ఆహారంతోనే ఆరోగ్యం. ఆరోగ్యముంటే ఆహార్యం బాగుంటుంది. ఈ రెండూ బాగుండాలంటే వ్యాయామం తప్పనిసరి. యుక్తవయసులో పిచ్చాపాటి ఆటలు కాకుండా ఒక నిర్దిష్టమైన క్రీడలు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఆటల్లో అలసిపోకుండా ఉండాలంటే పోషకాహారం తీసుకోవాలి. క్రీడాకారులు అన్నివిధాలా పోషకాలు శరీరానికి అందేలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి అలాంటి పోషకాహారాలలో కొన్నింటిని తయారుచేసుకోవటం ఎలాగో తెలుసుకుందాం.
ఎగ్ ధమ్ బిర్యాని..
కావలసినవి : బాస్మతి బియ్యం-ఒకటిన్నర గ్లాసు, నీళ్ళు-3 గ్లాసులు, బిర్యాని ఆకు, షాజీరా-1/2 స్పూను, లవంగాలు-4, దాల్చిన చెక్క-అంగుళం, యాలకులు-2
గుడ్లు- 8, ఉల్లిపాయలు-2, పసుపు-1/2 స్పూను, కారం- 2 స్పూన్లు, ఉప్పు-తగినంత, బిర్యానీ మసాలా-1/2 స్పూను, గరం మసాలా-1/2 స్పూను, ధనియాల పొడి-స్పూను
తయారీ : ఒక గిన్నెలో బియ్యం, నీళ్లు పోసుకోవాలి. బిర్యాని ఆకు, షాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, రెండు స్పూన్ల నూనె వేసి 70 శాతం ఉడికించాలి. అడుగు మందంగా ఉన్న గిన్నెలో పావు కప్పు నూనె వేడిచేసి సన్నగా, పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. ఆ నూనెలోనే కారం, పసుపు, ఉప్పు వేసి ఉడికించిన కోడిగుడ్లను గోల్డెన్ కలర్ వచ్చేలా వేయించి, వేరే గిన్నెలోకి తీసుకోవాలి. మరల బిర్యాని ఆకు, షాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు పైన వేసిన కొలతలతోనే వేసుకోవాలి. దానిలో పావుకప్పు ఉల్లిపాయ ముక్కలు, నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు, రెండు స్పూన్ల అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకూ వేయించాలి. పసుపు, కారం, ఉప్పు, బిర్యానీ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి వేసి సిమ్‌లో నిమిషం పాటు వేయించాలి. తర్వాత వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు, కొత్తిమీర, పుదీనా వేసి రెండు మూడు నిమిషాలు మూతపెట్టి ఉడికించి వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఈ గిన్నెలోనే ఉడికించిన అన్నం, దానిపై ఫ్రైడ్ ఆనియన్స్, ఎగ్ మసాలా, కొత్తిమీర, పుదీనా ఒక పొరలా వేసి, ఇదే పద్ధతిలో మిగిలినవి రెండో పొరగా వేసి పైన రెండు స్పూన్ల నెయ్యి వేయాలి. మూడు నాలుగు స్పూన్ల నీటిలో పావు స్పూను పసుపు కలిపి బిర్యానీపై చిలకరించాలి. గిన్నెను పూర్తిగా కవర్‌చేసేలా మూత పెట్టి (ఆవిరి బయటికి పోకుండా) దానిపై బరువు పెట్టాలి. సిమ్‌లో పది నిమిషాలు ఉడికించి, స్టవ్ ఆపాలి. అంతే ఘుమఘుమలాడే ఎగ్ ధమ్ బిర్యానీ రెడీ.
నుచినుండేలు..
