ఆ రోజు ప్రమద్వర కాలేజీకి వెళుతున్న సమయంలో ఒక ప్రతికా విలేఖరి ఆమెని కలవాలని వచ్చాడు.
‘మేడమ్! నమస్కారం! నా పేరు రవి. వెలుగు కిరణం పత్రికా విలేఖరిని’ అని తనను పరిచయం చేసుకున్నాడు. ప్రమద్వర అతనికి ప్రతి నమస్కారం చేసి, ఇంట్లోకి ఆహ్వానించింది.
‘మేడం! రెండు నెలల క్రితం మీ అబ్బాయి శ్రీహర్ష ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన గురించి మీతో మాట్లాడాలని వచ్చాను. మీకభ్యంతరం లేకపోతే కొన్ని ప్రశ్నలడుగుతాను’ అన్నాడు రవి.
‘మిస్టర్ రవీ, అది జరిగి రెండు నెలలైంది. ఇప్పుడిప్పుడే ఆ విషాద ఘటనని మరిచిపోతున్నాను. దయచేసి ఇప్పుడు మళ్ళీ దాన్ని గుర్తుచెయ్యొద్దు’ అంది ప్రమద్వర.
‘మేడం, ఈ సంవత్సరం మన రాష్ట్రంలో మీ అబ్బాయి శ్రీహర్షలాగే పది మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అందువల్ల మా పత్రిక ఈ ఆత్మహత్యల గురించి ఒక సవివరమైన సమగ్ర కథనాన్ని ప్రచురించాలనుకుంటోంది. అది నేటి తరం తల్లిదండ్రులకు, చదువుకుంటున్న మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు బాగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ విషయంలో మీరు మాకు సహకరించాలి. ఇది మీకు బాధాకరమే అయినా సమాజహితం కోరి మీ అనుభవాలు, భావాలు పంచుకోమని ప్రార్థిస్తున్నాను’ అన్నాడు రవి.
అతని మాటలకు ప్రమద్వర కొద్దిసేపు మౌనం దాల్చింది. ఆ తరువాత ‘మిస్టర్ రవీ! ఇప్పుడు నాకు కాలేజీకి టైమవుతోంది. రేపు ఆదివారం. నేను ఇంటి వద్దే ఉంటాను. దయచేసి రేపు ఉదయం మీరు వస్తే తప్పక నా భావాలు పంచుకుంటాను’ అంది ప్రమద్వర చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ.
‘సారీ మేడం మిమ్మల్ని బాధపెట్టాలని కాదు.. చాలా థాంక్స్!’ అంటూ రవి వెళ్ళిపోయాడు.
అతను వెళ్ళిన తరువాత ప్రమద్వర ఆలోచిస్తూ అక్కడే కూర్చుండిపోయింది. ఆమెకు గతం గుర్తుకు రాసాగింది..
ొొొ
ప్రమద్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్. విశ్వనాథ్ కూడా అదే కళాశాలలో హిస్టరీ లెక్చరర్. ఇద్దరూ ఒకేసారి ఉద్యోగంలో చేరారు. ఉద్యోగంలో చేరిన కొత్తలో విశ్వనాథ్ ప్రమద్వరకి ఎన్నో విధాలుగా సహాయం చేసాడు. ఆమెకు అద్దె ఇల్లు వెతికే దగ్గర్నుంచి గ్యాస్ కనెక్షన్ దాకా అన్నింట్లో తన తోడ్పాటు అందించాడు. అలా మొదలైన వాళ్ళ పరిచయం స్నేహంగా మారి, సంవత్సరం తర్వాత భార్యాభర్తలయ్యారు.
