తారుమారు

Dec 1,2024 11:56 #katha, #Sneha

‘నాన్నా బస్సు ఎక్కేసాను. రేపు ఉదయం ఆరు గంటలకల్లా బస్సు వైజాగ్‌ చేరుకుంటుంది. లగేజీ పెద్దగా లేదు. ఒక పెట్టే కాబట్టి, నేను నేరుగా ఇంటికి వచ్చేస్తాను. మీరు బస్టాండ్‌కి రాకండి’ అంది పాప మనీష ఫోన్లో.
‘సరే…అమ్మా.. జాగ్రత్త’ అన్నాడు తండ్రి బంగార్రాజు.
బంగార్రాజు రెండవ కుమార్తె మనీష. బీ.టెక్‌.థర్డ్‌ ఇయర్‌ పరీక్షలు రాసింది వైజాగ్‌లో. పెద్దమ్మాయి హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో జాబ్‌ చేస్తోంది. సెలవులు కదా..! అక్క దగ్గరకు వెళతానంటే తల్లిదండ్రులు మనీషాని పంపారు. ఓ పదిహేను రోజులు వుండి, ఆ రోజు తిరిగి వస్తోంది తను. మనీషా కాలేజీలో క్యాంపస్‌ సెలెక్షన్సు జరుగుతున్నాయి. ఆ రోజే తనకి ఇంటర్వ్యూ. పది గంటలకల్లా తను కాలేజీలో ఉండాలి. టైముకి చేరగలదో? లేదో?.. బస్సు లేటయిపోతేనో! అని ఆలోచిస్తూ తెగ టెన్షన్‌ పడిపోతున్నాడు బంగార్రాజు. ఒకరోజు ముందు రావలసింది.. కానీ ఏదో కారణాల వల్ల ట్రైన్‌ క్యాన్సిల్‌ ఆయిపోయింది. మర్నాడు ఏ ట్రైన్‌కీ రిజర్వేషన్‌ దొరకకపోతే తప్పక బస్సులో బయలుదేరి వస్తోంది. అంతా లాస్టు మినిట్‌ వ్యవహారం అయిపోయింది. వీళ్లకి ఎప్పుడు బుద్ధి వస్తుందో అని అనుకుంటూ తెగ కంగారు పడిపోతున్నాడు.
ఉదయం నాలుగు గంటలకే లేచి కూర్చున్నాడు బంగార్రాజు. బస్సు ఎంతవరకు వచ్చిందో తెలుసుకుందామని ఫోన్‌ చేసాడు మనీషకి. స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. ‘ఇదొకటి.. ఫోన్‌ ఛార్జింగులో ఉంచుకోవాలని తెలియదూ..?’ అని కసురుకున్నాడు. టెన్షన్‌ మరింత పెరిగిపోయింది తనకి. ‘అసలే రెండురోజుల నుండి కుండపోతగా వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌లో కూడా నిన్న వర్షమేనట. త్రోవలో వర్షం ఎంత పడిందో.. బస్సు అసలు నడుస్తోందో.. లేక ఎక్కడైనా ఆగిపోయిందో?.. ఏమీ తెలీదు. రాత్రి ఏ పన్నెండో ఒంటిగంట దాకానో ఫేసుబుక్కో చూస్తూ కూర్చోవడం నిద్ర మానుకొని. ఫోన్‌ ఛార్జింగ్‌ వుందో లేదో చూసుకొని వుండదు. పడుకుండిపోయి వుంటుంది. ఇప్పుడేంటి దారి..?’ అని విసుక్కుంటున్నాడు బంగార్రాజు.
తనకి అసలే టెన్షన్‌ ఎక్కువ. చీటికిమాటికీ కంగారు పడిపోతూ వుంటాడు. అందుకే బంగార్రాజుని అతని స్నేహితులు ‘కంగార్రాజు’ అంటూ వుంటారు . ఏ పనైనా రెండు రోజులు ముందే చూసుకొని రెడీగా వుండాలి అంటాడు తను. ‘ఈ పిల్లలేమో రెండు రోజులు కాదు కదా..! రెండు గంటలు ముందు దాకా ఏమీ చూసుకోరు. ఆఖరి నిమిషంలో వాళ్ళు కంగారు పడిపోతూ.. ఇంటిల్లిపాదినీ కంగారుపెట్టేస్తూ వుంటారు’ అని ఓ విసిగేసుకుంటున్నాడు. కాలుకాలిన పిల్లిలా అటూ ఇటూ తిరిగేస్తున్నాడు. తను ఎంత కంగారుపడుతున్నా.. నిమ్మకి నీరెత్తనట్లు ఉంటుంది భార్య. నిదానమే ప్రధానం తనకి.
‘ఇదుగో.. మీరు అలాగ కూర్చోండి కాస్సేపు. కంగారు పడిపోతున్నారు.. ఊరికే. అమ్మాయి వచ్చేస్తుందిలెండి.’ అంది భార్య.
