పుడమిని పరిరక్షించుకుందాం..

Apr 21,2024 12:14 #Sneha

‘నేలమ్మ.. నేలమ్మ.. నేలమ్మా… నీకు వేల వేల వందనాలమ్మా..’ అని భూమిని సమస్త జీవకోటికి ప్రాణం పోసే తల్లిగా, పచ్చి బాలింతగా అభివర్ణించారు కవి సుద్దాల అశోక్‌ తేజ. అటువంటి అమ్మ పాలు తాగి, రొమ్ము గుద్దుతున్న పరిస్థితి. ప్రకృతిని నాశనం చేసే దిశగా చర్యలు సాగిస్తూ ఆ అమ్మకే కంటనీరు తెప్పిస్తున్నాం. గాలి, నీరు, నేల, నింగిని కాలుష్యం చేస్తూ మానవ మనుగడను అస్తవ్యస్తం చేస్తున్నాం. జీవజాతులకు ముప్పు తెచ్చిపెడుతున్నాం. అగ్నికి ఆజ్యం తోడైనట్లు కార్పొరేట్ల గనుల తవ్వకాలు.. ప్రకృతిని కొల్లగొట్టే చర్యలు మరింతగా పర్యావరణాన్ని సర్వనాశనం చేస్తున్నాయి. వీటన్నింటి పర్యవసానాలే.. భూగోళం వేడెక్కిపోతోంది. గత కొన్ని ఏళ్లగా వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. అసాధారణ ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. రికార్డులు బద్దలయ్యేలా వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి. ప్రాంతాలకు అతీతంగా వడగాడ్పులు, రికార్డు స్థాయి అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఓ హెచ్చరిక. రుతుపవనాలు గతి తప్పుతున్నాయి. కాలాలు మారుతున్నాయి. అడవులు అంతరిస్తున్నాయి. మంచుకొండలు కరుగుతున్నాయి. వర్షాలు ఆవిరవుతున్నాయి. భూమి బీటలు వారి, వ్యవసాయం కుంటుపడుతోంది. ఆహార కొరత ఏర్పడుతోంది. ఇది మానవాళికే పెను ప్రమాదం. భవిష్యత్తు తరాలకు ప్రశ్నార్థకం. అందుకే ఇప్పుడైనా మేల్కొందాం. పచ్చని చెట్లతో భూ వాతావరణాన్ని పరిరక్షించుకుందాం. భూమాతను కాపాడుకుందాం. ఈ నెల 22న ‘ప్రపంచ భూమి దినోత్సవం’ సందర్భంగా ఈ ప్రత్యేక కథనం..

దిమ కాలంలో మనిషి అడవుల్లో జీవించాడు. నదీతీరం లేదా పర్వత ప్రాంతం- ఇదే మొత్తం ప్రపంచమని అనుకునేవాడు. కాలం గడిచేకొద్దీ మానవ సమాజం అభివృద్ధి చెందింది. మానవులు జీవన కార్యకలాపాల కోసం, వ్యాపార వాణిజ్యాల కోసం, నదీనదాలూ, మహాసాగరాలూ దాటుకుంటూ ఈ భూగోళమంతా విస్తరించారు. విజ్ఞానం పెంచుకున్నారు. దాంతోపాటే మానవులకు అవసరాలూ పెరిగాయి. పెట్టుబడుదారులు, కార్పొరేట్‌ శక్తులు తమ అవసరాలకు మించీ విశ్వాన్ని కబళించేయాలని చూస్తున్నాయి. ఆ దిశగా ఇప్పటి ధరిత్రిని అస్థిరపరిచే ఎన్నో దుశ్చర్యలకు పాల్పడ్డారు. ప్రకృతి వనరులు దెబ్బతీయడంతో, అవి తరిగిపోవడం మొదలయ్యాయి. ఇవన్నీ శీతోష్ణస్థితిలో మార్పులకు కారణమయ్యాయి. ప్రపంచస్థాయిలో పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి. పర్యవసానంగా జనబాహుళ్యానికి, జీవజాతుల మనుగడకు హాని కలుగుతుంది. అందుకే పర్యావరణ సమస్యల నివారణకు అంతర్జాతీయ స్థాయిలో సదస్సులు, ఒప్పందాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ అశ్రిత పెట్టుబడిదారుల చేతుల్లో ఉన్న దేశాల్లో ఏవీ అమలు కావడం లేదు.

