వేర్ల వృద్ధిలో లయబద్ధం..!

Jan 28,2024 07:22 #environmental study, #Science, #Sneha

మనం మొక్కలను అందమైన పూలు, పండ్లు, ఆకుకూరలు ఇచ్చేవిగానే చూస్తాం. ఇవి స్వచ్ఛమైన ప్రాణవాయువును ఇచ్చేవిగానూ తెలుసు. జగదీష్‌ చంద్రబోసు చెప్పినట్లు మొక్కలకూ ప్రాణముంది. అయితే ఇటీవల మొక్కలపై జరిపిన శాస్త్రీయ అధ్యయనాలు మరిన్ని కొత్త, విచిత్రమైన విషయాలను స్ఫురిస్తున్నాయంటున్నారు. ప్రతి ప్రాణిలోనూ నిరంతరం.. కొన్ని గంటలు.. కొన్ని రోజులు.. ఇలా కాలానుగుణంగా జరిగే కొన్ని జీవన చక్రాలుంటాయి. అలాంటి చక్రగమనాలు మొక్కలలోనూ ఉన్నాయట. మనలో గుండె కొట్టుకున్నట్లు మొక్కల్లోనూ లయబద్ధంగా డోలనాలు జరుగుతాయంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ కదలికలు సాధారణంగా కనిపించవు. మైక్రోస్కోపు ద్వారా మాత్రమే చూడవచ్చు.

అయితే మన పెరటి మొక్కల్లోనూ నిరంతర పర్యవేక్షణ ద్వారా ఆ కదలికల ఆనమాలును గుర్తించవచ్చు అంటున్నారు. మొక్కలు భూమి గురుత్వాకర్షణకు, కాంతికి ప్రతిస్పందిస్తాయి. కాండం కాంతి వైపు, వేర్లు భూమిలోకి పెరుగుతాయి. వేరు పెరుగుదల ప్రధానంగా గురుత్వాకర్షణ, నీరు, కాంతి, ఉష్ణోగ్రత, నేలలో ఉండే పోషకాలకు ప్రభావితమవుతుంది. వేరు పెరుగుదలకు గురుత్వాకర్షణ పాత్ర వహించడాన్ని గ్రావిట్రోపిజం అంటారు.

మొక్కను నాటడానికి మనం పట్టుకున్నప్పుడు దాని వేర్లలో కొన్ని రసాయనిక చర్యలు జరుగుతాయి. పెరుగుదల సమయంలో వేర్ల కొనల వద్ద ఉన్న కణాలలో నిరంతరం విభజన జరుగుతూ ఉంటుంది. ఆయా సమయాల్లో లయబద్ధమైన కదలికలు జరుగుతాయని గుర్తించారు శాస్త్రవేత్తలు. ఈ కదలికలు కొన్ని గంటలు చురుకుగానూ, మరికొన్ని గంటలు స్తబ్దుగానూ ఉంటాయంటున్నారు. ఈ పరిస్థితికి మొక్క పెరుగుదలకు కారణమైన ఆక్సిన్‌ అనే హార్మోన్‌ కీలకం. చార్లెస్‌ డార్విన్‌ ఆక్సిన్‌ ఉనికిని అప్పట్లోనే ఊహించాడు. అయితే శతాబ్ద కాలం క్రితం దాని రసాయన నిర్మాణాన్ని రూపొందించారు.

ఆక్సిన్‌ కణంలోకి ప్రవేశించినప్పుడు, ఈ జన్యువులు చురుకుగా మారతాయి. ఆక్సిన్‌లు ఈ జన్యువులను టార్గెట్‌ చేస్తాయి. వీటిలో ఉత్పత్తయ్యే ప్రోటీన్‌లు కొన్ని మొక్క పెరుగుదలకు సంబంధించినవైతే, మిగిలినవి ఆక్సిన్‌ల కార్యకలాపాలను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తాయి. ప్రోటీన్‌ ట్రాన్స్పోర్టర్ల ద్వారా ఆక్సిన్‌ ఒక కణం నుంచి మరో కణాన్ని చేరుతుంది. కణ భాగాలకు ప్రొటీన్లు ప్రయాణించే విధానం ఆక్సిన్‌ స్థాయిలపై ఆధారపడి ఉంటుంది. కణాలు ఒకే సమయంలో విభజించబడవు. కాలానుక్రమంగా జరిగే ప్రక్రియ. జన్యువులు క్రమం తప్పకుండా డోలనం చేసే వేరు భాగాలలోని ఆక్సిన్‌లలో క్రమబద్ధత లేకపోవడాన్ని గమనించారు పరిశోధకులు. జన్యు డోలనం వేర్ల పెరుగుదలతో ముడిపడి ఉంటుంది. వేర్ల కొనలు థింబుల్‌-ఆకారపు రూట్‌ క్యాప్‌తో కప్పబడి ఉంటాయి. దీని రక్షణతో నేలలో వేరు పెరుగుతుంది. క్యాప్‌ లోపలి భాగంలో కణ విభజనకు సహకరించే ఎపికల్‌ మెరిస్టెమ్‌ కణజాలం ఉంటుంది. ఆ సమయంలోనే గుండె చప్పుడు లాగా ఒక లయబద్ధమైన కదలికలు సంభవిస్తాయని గుర్తించారు.

ఈ కదలికలు శాస్త్రీయ ప్రపంచాన్ని ఆకర్షించాయి. దీంతో మొక్కల గురించి ఇప్పటివరకూ మనకున్న అవగాహనకు మరింత కళాత్మక విశేషణం అబ్బింది. ఈ కదలికల ద్వారా విభిన్న పరిస్థితులకు అనుగుణంగా ఏ నేలలో, ఏ కాలంలో, ఎలాంటి మొక్కలను పెంచవచ్చు అనే వివరణ రైతులకు, భవిష్యత్తు శాస్త్రవేత్తలకు శక్తిమంతమైన వివరణ కాగలదని పరిశోధకులు అంటున్నారు. తద్వారా అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్న వాతావరణంలో ఆహార పంటలను సురక్షితంగా పండించవచ్చని వారి అంచనా. ఈ ప్రక్రియ ద్వారా వివిధ రకాల నేల శక్తి సామర్ధ్యాలు, ఏ వాతావరణంలో ఎలాంటి మొక్కలు పెరుగుతాయని ఎంచుకోవడానికి సహాయ పడుతుందంటారు. దాని వలన కరువులు, వరదల వలన పంట నష్టాల వంటి పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంటుందంటారు పరిశోధకులు.

➡️