‘కంగారుపడనటే.. ఏ సంగతీ తెలియటం లేదు. అమ్మాయలకి నా పోలికే అంటారు అందరూనూ. రూపంలోనే నా పోలిక. బుద్ధులన్నీ నీవే వచ్చి పడిపోయేయి. వాళ్లు కూడా నీలాగే.. నిమ్మకి నీరెత్తనట్లుంటారు’ అన్నాడు.
‘ఆపండి ఇక.. ఎప్పుడు చూసినా దెప్పిపొడవడమే.. వంక దొరికితేచాలు.. మొదలెడతారు’ అని విసుక్కుంది.
‘అవునురా.. అలా ఊరికనే కూర్చోకపోతే అమ్మాయి బస్సు ఎక్కడిదాకా వచ్చిందో కనుక్కోరాదూ..?’ అని అంది బంగార్రాజు తల్లి. ఆమెకి డెభ్బై ఏళ్లు వుంటాయి. సరిగా వినబడదు. భార్యాభర్తల మధ్య జరుగుతున్న సంభాషణ వినబడక, ఆ ప్రశ్న వేసింది.
‘నువ్వూరుకో అమ్మా.. నీకేం తెలీదు’ అన్నాడు విసుగ్గా. ఆమెకి మనుమరాండ్లంటే ప్రాణం. మనీష అక్కడ బస్సు ఎక్కిందని తెలియగానే.. ఈమె ఇక్కడ మినప సున్నుండలు చేయడం ప్రారంభించింది. ఎప్పుడూ ఏవో పిండివంటలు చేసిపెట్టేద్దామని చూస్తూ వుంటుంది. మనీషా హైదరాబాదు వెళుతున్నప్పుడు కూడా, జంతికలు, చేగోడీలు, కోవాలు చేసి పంపించింది పెద్ద మనమరాలు కోసం. ఎప్పుడు మనీషా వస్తుందా.. దాని నోట్లో మినపసున్నుండ పెట్టేద్దామా అని ఎదురుచూస్తోంది ఆమె.
సమయం ఏడు కావస్తోంది. పాప ఇంకా రాలేదేంటని వీధిలోకి వెళ్లాడు బంగార్రాజు. అప్పుడే ఆటోలోంచి దిగుతున్న పాపని చూసి, ఊపిరి పీల్చుకున్నాడు. వస్తూనే.. ‘హారు…బామ్మా’ అంటూ వాళ్ల బామ్మ ఒడిలో వాలిపోయింది మనీష.
‘నా తల్లే. వచ్చావా.. ఇదిగో తిను..’ అంటూ ఓ సున్నుండ పాప నోట్లో దూర్చేసింది బామ్మ. ఆ సున్నుండ వల్ల నోరు అంటుకుపోయి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయిపోతూంటే మంచినీళ్ల గ్లాసు అందించింది తల్లి. నీళ్ళు తాగి, తేరుకుని ‘సారీ నాన్నా.. ఫోన్‌ ఛార్జింగు అయిపోయింది. బస్సులో ఛార్జింగ్‌ పాయింటు ఉంది. కానీ పనిచేయలేదు. అందువల్ల ఛార్జింగ్‌ అవ్వలేదు. మీకు ఏ సంగతీ చెప్పలేకపోయాను.’
‘సర్లేగానీ ఇప్పుడైనా ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టుకుని, తొందరగా తయారవ్వు. పదికల్లా కాలేజీలో ఉండాలన్నావు గుర్తుందా?’ అన్నాడు తండ్రి.
‘ఇదుగో మీరు కంగారు పెట్టకండి పాపని. వచ్చేసింది కదా.! ఇక అది చూసుకుంటుంది’ అంది భార్య.
‘ఏమిటి చూసుకుంటుంది?! నా బొంద. నేనే కదా కారులో దిగబెట్టాలి. ఆఖరి నిమిషంలో బయలుదేరి నన్ను తొందర పెట్టేస్తుంది. ”నాన్నా…ఫాస్ట్‌…ఫాస్ట్‌” అంటూ. అది కాలేజీ బస్సు తప్పిపోయినప్పుడు ఎన్నిసార్లు నేను మన కార్లో స్పీడుగా డ్రైవ్‌ చేస్తూ ఆ బస్సును ఆపించి, ఎక్కించలేదు? నీకేం తెలుసు నా బాధ’ అని విసుక్కున్నాడు.
ఇంతలో..
‘నాన్నా కొంప మునిగింది’ అని పెద్ద గావుకేక పెట్టింది మనీష.
‘ఏమైందే..?’ కంగారుపడుతూ అన్నాడు.
‘నా పెట్టె మారిపోయింది నాన్నా. ఈ పెట్టె నాది కాదు’ అంది.
‘పెట్టె మారిపోవడమేమిటే? పిచ్చి మొహమా? నీ పెట్టె నువ్వు పోల్చుకోలేవూ?’ అంటూ కసిరేడు తండ్రి.
