సమర్ధుని జీవయాత్ర

Feb 11,2024 08:54 #Sneha, #Stories
Life journey of the able story

జనసాంద్రతతో బాగా రద్దీగా వున్న ఆ జంక్షన్లో వాహనాలు ఒకదానిని మించి మరొకటి శరవేగంతో దూసుకుపోతున్నాయి. పక్క మనిషిని పట్టించుకునే తీరికా, ఓపికాలేని సమాజానికి సజీవసాక్ష్యంగా ఉరుకులు, పరుగులతో వాయువేగాన్ని మించి ముందుకు సాగిపోతున్నారందరూ!

అందరి మొహాల్లోనూ ఒకటే ఆరాటం! తమ జీవితాల్ని మరింత వేగవంతంగా, మెరుగ్గా మలుచుకోవాలనే ఆతృత సుస్పష్టంగా ప్రస్ఫుటమవుతోంది. అందరూ తమ గమ్యాలకు వీలైనంత త్వరగా చేరుకోవాలనే తాపత్రయం కనిపిస్తోంది. అదే రోడ్డుమీద ఊపిరి సలపని ఊహాలకు, లెక్కలకందని ఆశలకూ అతీతంగా జీవించే మనోహర్‌ తన ఆఫీస్‌ పని ముగించుకుని కారులో ప్రశాంతంగా ఇంటికి వెళ్తున్నాడు.

మనోహర్‌..! ఓ ప్రముఖ బ్యాంకులో మేనేజర్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. జీవితాన్ని హాయిగా అస్వాదిస్తూ, కాస్త బాధ్యతని జోడించి ఆహ్లాదంగా, నిష్కల్మషంగా బ్రతికెయ్యడమే అతని లైఫ్‌ ఫిలాసఫి!. మనోహర్‌ మనసున్న మంచి మనిషి. అలాగే రచయిత కూడా! రచనా వ్యాసంగమే అతని ఒంటరి జీవితానికి దొరికిన ఏకైక ఆలంబన.

మనోహర్‌ తన చుట్టూ చోటుచేసుకున్న ప్రతి విషయాన్నీ, ప్రతి సంఘటనీ ప్రత్యేక దృష్టికోణంలో దర్శిస్తుంటాడు. అంతేకాకుండా-తోటి సంఘజీవిగా తనవంతు సామాజిక బాధ్యతని నిర్వర్తిస్తుంటాడు. సరిగ్గా అప్పడే రోడ్డుమీద ఓ సంఘటన చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న ఓ కారుకి ఆకస్మికంగా కుక్క అడ్డుగా వచ్చింది. దాంతో ఆ కారు సడన్‌ బ్రేక్‌ వేయడంతో ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ కారు వెనుకనే వేగంగా వస్తోన్న లారీ కారుని బలంగా ఢకొీట్టింది. అంతే పెద్ద శబ్దం భయంకరంగా వినిపించింది. ఒక్కసారిగా జనమందరూ ఆ ప్రదేశానికి పరుగు తీశారు.

తన కారులోంచి ప్రమాదాన్ని గుర్తించిన మనోహర్‌ తన కారుని రోడ్డుకు ఓ పక్కగా ఆపి, ప్రమాదానికి గురయిన కారు దగ్గరకు వేగంగా పరుగెత్తిక్కెళ్లాడు. ఓ పెద్దాయన ఆ కారులో చిక్కుకుపోయివున్నాడు. అతనికి సుమారుగా యాభై అయిదేళ్లుంటాయి. అతని తలకు పెద్దగాయమై, మొహమంతా రక్తం ధారలు కట్టింది.

మనోహర్‌ కారులో చిక్కుకుపోయిన అతన్ని బయటకు తీయడానికి డోరు తెరిచే ప్రయత్నం చేశాడు. కానీ డోరు తెరుచుకోలేదు. మనోహర్‌ డోరు తెరవడానికి గుమిగూడిన కొందరిని సాయం కోరాడు. కొంతమంది కాస్త సంశయంతో ముందుకు రాగా, వారి సాయంతో కారు డోరుని అతికష్టం మీద తెరిచాడు. వెంటనే నూట ఎనిమిదికి కాల్‌ చేసి, వివరాలు చెప్పాడు. మనోహర్‌ తన చేతిరుమాలు తీసి రక్తం ఓడుతున్న అతని తలకి కట్టుకట్టాడు. ఆ పెద్దాయన ఆయాసంతో రొప్పుతున్నాడు. మనోహర్‌ అతన్ని తన ఒడిలోకి తీసుకుని ‘మీకేమి కాలేదు. భయమేమీలేదు..’ అంటూ ధైర్యం చెప్తూ మనోనిబ్బరాన్ని కలిగిస్తున్నాడు. ఇంతలో సైరన్‌ మోతతో అంబులెన్సు వచ్చింది. అతన్ని జాగ్రత్తగా స్ట్రెచర్‌ పై పడుకోబెట్టి, గబగబా అంబులెన్సులోనికి చేర్చారు. అప్పటికే ఆ అంబులెన్సులో మరో పేషంట్‌ ఉండడంతో, అంబులెన్సుతో వచ్చిన కేర్‌ టేకర్‌ ఎవరో ఒకరిని తనతో రమ్మనమని కోరాడు. ఎవరికివారు తమకు వీలుకాదంటూ వెనక్కు వెళ్లిపోయారు.

