‘వేగుల ద్వారా తెలిసిన విషయం ప్రకారం మనం నివసిస్తున్న ఈ ఇంటిని పడగొట్టి, కొత్త ఇంటిని నిర్మిస్తారు. కావున మనం ఇక్కడే ఉండటం క్షేమం కాదు. దగ్గర్లో వున్న పెద్ద భవనంలోనికి వెళ్లి తలదాచుకుందాం’ అని ఈగల, దోమల రాజు మస్కా పిలుపునిచ్చాడు.
రాజాజ్ఞను శిరసావహించి కొత్తగా నిర్మించిన పెద్ద భవనంలోనికి ఈగలు, దోమలు వెళ్లాయి. రెండు రోజులైనా ఆహారం లభించలేదు. గదులన్నీ విశాలంగా ఉండటం, ప్రతిగదిలోనూ రెండేసి ఫ్యాన్లు నిరంతరంగా తిరుగుతూ ఉండటం మూలంగా దోమలకు మనుషుల రక్తం పీల్చడానికి సాధ్యపడలేదు. ఇంట్లో అన్ని ఆహారపు పాత్రలకూ మూతలు పెట్టి ఉండటం మూలంగా ఈగలకు అన్నం మెతుకులు లభించలేదు. ఈ పరిస్థితి గమనించిన రాజు మస్కా ‘మనకు పెద్ద భవంతులు నివాసయోగ్యం కావు. కావునా పక్కనే ఉన్న పాత గృహాలలోనికి వెళ్దాం’ అని తీర్మానం చేశాడు. కానీ కొన్ని దోమలు, రాజు ఉన్న సమూహం నుండి దూరంగా వున్న మరొక వీధిలోకి చేరుకున్నాయి.
దోమల రాజు తన పరివారానికి కావాల్సిన సలహాలు, సూచనలు ఇవ్వసాగాడు. అవి పాటిస్తూ దోమలు బూజు, దుమ్ము, ధూళి పేరుకున్న ఇళ్లలోనే నివాసం ఉండేవి. ఈగలన్నీ వంట పాత్రలకు మూతలు పెట్టని మనుషులున్న ఇళ్లలోనూ, అతి పేదవారు, ఫ్యాన్లు లేనివారూ, అందులోనూ ఫ్యాన్లు రిపేర్‌లు చేయించుకొని ఇళ్లలో ఉంటూ దోమలు, ఈగలు సంతోషంగా జీవించేవి.
ఓ సారి దోమల దినోత్సవం సందర్భంగా రాజు మస్కా- ఈగలకూ, దోమలకూ సంయుక్త దినోత్సవం నిర్వహించాడు. కానీ కొన్ని ఈగలు, దోమలు బలహీనంగా ఉండటం చూసి ‘మీరు ఏ ప్రాంతం నుండి వచ్చారు. ఇంతటి వేగవంతమైన విశ్రాంతి లేని మానవ యుగంలో కూడా బక్కచిక్కి పోవడానికి కారణమేమిటి?’ అని ప్రశ్నించాడు రాజు.
‘రాజా! మేము మీ ఆజ్ఞ మేరకు పాత ఇళ్లలోనే ఉన్నాము. కానీ అక్కడి మనుషులు జాగ్రత్తగా రాత్రంతా దోమతెరలు కట్టుకుంటున్నారు. మాకు మత్తు కలిగేలా ఆల్‌ఔట్, గుడ్‌నైట్, ఎలక్ట్రిక్ బ్యాట్స్ వాడుతున్నారు. ఇక ఈగలకు ఆహారం లేకుండా ప్రతి వంట పాత్రలకూ మూతలు పెడతున్నారు’ అని ఆవేదన చెందాయి.
‘ఓస్ అంతేకదా సోదరులారా! నవీన సాంకేతిక విధానంలో మానవజాతి ముందుకెళ్తున్న మాట నిజమే. కానీ ప్రతిచోటా ఒక అవకాశం ఉంటుంది. అలాంటి గృహాలను ఈగలకు వదిలిపెట్టండి. దోమలన్నీ మొబైల్ ఫోన్స్ ఎక్కువగా ఉపయోగించే వారి ఇళ్లలో ఉండండి. ఎప్పుడూ టచ్ ఫోన్స్ వాడేవారు పరధ్యానంగా ఉంటారు. దోమలన్నీ వారి రక్తాన్ని కావల్సినంత పీల్చవచ్చు!’ అని మస్కా సూచన ఇచ్చాడు. ఆ నాటి నుండి దోమలు టచ్ ఫోన్ వినియోగించే వారి రక్తాన్ని తాగుతూ హాయిగా జీవించాయి.
హేమావతి
9441664931