‘లేదు నాన్నా.. నేను లాస్ట్‌స్టాప్‌లో దిగాను. అప్పటికి ముగ్గురు నలుగురు ప్యాసింజరులే ఉన్నారు. బస్సులో ఉన్న లగేజీలలో ఈ రంగు పెట్టె ఇదొక్కటే వుంది. అది నాదే కదా..! అని తెచ్చేసుకున్నాను. నంబరు లాక్‌ కూడా నేను వేసింది కాదు. అందుకే ఓపెన్‌ కావడం లేదు’ అంది.
‘అయితే ఇలాంటి పెట్టె ఇంకోటి కూడా వుండి వుండాలి. ఆ మనిషి నీకంటే ముందే దిగిపోయి వుండాలి. తను దిగిపోతూ తన పెట్టెకు బదులుగా పొరపాటున నీ పట్టె పట్టుకొని వెళ్లిపోయి వుండాలి’ అన్నాడు తండ్రి.
‘అయినా పెట్టె పైన సుద్దముక్కతో బెర్తు నంబరు రాస్తారు కదే.! స్లీపరు బస్సు వాళ్ళు.’ అంది మనీష తల్లి నెమ్మదిగా.
‘అవును కదా..!’ అంటూ… అప్పుడు చూసింది జాగ్రత్తగా మనీష. పెట్టె పైన ‘6’ అని రాసి వుంది. తనది ‘9’వ నంబరు బెర్తు. ఇప్పుడు కథ అర్థమైంది అందరికీ. ఆరో నంబరు బెర్తు గల ప్యాసింజరు తొమ్మిదని తలకిందులుగా చూసి, ఆరు అనుకొని పట్టుకెళ్లిపోయి వుండాలి. పెట్టె రంగు, సైజు ఒకటే అయి వుంటుందన్న నిర్ధారణకి వచ్చారు అందరూ. ఈలోగా ఫోన్‌ కొంత ఛార్జింగ్‌ అయిందేమో.. మోగుతోంది. చూస్తే.. అప్పటికే పదికి పైగా మిస్డ్‌కాల్స్‌ ఉన్నాయి. బస్సు వాడి గొంతు అట్నుంచి.
‘మేడం.. మీది తొమ్మిదవ నంబరు బర్తు కదా..! పెట్టెలు తారుమారు అయినట్లున్నాయి. ఆరో నంబరు ప్యాసింజరు ఇక్కడే ఉన్నారు. మాట్లాడుకోండి!’ అంటూ ఫోన్‌ తనకి అందించాడు. ఇరువురూ మాట్లాడుకున్నారు. వాట్సాప్‌లో పెట్టె ఫొటోలు పెట్టుకొని, రంగు, సైజు ఒకటే అని నిర్ధారించుకొని, ఎక్స్చేంజు చేసుకొనే మార్గంపై చర్చించుకున్నారు.
‘నాన్నా.. ఆ వ్యక్తి నా పెట్టె పొరపాటున తనదనుకొని తీసుకొని గాజువాకలో దిగిపోయాడట. నన్ను వచ్చి మార్చుకోమన్నాడు. నేను అక్కడి దాకా రాలేనంటే.. ఎన్‌.ఏ.డీ. దాకా రమ్మన్నాడు. పదండి నాన్నా అక్కడ దాకా ”ఫాస్ట్‌…ఫాస్ట్‌.” అంది కంగారుగా. అనుకున్న స్థలానికి ఇరువురు చేరుకున్నారు.
‘ఐ యాం ఎక్స్‌ట్రీంలీ సారీ అమ్మా.. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను!’ అన్నాడు అతను.. తప్పు అతని వల్ల జరిగిందని గిల్టీగా ఫీలవుతూ.
‘నో అంకుల్‌.. ఇట్స్‌ మై ఫాల్ట్‌ టూ..’ అంది మనీష. బస్సు దిగినప్పుడే పోల్చుకోలేక పోయిందని గిల్టీగా తను ఫీలవుతూ. మొత్తానికి ఇరువురూ సారీలూ.. థ్యాంక్యూలు.. చెప్పేసుకున్నారు. వెర్రిమొహం వేసి చూస్తూ నిలబడ్డాడు బంగార్రాజు.
ఆఘమేఘాల మీద పరిగెడుతూ.. తండ్రి యమా స్పీడుగా కారు డ్రైవ్‌ చేస్తూ.. ఎలాగో అతి కష్టం మీద పావు తక్కువ పదికి కాలేజీకి చేర్చాడు మనీషని.
సరిగ్గా పదిగంటలకు ఇంటర్వ్యూ మొదలైంది. అక్కడ కూడా అభ్యర్థులు వెయిటింగు లిస్టులో తన నంబరు ‘9’ కావడం కాకతాళీయం. తన పేరు పిలవగానే లోనికి ప్రవేశించింది మనీష. వెళుతూనే ఇంటర్వ్యూ బోర్డులో వున్న వ్యక్తిని చూసి అవాక్కయింది. అతను ఎవరోకాదు. స్లీపరు బస్సులో ఆరవ నంబరు బెర్తు గల ప్యాసింజరే ఆ వ్యక్తి.

భాగవతుల సత్యనారాయణ మూర్తి
9440871667

➡️