నెట్టివేస్తుంది. ఒకటి నుంచి 10వ తరగతి వరకు ఉన్న జాతీయ స్కాలర్‌షిప్, విదేశీ విద్యకు అందే స్కాలర్‌షిప్‌లను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. ప్రాథమిక విద్యలోనే ఆటంకాలు ఏర్పడితే ఉన్నత విద్యకు వెళ్ళడం అసాధ్యమైన విషయంగా మైనార్టీలకు పరిణమించింది. దీంతో పిల్లలను బడి మాన్పించి, పనుల్లోకి పంపడం జరుగుతోంది. బాలికలలో ఇది మరింత పెరిగి బాల్యవివాహాలకు దారితీస్తుంది.
గుజరాత్‌లో 2002లో ముస్లిం మైనార్టీలపై జరిగిన మారణకాండ, మణిపూర్లో ఇప్పటికీ కొనసాగుతున్న కుకీ మైనార్టీలపై మారణకాండలు మనదేశంలో మైనార్టీల స్థితిగతులకు అద్దం పడుతున్నాయి. అంతేకాదు. మైనార్టీలకు ఈ దేశంలో జీవనం ప్రశ్నార్ధకంగా మార్చివేశాయి.
వివక్ష – సామాజిక అణిచివేత..
బంగ్లాదేశ్‌లో ముస్లింలు మెజారిటీలు, హిందువులు మైనార్టీలు. అక్కడ మైనార్టీల పరిస్థితిని తస్లీమా నస్రీన్ (ఒక ముస్లిం రచయిత్రి) తన ”లజ్జ” నవలలో కళ్ళకు కట్టినట్లు వివరించారు. అక్కడి మెజారిటీ మత ఛాందసుల దాడికి గురయ్యింది. అమెరికా వంటి అగ్రదేశంలో నల్లజాతీయులైన మైనారిటీలు ఎటువంటి వివక్షకు గురవుతున్నారో ఇప్పటికీ జార్జ్ ఫ్రాయిడ్‌ని ఊపిరాడనీయక చంపేసిన వైనం మనందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
రాజస్థాన్‌లో ఒక పాఠశాలలో దళిత విద్యార్థి కుండలో గ్లాసుతో నీళ్ళు ముంచుకొని తాగాడని ఆ బాలుడిని కొట్టి, అతని మరణానికి కారణమైన ఉపాధ్యాయుడు ఎటువంటి కులరహిత, వివక్షారహిత సమాజాన్ని నిర్మించగలడు? మూఢనమ్మకాలతో బాబాలను ఆశ్రయిస్తూ పాదధూళి కోసం పరుగులు తీసి, ప్రాణాలు పోగొట్టుకున్నవారి మూర్ఖత్వంలో ప్రభుత్వమూ, రాజ్యం పాత్ర లేకపోలేదు. నాణ్యమైన విద్యను అందించడంలో వైఫల్యం ఉపాధ్యాయులకు ఆపాదించి, చేతులు దులిపేసుకుంటున్న ప్రభుత్వాలు ప్రైవేటీకరణకు, కార్పొరేటీకరణకు ఎర్ర తివాచీలు పరిచి మరీ ఆహ్వానిస్తున్నాయి. అటు ఆరోగ్యమూ లేక, సరైన వైద్యమూ అందక పేదరికంతో అలమటిస్తున్న ప్రజలు తమ వెనుకబాటుతనానికి తమ విధిరాతే కారణమనుకుంటూ మూఢ విశ్వాసాలతో దోపిడీకి గురవుతున్నారు.
హక్కుల కోసం పరిష్కారమార్గం..
ఈ రోజు ఇజ్రాయిల్ అమెరికా అండదండలతో పాలస్తీనాను అణచి వేస్తుంది. భారతదేశం, బంగ్లాదేశ్‌లో మెజార్టీ మతోన్మాదులు మైనారిటీ మతాలను అణిచివేయాలని, మత చిచ్చులు పెట్టడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాయి. కులవివక్ష అంటరానితనం 75 ఏళ్ళ రాజ్యాంగం ఇచ్చిన హక్కులూ, రిజర్వేషన్ల తర్వాత కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రైవేటీకరణ పెరిగిపోయిన నేపథ్యంలో తక్కువ వేతనంతో శ్రామికులు ఎక్కువ పని గంటలు పనిచేయవలసి వస్తుంది. ఆర్థికంగా కుటుంబ పోషణలో తన భాగస్వామ్యమున్నా, నిర్ణయాధికారం మాత్రం మహిళలు పొందలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో ఎవరి పక్షంలో ఉండాలో పెరియార్ మనకు సూచించారు. ఆ దిశగా వెళ్లేటప్పుడు, గళం విప్పేటప్పుడు అనేక అడ్డంకులు, అవాంతరాలు, అవరోధాలు రావడం అనివార్యం. వాటిని అధిగమించటానికి పోరాటమే సరైన మార్గం.
