పిల్లలు తల్లితో కలిసి పడుకోవడం అనేది ప్రపంచంలోని అనేక సంస్క ృతుల్లో సహజమైన అభ్యాసం. ఇది కేవలం నిద్రపోవడానికి సౌకర్యమే కాదు, బలమైన భావోద్వేగ, మానసిక అనుబంధాన్ని నిర్మించడానికీ దోహదపడుతుంది. అనేక అధ్యయనాలు, మనస్తత్వవేత్తలు తల్లితో కలిసి పడుకోవడం వల్ల పిల్లలకు ఉన్న ప్రయోజనాలను హైలైట్ చేశారు. బుజ్జి తండ్రి నిద్రపోవాలంటే పక్కన అమ్మ లేకపోతే ఆరున్నొక్క రాగం తీస్తాడు. అమ్మ బొజ్జను తడుముతూ పడుకోవడం చిట్టితల్లికి అలవాటు. అమ్మ చీర చెంగు చేతులో పట్టుకుని, నోట్లో వేలేసుకునే నాని పడుకుంటాడు. అమ్మ జోకొడితేనే నిద్రపోతుంది ట్వింకిల్. ఇలా చాలామంది చిన్నారులు తల్లితోనే నిద్రపోవడానికి ఇష్టపడతారు. పిల్లలు సహజంగానే అమ్మని హత్తుకుని పడుకోవాలని అనుకుంటారు. అందుకు కారణం లేకపోలేదు. పిల్లలకు అమ్మ తమతో ఉందన్న ధైర్యం. కొందరు పిల్లలు తండ్రితో ఎక్కువ సాన్నిహిత్యంగా ఉంటారు. చాలామంది చిన్నారులు అనుభవమైన విషయం ఏమంటే.. తండ్రి బొజ్జపై పడుకున్నాకే.. మెల్లగా పక్కన పడుకోబెడతారు. ఎక్కువ శాతం మాత్రం పిల్లలు తల్లితోనే పడుకోవడానికి కారణాలు చాలా ఉన్నాయనేది నిపుణులు చెప్తున్న మాట.
పిల్లలు తల్లితో కలిసి పడుకోవడం వల్ల ప్రయోజనాలు చాలానే ఉన్నాయనేది అధ్యయనాలు చెబుతున్నాయి. ఇటీవల జరిగిన అధ్యయనాల్లో తొమ్మిది నెలల నుంచి 11 ఏళ్లున్న దాదాపు 17,000 మంది చిన్నారులపై అధ్యయనం చేశారు. అందులో ప్రధానంగా వాళ్లు తల్లి మానసిక పరిస్థితి, పేరెంట్స్ ఆర్థిక స్థితిగతులు, నమ్మకాలు, తల్లిపాలు, పిల్లలు రాత్రిపూట ఏ ఏ సమయాల్లో మేల్కొంటున్నారు అన్న విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నారు. తల్లి దగ్గర పడుకోవడం వల్ల అధిక ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు.
1. భావోద్వేగ సురక్షితత్వం..
పిల్లలు, ముఖ్యంగా చిన్నపిల్లలు, తల్లి సమీపంలో నిద్రపోయినప్పుడు భయం, ఆందోళన తగ్గుతాయి. ఇది వారికి భావోద్వేగ సురక్షితత్వాన్ని ఇస్తుంది. తల్లి శరీర ఉష్ణోగ్రత, హృదయ స్పందన, స్పర్శ వారిని శాంతింపజేస్తాయి. వీటన్నింటివల్లా పిల్లలు మానసికంగా భావోద్వేగపరంగా ప్రశాంతంగా, భరోసా కలిగి ఉంటారు.
2. మానసిక ఆరోగ్యానికి మద్దతు..
అధ్యయనాల ప్రకారం, తల్లితో కలిసి పడుకునే పిల్లలలో ఒంటరితనం, డిప్రెషన్ సమస్యలు తక్కువగా ఉంటాయి. ఈ అభ్యాసం వారికి ఆత్మవిశ్వాసాన్ని, భావోద్వేగ స్థిరత్వాన్ని ఇస్తుంది.
3. మంచి నిద్ర నాణ్యత..
పిల్లలు తల్లి పక్కలో నిద్రపోయినప్పుడు, వారు తరచుగా నిద్రలేపడం లేదా భయంతో మేల్కొనడం తగ్గుతుంది. ఇది వారి నిద్ర చక్రాన్ని మెరుగుపరుస్తుంది. పెరుగుదలకు అవసరమైన హార్మోన్లను ప్రోత్సహిస్తుంది.
4. మేధో వికాసానికి దోహదం..
సురక్షితమైన, ప్రేమపూర్వక వాతావరణంలో పెరిగే పిల్లలు మానసికంగా మరింత స్థిరంగా ఉంటారు. ఇది వారి అభ్యాస సామర్థ్యం, సృజనాత్మకతను పెంచుతుంది.
5. బలమైన కుటుంబ బంధాలు..
తల్లి, పిల్లల మధ్య శారీరక సామీప్యం బలమైన భావోద్వేగ బంధాన్ని సృష్టిస్తుంది. ఈ బంధం పిల్లలు పెద్దయ్యాక కూడా కొనసాగుతుంది.
ముగింపు..
తల్లితో కలిసి పడుకోవడం పిల్లల భావోద్వేగ, మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే, ప్రతి కుటుంబానికి వారి సొంత సాంస్క ృతిక, వ్యక్తిగత ప్రాధాన్యతలు ఉంటాయి. పిల్లల అవసరాలు, కుటుంబ సౌకర్యాన్ని బట్టి ఈ అభ్యాసాన్ని సమతుల్యంగా అనుసరించడం మంచిది. తల్లి స్పర్శ, సామీప్యం పిల్లలకు ప్రపంచంలోనే అతిపెద్ద సురక్షిత కోట. ఈ విధంగా, తల్లితో కలిసి పడుకోవడం పిల్లల అభివృద్ధికి అనేక రకాలుగా మంచి ప్రభావాన్ని చూపుతుంది.
పిల్లలు కొంచెం పెద్దయ్యాక వేరుగానే పడుకోనివ్వాలి. తల్లిదండ్రులు ఉద్యోగస్తులు అయితే ఇది మరింత సమస్యగా మారుతుంది. వాళ్లు ఉద్యోగాల రీత్యా వేరే ఊళ్లు వెళ్లాల్సి వచ్చినా, మరో సందర్భంలో రాత్రి వేళ రాలేకపోయినా పిల్లలు నిద్రపోవడం కష్టంగా మారుతుంది. ఇది నిద్రలేమి సమస్యకు, మానసిక కుంగుబాటుకు దారితీస్తుంది. అందుకనే ఏ వయసులో ఏవిధంగా పిల్లలతో వ్యవహరించాలనే దానిలో పేరెంట్స్ పాత్ర చాలా కీలకం. ఇటీవల ఉమ్మడి కుటుంబాలు లేకపోవడంతో పెద్దవాళ్ల దగ్గర పిల్లల్ని ఉంచే పరిస్థితి తగ్గిపోతుంది. అలాగే వాళ్ల ఆలనాపాలనా చూసేందుకు వీలులేక పిల్లలు ఒంటరిగానే పెరగాల్సిన పరిస్థితి. అలాంటి సందర్భాల్లో వాళ్లు ధైర్యంగా ఉండాలంటే ఒక వయసు వచ్చాక పిల్లల్ని వేరుగానే పడుకోనివ్వాలనేది నిపుణుల సూచన.