మనోహర్‌ మరో ఆలోచనలేకుండా తను వస్తానని చెప్పాడు. అతను లోపల కూర్చున్నాక అంబులెన్సు బయల్దేరింది సైరన్‌ మోగుతూ. ప్రమాదానికి గురైన ఆ పెద్దాయన గజగజా వణికిపోతూ శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. అంబులెన్సు కేర్‌ టేకర్‌ ఆక్సీజన్‌ పైపు ముక్కుకీ, నోటికీ తగిలించి, అతని మొహంమీద దారలుకట్టిన రక్తాన్ని కాటన్‌తో తుడుస్తున్నాడు.

మనోహర్‌ ఆ పెద్దమనిషి పక్కనే కూర్చుని ధైర్యాన్నిస్తున్నట్టుగా అతని చేయి గట్టిగా పట్టుకున్నాడు. అతని శరీరం సన్నగా వణుకుతోంది. ఆ వ్యక్తి అంత అవస్థలోనూ మనోహర్‌ వంక కృజ్ఞతాపూర్వకంగా చూశాడు. అతను భయంతో సన్నగా మూలుగుతున్నాడు. క్రమేపి అతని కళ్లు మగతతో మూతలు పడిపోతున్నాయి.

మనోహర్‌, అతని కుటుంబసభ్యులకు సమాచారం అందించటం కోసం, అతని ప్యాంటు జేబులోని మొబైల్‌ ఫోన్‌ చేతిలోకి తీసుకున్నాడు. రీసెంట్‌ కాంటాక్ట్స్‌లో వున్న అతని కూతురుకి ఫోన్‌ చేసి, విషయాన్ని చెప్పాడు. ఆందోళన చెందాల్చిన అవసరంలేదని భరోసా కలిగించాడు. మనోహర్‌, ఆమె సూచించిన హాస్పిటల్‌కి అంబులెన్సుని పోనిమ్మన్నాడు.

అంబులెన్సు, ఆ హాస్పిటల్‌ ముందర ఆగిన వెంటనే అప్పటికే సిద్ధంగా వున్న ఆసుపత్రి సిబ్బంది హడావిడిగా ఆ పెద్దాయన్ని ఎమర్జన్సీ వార్డులోకి తీసుకెళ్లారు. అప్పుడు చూశాడు మనోహర్‌ ఆందోళనగా కన్పించిన రమణిని! యాక్సిడెంట్‌కి గురైన ఆ పెద్దాయన రమణి కన్నతండ్రేనని అవగతం కావడానికి మనోహర్‌కి అట్టే సమయం పట్టలేదు.

రమణి…! ఒకప్పుడు తనెంతో గాఢంగా ప్రేమించిన కలల రాణి! మనోహర్‌ వైపు హృదయపూర్వకంగా చూస్తూ కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పుకుంది, మౌనంగా. ఆమె కళ్ళల్లో నీరు తెరలుతెరలుగా చిప్పిళ్ళుతున్నాయి. తన తండ్రికి ఏమీకాదన్న కొండంత నమ్మకాన్ని కలిగిస్తూ, ఎంతో ఉపశమనాన్నిచ్చాడు. మనోహర్‌, రమణీకి అండగా హాస్పిటల్లోనే ఉండిపోయాడు. మనోహర్‌లో తమ ఇరువురి గతానికి సంబంధించిన ఆలోచనలు ముసురుకున్నాయి.