ప్రమద్వరది ముక్కుసూటి మనస్తత్వం. తన వ్యక్తిత్వానికి భంగం కలిగితే ఒప్పుకోదు. విశ్వనాథ్ అందుకు విరుద్ధమైన భావాలు కలవాడు. స్త్రీలంటే అతనికి చులకన. ఫెమినిజం అంటే చిన్నచూపు. రాను రాను విశ్వనాథ్ తన అసలు రూపాన్ని బయటపెట్టడం మొదలుపెట్టాడు. అది ప్రమద్వరకి నచ్చలేదు. దానివల్ల వాళ్ళ మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. అవి చిలికి చిలికి గాలి వానలయ్యాయి. ఈ లోపే వాళ్ళకు శ్రీహర్ష పుట్టాడు. కొడుకు పుట్టిన తరువాత ఆ దంపతులు ఘర్షణలకు కొన్నాళ్ళు విరామం ఇచ్చారు. భర్త విశ్వనాథ్ మనస్తత్వం నచ్చని ప్రమద్వర తన ఏకాగ్రతను కొడుకు శ్రీహర్ష మీదే కేంద్రీకరించింది. అలా ఆ దంపతుల మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఒకప్పుడు సరదాగా కబుర్లతో కాలక్షేపం చేసే ఆ దంపతులు ఇప్పుడు మౌనరాగాన్ని ఆశ్రయించారు. అది చిన్న వాగులా మొదలై, తర్వాత పెద్ద నదిగా మారింది.
కొంతకాలానికి విశ్వనాథ్ మద్యానికి అలవాటుపడ్డాడు. రాత్రిళ్ళు ఆలస్యంగా ఇంటికి వచ్చేవాడు. కాలేజీలో పనిచేసే మరో లెక్చరర్ గీతతో అతనికి అనుబంధం పెరిగింది. ఆమె ఒంటరి మహిళ. జీతం అంతా ఆమెకే ఇచ్చేసేవాడు. పైగా దొరికిన దగ్గర అప్పులు చేసాడు. ఆ విషయం తెలిసి ప్రమద్వర భర్త విశ్వనాధ్‌ని నిలదీసింది. ఇంట్లో గొడవలు పెద్దవయ్యాయి. పెద్దవాళ్ళు వచ్చి ఇద్దరికీ సర్దిచెప్పినా వాళ్ళిద్దరికీ సయోధ్య కుదరలేదు. అలా పదేళ్ళపాటు వాళ్ళు ఘర్షణలు పడుతూనే కాపురం చేసారు. ఇంట్లో రోజూ భార్యాభర్తలు ఘర్షణపడుతుంటే అది పెరుగుతున్న పిల్లల మీద బాగా ప్రభావం చూపుతుందనడానికి శ్రీహర్షే నిదర్శనం.
రోజూ తన కళ్ళ ముందు తల్లిదండ్రులు గొడవలు పడుతుండడం ఆ పదేళ్ళ కుర్రాడి మీద బాగా ప్రభావం చూపింది. వాడు ఎవ్వరితోనూ మాట్లాడేవాడు కాదు. స్కూల్లో కూడా ఎవ్వరితో మాట్లాడకుండా మౌనంగా ఉండేవాడు. దానివల్ల అతని ఏకాగ్రత లోపించి, చదువు మీద ధ్యాస తగ్గింది. అందువల్ల పదవ తరగతిలో చాలా తక్కువ మార్కులతో పాస్ అయ్యాడు. ఇదే పరిస్థితి కొనసాగితే కొడుకు చెడిపోతాడనీ భావించి, ప్రమద్వర భర్తతో విడాకులకు సిద్ధపడింది.
మూడు సంవత్సరాల తరువాత కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. కొడుకు శ్రీహర్షని తన వద్దే ఉంచుకుంటానంటే విశ్వనాథ్ అందుకు అభ్యంతరం పెట్టలేదు. తర్వాత ప్రమద్వర కొడుకు శ్రీహర్ష మీద ధ్యాస పెట్టి, చదివించింది. దానివల్ల వాడు ఇంటర్ ప్రథమశ్రేణిలో పాస్ అయ్యాడు. ఆ తరువాత వాడిని ఇంజనీరింగులో చేర్పించింది.
