చిరునవ్వుకు చిరునామా చక్కని పలువరుస. అంతేకాదు స్పష్టంగా మాట్లాడాలన్నా, అన్నిరకాల ఆహార పదార్థాలు తీసుకోవాలన్నా దంతాలు ఆరోగ్యంగా ఉండాలి. ఏ కారణం చేతనైనా దంతాలు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడితే వాటి స్థానంలో కృత్రిమంగా తయారుచేసిన దంతాలు ఫిక్స్ చేయించుకోవటమో, సెట్ పెట్టుకోవటమో ఇప్పటివరకూ జరుగుతూ వచ్చింది. అయితే ఇటీవల జరిగిన పరిశోధనల్లో స్టెమ్ సెల్స్‌ను దవడ ఎముకలో అమర్చి, దంతాల పునరుత్పత్తికి నాంది పలికారు శాస్త్రవేత్తలు. లండన్‌లోని కింగ్స్ కాలేజ్, ఇంపీరియల్ కాలేజీల పరిశోధకులు డాక్టర్ అనా ఏంజెలోవా-వోల్పోని, డెంటిస్ట్రీ, ఓరల్, క్రానియోఫేషియల్ సైన్సెస్‌లో డాక్టరేట్ విద్యార్థి జుచెన్ జాంగ్ మానవ దంతాలపై అధ్యయనం చేశారు. వీరు బయోమెటీరియల్‌తో మళ్ళీ దంతాలను పునరుత్పత్తి చేసి, అబ్బురపరిచారు.
వివిధ కారణాల వల్ల దంతాలు ఊడిపోవడం అనేది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ఇబ్బందికి గురిచేస్తున్న ఆరోగ్య సమస్య. దంతాలు ఊడటం వలన ఆహారం నమలలేని పరిస్థితి.. స్పష్టంగా మాట్లాడలేకపోవటం.. ముఖకవళికల్లో వచ్చే మార్పు.. ఇవన్నీ మనిషిని మానసికంగా కుంగదీసే సమస్యలే. వాటిని అధిగమించే అవకాశం కొద్దికాలంలో ప్రజలకు అందుబాటులోకి రావడం ఆనందించదగ్గ విషయం.
దంతాలంటే..
దంత నిర్మాణంలో కిరీటం, వేరు, ఎనామిల్, డెంటిన్, గుజ్జు, సిమెంట్ ఉంటాయి. ఎనామిల్ అంటే గట్టిగా ఉండి మనకు కనిపించే బయటిపొర. కిరీటం అంటే పంటిని చిగురుకు పట్టి ఉంచే భాగం. మూలం లేదా వేరు దవడ ఎముకలో పాదుకుని ఉంటుంది. సిమెంట్ మూలాన్ని కప్పి ఉంచుతుంది. డెంటిన్ అనేది ఎనామిల్ కింద ఉండే పొర. గుజ్జు.. నరాలు, రక్త నాళాలతో పంటి మధ్యలో ఉండే మృదు కణజాలం. ఎనామిల్ బలంగా ఉన్నప్పటికీ, నోటిని ఆరోగ్యంగా ఉంచుకోకపోతే బ్యాక్టీరియా, ఫలకం, ఆమ్లాలు దానిని దెబ్బతీస్తాయి.
ఏ కణాలు ఎలా..
దంత పాపిల్లాలోని మెసెన్‌కైమల్ కణాలు దంత గుజ్జును ఏర్పరుస్తాయి. ఇవి ఎముక మజ్జ, మృదులాస్థి, కొవ్వుల్లో కనిపించే అత్యంత శక్తిమంతమైన కణాలు. ఇవి కణజాల మరమ్మతు, పునరుత్పత్తిలో ప్రముఖపాత్ర వహిస్తాయి. అలాగే సిమెంటోబ్లాస్ట్‌లు దంతాల సిమెంట్‌ను, ఆస్టియోబ్లాస్ట్‌లు దంత మూలాల చుట్టూ ఉండే అల్వియోలార్ ఎముకను పెంచుతాయి.
