సమాజంలో నేటికీ వివక్షకు గురవుతున్న వారిలో వికలాంగులు (విభిన్న ప్రతిభావంతులు) ఒకరు. అవయవాలు సరిగా లేకున్నా అన్ని రంగాల్లో రాణిస్తున్న వీరికి నిత్యం చీదరింపులు, హేళనలు ఎదురుకావడం నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. సమాజ ఉత్పత్తిలో వీరి భాగస్వామ్యం ఉంటున్నా సరైన గుర్తింపు దక్కకపోవడం వ్యవస్థ వైఫల్యాన్ని పట్టి చూపుతుంది. జాలి, దయ కాదు హక్కులు కావాలని, సాటి మనుషులుగా తమనూ గుర్తించాలని డిసెంబర్ 3 వికలాంగుల దినోత్సవం సందర్భంగా వికలాంగులు నేడు నినదిస్తున్నారు. వారి గురించి ఈ ప్రత్యేక కథనం..
సమగ్రమైన, స్థిరమైన భవిష్యత్తు కోసం వికలాంగుల నాయకత్వాన్ని పెంచాలని 2024 ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. వాస్తవానికి వికలాంగులలో సామాజిక చైతన్యం కల్పించి వారిని సమాజంలో భాగస్వామ్యం చేసేందుకు, సమాన అవకాశాలు పొందేందుకు, సమాజంలో గౌరవ ప్రదంగా జీవించేందుకు, సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం చేసేందుకు 1992 నుంచి ప్రతి ఏటా డిసెంబర్ 3న అంతర్జాతీయు వికలాంగుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రజలందరి కోసం సమగ్రమైన, స్థిరమైన ప్రపంచాన్ని సృష్టించడంలో వికలాంగుల పాత్ర కీలకమైంది. కానీ వారికి సరైన గుర్తింపు దొరకడం లేదు.
ఆరోగ్య అసమానతలు..
ప్రపంచ జనాభాలో 130 కోట్ల మంది అంగవైకల్యం కలిగి ఉన్నారు. ఇది ప్రపంచ జనాభాలో 16 శాతం. ప్రతి ఆరుగురిలో ఒకరు అంగవైకల్యం కలిగి ఉన్నారని పలు సర్వేలు చెబుతున్నాయి. ఆరోగ్య అసమానతల వల్ల అంగవైకల్యం కలిగిన వారు సకలాంగులతో పోలిస్తే 20 సంవత్సరాల ముందే మరణిస్తున్నారు. ఆరోగ్య అసమానతల వల్ల వికలాంగులు మెరుగైన వైద్యం పొందడంలో వెనుకబడి ఉంటున్నారు. డిప్రెషన్, ఆస్తమా, మధుమేహం, గుండెపోటు, ఊబకాయం వంటి అనారోగ్య సమస్యలు వికలాంగులలో రెండు రెట్లు అధికంగా ఉంటున్నాయి. వివక్ష వీరిని వెంటాడుతోంది. పేదరికం, విద్య, ఉపాధి అవకాశాలు లేకపోవడం, ఆరోగ్య సంరక్షణ, సౌకర్యాలు కొరవడటం వంటి కారణాల వల్ల వికలాంగులు ఆరోగ్య అసమానతలను ఎదుర్కొంటున్నారు. మోడల్ డిసెబిలిటీ సర్వేలో సహాయ పరికరాలు ప్రతి పదిమందిలో ఒకరికి మాత్రమే అందుబాటులో ఉన్నాయని తేలింది. ఈ క్రమంలో డబ్ల్యుహెచ్‌ఓ 2030 నాటికి కొన్ని లక్ష్యాలను నిర్దేశించింది. వీటి ద్వారా వికలాంగులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులో రావడానికి అవకాశముంది.
వైకల్యం లేని స్త్రీలతో పోలిస్తే వైకల్యం కలిగిన స్త్రీలు 2 – 4 రెట్లు జీవిత భాగస్వామితో హింసను అనుభవిస్తున్నారు. వికలాంగులు ఎదుర్కొంటున్న ఆరోగ్య అసమానతలను పరిష్కారం చేయడానికి అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం ప్రకారం ప్రపంచ దేశాలు బాధ్యత వహించాలి. కానీ ఆ పని సక్రమంగా జరగడం లేదు.
వైకల్యానికి కారణమేంటి?
పేదరికం, పోషకాహార లోపం, విద్య, ఆరోగ్య సంరక్షణ లేకపోవడం, కలుషిత వాతావరణం, సురక్షిత నీటి సౌకర్యం, పారిశుధ్యం కొరవడటం వల్ల సమాజంలో వికలాంగులు పెరుగుతున్నారు. తక్కువ వేతనాలతో పనిచేయడం, వైకల్యం వల్ల జీవన వ్యయం పెరగడం వల్ల వికలాంగులు పేదరికాన్ని అనుభవిస్తున్నారు. సమాజాభివృద్ధిలో వికలాంగుల భాగస్వామ్యంపై ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాల్లో అవగాహన పెరుగుతోంది. యునైటెడ్ నేషన్ కన్వెన్సన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిసెబిలిటీని 185 దేశాలు ఆమోదించడం వల్ల సమాజంలో వికలాంగులకు ఐక్యం చేయడానికి ఐక్యరాజ్య సమితి కృషి చేస్తోంది.