తల్లికి దూరంగా ఇంజనీరింగ్ చదువు మళ్ళీ శ్రీహర్షని ఒంటరితనానికి గురిచేసింది. రోజూ తన స్నేహితులు వాళ్ళ తల్లిదండ్రులతో ఆప్యాయంగా ఫోన్లలో మాట్లాడుతుండటం, ప్రతీ పదిహేను రోజులకి వాళ్ళు తల్లిదండ్రుల దగ్గరకు వెళుతుండటం, లేదా తల్లిదండ్రులే వాళ్ళ దగ్గరకు వస్తుండటం, తద్విరుద్ధంగా అతని తల్లి ఎప్పుడూ రాకపోవడం అతని మనస్సు మీద బాగా ప్రభావం చూపించడం మొదలుపెట్టాయి.
అతను ఎప్పుడూ తల్లితో పెద్దగా మాట్లాడేవాడు కాదు. తండ్రి అతన్ని చూడటానికి వచ్చేవాడే కాదు. ఒక విధంగా తండ్రి ఉన్నా అతనికి లేనట్లే. సెలవులకు తల్లి దగ్గరికి వెళ్ళినా అతనికి ఆనందం కలిగేది కాదు. ప్రమద్వర తన తల్లి ప్రేమను కొడుక్కి ఎంత ఎక్కువగా చూపించినా అతనిలో స్పందన ఉండేది కాదు. రాను రాను శ్రీహర్ష ఇంట్రావర్టుగా మారిపోసాగాడు.
ప్రమద్వర కొడుకు స్థితిని గమనించి, అతన్ని మానసిక వైద్యుడికి చూపిస్తే అతను శ్రీహర్షను పరీక్షించి, అతన్ని ఒంటరిగా వదిలేయడం మంచిది కాదనీ, తోడుగా తల్లిదండ్రులు ఉండాలనీ, లేకపోతే మానసిక బలహీనత వల్ల అతను ఏమైనా అఘాయిత్యం చేసుకునే అవకాశాలు ఉన్నాయనీ హెచ్చరించారు.
డాక్టరు చెప్పింది విన్న తరువాత ప్రమద్వరకి ఏం చెయ్యాలో అర్థంకాలేదు. ఇంజనీరింగ్ పూర్తవ్వడానికి ఇంకా సంవత్సరం ఉంది. ఇప్పుడు వాడిని చదువు మాన్పించి, ఇంటికి తీసుకువస్తే వాడి భవిష్యత్తు పాడవుతుందనీ ఆలోచించింది. కానీ కొద్దిరోజుల్లోనే శ్రీహర్ష ఆత్మహత్య చేసుకున్నాడన్న పిడుగులాంటి వార్త తెలిసి నిశ్చేష్టురాలైంది ప్రమద్వర. ఆలోచనల్లోంచి తేరుకొని కాలేజీకి వెళ్ళిపోయింది ప్రమద్వర.
ొొొ
ఆ మర్నాడు ఉదయాన్నే రవి ప్రమద్వరను ఇంటర్వ్యూ చెయ్యడానికి ఆమె ఇంటికి వచ్చాడు.
‘మేడం! మీ భార్యాభర్తలిద్దరూ తెలివైనవాళ్ళు. లెక్చరర్స్‌గా మంచి ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళు. మరి మీ అబ్బాయి శ్రీహర్ష ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? డాక్టర్లు డిప్రెషన్‌కి లోనై ఆ పని చేసాడంటున్నారు. కాలేజీ యాజమాన్యం మాకేమీ సంబంధం లేదనీ అంటోంది. ఇంతకీ మీ అబ్బాయి ఆత్మహత్యకి కారణం ఏమిటంటారు?’ అనీ అడిగాడు రవి.