నేడు దేశంలో, రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల అభివృద్ధి మరింత దిగజారింది. వారి భాష, సంస్క ృతులకు రక్షణ లేకుండా పోతోంది. రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తుల దురాక్రమణ యథేచ్ఛగా కొనసాగుతోంది. వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేసి, దానికి ఎండోమెంట్ శాఖ మాదిరిగా అధికారాలనిచ్చి వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు కృషి చేయవలసిన ప్రభుత్వం ఆ ఆస్తుల పట్ల ఉదాసీన భావంతో వ్యవహరిస్తోంది. మైనారిటీ ఫైనాన్సు కార్పొరేషన్, ఉర్దూ అకాడమీలకు వేతనాలకు తప్ప నిధులు ఇవ్వనందున అవి కునారిల్లిపోతున్నాయి. ముస్లిం విద్యార్థులు విదేశాల్లో చదువుకోవటానికి గత కొన్నేళ్లు ఇస్తున్న ఆర్థిక సహాయాన్నీ గత ప్రభుత్వం ఆపివేయటం దురదృష్టకరం. షాదీ ముబారక్, రంజాన్ తోఫా లాంటి కార్యక్రమాలు నిలిచిపోయాయి. మాటలలో ముస్లింల సంక్షేమం తప్ప ఆచరణలో వారి అభివృద్ధికి ఏ కార్యక్రమం అమలు జరగని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం బిజెపి భాగస్వామ్యం చేసుకున్నాక కేంద్రం కనుసన్నల్లోనే పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం విద్వేష దాడులు, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం రెండూ కలిసి ముస్లిం ప్రజల అభ్యున్నతికి శాపాలుగా మారాయి. ఈ పరిస్థితుల్లో ముస్లిం ప్రజలను సంఘటితం చేసి, వారి మౌలిక హక్కుల కోసం, అభివృద్ధిలో ఆ ప్రజలకు తగిన నిధుల కోసం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఒత్తిడి పెంచాల్సిన అవసరం నేడు ఎంతైనా వుంది. అందుకు లౌకిక పార్టీలు, సంఘాలు ముస్లిం మైనారిటీలకు అండగా ఉండాలి. అవసరమైతే ఉద్యమ రూపంలో వారిని ముందుకు నడిపించాలి. మైనారిటీలను భాగస్వాములను చేసి, లౌకిక విలువలను కాపాడేందుకు, రాజ్యాంగ మౌలిక సూత్రాల పరిరక్షణకు దేశంలో సాగే విశాల ఉద్యమంలో.. మైనారిటీల హక్కుల కోసం సాగే ఆందోళన కూడా ఒక భాగమేనని గ్రహించాలి. మైనారిటీల ఐక్య ఉద్యమాలే మైనారిటీ సంక్షేమానికి పునాదవుతాయి. నేడు ఈ కర్తవ్య సాధనకు అందరం నడుం బిగించాలి.
నివేదికలు చెప్పింది ఇవే..
మైనార్టీల దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని వివిధ ప్రాంతాల్లో సభలు సమావేశాలు జరిపి, ముస్లిం ప్రజల సంక్షేమం గురించి ఉపన్యాసాలతో.. మైనారిటీల సంక్షేమాన్ని ముగించటం ద్వారా ”మైనారిటీ హక్కుల దినోత్సవం” దేశంలో ఒక తంతుగా మారింది.
స్వాతంత్య్రానంతరం ముస్లిం మైనారిటీల ఆర్థిక, సామాజికాభివృద్ధి, రాజకీయ ప్రాతినిధ్యంపై అనేక సర్వేలు జరిగాయి. గతంలో గోపాల్‌సింగ్ కమిషన్, ఆ తర్వాత రాజేంద్ర సచార్ అధ్యక్షతన ఏర్పడిన సచార్ కమిటీ, జస్టిస్ రంగనాథ్ మిశ్రా అధ్యక్షతన పనిచేసిన మైనారిటీ కమిషన్లు ఏర్పడ్డాయి. ఇవన్నీ మైనారిటీల సమస్యలపై, విద్య, వైద్యం, సామాజిక అభివృద్ధి, ఉపాధి, పరిశ్రమలు, వ్యాపారం తదితర రంగాలపై లోతైన అధ్యయనం చేశాయి. దేశంలోని ముస్లిం ప్రజలు విద్య, ఉపాధి రంగాల్లో దేశంలోని ఇతర ప్రజలతో పోల్చితే చాలా వెనకబడి వున్నారని చెప్పాయి. ఉన్నత విద్యలో దళితులు, గిరిజనుల కంటే కూడా అధ్వాన్నమైన స్థితిలో ఈ తరగతి ప్రజలు వున్నారని సచార్ కమిటీ నివేదిక వెల్లడించింది. అంతేగాక, విద్యలో ముస్లిం మహిళలు దేశంలోనే అందరికంటే వెనుకబడి వున్నారని, వ్యాపార రంగంలో ఈ తరగతి ప్రజలకు జాతీయ బ్యాంకులు చేస్తున్న సాయం నామమాత్రంగా వుందనీ పేర్కొంది. ఈ పరిస్థితి మారనట్లయితే భవిష్యత్తులో ముస్లిం మైనారిటీలు దేశ ప్రధానస్రవంతి నుండి వేరుపడతారనీ హెచ్చరించింది. ఈ ప్రతిపాదనతో పాటుగా దేశంలోని జమ్ము-కాశ్మీర్ మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో ముస్లిం మైనారిటీలకు అన్ని అభివృద్ధి పథకాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, జమ్ము-కాశ్మీర్‌లో మాత్రం హిందూ ప్రజలకు ఆ 10 శాతాన్ని రిజర్వు చేయాలని రంగనాథ్ మిశ్రా కమిషన్ చెప్పింది.
వలసపోతున్నారు…
వలస కార్మికులు ఇప్పుడు దేశం వెలివేసిన అనాథలు. ప్రభుత్వాలు పట్టించుకోని నిరాశ్రయులు. ఉన్న ఊరుని, కన్నవారిని, తమ చుట్టూ వున్న బంధాలను వదిలేసి.. దుఃఖపు నదిలా మారి, వలసబాట పడతారు. సొంతూరిలో సంపాదించలేని పనిని, పొరుగూరులోనైనా సాధించొచ్చన్న ఆశతో బయల్దేరతారు. ఒక ఊరి కాపు.. మరో ఊరిలో పాలేరు అన్న చందంగా వుంటుంది వీరి బతుకు పోరాటం.
- యం.డి. షకీలా బేగం