అణు బాంబులతో విధ్వంసం..
అమెరికా వంటి అగ్ర దేశాల దగ్గర ధరిత్రిలోని అన్ని జీవాలను సర్వనాశనం చేయ గల అణుబాంబులు ఉన్నాయి. వీటిని అమ్ముకుని, కోట్లు గడించాలన్న కుటిలబుద్ధితో దేశాల మధ్య సరిహద్దు చిచ్చులు పెడుతోంది అమెరికా. అందుకు నిదర్శనం ఇజ్రాయిల్‌ గాజాపై సాగిస్తున్న దుర్మార్గమైన దాడి. ఇజ్రాయిల్‌ అధ్యక్షుడు నేతాన్యాహు అమెరికా అండతో గత ఏడాది అక్టోబర్‌ నుంచి పాలస్తీనా ప్రజలపై మరణహోమం సాగిస్తున్నాడు. నివాస ప్రాంతాలపై, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలపై తెల్ల భాస్వరంతో తయారుచేసిన బాంబులు వేస్తున్నారు. ఈ దాడి సుమారు ఆరు నెలలుగా కొనసాగుతోంది. ఫాస్పరస్‌ బాంబు దాదాపు అణుబాంబు వలే అత్యంత ప్రమాదకరమైనది. తెల్ల భాస్వరం, రబ్బరు కలిపి వైట్‌ ఫాస్పరస్‌ బాంబును తయారుచేస్తారు. భాస్వరం అనేది మైనపు లాంటి రసాయనం. ఇది లేత పసుపు లేదా రంగు లేకుండా, కుళ్ళిన వెల్లుల్లిలా ఘాటైన వాసనతో ఉంటుంది. ఇది ఆక్సిజన్‌తో కలిసినప్పుడు వెంటనే మంటలు చెలరేగుతాయి. ఆపై దానిని నీటితో కూడా ఆర్పలేము. ఇదే అత్యంత ప్రమాదకరం. ఆక్సిజన్‌తో రియాక్టివ్‌గా ఉండటం వల్ల, అది ఎక్కడ పడితే అక్కడ ఆ ప్రదేశంలోని ఆక్సిజన్‌ను వేగంగా పీల్చుకోవడం ప్రారంభిస్తుంది. అలాంటి పరిస్థితిలో అనేకమంది ఊపిరాడక మరణిస్తారు. అది పూర్తిగా నాశనమయ్యే వరకూ మండుతూనే ఉంటుంది. ఎన్ని నీళ్లు పోసినా అది అంత తేలికగా ఆరదు. పైగా దాని పొగ మరింత పొగలు వ్యాపింపజేస్తూ.. దట్టమైన పొగలతో మేఘాలను సృష్టిస్తుంది. ఈ విధ్వంసంతో అక్కడ పుడమి తీవ్రంగా వేడెక్కి, బూడిదైపోతుంది. ఇది ఆ దేశానికే కాదు.. ప్రపంచానికే పెనుముప్పుు. అందుకే ఈ యుద్ధాన్ని వెంటనే నివారించాలి. అందుకే ప్రపంచ ప్రజలంతా నడుం బిగించాలి. భూతాపాన్ని చల్లార్చే చర్యలకు పూనుకోకపోతే మన భవిష్యత్తు మన చేతిలో నుంచి జారిపోతుంది.

