మనుషులుగా మిగులుదాం

Sep 29,2024 09:30 #Poetry, #Sneha

దేశాల ఆక్రమణ
దేహాల ఆక్రమణ
మతాల ఆక్రమణ
మౌఢ్యాల ఆక్రమణ
వినిమయాల ఆక్రమణ
ఆలోచనల ఆక్రమణ
ఎటు చూసినా.. ఏది చూసినా..
ప్రతిదీ ఆక్రమణ
ఆక్రమణ కోసం పారిస్తున్న
రక్త నదులు ఎన్నని?
ఆక్రమణ కోసం పోగుపడుతున్న
శవాల గుట్టలు ఎన్నని?
ఆక్రమణ కోసం వెదజల్లబడుతున్న
ద్వేషం ఎంతని?
ఆక్రమణ కోసం రగిలించబడుతున్న
కుంపట్లు ఎన్నని?
ఆక్రమణ కోసం తగలబడుతున్న
మందుగుండు ఎంతని?
ఆక్రమణ కోసం వ్యర్థమవుతున్న
మేధస్సు ఎంతని?
లైంగిక దాడులు
ఆకలి చావులు
మూకుమ్మడి హత్యలు
పరమత ద్వేషాలు
సరిహద్దుల కంచెలు
ఇజాల సంఘర్షణలు
ఆక్రమణ కోసం ఎన్నెన్నెన్నని?
కోల్పోని వాడెవడిక్కడీ
చివరకు గెలుపుగా మిగిలే వాడెవడట?
ఎందుకురా ఈ ద్వేష ప్రలాపాలు?
ఎందుకురా స్వార్థపూరిత ప్రవచనాలు?
మనిషిని మనిషిగా చూడని సిద్ధాంత
మత రాద్ధాంతాలు?
అనుక్షణం ఆక్రమణ అభిజాత్యాలు?
వినాశనాన్ని విడిచి
నిర్మాణాన్ని ప్రేమిద్దామా!
ద్వేషాన్ని తరిమి
మానవత్వాన్ని వెలిగిద్దామా!
నవ్వుల వెలుగుతో
లోకాన్ని నింపేద్దామా!
అంతిమంగా..
మనుషులుగా మెలుగుదామా!
మనుషులుగానే మిగులుదామా!!

– వి.ఆర్‌. తూములూరి
9705207945

➡️