****************************

అది సాగరతీరం. చాలా మంది యువతీయువకులూ, కొంతమంది పెద్దవాళ్లు సైతం ఉల్లాసంగా, ఉత్సాహంగా బాధలన్నీ మర్చిపోయి ఆ సముద్రపు ఒడ్డున చిన్నపిల్లల్లా కేరింతలు కొడుతూ, సేదతీరుతున్నారు. అక్కడి వాతావరణానికి విరుద్ధంగా మనోహర్‌ అంతరంగం ఆ సముద్రాన్ని తలపిస్తూ అల్లకల్లోలంగా వుంది. అతని పక్కనే ఇసుకతెన్నెలపై కూర్చున్న రమణి గొంతు విప్పుతూ చాలాసేపటిగా తమ మధ్య నెలకొన్న నిశ్శబ్దాన్ని చేధిస్తూ

‘డాడికి ఎంతో చెప్పి చూశాను. మన పెళ్లి కావాలంటే.. నీకు ఉద్యోగం లేకపోయినా ఫర్లేదు కానీ, నువ్వు ఇష్టపడే ఆ సాహిత్యాన్ని పూర్తిగా వదిలిపెడితేనే మన వివాహానికి ఒప్పుకుంటానన్నారు..’ అంది.

రమణి మనోహర్‌ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అసలు విషయాన్నీ ధ్రువపరిచింది. ఆమె మాటలకు గొంతు పెగుల్చుకోలేక మనోహర్‌ మౌనంగా ఉండిపోయాడు. అతని మొహంలో అంతులేని నిరాశానిస్పృహలు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. హృదయమంతా బాధతో బరువెక్కిపోయింది. రమణి అతని మౌనాన్ని భగంచేస్తున్నట్టుగా, వేదనని వేయిరెట్లు అధికం చేస్తున్నట్టుగా ‘మనూ.. నీకు నేను కావాలో, నీ సాహిత్యం కావాలో స్పష్టంగా తేల్చుకో..’ నిష్కర్షగా చెప్పింది.

రమణి మాటలకు మనోహర్‌ శరీరంలో కించిత్‌ కూడా చలనంలేకుండా ఉన్నచోటునే స్థాణువైపోయాడు. అతని మనసు వేదనతో రోదిస్తోంది. తన కంట్లోంచి నీళ్లు బైటకు రాకుండా అతను చేస్తోన్న విశ్వప్రయత్నం విఫలమైనట్లుగా నెమ్మదిగా ఉబికుబికి ఊటలా తన్నుకొస్తున్నాయి.

మనోహర్‌ మానసికస్థితిని గమనించని రమణి తన ధోరణిలో చెప్పుకుపోతోంది.

‘నువ్వు మంచి రచయితవే కావచ్చు. మంచి కుటుంబీకుడివి కావాలన్నదే నాన్న ఆలోచన. నువ్వు జీవితంలో ఎన్నడూ సాహిత్యం జోలికి పోకూడదన్నదే నాన్నగారి ముఖ్యమైన షరతు. అలా అయితేనే మనిద్దరి పెళ్లి జరిపించడానికి ఎటువంటి అభ్యంతరంలేదని చెప్పమన్నారు..’ అని మధ్యలో ఆగిపోయింది.

‘మన పెళ్ళికీ, సాహిత్యానికీ ముడిపెట్టడం చాలా కష్టంగా ఉంది..’ ఇబ్బందిగా గొంతు పెగుల్చుకున్నాడు మనోహర్‌.

‘ఈ విషయంలో నేను నాన్నతో విభేదించలేను. వాళ్లెంతో జీవితాన్ని చూచినవాళ్ళు. నేను నాన్న మాటను జవదాటలేను. నాన్నను మెప్పించి, ఒప్పించాల్సిన బాధ్యత నీదే…!’ అంది రమణి. తన తండ్రి మాటనే కొంతవరకు సమర్థిస్తూ.

‘కథలూ, కవిత్వం రాసేవాళ్లంటే ఎందుకంత చులకన భావన మీ నాన్నగారికి?!’ ఆవేదనగా అడిగాడు మనోహర్‌. రమణి ఏమీ మాట్లాడలేదు. ఆమె మౌనం అర్ధమైనట్టుగా మనోహర్‌ ఒక నిశ్చయానికి వచ్చాడు. ‘ఎవరూలేని నాకు సాహిత్యమే నన్ను నాన్నలా పాలిస్తోంది. అమ్మలా లాలిస్తోంది. అదే నాకున్న ఏకైక ఆలంబన! ఐశ్వర్యం…!!”అంటూ ఆరోజు అలా ఆమె నుండి భారంగా, దూరమైపోయాడు.

