సహజ లక్షణం

Oct 6,2024 10:48 #Sneha

చెరువులో పడిన తేలును
కరుణతోడ ఓ సాధువు
పట్టిబయట వేయుచుండ
కుట్టె తేలు అతనివేలు!!

బాధతో విదిలించ చేయి
పడె చెరువున మరల తేలు!
పాపం ఆ చిన్ని ప్రాణి
ప్రాణం పోతుందేయని

పట్టిమరల తీయుచుండ
కుట్టగ సాధువును తేలు
చేతిని విదిలించగానె
చెరువునపడె మరల తేలు!!

మరల మరల ఎన్నోమార్లు
జరిగిందీ అదే రీతి!
బాధభరించీ సాధువు
పడేసె ఒడ్డున తేలును!!

ఆ సమయంలోనె సరిగ
అక్కడున్న వ్యక్తి యొకరు
అది అతా గమనించీ
అడిగె సాధువు నీ రీతి,

”తేలు కుట్టునను సంగతి
తెలిసి గూడ మీరు ఇలా
తేలును రక్షించాలని
ఏల తలచినారు స్వామి?”

”జనులను కుట్టుటె తేలుకు
సహజ లక్షణమ్ము గదా!
సాయం చేయుటయే నా
సహజ లక్షణమ్ము సదా!

జగతిని ఏ ప్రాణీ తన
సహజ లక్షణం వదలదు!
అలాగె నేనూ వదలను”
అనె సాధువు సౌమ్యంగా!!
– ‘బాల బంధు’

అలపర్తి వెంకటసుబ్బారావు
9440805001

➡️