అమెలోబ్లాస్ట్‌లు దంత ఎపిథీలియల్ కణాలు. ఇవి ఎక్టోమెసెన్‌కైమ్ సెల్స్ నుండి ఉత్పన్నమైన ఓడోంటోబ్లాస్ట్‌లతో కలిసి ఎనామిల్ ప్రోటీన్ మాతృకను స్రవించి, రక్షణ కవచాన్ని ఉత్పత్తి చేస్తాయి. శిశువు అభివృద్ధి చెందే సమయంలో పరిణతి చెందిన దంతాలకు కావలసిన ఎనామిల్ తయారీకి ఖనిజాలను సమకూరుస్తాయి.
దంతాలపై ఉండే ఎనామిల్ శరీరంలోని అత్యంత గట్టి పదార్థం. ఇది ఎముకల కంటే కూడా బలమైనది. దంతాల లోపలి పొరలైన డెంటిన్, గుజ్జు దెబ్బతినకుండా కాపాడుతుంది. ప్రత్యేకంగా డెంటిన్‌లో, మైటోకాండ్రియల్ డిఎన్‌ఎ సమృద్ధిగా ఉంటుంది. శక్తిని ఉత్పత్తి చేసి, సెల్యులార్ రక్షణనిస్తూ డెంటిన్ నిర్మాణం, నిర్వహణల్లో కీలకపాత్ర వహిస్తుంది.
దంత పునరుత్పత్తి..
ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు స్టెమ్‌సెల్‌ను దంత కణంగా రూపాంతరం చెందించడంలో సఫలీకృతులయ్యారు. ‘తొలగించిన పంటి స్థానంలో స్టెమ్‌సెల్‌ను ఉంచుతారు. అది మామూలు దంతంగా పెరుగుతుంది. ఇలా పెరిగిన కొత్త దంతాలు బలంగా ఉండి దవడలో కలిసిపోతాయి. ఇవి దీర్ఘకాలం ఉంటాయి.
‘కణాన్ని రోగి నోటిలో ఉంచే ముందే దంతం పెరిగే నమూనాని ల్యాబ్‌లో తయారుచేస్తారు. ఫిల్లింగ్స్, ఇంప్లాంట్ల కంటే ఇవి చాలా మెరుగైనవి.. పూర్తిగా బయోమెటీరియల్స్. కృత్రిమ పదార్థాలకు తావు లేదు. జీవశాస్త్రపరంగా పెరిగిన దంతాలు మన్నికగా ఉంటాయి’ అంటారు జుచెన్ జాంగ్.
‘జీవ సంబంధమైన రీతిలో పంటిని తిరిగి పెంచడం అనే ప్రక్రియకు ప్రేరణ లండన్ కింగ్స్ కాలేజీ వాతావరణమే. ఈ అధ్యయనం ద్వారా మనం జ్ఞానాంతరాలను స్పృశించినట్లనిపించింది’ అని ఎంతో ఉద్విగత వ్యక్తం చేశారు అధ్యయనకర్త డాక్టర్ అనా ఏంజెలోవా-వోల్పోని.
ఇలా ఏర్పడిన దంతాలు సహజ దంతాల లక్షణాలు, విధులను నిర్విర్తిస్తాయి. బయో ఇంజనీరింగ్ ద్వారా దంత ఎపిథీలియం, మెసెన్‌కైమల్ సెల్స్ మధ్య పరస్పర చర్యలు జరిగేలా చేసి, వాటి నిర్మాణం అంతా సహజ దంతాల వలెనే ఉంటుందని.. దంత సంరక్షణ పురోగతిలో కొత్త శకానికి నాంది పలికామంటున్నారు పరిశోధకులు.
మరి సహజ దంత పునరుత్పత్తి కోసం మనందరం వేచి చూద్దాం.