లిటిల్‌ నైబర్స్‌

Jun 9,2024 09:04 #Sneha

ఫోన్‌ స్విచాఫ్‌ అయ్యేదాకా వాడేసి, ఛార్జింగ్‌ పెట్టి తోచక, పక్కింట్లోకి తొంగి చూస్తూ ఉన్నాను. చాన్నాళ్లకి మా ఫ్లోర్‌లో మా పక్కన ఖాళీగా ఉన్న ఇంట్లోకి మళ్లీ ఓ కుటుంబం వచ్చారు. పెద్ద పెద్ద శబ్దాలు, హడావిడి చేసుకుంటూ మరీ వస్తున్నారు. వారింట్లో వింతగా, ఎవ్వరూ ఫోన్లు వాడట్లేదు. ఒక్క నిమిషం ఫోన్‌ లేకపోతే బతకలేని నాకు అది వింతగా అనిపించింది. సరే, ఏ ట్యాబో, లాప్టాప్‌ కూడా లేదు, టీవీ లేదు. బాబోరు ఇదేం ఫ్యామిలీ రా బాబు, అనుకున్నా.
వారి దినచర్య, తెగ కష్టపడి పని చేసుకోవడం, ఆ రోజుకి సరిపడా తినడం, మిగిలితే మర్నాడికి దాచుకోవడం, హాయిగా నిద్రపోవడం. వారి సామాను వారే తెచ్చుకుంటున్నారు. ఎంతో తృప్తిగా ఉన్నారు. నాన్నగారు సామాను తెచ్చే పనికి బయటకి వెళతారు, అప్పటిదాకా అమ్మేమో ఇంటిపట్టున ఉంటూ, చుట్టూ గమనించుకుంటూ ఉంటుంది. నాన్నగారు అలసిపోయి వచ్చేసరికి, ప్రేమగా ఆ సామాను తన నోటితో అందుకుని లోపల గూట్లో పెడుతుంది అమ్మ.
నేను కూర్చుని ఇది చూసినది అయిదు నిమిషాలు. నాకు తోచక, వాళ్ళలా ఎన్నిసార్లు తిరుగుతున్నారో అని లెక్కపెట్టడం మొదలుపెట్టి, బద్ధకానికి కౌంటే 5 దగ్గరే ఆపేసాను. వాళ్ళు మాత్రం ఈ పనిని ఓ రెండు మూడు వందల సార్లు లేదా ఇంకా ఎక్కువ సార్లే, హుషారుగా చేసుకుంటున్నారు.
ఇది మొదటి సారి కాదు, ఇప్పటిదాకా ఎన్నో కుటుంబాలు వచ్చాయి. కొందరేమో, ఒక్క పిల్లాడితోనే నిశ్చింతగా హాయిగా ఉండి వెళ్ళిపోయేవారు. ఇంకొంతమందేమో బోలెడంత మంది పిల్లలు, బోలెడు భాధ్యత, హడావిళ్ళతోనే తృప్తిగా ఉండేవారు. ఒకరు తరువాత ఒకరు వస్తూ స్వేచ్చగా, మా బాల్కనీలోని ఔటర్‌ ఏసీని చక్కగా, తరతరాలుగా వాళ్ళ ఇళ్లు చేసేసుకున్నారు.
వాళ్ళ దారి వాళ్ళది, మా దారి మాది. మమ్మల్ని పెద్దగా ఇబ్బందేమీ పెట్టరు. కాకపోతే ఒకోసారి నేను బాల్కనీలో బ్రష్‌ చేసుకుంటున్నా, అమ్మ బట్టలారేస్తున్నా, వాటి ఇల్లు కట్టుకునే రొటీన్‌ డిస్ట్రర్బ్‌ అయిపోతుంది. అందుకని పెద్ద గడ్డి చిన్ని నోటితో పట్టుకుని వచ్చి వాలి, కీచ్‌ కీచ్‌ కుచ్‌ క్రుచ్‌ అని చాలా సీరియస్‌గా మాపై అరిచేస్తాయి. అప్పుడు మేము ఉన్నపళంగా పనాపేసి పక్కకి దూరంగా వెళ్లిపోవాలి. అప్పుడవి వచ్చి, నిర్మొహమాటంగా అసలు కంగారే లేకుండా అంతా సర్దుకుని, రెండు మూడు సార్లు చూస్కుని వెళ్ళిపోతాయి. అప్పుడు మేము వెళ్లి మళ్లీ మా పనిచేసుకోవచ్చు.
కొన్నిరోజులకి కాం అయిపోతుంది మా బాల్కనీ అంతా. ఇంకొన్ని రోజలకి బుల్లి బుల్లి ఆకలరుపులు వినపడతాయి. అప్పుడు అమ్మానాన్నల హడావిడి తిరుగుళ్ళు మళ్లీ మొదలవుతాయి. అలా ఒకరోజు, ఎక్కువ ఆకలేసేసి, అమ్మ తెచ్చిన ఆహారమంతా నేనే తినేద్దామన్న ముద్దైన స్వార్థంలో, తొందరపడి నోరు ఎక్కువ తెరిచేసి ముందరికి వంగే ప్రయత్నంలో దుబుక్‌మని కిందపడిపోయింది ఓ కంగారు పిచ్చుక పిల్ల. దానికోసం మళ్లీ, safe foods to feed a chicklingµ’ అని నెట్‌లో రీసెర్చ్‌ చేసి, సూది తీసి సిరంజ్‌తో బనానా జ్యూస్‌ 10 నిమిషాలకు ఓ సారి పట్టి, రెండు రోజులు పాట్లు పడి, నిచ్చనెక్కి మొత్తానికి దాన్ని మళ్లీ గూట్లో పెట్టాము.
ప్రపంచంలో ఏం జరుగుతోంది, ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, కరోనా కేసులు తగ్గాయా, మళ్లీ ఏ కొత్త వైరస్‌ వచ్చింది, బిట్కాయిన్‌ వాల్యూ ఎంతుంది, షేర్స్‌ పడిపోయాయా, పెరిగాయా, కుక్కట్పల్లిలో ప్లాట్‌ ఎంత రేట్‌ ఉంది, ఏ సినిమా రిలీజ్‌ అయింది, అసలు సమంతా నాగచైతన్య ఎందుకు విడిపోయారు, అసలు ఇందులో ఒక్క విషయం కూడా అక్కర్లేదు వీళ్ళకి.