కావలసినవి : పెసరపప్పు-1/4 కప్పు, కందిపప్పు-1/4 కప్పు, పచ్చిశనగపప్పు-1/4 కప్పు, మినప్పప్పు-1/4 కప్పు, బియ్యం-2 స్పూన్లు, ఎండుమిర్చి-6, జీలకర్ర-స్పూను, అల్లం తరుగు- స్పూను, పచ్చిమిర్చి తరుగు-2, పచ్చికొబ్బరి తురుము- 1/2 కప్పు, ఉల్లిపాయ తరుగు-1/2 కప్పు, కొత్తిమీర తరుగు-1/4 కప్పు, కరివేపాకు- 2 రెబ్బలు, మిరియాల పొడి-స్పూను, ఉప్పు-తగినంత, నెయ్యి- 1/4 కప్పు
తయారీ : ఒక గిన్నెలోకి పైన పేర్కొన్న పప్పులు, బియ్యం, ఎండుమిర్చి శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం మళ్ళీ ఒకసారి కడిగి, బరకగా మిక్సీ పట్టుకోవాలి. దీనిలో జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి తరుగు, పచ్చికొబ్బరి తురుము, ఉల్లిపాయ తరుగు, కొత్తిమీర తరుగు, కరివేపాకు, మిరియాల పొడి, ఉప్పు వేసి నీళ్ళు పోయకుండా కలుపుకోవాలి. ముద్ద చేయటానికి వీలుగా వచ్చిన తర్వాత ఓవెల్ షేప్‌లో చేసుకుని, ఇడ్లీ పాత్రలో పెట్టి పావుగంట ఆవిరి మీద ఉడికించాలి. అంతే ఆరోగ్యకరమైన నుచినుండేలు రెడీ. వీటిని నేతిలో ముంచుకుని తింటే రుచికి రుచి, బలానికి బలం.
చికెన్ 555..
కావలసినవి : బోన్‌లెస్ చికెన్-350 గ్రా., ఉప్పు- తగినంత, అల్లంవెల్లుల్లి పేస్ట్- స్పూను, మిరియాల పొడి- స్పూను, కార్న్‌ఫ్లోర్- 3 స్పూన్లు, వరిపిండి- స్పూను, వంటసోడా- చిటికెడు, గుడ్లు-2, వెన్న-2 స్పూన్లు, ఎండుమిర్చి-2, వెల్లుల్లితరుగు-2 స్పూన్లు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి-2 స్పూన్లు, ఉప్పు- తగినంత, రెడ్‌చిల్లీ సాస్-2 స్పూన్లు, టమాటా సాస్-2 స్పూన్లు, సోయాసాస్- స్పూను, గరం మసాలా-స్పూను, మిరియాల పొడి-1/2 స్పూను, కాశ్మీరీ కారం-స్పూను, మీగడ పెరుగు-1/4 కప్పు
తయారీ : బోన్‌లెస్ చికెన్‌ను శుభ్రం చేసి, సన్నని చీలికలుగా కట్‌చేసుకోవాలి. ఒక గిన్నెలో ఈ చీలికలు, ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, కార్న్‌ఫ్లోర్, వరిపిండి, వంటసోడా, గుడ్డు తెల్లసొన వేసి బాగా కలపాలి. వీటిని పది నిమిషాలు పక్కనుంచి బాండీలో డీప్‌ఫ్రై చేసేందుకు నూనెను వేడిచేయాలి. పది నిమిషాల తర్వాత మళ్లీ ఒకసారి ముక్కల్ని కలిపి నూనెలో ఒక్కొక్క పీస్ విడివిడిగా వేస్తూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకూ వేయించాలి. మరో బాండీలో రెండు స్పూన్ల వెన్న కరిగించి ఎండుమిర్చి, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు వేసి నిమిషంపాటు వేయించాలి. తర్వాత రెడ్ చిల్లీ, టమాటా, సోయాసాస్‌లు, గరం మసాలా, మిరియాల పొడి, కారం వేసి నిమిషం పాటు ఉడికించాలి. దీనిలో క్రీమ్‌లా చిలికిన మీగడ పెరుగు, రెండుమూడు స్పూన్ల నీరు, స్పూను వెనిగర్ వేసి కలపాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్‌ను కూడా వేసి, కలపాలి. గ్రేవీ అంతా చికెన్ పీసెస్‌కి పట్టి యమ్మీయమ్మీ చికెన్ 555 రెడీ.