*******************************

మూడేళ్ల కిందట జరిగిన ఆ సంఘటన తాలూకా చేదుజ్ఞాపకాలను నుండి అతన్ని వేరుచేసినట్లుగా ఆ ఐసియూ గదిలోంచి ఓ నర్సు గబగబా బయటికి వచ్చి ‘మీలో ఎవరికైనా ఏబీ నెగటివ్‌ బ్లడ్‌ గ్రూప్‌ వుందా?!’ రమణి, మనోహర్లను ఉద్దేశిస్తూ అడిగింది ఆతృతగా.

ఆమెకు బదులిస్తున్నట్టుగా ఇద్దరూ ఒకేసారి ‘లేదు..’ అన్నారు నీరసం ధ్వనించిన స్వరంతో. వారు చెప్పింది విన్న ఆ నర్స్‌ ‘మా హాస్పిటల్‌ స్టోర్లో గానీ, బయట బ్లడ్‌ బ్యాంకుల్లోగానీ ఈ బ్లడ్‌ అందుబాటులో లేదు. అర్జెంటుగా ఆ బ్లడ్‌ గ్రూప్‌ వున్నవారు కావాలి. మీకు తెలిసిన వాళ్లెవరైనా ఉంటే కనుక్కోండి. టైమ్‌ లేదు..’ అందామె.

రమణి, మనోహర్‌ ఇద్దరూ గబగబా తమ ఫోన్లను చేతిలోకి తీసుకుని తెలిసినవారందరికీ ఫోన్లు చేశారు ఎంతో ఆరాటంగా. ఫలితం మాత్రం శూన్యం. ప్రతి ఒక్కరి నుండి తమది ఆ బ్లడ్‌ గ్రూప్‌ కాదనే సమాధానం వారిద్దరినీ మరింత నిస్తేజానికి గురిచేసింది.

ఇంతలో ఆ హాస్పిటల్లోని స్టాఫంతా హడావిడి పడుతున్నారు. ఆ హాస్పిటల్‌ ఎండి డాక్టర్‌ రవికిరణ్‌ అన్ని వార్డులను విజిట్‌ చేస్తున్నారట. సిబ్బందంతా ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.

ఇంతలో హాస్పిటల్‌ ఎండి డాక్టర్‌ రవికిరణ్‌ తన ఆకస్మిక తనిఖీలో భాగంగా ఐసియూ గదికి దగ్గరగా వస్తున్నారు. రమణీ, మనోహర్లూ తమ దగ్గరగా వస్తోన్న అతనికి గౌరవసూచికంగా పక్కకు నిలుచున్నారు. పేషెంట్లకు సంబంధించిన కొంతమంది డాక్టర్‌ రవికిరణ్‌కు నమస్కరిస్తున్నారు.

అతను తన సౌమ్యమైన చిరునవ్వుతో ముందుకు నడుస్తున్నాడు. అతను తెల్లటి కోటులో చాలా హుందాగా కనిపిస్తున్నాడు. అతని ప్రక్కన కొంతమంది డాక్టర్లు వినయంగా ఏదో చెప్తున్నారు. అతనూ ఓ డాక్టర్‌ కావడంతో వాళ్ళు చెప్తున్నది శ్రద్దగా వింటూ ముందుకు అడుగులు వేస్తున్నాడు. అతను రమణీ, మనోహర్లూ నిల్చున్న ఐసియూ గదిని దాటి ముందుకు సాగిపోతుండగా ఏదో గుర్తు వచ్చినట్లుగా చప్పున ఆగిపోయాడు. అతని వెంట నడుస్తోన్న ఆ ఆసుపత్రి సిబ్బంది అంతా అతనితోపాటు ఆగిపోయారు. అందరిలోనూ అప్రమత్తత!!

వెనక్కి తిరిగిన డాక్టర్‌ రవికిరణ్‌, మనోహర్‌ వైపు తేరిపార చూస్తున్నాడు. అతని వెంట నడుస్తోన్న ఓ డాక్టర్‌ చూపులు అర్ధం కానట్టుగా ‘వాట్‌ హేపెన్డ్‌, సార్‌…?!’ అడిగాడు కాస్త ఆశ్చర్యంగా.డాక్టర్‌ రవికిరణ్‌, సాలోచనగా మనోహర్‌కు దగ్గరగా అడుగులు వేశాడు. అతని వెనకున్న స్టాఫ్‌ అంతా అతన్నే అనుసరించారు. అప్పటికే ఇదంతా గమనించిన రమణీ, మనోహర్లూ తమ దగ్గరకు వస్తోన్న డాక్టర్‌ రవికిరణ్‌ని విస్మయంతో చూశారు.