వర్షాభావంతో ఆహార కొరత..
ఇటీవల కాలంలో అభివృద్ధి పేరుతో ప్రకృతి వనరులన్నింటినీ దోచుకుంటున్నారు కార్పొరేట్‌ శక్తులు. అటవీహక్కుల చట్టాలను తుంగలో తొక్కి, అడవులను నరికేస్తున్నారు. గనులను, శిలాజ ఇంధనాలను పరిమితి లేకుండా తవ్వుతున్నారు. ఇలాంటి కార్యకలాపాల కారణంగా ఉపరితల ఉష్ణోగ్రత మరింతగా పెరిగిపోతోంది. దీంతో నీరంతా ఆవిరైపోతుంది. సముద్రాలు, సరస్సుల్లో నీటి స్థాయిలు తగ్గిపోతున్నాయి. ఫలితంగా వర్షాలు పడటం లేదు. దేశంలో సాధారణంగా 868.6 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. 820 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఋతుపవనాల కాలంలో.. 94 నుంచి 106 మధ్య వర్షపాతం రికార్డైతే.. సాధారణంగా పరిగణిస్తారు. ఈసారి నైరుతి రుతుపవనాలతో 94.4 శాతం వర్షపాతం నమోదైంది. అనువైన వర్షాలు లేక నదులు, చెరువులు ఎండిపోయాయి. గత ఏడాది ఖరీఫ్‌లో వర్షాలు రాకపోవడంతో విత్తనాలు కూడా వేయని పరిస్థితి నెలకొంది. బోరుబావుల కింద పంటలు సాగు చేద్దామంటే భూగర్భజలాలు అడుగంటి సేద్యం కష్టమైపోయింది. వ్యవసాయానికి సరైన నీరు లేక ఈ ఏడాది దిగుబడి తగ్గిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
భూమిపై మానవ మనుగడ సాగాలంటే.. ముందు తిండి కావాలి. వర్షాలు లేక ఈ ఏడాది ధాన్యం ఆశించిన స్థాయిలో పండలేదు. భవిష్యత్తులో ఆహార కొరత ఏర్పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుత మన దేశంలో 28 కోట్ల ప్రజలు అర్ధాకలితోనూ, 21 కోట్ల మంది అనారోగ్యంతోనూ, 18.7 శాతం జనాభా పోషకాహార లోపంతో సతమతమవుతున్నారని ఆర్థిక నివేదికలు తెలుపుతున్నాయి. అందులోనూ 15-24 ఏళ్ల మధ్య వయసున్న యువత 58.1 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇలానే భూమిని నాశనం చేస్తే భవిష్యత్తు తరాల ఆరోగ్యమూ ప్రమాదంలో పడిపోతుంది.

తరిగిపోతున్న అడవులు..
భూమ్మీద 2022-23 మధ్య చెట్లు వ్యాపించి ఉన్న విస్తీర్ణం ఏకంగా 9.7 శాతానికి తగ్గిపోయి, 2.28 కోట్ల హెక్టార్లకు పరిమితమైంది. కెనడాలో మునుపెన్నడూ లేని స్థాయిలో అడవులు కార్చిచ్చులకు దగ్ధమైపోయాయి. ఈ ఏడాది కోటి 66 లక్షల హెక్టార్లలో అడవులు బూడిదైపోయాయి. ప్రపంచ మానవాళి ధనదాహానికి ఇప్పటికే 46 శాతం అడవులు కనుమరుగయ్యాయి. పట్టణీకరణ, జనాభా పెరుగుదల వల్ల వచ్చే 200 ఏళ్లలో 54 శాతం అడవులు హరించుకుపోవచ్చని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. మన దేశం విషయానికొస్తే.. 33.3 శాతం అడవులు వుండాలి. కానీ, 21 శాతానికి మించిన వన సంపద లేదు. విలువైన వనాలు నరికేస్తున్నా, అడ్డుకోవాల్సిన ప్రభుత్వాలే అనుమతులు ఇస్తున్నాయి. ఫలితంగా 420 కోట్ల సంవత్సరాల ధరణీతలం.. అభివృద్ధి పేరుతో జరుగుతున్న భీభత్సం కారణంగా.. భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాలు మరింతగా పెరుగుతాయి. భూమి మీద ఉన్న సమస్త జీవజాతుల జీవనం అస్తవ్యస్తమవుతుంది.