‘దానికి మేమే. అంటే మా భార్యాభర్తలమే కారణం! మేమే సరిగ్గా ఉంటే వాడికా స్థితి వచ్చేది కాదు. ఇంట్లో సరైన వాతావరణం లేకపోతే పిల్లలు సరిగ్గా పెరగరు. తల్లిదండ్రులు సఖ్యతగా, ప్రేమగా ఉన్న కుటుంబాల్లో పిల్లలు మంచిగా పెరుగుతారు. లేకపోతే మా శ్రీహర్షలాగే ఇంట్రావర్టులుగా మారి, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడతారు. నాలాంటి తల్లులకు కడుపుకోత మిగులుస్తారు’ అంది ప్రమద్వర చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ.
‘మేడమ్! మీరు ఉన్నత చదువులు చదివారు. డిగ్రీ విద్యార్థులకు ఇంగ్లీష్ పాఠాలు బోధించే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. మీ భర్త కూడా చదువుకున్నవారే. అయినా మీలాంటి దంపతుల మధ్య సమస్య ఎందుకు వచ్చింది?’ అనీ అడిగాడు రవి.
‘చదువుకోవడం వల్ల మా మధ్య సమస్యలు రాలేదు. మనిషిలో విజ్ఞత, విచక్షణ లోపిస్తే సమస్యలు వస్తాయి. పూర్వం స్త్రీలెవ్వరూ చదువుకున్నవాళ్ళు కారు. అందువల్ల వాళ్ళు భర్తలకు అడుగులకు మడుగులు ఒత్తుతూ అణుకువగా ఉండేవారు. దానివల్ల వాళ్ళ భర్తల అహం దెబ్బతినేది కాదు. అందువల్ల వాళ్ళ మధ్య గొడవలు వచ్చేవి కావు. కానీ ఈ తరం స్త్రీలు చదువుకుంటున్నారు. భర్తలతో సమానంగా ఉద్యోగాలు చేసి, డబ్బు సంపాదిస్తున్నారు. తమతో సమానంగా ఎదగడాన్ని నేటి పురుషులు జీర్ణించుకోలేకపోతునారు. ఆధునిక కాలంలోనూ పురుషుల్లో ఫ్యూడల్‌భావాలు తొలగడం లేదు. వాళ్ళు ఇప్పటికీ స్త్రీలకన్నా మేమే అధికులం అన్న భావంలోనే ఉన్నారు. కానీ నేటి స్త్రీలు భర్తల అఘాయిత్యాలను, అహంకారాలనూ ప్రశ్నిస్తున్నారు. ఇద్దరం సమానమనీ గుర్తుచేస్తున్నారు. అది పురుషులకు సహజంగా నచ్చటం లేదు. అందుకే నేటితరంలో విడాకుల కేసులు ఎక్కువ అయ్యాయి. కానీ తల్లిదండ్రుల ప్రవర్తన – పిల్లల మీద బాగా ప్రభావం చూపుతోంది. అందుకే చాలామంది స్త్రీలు పిల్లల కోసం తమని తాము తగ్గించుకుని, భర్తలతో రాజీపడి, ఇష్టం లేకపోయినా కలిసి ఉంటున్నారు. కానీ అందరికీ అది సాధ్యపడదు. నేను కూడా విడాకుల విషయంలో చాలా సంవత్సరాలు ఓపిక పట్టాను. కానీ తప్పని పరిస్థితుల్లో విడాకులు తీసుకోవలసి వచ్చింది. అయినా నా కొడుకుని నా దగ్గరే ఉంచుకున్నాను. అందుకోసం కోర్టులో రెండేళ్లు పోరాడాను. అయినా సరే వాడి విషయంలో నేను ఓడిపోయాను. వాణ్ణి సరిగ్గా పెంచలేకపోయాను. సింగిల్ పేరెంట్ జీవితం ఈ సమాజంలో చాలా కష్టం. ఉద్యోగం చేసే ఒంటరి స్త్రీకి ఈ సమాజంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ఆమెకు కుటుంబం, సమాజం ఎవ్వరూ సహాయం చెయ్యరు’ అని బాధతో ప్రమద్వర అంది.