వారిద్దరినీ సమీపించిన డాక్టర్‌ రవికిరణ్‌ ‘మీరూ.., ప్రముఖ రచయిత మనోహర్‌ గారా..?!’ అడిగాడు తన అనుమానాన్ని నివృత్తి చేసుకుంటున్నట్టుగా. అతని ప్రశ్నకు ‘అవునండి…” అని మనోహర్‌ అయోమయంగా మొహంపెట్టి, బదులిచ్చాడు.’నా పేరు డాక్టర్‌ రవికిరణ్‌. నేను సాహిత్యానికి వీరాభిమానిని. మీరు రాసిన రచనలు మిస్‌ కాకుండా చదువుతాను’ అంటూ తనని మనోహర్‌కూ పరిచయం చేసుకుంటూ ఉద్వేగంగా అన్నాడతను.

అంత పెద్ద హాస్పిటల్‌ ఎండీ, ఎటువంటి ఇగో లేకుండా మాట్లాడేసరికి, ఎలా స్పందించాలో మనోహర్‌కూ అర్థం కాలేదు. కొన్ని క్షణాల అనంతరం ‘మీ అభిమానానికి కృతజ్ఞతలు…!’ అన్నట్టుగా చిన్నగా నవ్వేసాడు.’ఏమైంది, మనోహర్‌ గారూ, ఈజ్‌ దేర్‌ ఎనీ ప్రాబ్లం?!’ ఆడిగాడు. బ్లడ్‌ గ్రూప్‌ అడిగిన ఆ నర్స్‌ ముందుకు వచ్చి ‘ఇతనికి కావలసిన మనిషికి ఏబీ నెగటివ్‌ బ్లడ్‌ అర్జెంటుగా కావాలి, సార్‌! ప్రస్తుతానికి ఆ బ్లడ్‌ గ్రూప్‌ అందుబాటులో లేదు… ‘ అంటూ మనోహర్‌ సమస్యని వివరంగా చెప్పింది.

ఆమె చెప్పినది విని డాక్టర్‌ రవికిరణ్‌ నుదుటిపై చేతిని అనించుకుని ‘బ్లడ్‌ బ్యాంకులన్నింటికి కాల్‌ చేశారా? అలాగే ఆ గ్రూవు సంబంధించిన వారి కాంటాక్ట్‌ నెంబర్లుకి కాల్‌ చేశారా?!” విషయాన్ని పరిష్కరించే దిశానిర్దేశం చేస్తూ అడిగాడు.

‘ఎస్‌ డాక్టర్‌!, మన దగ్గర ఏబీ నెగెటివ్‌ బ్లడ్‌ గ్రూప్‌కు సంబంధించి రెండు కాంటాక్ట్‌ నెంబర్లు మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి ఔట్‌ ఆఫ్‌ కవరేజ్‌ ఏరియా అని వస్తోంది. మరొకాయన ఎబ్రాడులో ఉంటున్నారు సార్‌…!’ అందామె వినయంగా డాక్టర్‌ రవికిరణ్‌కు విషయాన్ని విశదీకరిస్తూ.

‘నో ప్రోబ్లెం, నాది అదే గ్రూపు కదా! ఆ ఏర్పాట్లు చూడండి. పదండి నేను వస్తున్నాను…’ అన్నాడు డాక్టర్‌ రవికిరణ్‌ ఆ నర్స్‌ని అనుసరించమని చెబుతూ. అతని మాటలకు అతని వెంటవున్న సిబ్బంది అంతా ఆశ్చర్యంగా చూశారు. అంతవరకూ ఎవరో తెలియని ఒక మామూలు రచయిత కోసం తమ ఎండి ఇంతలా స్పందించడాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు.

కొద్దిసేపటి తర్వాత బయటకొచ్చిన డాక్టర్‌ రవికిరణ్‌కి కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలో అర్థంకాక, మనోహర్‌ తనరెండు చేతులెత్తి అతనికి దండంపెట్టాడు. అతను మనోహర్‌ని వారిస్తున్నట్టుగా ‘మీలాంటి గొప్ప సాహితీమూర్తులకు మాలాంటి వాళ్లే దండంపెట్టాలి… మీ రచనలు ఆలోచింప చేస్తాయి. హృదయానికి హత్తుకుంటాయి.’ అన్నాడు.