అందని ద్రాక్షగానే..
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లు, రాజ్యాంగం అమల్లోకి వచ్చి 74 ఏళ్లు పూర్తయ్యాయి. రాజ్యాంగంలో పేర్కొన్న స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం వంటివి వికలాంగులకు నేటికీ అందని ద్రాక్షగానే మిగిలాయి. ఆర్టికల్ 14 నుండి 19 వరకు సమాజంలో పౌరులందరూ సమానమేనని, ఎలాంటి వివక్షా ఉండరాదని పేర్కొన్నారు. అవి మాటలకే పరిమితమయ్యాయి. సమాజంలో నేటికీ వికలాంగులు ద్వితీయశ్రేణి పౌరులుగానే బతకాల్సి వస్తోంది. వికలాంగులు అంటేనే చిన్నచూపు చూస్తున్నారు. విద్యా, ఉద్యోగాల్లో సైతం వివక్ష కొనసాగడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.
విద్య, ఉద్యోగాల్లో న్యాయమైన వాటా వికలాంగులకు దక్కకపోవడం ద్వారా అనేకమంది ఉన్నత చదువులు చదివి, నిరుద్యోగులుగా మారుతున్నారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ నియామకాల్లో నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి. వికలాంగులకు ప్రత్యేక స్కూల్స్, ప్రత్యేక శిక్షణ పొందిన టీచర్లను ఏర్పాటు చేయాల్సి ఉన్నా అమలు కావడం లేదు. ఆటిజం, అంధత్వం, వినికిడి సమస్యతో బాధపడే విద్యార్థులకు ప్రత్యేక పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించాలని 2017, అక్టోబర్ 30న సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వికలాంగులకు చదువు చెప్పేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అత్యున్నత న్యాయస్థానం ఒకవైపు ఆదేశిస్తుంటే.. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో వికలాంగులను చేర్చుకోలేనటువంటి సంఘటనలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. ప్రభుత్వ శాఖల్లో కేడర్ స్ట్రెంత్ ప్రకారం వికలాంగుల ఖాళీ పోస్టులను ప్రకటించాలిగానీ ఆ పని సక్రమంగా జరగడం లేదు. వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం 2016లో అమల్లోకి వచ్చినప్పటికీ నేటికీ ఆంధ్రప్రదేశ్‌లో డ్రాఫ్ట్ రూల్స్‌ను రూపొందించలేదు. దీంతో చట్టం కాగితం పులిగానే మిగిలింది.
వికలాంగుల పోరాటాల ఫలితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల సంక్షేమం కోసం అనేక చట్టాలను చేశాయి. వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం 2016, ఇంటర్ హెల్త్ కేర్ 2017, నేషనల్ ట్రస్ట్ చట్టం, ఆటిజం యాక్ట్, ఐక్యరాజ్యసమితి హక్కుల ఒప్పందం వంటివి దేశంలో వికలాంగుల సంక్షేమం కోసం ఉద్దేశించబడ్డాయి. కానీ అవేవీ పటిష్టంగా అమలు కావడం లేదు. పెట్టుబడిదారులకు సానుకూల వాతావరణం కల్పించాలనే పేరుతో క్రిమినలైజింగ్ మైనర్ అపెక్స్ అంటూ కార్మిక చట్టాలను సవరించి నాలుగు లేబర్ కోడ్స్‌గా అమల్లోకి తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం వికలాంగుల చట్టాలను కూడా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం 2016లోని సెక్షన్ 89, 92, 93లను రద్దు చేయాలని, 1999 నేషనల్ ట్రస్టు చట్టాన్ని సవరించాలని, దేశవ్యాప్తంగా ఉన్న తొమ్మిది నేషనల్ ఇనిస్టిట్యూషన్స్‌ను విలీనం చేయాలని చేసిన ప్రయత్నాలను వికలాంగులు పోరాటాలతో తిప్పికొట్టారు.
సుగమ్య అభియాన్ దేనికోసం?
కేంద్ర ప్రభుత్వం సామూహిక ప్రాంతాలను వికలాంగులు వినియోగించుకునే విధంగా మార్చాలన్న ఉద్దేశంతో సుగమ్య అభియాన్ భారత్ పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టింది. 2022 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన పట్టణాల్లో 50 శాతం పట్టణాలను అవరోధ రహితంగా మార్చాలని నిర్దేశించిన లక్ష్యం నేటికీ నెరవేరలేదు. నేటికీ సామూహిక ప్రాంతాలు వికలాంగులకు అందనంత దూరంలో ఉన్నాయి. ప్రధానమంత్రి మోడీ వికలాంగులకు దివ్యాంగులుగా నామకరణం చేశారు. పేరైతే మార్చారుగానీ వారి సంక్షేమానికి ఎటువంటి చర్యలూ చేపట్టకపోవడం శోచనీయం. ఇప్పటికైనా ప్రభుత్వం వికలాంగుల సంక్షేమంపై దృష్టి సారించాలి.
ఎం.అడివయ్య
9490098713