‘మేడం! మీ అబ్బాయి శ్రీహర్ష ఆత్మహత్యకు అతని స్నేహితుడు రాజేష్ కారణమనీ మీరు పోలీసులకు చెప్పారు. పోలీసులు కూడా కేసుని పరిశోధించి, అతన్ని అరెస్ట్ చేసారు. కానీ నిన్న ఆ కుర్రవాడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం మీకు తెలుసా?’ అని అడిగాడు రవి.
అతని మాటలకు ప్రమద్వర ఆశ్చర్యపోయి ‘నాకు ఆ విషయం తెలియదు. అయినా వాడి వల్లే నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. వాడి తల్లిదండ్రులు కూడా విడాకులు తీసుకున్నారు. వాడే నా కొడుకు శ్రీహర్షకు మద్యం, మత్తు పదార్థాలు అలవాటు చేసాడు. వాడివల్లే మావాడు చెడు అలవాట్లకు బానిసై, డిప్రెషన్‌కి లోనై చనిపోయాడు. మరి వాడెందుకు చనిపోయాడో నాకు తెలియదు’ అంది ప్రమద్వర.
‘మేడం! వారం క్రితం ఆ రాజేష్‌ని నేను జైల్లో కలిసాను. అతను ‘మీ అబ్బాయి శ్రీహర్ష హత్యకూ, తనకూ ఏ సంబంధం లేదనీ, పైగా తాను మీ అబ్బాయికి ధైర్యం చెప్పేవాడిననీ! నాతో చెప్పాడు. అతని మాటలు మీరు నమ్ముతారా? ఆ విషయం తెలుసుకునేందుకే నేనొచ్చాను’ అనీ చెప్పాడు రవి.
‘ఆ అబ్బాయి చనిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఆ వివరాలన్నీ అనవసరం. జరిగిన ఘోరం ఎలాగూ జరిగిపోయింది. బతికున్నప్పుడే మనిషి యొక్క మంచి చెడులు గురించి ఆలోచించాలి. పోయిన తరువాత అవి అనవసరం. అతను ఏ కారణం వల్ల చనిపోయినా అతని తల్లి కూడా నాలాంటి ఓ తల్లే. నాలాగే ఆమె కూడా కడుపుకోతకు గురైన ఓ మహిళ. పిల్లలు ఎలాంటి వారైనా వాళ్ళ మంచినే కోరుకుంటుంది తల్లి. కాబట్టి నేను రేపు వెళ్ళి ఆమెను పరామర్శిస్తాను. నాలాంటి కడుపుకోత ఏ తల్లికీ రాకూడదు’ అంది ప్రమద్వర.
‘చివరగా మీరు సమాజానికి ఏం చెప్పదల్చుకున్నారు?’ అని అడిగాడు రవి.
‘తల్లిదండ్రులు చేసే తప్పులకు పిల్లలు బలి అవుతున్నారు. పిల్లల ఆత్మహత్యలకు మూలకారణాలు తెలుసుకోవాలి. అమ్మాయిలతో ప్రేమలు, మద్యం, మత్తు పదార్థాల అలవాట్లు తదితర కారణాలతో వాళ్ళు డిప్రెషన్‌కి లోనై, ఆత్మహత్యలు చేసుకుంటున్నారనీ చాలామంది నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు తల్లిదండ్రుల మధ్య గొడవలు… అన్నీ సరిగ్గా ఉంటే పిల్లలు ఎలాంటి చెడు అలవాట్లకు లోనవ్వరు, ఆత్మహత్యలు చేసుకోరు. కాబట్టి ఈ ఆత్మహత్యల సమస్యలకు తల్లివేళ్లు సమాజంలోనే ఉన్నాయి. సమాజమనే ఆ చెట్టు బాగుంటే నూరేళ్ళపాటు పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది!’ అంది ప్రమద్వర.
తర్వాత అక్కడ నుంచి రవి బయటకొచ్చాడు. కానీ ప్రమద్వర అన్న ‘తల్లి వేళ్ళు’ అన్న మాట అతని చెవుల్లో మార్మోగుతూనే వుంది.
– గన్నవరపు నరసింహ మూర్తి
7752020123