ప్రమాదంలో తూర్పు కనుమలు..
తూర్పు కనుమలు హిమాలయాల కంటే పురాతన పర్వతశ్రేణులు. ఇవి ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ మీదుగా తమిళనాడు వరకూ విస్తరించి ఉన్నాయి. తెలంగాణ, కర్ణాటకలోని కొన్ని భాగాలను ఇవి తాకుతాయి. మన రాష్ట్రంలో 40 శాతం విస్తరించి ఉంటే.. ఒడిశా, తమిళనాడులో 25 శాతం చొప్పున, కర్ణాటక, తెలంగాణలో ఐదు శాతం చొప్పున వీటి విస్తీర్ణం ఉంది. మన రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకూ ఇవి విస్తరించి ఉన్నాయి.
వాతావరణ సమతుల్యతను కాపాడటం, జీవవైవిధ్యాన్ని పెంపొందించడంలో తూర్పు కనుమలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. నైరుతి, ఈశాన్య ఋతుపవనాల గమనంలోనూ వీటి పాత్ర ఎంతో కీలకం. మన రాష్ట్రానికి జీవనదులుగా ఉన్న కృష్ణా, గోదావరి సహా అనేక నదుల్లో నీరు చేరడానికి ఈ పర్వతశ్రేణులు ఎంతగానో దోహదపడుతున్నాయి. ఆ నదులు పుట్టింది పశ్చిమ కనుమల్లో అయినా.. వాటిలో ప్రవహించే నీరు చాలావరకూ తూర్పు కనుమల్లో పుట్టిన ఉపనదుల నుంచే వస్తుంది. మన రాష్ట్రంలో వంశధార, నాగావళి, చంపావతి, గోస్తనీ, శబరి, సీలేరు, తమ్మిలేరు, గుండ్లకమ్మ, స్వర్ణముఖి, కుందు వంటి అనేక ఉప నదులు ఈ కనుమల్లోనే పుట్టి, ప్రధాన నదుల్లో కలుస్తున్నాయి. ఆ నదుల్లోని నీటినే మనం తాగడానికి, ఆహార ధాన్యాలు పండించడానికి వినియోగిస్తాం.
తూర్పు కనుమల్లోని అడవులు వేగంగా తరిగిపోతున్నట్టు అశోక్‌ ట్రస్ట్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ ఎకోలజీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (ఏటీఆర్‌ఈఈ) ఇటీవల జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ఏటా సగటున 28 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం భూకబ్జాదారులు ఆక్రమిస్తున్నారు. చెట్లను నరకడం, మైనింగ్‌ వల్ల ఈ దుస్థితి ఏర్పడుతోంది.
పాపికొండలు, నాగార్జునసాగర్‌ – శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ వంటి రక్షిత ప్రాంతాలలో అడవులు వివిధ జంతు జాలాలకు నిలయంగా ఉన్నాయి. పాడేరు, అరకు, అనంతగిరి, లంబసింగి వంటి ప్రాంతాల అడవులు ఇప్పటికే ఆక్రమణకు గురయ్యాయి. తూర్పు కనుమలు దెబ్బతింటే ఆ ప్రభావం ఈ నదులన్నింటిపై పడుతుంది. అప్పుడు ఈ నదుల నీటిపై ఆధారపడిన రైతులు, సామాన్య ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అలాంటి తూర్పు కనుమల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.

రసాయనాలతో పెనుముప్పు..
నేలంటే నిర్జీవ పదార్థం కాదు. లక్షలాది జీవజాతులు, పోషకాలతో కూడిన జీవావరణం. వ్యవసాయం కోసం విచ్చలవిడిగా వాడుతున్న రసాయనాలు భూమిని నిస్సారంగా, నిర్జీవంగా మార్చుతున్నాయి. జీవం కోల్పోయిన నేల.. సారం లేని బూడిదలా మారిపోయింది. అలాంటి నేలలో దిగుబడులు కూడా అంతంత మాత్రంగానే వుంటాయి. తక్కువ సమయంలో పంట దిగుబడి బాగా రావాలని విపరీతమైన రసాయనిక ఎరువులు వాడుతున్నారు. దిగుబడులను పెంచుకోవాలనే దురాశతో విషపూరితమైన పురుగుమందులు చల్లుతున్నారు. దీంతో భూమి మరింత నిర్జీవంగా మారిపోతోంది. దీర్ఘకాలంగా రసాయనాలు వాడకం వల్ల దిగుబడులు దారుణంగా పడిపోతాయి. అందుకే సహజసిద్ధమైన మందులు, పర్యావరణ అనుకూల విధానాల అనుసరించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. రైతులకు అవగాహన కల్పించి, ప్రకృతి సాగుకు ప్రోత్సహించాలి. అప్పుడే నిర్జీవం కోల్పోయిన నేలమ్మ పచ్చగా కళకళలాడుతుంది.