డాక్టర్‌ రవికిరణ్‌, మనోహర్‌ మొబైల్‌ నెంబరు తీసుకుని, తన మొబైల్‌ నెంబరు ఇస్తూ ‘ఏమైనా సమస్య ఉంటే మీరు నాకు కాల్‌ చెయ్యొచ్చు…” అంటూ అభిమానం కూడిన నిండైన భరోసానిస్తూ అతను వెళ్ళిపోయాడు.

మనోహర్‌, ఆ రాత్రంతా రమణికి తోడుగా ఆసుపత్రిలోనే ఉండిపోయాడు. తెల్లవారుజామున లేచి, సాయంత్రం వస్తానని ఇంటిముఖం పట్టాడు. ఐసియూలో వున్న వీరభద్రం కళ్ళు తెరిచారు. కొంచెం తేరుకున్నాక…రమణీ తన తండ్రికి జరిగినదంతా చెప్పింది.

ఆ రోజు రచయిత అయినందుకుగానూ అతని ప్రేమని నిర్దాక్షిణ్యంగా తను తిరస్కరించినా మనోహర్‌ తనపట్ల చూపించిన అభిమానానికీ, చొరవకీ చాలాసేపూ ఆలోచనల్లో పడిపోయారు వీరభద్రం.మనోహర్‌లోని ఏ రచయితను తాను వద్దకునున్నాడో, ఆ రచయిత అనే గుర్తింపే ఈనాడు తనని ప్రాణాలతో నిలబెట్టిందన్న విషయం వీరభద్రాన్ని మరింత వేదనకు గురిచేసింది.

ఆరోజు సాయంత్రం….

‘నాన్నగారు రమ్మంటున్నారంటూ….’ రమణి నుండి మనోహర్‌కి ఫోన్‌ కాల్‌ వచ్చింది. మనోహర్‌ ఆఫీస్‌ పని ముగించుకొని ఆ సాయంత్రమే ఆసుపత్రికి వెళ్లాడు. రమణి అతని కోసమే ఎదురు చూస్తోంది. బెడ్‌ మీద పడుకున్న వీరభద్రం, మనోహర్‌ రాగానే ఓపికచేసుకుని, లేచి కూర్చున్నారు.మనోహర్‌ని చూడగానే ఏమీ మాట్లాడకుండా కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఏదో తెలియని అపరాధభావంతో పూడుగుపోయిన తన గొంతుని నెమ్మదిగా పెగుల్చుకున్నారు.

‘బాబూ, రచయితల గురించి తప్పుగా భావించుకుని మిమ్మల్నిద్దరినీ ప్రేమకు దూరం చేశాను. రచయితలంటే సిగ్గు, మొహమాటాలతో అంతర్గతంగా, బాహ్యంగా ఎదగడం చేతకానివారని, తను జీవితం గురించి ఆలోచనలేకుండా, కేవలం సమాజం మార్పుకోసం కేవలం అక్షరాలతో కుస్తీలుపట్టే చేతకానివారని ఒకప్పుడు నమ్మాను. ఈ రోజు నీవు చేసిన మేలు జన్మలో మరిచిపోలేను. ఈ ఆసుపత్రి ఎండి గారే రక్తంమిచ్చి ప్రాణం పోశారంటే మీ ఔన్నత్యమే…’ అన్నారు పశ్చాత్తాపంతో నిండిన స్వరంలో.

కొద్దిసేపు ఆ గది గాఢమైనా నిశ్శబ్దంతో నిండిపోయింది. కొన్నిక్షణాల అనంతరం మళ్ళీ ఆయన కలగచేసుకుంటూ..’ మీలాంటి అక్షరశిల్పులు నూతన సమాజానికి ప్రగతి బాటలువేసే చరిత్రకారులుగా నిలుస్తారు…’ అన్నారు వీరభద్రంగారు మనోహర్‌ని మెచ్చుకోలుగా చూస్తూ.

తన ప్రేమనూ, అభిరుచినీ అర్ధంచేసుకున్నందుకు నోటమాటరాక మౌనంతో కృతజ్ఞతాపూర్వకంగా తన రెండుచేతులెత్తి అతనికి మనోహర్‌ నమస్కరించాడు. వెంటనే మనోహర్‌, రమణి కలిసి వీరభద్రం పాదాలకు నమస్కరించారు. హృదయపూర్వకంగా అక్కునచేర్చుకుని, అవధులులేని ఆనందంతో ఆశీర్వదించారు.

  • శ్రీనివాసరావు తిరుక్కోవుళ్ళూరు
  • 99128 48738
➡️