మటన్‌ మస్తీ..

Jun 9,2024 09:21
  • వెనకటి రోజుల్లో ఎవరైనా అనారోగ్యం నుంచి కోలుకోవాలంటే మటన్‌ పెట్టేవారు. ఇప్పుడేమో ఆదివారం వచ్చిందంటే చాలు నాన్‌వెజ్‌వైపు మనసు లాగేస్తుంది. నేటి తరం మటన్‌ కన్నా చికెన్‌వైపు ఎక్కువ ఆసక్తిగా ఉంటుంది. కానీ మటన్‌ ఆరోగ్యానికి మంచిది. కాకపోతే ఏదైనా పరిమితంగా తింటేనే కదా మంచిది. అయితే ఈ వీకెండ్‌లో జిహ్వచాపల్యం తీరేలా మటన్‌తో ఈ వంటలను ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.

కబాబ్స్‌..
కావల్సినవి: ఖీమా – 150గ్రాములు, చికెన్‌ బోన్‌లెస్‌ – 100గ్రాములు, అల్లంవెల్లుల్లి పేస్టు – రెండు టీస్పూన్లు, ఉల్లిపాయ పేస్టు – ఒక టేబుల్‌స్పూన్‌, కారం – ఒక టీస్పూన్‌, ధనియాల పొడి – ఒకటీస్పూన్‌, జీలకర్రపొడి – ఒక టీస్పూన్‌, మిరియాల పొడి – పావు టీస్పూన్‌, ఆమ్‌చూర్‌ పౌడర్‌ – ఒక టీస్పూన్‌, శొంఠిపొడి – పావు టీస్పూన్‌, నూనె – సరిపడా, జీడిపప్పు పేస్టు – ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, క్రీమ్‌ – ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, శనగపిండి – రెండు టేబుల్‌స్పూన్లు, కోడిగుడ్డు పచ్చసొన – ఒకటి, ఉప్పు – రుచికి తగినంత, కొత్తిమీర – గార్నిష్‌ కోసం ఒకకట్ట.
తయారీ: ఒక బౌల్‌లో ఖీమా, చికెన్‌ వేసి బాగా కలపాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ పేస్టు, కారం, ధనియాల పొడి, జీలకర్రపొడి, మిరియాల పొడి, ఆమ్‌చూర్‌పౌడర్‌, శొంఠిపొడి, జీడిపప్పు పేస్టు, క్రీమ్‌, కొద్దిగా నూనె వేసి బాగా కలపాలి.తరువాత శనగపిండి, కోడిగుడ్డు వేసి కలియబెట్టాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టి ఫ్రిజ్‌లో ఒక గంట పాటు పెట్టాలి.ఇప్పుడు మిశ్రమాన్ని బయటకు తీసి కొద్దికొద్దిగా తీసుకుంటూ పుల్లలకు గుచ్చాలి. నూనె వేసుకుంటూ గ్రిల్‌ చేసుకోవాలి. సర్వింగ్‌ ప్లేట్‌లోకి మార్చుకుని ఉల్లిపాయలు, కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుని కబాబ్స్‌ సర్వ్‌ చేసుకోవాలి.


రోస్ట్‌..
కావల్సినవి: మటన్‌ – అరకేజీ, మిరియాల పొడి – అర టీస్పూన్‌, ఉప్పు – రుచికి తగినంత, పసుపు – పావు టీస్పూన్‌, నూనె – సరిపడా, ఉల్లిపాయ – ఒకటి, టొమాటో – ఒకటి, అల్లం – రెండు అంగుళాల ముక్క, వెల్లుల్లి – ఐదారు రెబ్బలు, కారం – ముప్పావు టీస్పూన్‌, ధనియాల పొడి – పావు టీస్పూన్‌, గరంమసాల – అరటీస్పూన్‌, సోంపు – అర టీస్పూన్‌, కరివేపాకు – రెండు రెమ్మలు, ఉప్పు – తగినంత.
తయారీ: మటన్‌ను శుభ్రంగా కడిగి కుక్కర్‌లో వేసి మిరియాల పొడి, పసుపు వేసి ఒక కప్పు నీళ్లు పోసి ఉడికించాలి.మొదటి విజిల్‌ వచ్చే వరకు పెద్ద మంటపై ఉడికించాలి. తరువాత చిన్నమంటపై అరగంటపాటు ఉడికించాలి. కుక్కర్‌లో ఆవిరిపోయాక మటన్‌ను ఒక బౌల్‌లోకి మార్చుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి. సోంపు, దంచిన అల్లంవెల్లుల్లి, కరివేపాకు వేయాలి.కారం, ధనియాల పొడి, గరంమసాల, తగినంత ఉప్పు వేసి కలపాలి. కాసేపు వేయించుకున్నాక టొమాటో ముక్కలు వేసి మరో రెండుమూడు నిమిషాలు ఉడకనివ్వాలి.ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న మటన్‌ మిశ్రమాన్ని వేయాలి. పెద్ద మంటపై కాసేపు ఉడికించుకుని దింపుకోవాలి.

 

కట్‌లెట్స్‌..
కావల్సినవి: మటన్‌ – అరకేజీ(బోన్‌లెస్‌), అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక టేబుల్‌స్పూన్‌, ఉల్లిపాయ – ఒకటి, కొత్తిమీర – ఒకకట్ట, పుదీనా – ఒక కట్ట, పచ్చిమిర్చి – రెండు, కారం – రెండు టీస్పూన్లు, పసుపు – అర టీస్పూన్‌, బంగాళదుంప – ఒకటి, ఉప్పు – రుచికి తగినంత, లవంగాలు – రెండు, దాల్చిన చెక్క – చిన్నముక్క, నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా, గోధుమ బ్రెడ్‌ క్రంబ్స్‌ – కొద్దిగా.
తయారీ: ముందుగా మటన్‌ను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనాను కట్‌ చేసుకోవాలి. బంగాళదుంపను ఉడికించి పొట్టుతీసి గుజ్జుగా చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చిని తరగాలి. మటన్‌ను కడిగిన తరువాత నీళ్లు లేకుండా చేతితో గట్టిగా పిండాలి. తరువాత ఒక బౌల్‌లోకి తీసుకుని అందులో అల్లంవెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కారం, పసుపు, బంగాళదుంప, లవంగాలు, దంచిన దాల్చిన చెక్క, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మిశ్రమాన్ని నిమ్మకాయ సైజంత చేతుల్లోకి తీసుకుని కట్‌లెట్స్‌లా ఒత్తుకోవాలి. తరువాత బ్రెండ్‌ క్రంబ్స్‌ అద్దుకుంటూ పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోసి కాస్త వేడి అయ్యాక కట్‌లెట్స్‌ వేసుకుంటూ వేయించాలి. చిన్నమంటపై రెండు వైపులా బాగా కాలేలా వేయించుకోవాలి. పుదీనా చట్నీతో తింటే ఈ మటన్‌ కట్‌లెట్స్‌ రుచిగా ఉంటాయి.

➡️