ప్లాస్టిక్‌ నిషేధం
ప్లాస్టిక్‌ వ్యర్థాలు భూమిలో కలిసిపోని పదార్థం. వందల సంవత్సరాలు అలాగే ఉంటుంది. ఫలితంగా, ప్లాస్టిక్‌ వ్యర్థాలు మన వాతావరణంలో పేరుకుపోతాయి. పర్యావరణ వ్యవస్థకు గణనీయమైన ముప్పును కలిగిస్తాయి. ఈ మధ్యకాలంలో సముద్రాల్లో వేల టన్నుల ప్లాస్టిక్‌ బాటిల్స్‌ కలుస్తున్నాయి. వాటివల్ల జలచరాలకు గణనీయమైన ముప్పు వాటిల్లుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. సముద్ర తాబేళ్లు, డాల్ఫిన్లు, తిమింగలాలు వంటి సముద్ర జీవులు ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఆహారంగా తీసుకుంటున్నాయి. దాంతో వాటి శరీరభాగాలు దెబ్బతిని, మరణానికి దారితీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్షులు, చిన్న చేపలు, జంతువులు ప్లాస్టిక్‌ వ్యర్థాలలో చిక్కుకుపోతున్నట్లు వీడియోల ద్వారా గ్రహించారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలు విచ్ఛిన్నమైనప్పుడు, పర్యావరణంలో హానికరమైన రసాయనాలను విడుదలై, మానవ ఆరోగ్యానికి ముప్పు కలుగుతోంది.
ఇంతటి ప్రమాదాన్ని వెంటనే అరికట్టేలా ప్రపంచ దేశాలు చర్యలు చేపట్టాలని ఎర్త్‌ డే అధికారిక నిర్వాహకులు సూచిస్తున్నారు. ‘ప్లానెట్‌ వర్సెస్‌ ప్లాస్టిక్స్‌’ లక్ష్యంగా 2024 ప్రపంచ ఎర్త్‌ డే థీమ్‌గా పిలుపునిచ్చారు. ప్రజలకు ప్లాస్టిక్‌ వాడకం ప్రమాదాన్ని, దాని కాలుష్యాన్ని, భయంకరమైన పరిణామాల గురించి అవగాహన పెంచేలా అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. ప్లాస్టిక్‌ వినియోగం, ఉత్పత్తిని తీవ్రంగా తగ్గించడానికి ప్రపంచ దేశాలు కృషి చేయాలి. ప్రపంచ ప్లాస్టిక్‌ రహిత భవిష్యత్తును సాధించాలనే అంతిమ లక్ష్యంతో 2040 నాటికి అన్ని ప్లాస్టిక్స్‌ ఉత్పత్తిని 60 శాతం తగ్గించాలని శక్తివంతమైన సందేశాన్ని నిర్వాహకులు ఇచ్చారు. దీన్ని ప్రతిఒక్కరూ ఓ ఉద్యమంలా ఉధృతం చేయాలని కోరుతున్నారు.
మనమంతా వాతావరణంలో మార్పుల గురించి మరింతగా తెలుసుకోవాలి. స్థానికంగా జరిగే పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలలో భాగమవ్వాలి. ఇందుకోసం మనం వెచ్చించే ప్రతి నిమిషమూ భూ పరిరక్షణకు వెచ్చించాలి. చేయి చేయి కలిపి భూమిని మనం కాపాడుకుందాం.

పద్మావతి
9490559477

➡️