In the world full of our so called problems and complications regarding beauty, wealth, popular gadgets, comparisons and on and on and on, here they are, our little neighbours, living the busiest yet a lovely, most productive, de-digitalised life full of nothing but just the real problems, precious moments and making all the cutest of memories.

పెద్ద పెద్ద గడ్డిపూలు, చాలా మెత్తగా ఉండే ఆకులు, ఎక్కడో ఒకచోట గుట్టలుగా దొరికేసిన అన్నం మెతుకులు, వాటి గూడుకు దగ్గరగా ఓ అక్క పెట్టిన చిన్న దూది ముక్క, సరదాగా తడిపే బరువులేని చిన్ని వర్షం, వెచ్చదనమిచ్చే బుజ్జి మెత్త గూడు, ఆకలి తీరిపోయినా ఆహారం తెచ్చి నోట్లో ప్రేమగా పెట్టేసే అమ్మానాన్న, కళ్ళ ముందే బుజ్జిబుజ్జిగా ఉంటూ, పెరిగిపోయి ఒకరోజు ఎగరడం నేర్చుకుంటూనే బయటకి ఎగిరిపోయే పిచ్చుక పిల్లలు.
అమ్మా నాన్న పిచ్చుకల కష్టమైన ఆనందపు సాగనంపులు, వారి అందమైన జీవితం.
నాకు మాత్రం వారితో పాటు, ఓ చెట్టు కొమ్మపై కూర్చుని, చూస్తూ వింటే, ఎన్ని సార్లు విన్నా బోరుకొట్టని అరుదుగా దొరికే ఓ బుజ్జి అందమైన కథ, తాజా అమాయకపు కబుర్లు…

  • సాయి మల్లిక పులగుర్త
    mallika.quill@gmail.com
➡️